తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Friday, May 17, 2019

గోదాదేవి వృత్తాంతము - 4

స్వామిని ఆముక్తమాల్యద అర్చనాదులతో గొలువనారంభించినది.

“వ. ఇత్తెఱంగున సకల కాలంబుల నారటంబునకు  నూరట గానకుండియు నప్పుండరీకాక్షి యందుండు నప్పుండరీకాక్షు నారాధనంబున నా రాధారమణుం గ్రమ్మర జెంద డెందంబునన్ దలంచి” (5-88)
ఆ పడతి అహోరాత్రములు పరితాపమునకు ఊరట పొందనిదై శ్రీవిల్లిపుత్తూరునందున్న శ్రీమహావిష్ణువును పూజచేయుచు ఆ స్వామిని పొందుటకు మనసులో తలచుకొని పూజోపచారములు జేయుచుండగా..

ఉ. కుందరదాగ్ర నెన్నొసల గుమ్మడిగింజ తెరంగు పాండు మృ
ద్బిందువుఁ దీర్చి చెందిరము పేచక శీర్షముపైఁ  బలె న్గటిం
జందుర కావిజీ బమరఁ  జల్లని రేయిటి తట్టుపున్గళు
ల్విందులఁ దేల నూనెముడి వెండ్రుకలం దడి తావు లీనగన్ (5-90)

ఆమె ప్రతి రోజూ కోవెలకు బయలుదేరే తీరు వర్ణిస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు. మల్లె మొగ్గల్లాంటి దంతములున్న ఆ సుందరి నుదుటిమీద గుమ్మడిగింజ ఆకారంలో తిరుమణి తిలకాన్ని పెట్టుకుంటుంది. ఎత్తైన విశాలమైన పిరుదులమీద సిందూరవర్ణ వల్కలాన్ని ధరిస్తుంది. అది చూడడానికి ఏనుగు కుంభస్థలం మీద సిందూరం పూత పూసినట్లు కనిపిస్తుంది. గతరాత్రి  అలముకున్న పరిమళ ద్రవ్యములసువాసనలకు తుమ్మెదలు శరీరానికి మూగుతుండగా, అంతకుముందు ఎప్పుడో రాసుకున్న నూనెవెంట్రుకలకు తడి అంటుకునీ, అంటుకొనక వింత  శోభలను చేకూరుస్తుంటాయి. అలా దురితలతాలవిత్రయై, విచిత్ర పవిత్ర పరిమళసముచ్చయంగా కోవెలకు బయలుదేరుతుంది. 
శ్రీహరిని భర్తగా పొందడం కోసం గోదాదేవి వ్రతం చేయడం ప్రారంభించింది. ఆ విధానాన్ని వర్ణన చేస్తున్నాడు రాయలవారు.

తే.బోటి గట్టిన చెంగల్వ పూవుటెత్తుఁ 
దరు పరిణ తోరుకదళిమంజరియుఁ గొనుడుఁ 
బోయి గుడి నంబి విజనంబుఁ జేయఁ జొచ్చి
మ్రొక్కి వేదికఁ బలువన్నె మ్రుగ్గు వెట్టి (5-91)

చెలికత్తె కట్టి ఇచ్చినటువంటి పెద్ద ఎర్రకలువల పూదండను, చెట్టుమీదే పండిన అరటిగెలను పట్టించుకుని పోయి, గుడిలో అర్చకుడు జనులనందరినీ పంపివేసిన తర్వాత  ఏకాంతంగా, ప్రశాంతంగా  కోవెలలోకి ప్రవేశించి, స్వామికి నమస్కరించి, వేదిక మీద రంగు రంగుల ముగ్గులు పెడుతుంది. జనులనందరినీ  పంపించి వేయడం అంటే వెళ్ళగొట్టడం కాదు, చిరు పూజలున్నవారిని వారి వారి పూజలు చేయించి పంపించి,  విశేష పూజలు అర్చనలు చేసేవారిని తర్వాత లోపలి రప్పించి వారి పూజలు నిర్వహించడం అని అర్ధం తీసుకోవాలి.

తే.గీ.కపిలగవిసర్పిఁ బృథు దీపకళికఁ దీర్చి    
ద్వయముతో వక్షమునఁ గల్వదండసేర్చి
యగరు ధూపంబు లిడి శర్కరాజ్య యుక్త
హృదయ కదళీఫలాళి నైవేద్యమిచ్చి (5-92)

కపిలధేనువు పాలను కాచి, వెన్నను తీసి కరిగించి చేసిన నేయితో పెద్ద దీపమును వెలిగించి, ద్వయమంత్రమును పఠిస్తూ స్వామి వక్షస్థలము మీద ఎర్రకలువల దండను అలంకరించి, అగరు పొడితో ధూపం ఇచ్చి, చక్కర, నేయి, అరటిపండ్లను నైవేద్యం పెడుతుంది.

కం.ఖండిత పూగీ నాగర
ఖండంబులు ఘన శశాంక ఖండంబులచే
హిండితములు గావించి య
ఖండస్థిరభక్తి నొసఁగి కదలి చెలులతోన్ (5-93)

కత్తిరించిన పోకచెక్కలు, సొంటిముక్కలు శ్రేష్ఠమైన కర్పూరపు తునుకలతో కలిపి అఖండమైన భక్తితో తాంబూలాన్ని స్వామికి సమర్పించి చెలికత్తెలతో కదలిపోతుంది.

చెలువ గర్భగృహ ప్రదక్షిణముఁ జేసి
వినతయై మౌళి శఠకోపమును ధరించి
చరణతీర్థముఁ గొని తత్ప్రసాద లబ్ధ
మయినమాల్యముఁ  దాల్చి గేహమునకరుగు (5-94)

ఆ సుందరి గర్భగృహానికి ప్రదక్షిణ జేసి, వినమ్రంగా శఠకోపమును తీసుకుని స్వామీ చరణతీర్థమును తీసుకుని  ఆ స్వామి ప్రసాదముగా అర్చకస్వామి ఇచ్చిన మాలను తీసుకుని ధరించి, యింటికి వెడుతుంది.

కం.ప్రతిదినము నిట్లు చని య
చ్యుత పూజ యొనర్చి వచ్చి సుదతి వియోగ
చ్యుతధైర్య యగుచు నయ్యదు
పతిగుణములు ద్రవిడభాషఁ బాడుచునుండున్ (5-95)


ప్రతిదినమూ యిలాగే కోవెలకు వెళ్లి అచ్యుతుని పూజ చేసి వచ్చి ఆమె వియోగ బాధచే సడలిన ధైర్యముతో  ఆ యాదవప్రభువు గుణములను, శ్రీకృష్ణుని గుణములను ద్రావిడ భాషలో పాడుతూ ఉంటుంది. యిలా ఆమె  ఆ ద్రావిడ భాషలో పాడిన పాటలే పాశురములు లేక తిరుప్పావై అంటారు. యిలా కేవలం రెండు ముక్కల్లో అమ్మవారి  దివ్యసారస్వతమైన తిరుప్పావైని లీలామాత్రంగా సూచించాడు శ్రీకృష్ణ దేవరాయలు. రాయలవారి  సర్వతంత్ర స్వతంత్ర సార్వభౌమ లక్షణానికి యిది ఒక ఉదాహరణ. ఎందుకంటే వేరే ఎవరైనా గోదాదేవి నాయికగా  ఉన్న కావ్యములో తిరుప్పావైని విస్తృతంగా ఉదాహరించకుండా ఉండడం అంటే భయపడేవారు, విమర్శలకు,  భక్తితో కూడా. కానీ యిది ఆధ్యాత్మిక గ్రంథం కాదు, ప్రబంధం. కనుక ప్రబంధ లక్షణాలకే ప్రాధాన్యతను ఇచ్చారు  రాయలవారు. యింతలో వసంత ఋతువు ప్రవేశించింది.
Related Posts Plugin for WordPress, Blogger...