తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Tuesday, December 21, 2010

చతుర్వర్ణాల వర్ణన

అష్టాదశ వర్ణనల సంప్రదాయాన్ని పాటిస్తూ రాయలు మధురాపురంలోని చతుర్వర్ణాలవారైన బ్రాహ్మణులు, క్షత్రియులు, కోమట్లు, కాపులను గురించి వర్ణించాడు. మనఃప్రవృత్తికి అనుగుణమైన వృత్తులకి చిహ్నంగా ఉండేవి వర్ణాలు. రాజ్య పరిపాలన వర్ణాశ్రమాచారాన్ని పరిరక్షించే విధంగా ఉండేది. ఇది సామాజిక భద్రతను చూచించే పరిపాలనా విషయంగా ఆ నాటి కవులు వర్ణించేవారు.


. చిరసముపార్జితాగ్ని తడిఁ జెంది నశించు నటంచునో, కృతా

ధ్వరతఁ దదగ్ని మై నునికి దాన నొకంగము తాఁచుచేతనో,

పుర ధరణీసురు ల్నిగమభూధరము ల్జపయజ్ఞ శీలు రా

హరి ధనదాదులైన వలహస్తము సాఁపరు దానధారకున్.-



( ఈ పద్యం సనత్ స్వరంలో )


మధురాపురంలోని బ్రాహ్మణులు పరమనిష్ఠా గరిష్టులు. వేద పర్వతాలు. నిత్యాగ్నిహోత్రులు. వారందరూ సోమయాజులగుటచే వారి దక్షిణ హస్తమునందు అగ్ని ఉంటుందని అంటారు. దానోదకముచే (దానం ఇచ్చేటప్పుడు వదిలే నీళ్ళు) తేమ తాకి ఆ అగ్ని చల్లారుతుందని దేవేంద్ర, కుబేరాదులు వచ్చి దానమిస్తానన్నా తమ దక్షిణ హస్తమును (కుడిచేతిని) చాపరు. ప్రతినిత్యమూ జపయజ్ఞములు చేసే ఈ బ్రాహ్మణోత్తములు ఎవరికీ చేయి చాపరు అని భావము.

అగ్నిహోత్రం బ్రాహ్మణులకు ఎంత ముఖ్యమో “నచికేతోపాఖ్యానం” లో దగ్గుపల్లి దుగ్గన ఇలా చెప్తాడు.

"వినుము బ్రాహ్మణునకు వేదంబు ముఖ్యంబు
వేదములును యాగ విధుల నొడవు
యజ్ఞములకు మూలమగ్నిహోత్రముగాన
నగ్ని హోత్ర సేవ యాత్మ సేవ."

అలాగే రాయలు కూడా మధురాపురంలోని బ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రులుగా కొనియాడాడు. ఇతర కావ్యాలలో సాధారణంగా బ్రాహ్మణులని పండితులుగా వర్ణించడం కనిపిస్తుంది. కాని రాయలవారిక్కడ బ్రాహ్మణుల వైదిక కర్మ నిష్ఠని వర్ణించారు.


. ఉరవడిఁ బోరికై కవచ మొల్లరు మంత్రములందుఁ దక్క, సు

స్థిరభుజశక్తి నైదుపది సేయరు దత్తిన తక్క, మంటికై

పొరల రధీశుడీ కమలబుద్ధి ఖళూరికఁ దక్క, వజ్రదోః

పరఘవశీకృతాన్యనరపాలకు లప్పురి రాకుమారకుల్.-


(ఈ పద్యం రాఘవ స్వరంలో )

ఇక క్షత్రియకుమారులు మహావీరులు. వజ్ర సమానమైన బాహువులు అనే పరిఘలతో శత్రు రాజులను లొంగదీసుకోగలరు. వీరు ఎంత బలశాలులు, ధైర్యవంతులంటే యుద్ధమునందు కూడా కవచము ధరించరు. కాని వీళ్లు కవచం వాడేది ఒకే సందర్భంలో. అది మంత్రోచ్చారణ సమయంలో. రాకుమారులు నేర్చుకునే ప్రతి అస్త్రము ప్రయోగించడానికి ప్రత్యేకమైన మంత్రము ఉంటుంది. ప్రతి మంత్రానికి మంత్రకవచం ఉంటుంది. అందుకే ఆ అస్త్రప్రయోగ సమయంలోనే కవచం వాడతారు అని శ్లేషగా చెప్పాడు కవి. అంతే కాక గొప్ప భుజశక్తి గల ఈ రాకుమారులు రెండు చేతుల ఐదేసి వేళ్లు కలిపి పదిగా చేసి అంటే చేతులు జోడించి ఆశ్రయించరు. కాని అదే రెండు చేతులు కలిపి దోసిలితో దానం చేయడానికి మాత్రం వెనుకాడరు. సాధారణంగా రాజ్యం కోసం మహారాజు ముందు మట్టిలో పొర్లి దణ్ణాలు పెడతారు. ఈ రాజకుమారులు అలా చేయరు. కాని వీళ్లు కూడా మట్టిలో పొర్లుతారు. ఎక్కడంటే ఖళూరిక అనే సాము గరిడీ చేసే ప్రదేశంలో. దీనివల్ల మధురాపురంలోని రాజకుమారులు సాముగరిడీలో కూడా నిష్ణాతులే అని తెలుస్తుంది. "అయిదు పది చెయ్యడం" అన్నది చక్కని తెలుగు నుడికారం.


శా. దంభాపేతవితీర్ణితోయములు రథ్యం దొట్టి హట్టస్ధిత

స్తంభంబు ల్చిగిరించుచున్నవి యనన్ ధర్మైకనిత్యార్జనన్

సంభూతం బగుపైడికోటి కొకడై నానాఁటికిన్ హెచ్చు చ

య్యంభోదావళి గప్ప గేతువులు వైశ్యశ్రేణి పొల్చున్ బురిన్



( ఈ పద్యం భైరవభట్ల కామేశ్వరరావు స్వరంలో)


మధురపురంలోని కోమట్లు ధర్మము వీడక నిజాయితీగా వ్యాపారం చేసేవారు. పూర్వం కోటీశ్వరులు తమ సంపదకి గుర్తుగా ఒక్కొక్క కోటికి ఒకో జెండాని ఎగరేసేవారు (కోటికి పడగలెత్తడం అన్న నానుడి ఇలా వచ్చిందే). ఆ నగరంలోని వైశ్య వీథులు అలా ఎగరేసిన జెండాలతో ఎంతగా నిండిపోయిందంటే, అవి ఆ పైనున్న మబ్బులని కూడా కప్పేసాయిట! అంటే ఆ నగరంలోని వైశ్యులు అంత ధనవంతులన్న మాట. ధనవంతులవ్వడమే కాదు. ఎలాంటి గర్వం లేకుండా వారు నిరంతరం దానాలు చేసేవారు. ఆ దానధారలు ఏరులై పారి, ఆ నీటికి వీథులలోని స్తంభాలు కూడా చిగురించాయా అన్నట్టుగా ఉన్నాయట ఆ పతాకలు.

ప్రాచీన సమాజంలో వైశ్యులు వ్యాపారులు, ధన రక్షకులు. బ్రాహ్మణులు విద్యారక్షకులు, క్షత్రియులు రాజ్య రక్షకులు, శూద్రులు సస్య క్షేత్ర రక్షకులు. అందరూ కాపులే. నిరంతర దానం వైశ్యులకి విధి. బుద్ధునికి విరివిగా విహారాదులు కట్టించినది వైశ్యులే అని చరిత్ర చెబుతోంది. కనుక ఈ పద్యం ప్రాచీన సమాజంలో వైశ్యులంటే ఎలా ఉండేవారన్నది చక్కగా వర్ణిస్తోంది. ఇతర కావ్యాల్లో వైశ్యులు కుబేరులని మాత్రమే వర్ణించబడితే, ఇక్కడ దానధర్ములని చెప్పడం రాయలవారి సామాజిక పరిజ్ఞానాన్ని పట్టిచూపుతోంది. ఈ వైశ్యుల దానం దంభాపేతం. అంటే ఏదో మిషతో చెయ్యడం కాకుండా పవిత్ర దృష్టితో చేస్తున్న దానం అన్నమాట. పద్యం ఇక్కడ ప్రారంభం కావడం కూడా వారి స్వభావానికి గీటురాయి.


తే. నృపులపదహల రేఖల కెల్ల మా భు

జాగ్ర హలరేఖలే మూల మనుచుఁ గోటి

కొండలుగ ధాన్యరాసులు పండువీట

సుజనభజనైక విఖ్యాతి శూద్రజాతి



( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో )


ఆపురంలోని చెప్పుకోదగిన మరో ముఖ్యమైన జాతి సస్య రక్షకులైన శూద్రజాతి. వారి భుజాలమీది మోసిన నాగలి గుర్తులే మహారాజుల పాదములలోని హలాకార రేఖలు అనుకుంటారు. తాము నాగలి పట్టి వ్యవసాయం చేసి కోట్ల కొండలుగా నానావిధ ధాన్యరాశులను పండిస్తున్నారు. అన్నదాతలై సత్పురుషులకు సేవచేస్తూ సుఖసంతోషాలు పొందుతున్నారు. సాముద్రిక శాస్త్రంలో పాదాలందు హలరేఖ పంచ మహాపురుష లక్షణాలలో ఒకటిగా చెప్పబడింది. హల రేఖలు మహా వైభవాన్ని సూచిస్తాయి. రాజులకి తద్వారా రాజ్యానికి ఆ వైభవాన్ని ఇస్తున్నది రైతులే అని తాత్పర్యం.

1 comments:

కంచర్ల said...

మంచి ప్రయత్నం. మీ కృషికి అభినందనకుసుమాలు.
- కంచర్ల సుబ్బా నాయుడు

Related Posts Plugin for WordPress, Blogger...