తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Saturday, November 23, 2019

మాలదాసరి కధ - 3


గతంలో మనం మాలదాసరి వృత్తాంతంలో దారిలో  కొండలా ఉన్న  ఒక బ్రహ్మరాక్షసుడిని చూశాడు. మరి ఆ సమయంలో జరిగిందేమిటో చూద్దాం.

ఉ. వాడును గంటి బోకుమని వ్రాలె మహీరుహ పాళి నుగ్గుగా
వీడును మున్ను రేవగటి వేళకు మానిసియౌట బోరిలో
వాడిమి గొంతకాల మిల వ్రాలుట లావరియౌట నిల్చి యా
వాడి శరంబుచే నడువ వాడది ద్రుంపుడు వీడు నుద్ధతిన్.

   చూసిన వెంటనే వాడు "ఒహ్హో...నిన్ను చూశాను. ఎక్కడికీ వెళ్ళకు" అని చెప్పి ఒక్కసారి ఆ చెట్టుమీదనుండి ఆ కొమ్మలు నుగ్గు నుగ్గు అయేట్టుగా క్రిందికి దూకాడు. యుద్ధము చేయాలని దూకిన బ్రహ్మరాక్షసుని నిలువరించాడు మాలదాసరి. దాసరి కూడా ఎదురు నిలిచాడు. ఇరువురు ఒకరికొకరు మల్లయుద్ధరీతిలో బల ప్రదర్శనం గావిస్తున్నారు.  మాలదాసరి కూడా పరాక్రమంలో ఏమీ తీసిపోవడంలేదు. రాక్షసుడిని కాళ్ళతో చేతులతో కుమ్మి కుమ్మి నిలువరిస్తున్నాడు. అది చూసి వానిని కాస్తా ఆపి  బ్రహ్మరాక్షసుడి కోపం తారాస్తాయినందుకుంటుండగా ఇలా అన్నాడు.

శా. సారాస్వాదన బ్రాణ పంచకము తృష్ణంబాసి సంతర్పణ
న్మూరింబో నసి ద్రుంచి పొంగెడు భవన్ముండాస్రధారోష్మ మిం
పారం గ్రోలి పిశాచి నీదు కరకుట్లందీ నదస్తాలకాం
తారాంతర్ నృకపాల కుండ విగళన్మై రేయముం గ్రోలెదన్.

      ఓరీ..నిన్ను ఇప్పుడే కత్తితో నీ తలను మొండెము నుండి వేరు చేసి నీ వేడి వేడి రక్తమును నా పంచప్రాణాలు శాంతించేవిధంగా మంచి కమ్మనైన రుచిగా త్రాగేస్తాను. ఆ తర్వాత నా పిశాచి భార్య నీ మాంసం వండి వేడి వేడిగా తెస్తుంది. ఆ మాంసంతింటూ మనిషి పుర్రె పాత్రలతో ఇక్కడ ఉన్న తాటికల్లును తాగుతాను అని హూంకరించాడు.

క. నన్నిం తలయించిన ఖలు
నిన్నున్ ఋజువిధి వధింతునే యని యార్పుల్
మిన్నందగ బుసకొట్టుచు
నన్నీచుడు పొగరు వెడలు నవ్యక్తోక్తిన్.
     
      ఓయీ నువ్వెవరో తెలియదు నన్ను ఇంత బాధ పెట్టావు కాబట్టి నిన్ను ఊరకే వదలే ప్రసక్తే లేదు. చిత్ర వధ చేసేస్తాను అని అరుస్తూ అస్పష్టమైన మాటలతో తిడుతూ ఉన్నాడు.

చ. వినుమొక మాట రాత్రిచర! వేగిర మేటికి నిన్ జయింతురే
యనిమిషులైన? భాజనగతాన్నమ నేనిక నెందు బోయెదన్
బెనగక ప్రాణరక్షణ ముపేక్ష యొనర్చుట పాపమిందుకై
కనలకు నాకు మేనియెడ గాంక్షయు లేదిది పోవుటే యురున్

        ఆమాటలకు దాసరి ఇలా అంటున్నాడు. ఓ రాకసుడా! ఒక మాట చెప్తా విను. తొందర ఎందుకు నేను నీకు ఆహారంగా చిక్కిపోయాను కదా! కోపం తగ్గించుకో. నిన్ను దేవతలు కూడా జయించలేరు అంత బలం ఉన్న వాడివి నీవు. నాకు ఈ దేహం అంటే ఏమాత్రం అపేక్షలేదని తెలుసుకో.

ఆ. హీన జన్మ మరుట యెవ్వడె నొకప్రాణి
సంతసిలుట ముక్తి పొంత గనుట
మేలె కాదె శిబియ మేల్బంతి గాడె న
శ్వరపు దేహమమ్మి పరము గొనుట

       నా దేహం నీకు ఆహారంగా అయితే నాకొక మేలు జరుగుతుంది. అది ఏమిటంటావా?  నాకు ఈ చండాలమైన జన్మ తొలిగి పోతుంది.నాకు మోక్షం లభిస్తుంది.శిబి చక్రవర్తి తన దేహంలో ని తొడను కోసి ఇచ్చి పుణ్యలోకములకు వెళ్ళలేదా చెప్పు అని అంటున్నాడు.

చ. తెవు లయినం, గ్రహం బయిన, దేలయినం, గరమైన, నాత్మ పెం
దెవు లయినన్, జలంబయిన, దెక్కలి యైన, మృగాగ్నులైన, మే
ల్తవు లయిన, న్వ్రణం బయిన, ద్రాచయినన్, బిడుగైన దీర్చు పే
లవ తను వూరకే చెడ కిలన్ గృశునొక్కని బ్రోచుటొప్పదే.

       ఈ దేహం ఎలాంటిదో తెలుసునా నీకు? రోగం, దయ్యం, తేలువిషం, గొప్ప మనోవ్యాధి, బందిపోట్లు, అగ్ని, క్రూర జంతువులతో చంపబడే ఈ దేహం నీకు ఆహారం అవడం నా అదృష్టం అంటూ అనేక వేదాంత విషయాలు చెప్పి ఎప్పటికైనా ఎంత వాడికైనా మరణము అనేది తధ్యం కదా అని చెప్తున్నాడు దాసరి.

Tuesday, October 8, 2019

మాలదాసరి కధ - 2

ఒకనాడు అర్ధరాత్రి ఒక పిల్లి ఇంటిలోనికి ప్రవేశించగా అలికిడికి కోళ్ళు కూత పెట్టగా, ఎరుంగని దాసరి ప్రాత:కాలమయినదని భావించి, నా గురించి కీర్తించుటకు బయలుదేరెను.
శా.కాంచెన్వైష్ణవు డర్ధయోజన జటాఘటోత్థ శాఖోప శా
ఖాంచ ఝాట చరున్మరుద్రయ దవీయః ప్రేషితోద్యచ్ఛ దో
దంచత్కీట కృత వ్రణచ్ఛలన లిప్యా పాదితా ధ్వన్యని
స్సంచారాత్తమహా ఫలోపమ ఫలస్ఫాయ ద్వట క్ష్మాదమున్
రాయల పాండితీ గరిమను చాటిచెప్పే పద్యమిది. అలా మాలదాసరి వెళ్తూ ఉండగా.. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. చెట్టు మీద ఒక బ్రహ్మరక్షసుడున్నాడు. అది తిమ్మమ్మ మఱ్ఱి మానును మించినది..ఎన్నో ఊడలు, మరెన్నో కొమ్మలు. కొమ్మలు ప్రక్కకు విస్తరిస్తూంటే ఊడలు నేలలోకి చొచ్చుకొని వెళ్తున్నాయి. అది చెట్టా! చెట్లా! ఆకులు ఎండి రాలాయి కాలువేస్తే పట పట మని శబ్దం చేస్తూ విరిగి పోతున్నాయి. ఆకులను చెదపురుగులు తిన్నాయి. తినడం ఏదో అక్షరాలూ వ్రాసినట్లున్నది. గాలి చెట్టు క్రింద దూరి ఆకులను విసిరి వేస్తున్నది. నిర్జనారణ్యం. యింత నేపధ్యం వున్నది. యింత భయంకరమైన దృశ్యాన్ని దృశ్యమానం, శ్రవ్యమానం చెయ్యటానికి ఎలాంటి పదాలు వాడాలో అలాంటి పదాలు వాడారు రాయలు. మాలదాసరి ఐదు మైళ్ళు వ్యాపించిన ఊడలపై భాగంలో మొలిచిన కొమ్మలు, చిట్టి కొమ్మలతో ఒప్పుచున్న గంభీర సమూహంలో ఈలలు వేస్తూ సూది తిరుగుతున్న గాలి యొక్క వేగంతో దూరానికి పంపబడిన ఎగిరే ఆకులలో స్పష్టానంగా పురుగులచే చేయబడిన రంధ్రాలన్న మిష గల వ్రాతతో కలిగిన, బాటసారులెవరూ సంచరించనందున లబ్ధమైన గొప్ప ఫలాలతో సాటి రాగల పండ్లతో విస్తరించిన మఱ్ఱి చెట్టును చూచెనని రాయలవారు వర్ణించారు.

.వె.కాంచియాతడొక్క కాలిత్రోవయునంత
గాంచి యందు దెరువు గాంచినదియ
పరమలబ్ధి గాన ద్వరితంపు గతి నవ్వ
టావనీజ మంత నత గదిసి.
       అంత పెద్ద మర్రి చెట్టును గాంచి, దాని ద్వారా యున్న ఒక కాలిద్రోవను కనుగొని అటుగా వెళ్ళి మర్రిచెట్టును చేరాడు.

సీ. ఎలనీటి బొండలంబులువోలె మెదడెల్ల
జుఱ్ఱి వైచిన డొల్లు పుఱ్ఱెగములు
నెఱచి గీఱిన జీర లేర్పడఁ దుదముట్టఁ 
జీఁకిన నులిపచ్చి కీకసములు
దొనదొనమను నీఁగె తుట్టెల రూ పేఱు
పరక క్రంపలను వ్రేలెడు గరుసులు
ధూళ్ళ మక్కెక్కి మంగళ్ళతిప్పలు రేఁగు
వడువున గాలి నాడెడు వెఱకలుఁ 
తే.గీ. దునిసిన నరాంగకములఁ బొత్తులను గమిచి
పోక యొండొంటితోఁ బిఱువీకులాడు
శ్వాపదంబులుఁ, బదహతి వ్రస్సి వలచు
పరుగు దఱచగు ముఱుత్రోవ నరిగె యెదుట
   
  చెట్టుక్రింద ఉన్న బీభత్స దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు రాయలవారు. లేత కొబ్బరినీళ్ళను పీల్చేసి, పారేసిన కొబ్బరి బోండాల లాగా మెదడు మొత్తాన్ని  పీల్చిపారేసిన డొల్లు పుర్రెలు అంతటా పడి ఉన్నాయి. అంటే భారతంలో బకాసుర వధ సన్నివేశంలో మనం చూసిన దృశ్యం లాంటిదేగీకి గీకి మాంసాన్ని మొత్తం పీల్చిన  పచ్చి బొమికలు పడి ఉన్నాయి. కంపలమీద వ్రేళ్ళాడుతున్న పచ్చి చర్మపు ఖండాలు   కనిపించకుండా దొన దొన మని జోరీగలు ముసురుతున్నాయి. ధూళి కొట్టుకుని  కనరెక్కిన మంగలి వాళ్ళ స్థలాలలో వెంట్రుకల కుప్పలు ఎగిరినట్లు, మానవ శరీరాలమీది రోమాలు, కేశాలు గాలికి ఎగురుతున్నాయి. మా నవశరీరాల ఖండాలను  కరిచిపట్టుకుని అక్కడినుండి కదలకుండా ఒకదానితో ఒకటి పెనగులాడుతున్న  దుష్ట జంతువులు కనిపిస్తున్నాయి. కాళ్ళతో తన్ని పగిలి కంపు కొడుతున్న మాంసపు  వరుగుల కుప్పలు కనిపిస్తున్న కాలిబాటవెంట ముందుకు వెళ్ళాడు భక్తుడు. ముందరికాళ్ళమీద సాగిలపడి, పైకి దొంగచూపులు చూస్తూ, మాంసపు ఖండాలను ఎత్తుకుని పారిపోతున్న కుక్కలు కనిపిస్తున్నాయి. మాంసపు పోగులను కరుచుకున్న గ్రద్దలు కొమ్మలమీదినుండి ఎగిరిపోతున్నప్పుడు గాలికి దుర్వాసన వ్యాపిస్తుండగా గ్రద్దల అరుపులు వినిపిస్తున్నాయి. బ్రహ్మరాక్షసుడి దారికి అడ్డంగా వచ్చి, వాడి చేతి చరుపులకు నడుములమీద చేతులు పెట్టుకుని అరుస్తూ పారిపోతున్న  కోతులు కనిపిస్తున్నాయి. యిదంతా చూస్తూ బిక్కు బిక్కుమంటూ, 'యిక్కడెవడో  భయంకరుడు ఉన్నాడు, వాడు మనిషి గాడు, ఎలారా దేవుడా, వెనక్కు వెళ్ళాలన్నా చాలా దూరం' అనుకుంటూ ముందుకు వెళ్ళాడు భక్తుడు, దాసరి. వెళ్లి..ఒక భయంకరమైన రాక్షసుడిని చూశాడు. వాడెలా ఉన్నాడయ్యా అంటే...

సీ. మృతమర్త్యు రెంటాన నిడ్డఁ జాలక నెత్రు
రంజిల్లు పెనుపొట్ట ముంజివానిఁ 
బల్లచీమల వక్ర భల్లాతకియుఁబోలె
నెఱ్ఱ దుప్పటి నొప్పు కఱ్ఱె వాని
వ్యత్యస్త హస్తిమ స్తాభఁ బాయగు గడ్డ
మును దంష్ట్రికలుఁ బొల్చు మొగమువానిఁ
గడుఁదుర్ల నిడుత్రుట్టె గతిఁ జోఁగలోఁ బాండు
రత మించు కపిలకూర్చంబువాని
తే.గీ. నెఱకుఁదెరువరిఁ గన శాఖ లెక్క జారు
ప్రేవుజందెంబుఁ గసరి పైఁ బెట్టువాని
వ్రేలు డగుబొజ్జ గల బూర కాలి వానిఁ
జెంబుతలవాని నవటుకచంబువాని

     భీకరాకారం తనచేతిలోచచ్చినవాడి శవాన్ని గోచీలాగా పెట్టుకున్నాడు అలాంటివాడు... గోచీగా శవం నిడివి చాలక, లాగి, లాగి మొలతాడులో దోపుకోవడంవల్ల శవం ఛిద్రమై ఒంటి నిండా రక్తం స్రవిస్తున్న భయంకరుడిని చూశాడు. ఎర్రచీమలు  నిండా పాకుతున్న నల్లని జీడి చెట్టులా ఎర్రని దుప్పటిని కప్పుకున్న నల్లటి భయంకరాకారుడిని చూశాడు. ఏనుగు తలను తలకిందులు చేసినట్లు కోర దంతాలు పైకి పొడుచుకువచ్చి, నోటిక్రింద చాలా పెద్దదైన గడ్డంతో ఉన్న వికృత భయంకరాకారుడిని చూశాడు. కందిరీగల గుంపులా గుంటగా పాండు వర్ణంలో ఉన్న నుదుటితో భయంకరంగా ఉన్నవాడిని చూశాడు. 'ఎర'కోసం, తిండికోసం దారినబోయే వాడెవడన్నా ఉన్నాడా అని చూడడం కోసం కొమ్మలమీదికి ఎక్కినపుడు జారిపోయిన ప్రేగుల జందెమును కసిరి  తిట్టుకుంటూ భుజము మీదికి నెట్టుకుంటున్న వాడిని, వ్రేలాడుతున్న పొట్టతో,బూరల్లా ఉన్న కాళ్ళతో, చెంబులా నున్నగా ఉన్న తలతో ముచ్చెనగుంటలో జుట్టు ఉన్న వికృత భయంకరాకారుడిని చూశాడు భక్తుడు మాల దాసరి.  

తే.గీ. కండకన్నులవాని, నాఁకటను బండు
తిట్ల బేతాళికల సారెఁ దిట్టువాని,
నగగరిమవాని, నన్వర్థ నాముఁ, గుంభ
జాను వనునొక్కద్విజనిశాచరునిఁ గనియె

కళ్ళల్లో కండలు పెరిగిన వికృతాకారుడిని, ఆకలితో తోటి ఆడ దయ్యాలను మాటిమాటికీ బండబూతులు తిడుతున్నవాడిని, కొండలా ఉన్నవాడిని,కుండలవంటి మోకాళ్ళతో 'కుంభజానువు' అనే సార్ధక నామధేయుడైన ఒక బ్రహ్మరాక్షసుడిని చూశాడు.

తర్వాత జరిగిన వ్యవహారం తరువాయి భాగంలో చూద్దాం.

Thursday, August 29, 2019

మాలదాసరి కధ - 1

షష్ఠశ్వాసంలోకి ప్రవేశించాం. ప్రధమంగా దైవప్రార్ధన "శ్రీకారి కృపార్ద్రేక్షణ" అంటూ సాగించాడు. స్వామిని పరిపరివిధాల తన కుమార్తె అవస్థ ఏమిటో తెలియజేయమని ప్రార్ధించాడు. అనంతరం విష్ణుమూర్తి మాలదాసరి కధ విష్ణుచిత్తునితో చెప్తున్నాడు.
        
         కలడొకరుండు పేరుకొనగాని కులంబు మదీయ భక్తుడు
         య్యులమును వాడు వామన తనే వసియింపనొ పుణ్యభూమినం
         దులకొక యోజనత్రయపు దూరపుటూరు వసించి బ్రహ్మవే
         ళల జనుదెంచి పాడుమము లాలస మంగళకైశికిన్
మాలదాసరి కథను ప్రారంభించాడు. పంచమ కులమున బుట్టిన నా భక్తుడొకడు గలడు. అతడు నేను వామనావతారం ధరించి వసించిన గ్రామమునకు మూడు ఆమడల దూరంలో ఉన్నాడు. ప్రభాత వేళలలో మనగళ కైశికిలో నా నామగానం చేస్తూ ఉంటాడు.
భక్తుడు తన జాతికి తగినవాడుగా ఉండి వర్ణాశ్రమ ధర్మము పాటించుచు, మా సంతోషము కొరకు "శ్రేయాన్ స్వధర్మో విగుణ: పరధర్మాత్స్వనుష్టితాత్! అను గీతా వాక్యము ననుసరించి తన శరీరము చండాల సంగమమైనను అతి పవిత్రముగ ఉంచుకొనుచూ మసిగుడ్డ యందలి మాణిక్యమై వెలుగొందుచున్నాడు. మాలదాసరి ఎలా ఉన్నాడయ్యా అంటే...అతడు ధరించిన వస్తు విశేషాలను కూడా ఇలా వర్ణిస్తాడు...
సీ. చమురైన తోల్కుబుసంబు టెక్కియును నిత్తడిశంఖ చక్రకుండలములమర
దివెదారికొమ్ముదోల్తిత్తియు జోడమ్ము మెడమీది మొగలాకు గొడుగుదనర
మత్పాదరక్షయుమావు పెన్వెఱకగుట్టిన మోటి తిపిరిదండెయును మెఱయ
జిటితాళములు సంకపుటికనొక్కొక మాటు గతిరయంబున దాకి కలసి మెరయ

వలుద వనమాల కంటెయు మలిన తనువు
బట్టె తిరుమన్ను బెదురు గెంబుట్టుజూపు
బసుపు బొడితోలు వల్లంబు నెసకమెసగ
వచ్చు సేవింప సురియాళు వైష్ణవుండు.

      తోలు వస్తువులను ధరించి, చెవులకు ఇత్తడి శంఖచక్రాలను పెట్టుకుని, విష్ణు పాదుకలు, మెడలో తులసిహారాలను అలంకరించుకుని కిన్నెరను మీటుతూ మాలదాసరి రోజూ దేవాలయానికి పోయి వస్తున్నాడట. క్రీ. 11, 12 శతాబ్దాల్లో కుల వ్యవస్థ కరాళనృత్యం చేస్తున్న సమయంలో విశిష్టాద్వైతమత సిద్ధాంత కర్త, పరమ వైష్ణవులు శ్రీ మద్భగవత్రామానుజాచార్యులు కులాలన్నీ ఒకటేనని, భగవంతుడు అందరికీ ఒక్కడేనని నినదించారు. శ్రీరంగంలో అందరికీ తారక మంత్రోపదేశం చేశారు. అదే కాలంలో పల్నాడు ప్రాంతంలో బ్రహ్మనాయుడు విశిష్టాద్వైత మత ప్రచారంలో భాగంగా పద్దెనిమిది కులాల వారిని కలిపి రామానుజ కూటంగా ఏర్పాటు చేశాడు. చాపకూటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి, మాలలకు దేవాలయ ప్రవేశం చేయించాడు. అలా వాళ్లంతా చెన్నకేశవ భక్తులుగా మారారు. విష్ణు భక్తి ప్రచారానికి శూద్రుల్లో సాతానులను, మాలల్లో మాలదాసులను ఏర్పాటు చేశారు. వీరు వివాహాది శుభకార్యాలు, అపరకర్మలు నిర్వహిస్తారు. వీళ్లలో మాలదాసరులు.. విష్ణువుకు ప్రీతిపాత్రమైన ధనుర్మాసం ప్రారంభం కాగానేహరిదాసులుగా ఊరూరా సంచరిస్తూ ఆధ్యాత్మిక పరిమళాలను పంచుతుంటారు. హరిదాసులు ధనుర్మాస ప్రారంభం నుంచి మకర సంక్రమణ వరకు వేకువజామునే లేచి తలంటుస్నానం చేస్తారు. నొసట తిరుమణి, తిరుచూర్ణం, పట్టెనామాలు ధరించి కొత్త బట్టలు ధరిస్తారు. తెల్లపంచె/ కాషాయ పంచె, చొక్కా/ అంగి, నడుముకు గుడ్డ, కాలికి అందెలు కట్టుకుని.. మెడలో పూలదండ. తలపై కలశం (అక్షయపాత్ర), కుడిభుజంపై తంబుర, ఎడమచేతిలో చిటికెలు ధరించి హరినామ సంకీర్తన చేస్తూ ఇంటింటికీ తిరుగుతారు. మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలా తిరిగి ఇంటికి వచ్చేస్తారు. స్నానం చేసి పూజా కార్యక్రమాలు ముగించాకే ఆహారం తీసుకుంటారు. నెల రోజులు వీళ్లు చాలా నిష్ఠగా ఉంటారు. నేలపడక, ఒంటిపూట భోజనం చేస్తారు. తర్వాత రోజుల్లో వీళ్లు వీధి నాటకాలను ప్రదర్శిస్తారు. కొందరు బుర్రకథలు గానం చేస్తారు. మూడు ఆచారాలూ వీళ్లకి వంశపారంపర్యంగా వస్తున్నాయి. మాలదాసులుగా, హరిదాసులుగా వ్యవహారంలో ఉన్న వీళ్లు మాలల్లో ఒక తెగవారు. పన్నెండో శతాబ్దం నుంచి రామానుజ సిద్ధాంతాలను పాటిస్తూ, ఆయన బోధనలను వ్యాప్తి చేస్తూ వస్తున్నారు. మాలలకు వివాహాది శుభకార్యాలు, అపరకర్మలు నిర్వహిస్తూ భజన కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు.
            ఆవిధముగా పెరుమాళ్ళును నిత్యము సేవించునట్టి యా మాలదాసరి గుణంబులెట్టివనిన.. ఉత్తమజాతికి చెందినవారొచ్చినచో దూరముగా బోవును. ఎండను గాలిని లెక్కచేయక ఎంతసేపైనను స్వామి ప్రసాద కైంకర్యము కొరకు వేచి ఉండెడివాడు. ఎవరైన ప్రసాదమును ఇచ్చినచో చేతితో స్వీకరించక తన కిన్నెరను జాపి దానిమీద పెట్టుడని చెప్పి స్వీకరించెడివాడు. దాత ఇచ్చిన తీర్ధమును త్రావును. తన చండాల గుణముచేత లోపలికి రాక బయట నీరు వెలువడు ప్రదేశమునందుండి ప్రార్ధించి వెడలుచుండేవాడు.

        కం. అద్దమరేయద్దాసరి
        యద్దండ బిడాల గాహి తాలయ కృకవా
        కూద్దండ రవము విని చను
         ప్రొద్దాయనటంచు బాడబోవుచు ద్రోవన్

                      ఇట్లుండగా ఒకనాడు అర్ధరాత్రి ఒక పిల్లి ఇంటిలోనికి ప్రవేశించగా అలికిడికి కోళ్ళు కూత పెట్టగా, ఎరుంగని దాసరి ప్రాత:కాలమయినదని భావించి, నా గురించి కీర్తించుటకు బయలుదేరెను. (సశేషం)
Related Posts Plugin for WordPress, Blogger...