తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Monday, December 3, 2012

వర్షాకాల వర్ణన



సరిగ్గా విష్ణుచిత్తునిలాగే, యామునాచార్యుడు పాండ్యరాజు సభలో పండితులను ఓడించి విజయం సాధించాడు. అందరి వాదాలను ఒక్కటొక్కటిగా సహేతుకంగా ఖండించి "విష్ణుమూర్తియే పరమాత్మ, విశిష్టాద్వైతమే గొప్పమతం" అని నిరూపించాడు. అప్పుడు ఆ  మహారాజు యామునాచార్యుని ప్రతిభను గుర్తించి సాష్టాంగ ప్రణామం చేసి పూజించాడు. ఇక్కడే కథ మలుపు తిరిగింది. ఆ రాజు యామునాచార్యుని ప్రతిభకు మెచ్చి తన చివరి చెల్లెలినిచ్చి వివాహం జరిపించి, అర్ధరాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేశాడు.  తాను ఇతర దేవతలను, దేవాలయాలను, భక్తులను కూడా గౌరవిస్తూ, భక్తితో శ్రీహరిని సేవించాడు. ఒక ఆచార్యుడు రాజయ్యాడు.! రాజ్యాభిషేకం తర్వాత యామునాచార్యుడికి అస్త్రశస్త్ర విద్యలు, రాజనీతి, స్వయంగా నేర్పించి, దివ్యాస్త్ర మంత్రాలు కూడా ఉపదేశించాడు పాండ్యరాజు. రాజు అయినవాడు తరచూ శత్రువులపై దండెత్తి జయించి రావాలని హెచ్చరించాడు. కాని వస్తున్నది వర్షాకాలం. వర్షాకాలంలోదండయాత్ర చేయుట తగదని మంత్రి, పురోహితులు వారించారు. ఆ వర్షాకాలాన్ని అద్భుతమైన పద్యాలలో రాయలవారు ఈ విధంగా వర్ణిస్తున్నాడు.



 మ. తనతోయం బినరశ్ము లెత్త, నిల వాత్యారేణుమూర్తిన్ మహేం

      ద్రునకుం జెప్పగ, మ్రుచ్చుఁ బట్ట దివమందు న్విల్ఘటింపం, భయం

      బునఁ దద్రశ్మిసహస్రము న్వెస డిగెం బో డాఁగి వే గ్రుమ్మరిం

      , ననం ధారలు దోఁచె మించు వెలిఁగింప న్మబ్పుల న్వెల్లిపై.

ఈ పద్యం రాఘవ స్వరంలో ... రాగం - తోడి


వానాకాలంలోని గాలివానని చిత్రిస్తున్న పద్యమిది. ఆకాశంలో ఓ వైపు దట్టని మేఘాలు, మెఱపులు. మరోవైపు ఇంద్రధనుస్సు. దుమ్ము రేపే జోరుగాలి. హోరువాన. ఇవన్నీ ఉన్నాయీ పద్యంలో. వీటన్నిటినీ కలిపి ఒక అందమైన కథ అల్లాడు కవి. భూమి, తనలోని ఉదకాన్ని (నీటిని) సూర్యకిరణాలు ఎత్తుకుపోయాయని, సుడిగాలి రేణువుల రూపంలో వెళ్లి దేవేంద్రుడితో మొఱ పెట్టుకుందిట. వెంటనే ఆ ఇంద్రుడు విల్లంబులు ధరించి ఆకాశంలో దొంగను పట్టుకోవడానికి బయలుదేరాడు. మబ్బుల చాటున మెఱుపుల రూపంలో దాగిన ఆ కిరణాలిది గమనించి, తాము దొంగిలించిన నీటినంతా తొందరగా పారేయాలనే ఆత్రుతతో గ్రుమ్మరించేస్తున్నట్టుగా వర్షం కుండపోతగా కురుస్తోందట!

ఈ వర్ణనలో రాయలవారి రాజధర్మ నిర్వహణ తొంగిచూడటం లేదూ! ఇందులో మరొక విశేషం కనిపిస్తుంది. సూర్యుని వేడిమికి భూమ్మీద నీరు ఆవిరై మేఘాలు ఏర్పడి వానలు కురిసే జలచక్రం గురించిన అవగాహన, కనీసం రాయలనాటి కాలానికి మన దేశంలో ఉందని తెలుస్తుంది. ఆ శాస్త్రపరిజ్ఞానాన్ని అందమైన కథ రూపంలో చెప్పడమూ కనిపిస్తుంది.


 తే. పుట్ట వెడలి నభోభిత్తిఁ బట్టు శక్ర

     కార్ముకపుఁ బెద్ద పలువన్నెకట్ల జెఱ్ఱి

     దైన నడచెడు కాళ్ళగుంపనఁగ గాలిఁ

     గార్కొని దిగంతముల వానకాళ్లు నడచె

ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో...

మెఱుపు కాంతిలోనో సూర్యకాంతిలోనో వర్ష ధారలను చూస్తే, గాలికి ఊగుతూ అవి నడుస్తున్నట్టుగా కనిప్సితాయి. వాటినే వానకాళ్ళంటారు. ఇక్కడ కవి ఆ వానకాళ్ళని వర్ణిస్తున్నాడు. పైన ఆకాశంలో ఏడు రంగుల హరివిల్లుంది. అది రంగురంగుల జెఱ్ఱిలా ఉందట! పుట్టనుండి బయటకు వచ్చి ఆకాశమన్న గోడ మీద నడుస్తున్న ఆ రంగురంగుల జెఱ్ఱి కాళ్ళ గుంపులాగా ఉన్నాయట వానకాళ్ళు!

కాళిదాసు మేఘదూతంలోని "వల్మీకాగ్రాత్ ప్రభవతి హి ధనుఃఖండ మాఖండలస్య" అన్న శ్లోక పాదం యీ పద్యానికి ఆధారం అనిపిస్తుంది. వల్మీకంనుండి ఇంద్రధనుస్సు పుట్టింది అని అర్థం! పుట్టనుండి హరివిల్లు పుట్టడమేమిటని సందేహం. "వల్మికో సాతపో మేఘః" అన్న అమరకోశం ప్రకారం, వల్మీకం అనే పదానికి ఎండతో కూడిన మబ్బు అనే అర్థం కూడా ఉంది. అంచేత అక్కడ కాళిదాసు ఉద్దేశం ఎండ పడిన మేఘంనుండి ఉద్భవించిన ఇంద్రధనుస్సు అని పండితులు వ్యాఖ్యానించారు (ఇంద్రధనుస్సు ఏర్పడడం వెనకనున్న భౌతిక కారణం కాళిదాసు కాలానికే తెలుసననడానికిది రుజువని కూడా అన్నారు). అయితే ఇక్కడ రాయలవారు ఆ పదానికి పుట్ట అనే అర్థమే తీసుకొని, ఆ ఊహకు కొనసాగింపుగా ఆ హరివిల్లుని పుట్టనుండి వెడలిన పలువన్నెల కట్లజెఱ్ఱితో పోల్చారు!

  


 సీ. ఎలగోలుజల్లు మున్ పెళపెళ నేటవా

        ల్పడి గాలి నట్టిండ్లఁ దడిపి చనఁగ

     నట్టె తో వడగండ్ల కట్టావులు దుమార

        మావుల రేఁచి రెండవదియుఁ జన

     మఱి మూఁడవది నిల్చి మెఱసి బిట్టుఱిమి శీ

        కరవారి సృష్టిఁ జీకటిగ నలమ

     నుయ్యెలచేరుల యోజఁ బై పై వెండి

        జల్లుపైజల్లు పెల్లల్లుకొనఁగ



 తే. భూభిదాపాది దుర్భరాంభోభరంపు

     వడి మరుజ్ఝంఝఁ దెరలక కడవ వంచి

     నట్లు హోరని ధారౌఘ మైక్య మొంది

     విన్ను మన్నును నొకటిగా వృష్టి బలసె.

ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో...


ఈ పద్యంలో అంచెలంచెలుగా కురిసే వానని స్వభావోక్తిలో వర్ణిస్తున్నారు రాయలవారు. మొదటి జల్లు పెళపెళధ్వనితో  ఏటవాలుగా వచ్చి గాలితో కలిసి గుమ్మాలు దాటి నట్టింట్లోకి దూరి తడిపేసి వెళుతుంది. వెంటనే రెండవ జల్లు వడగళ్ళతో వచ్చి భూమిని తడిపి, వేడిపొగలూ, దుమ్మూ రేపి వెళిపోతుంది. ఆ వెనకే మూడవజల్లు వచ్చి కొంతసేపు ఆగి ఉరుములు మెరుపులతో, చిరు తుంపరలతో అంతా చీకటి చేస్తుంది. ఇక ఆ తర్వాత జల్లు మీద జల్లు ఉయ్యేల గొలుసుల్లా పెనవేసుకుపోయి కురవడం మొదలుపెడతాయి. కారు మబ్బులు కమ్మి, జోరుగాలితో కూడి, భరింపలేని వేగంతో, భూమి ఆకాశాలు ఏకమైనట్లుగా హోరుమనే ధ్వని చేస్తూ, కడవతో నీరు గ్రుమ్మరించినట్టు విడువకుండా కురుస్తుంది వాన.


 చం. పెళపెళ మబ్బు బిట్టుఱుమ భీతి విదూరశిలాంకుర చ్చటో

      త్పులకినియై ప్రియు న్నిదురవోవు హరి న్వడిఁ గౌఁగిలింపఁగాఁ,

      దలరి ధరిత్రి సాఁచు గఱు దాల్చిన గేళ్ళన గంకణంపుమ్రోఁ

      తలఁ బులు దేల వండు పయిఁదాల్చి నదు ల్వెసఁ జొచ్చెవారిధిన్.

ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం - శంకరాభరణం..


పెళపెళమని మబ్బురిమింది. ఏకాంతంలో కాంత భూదేవికి భయం కలిగింది. పక్కనే ఉన్న భర్త గాఢంగా నిద్రిస్తున్నాడు (వానాకాలంలో నాలుగునెలపాటు విష్ణుమూర్తి నిద్రలోకి వెళతాడని అంటారు కదా!). భయం పోగొట్టుకోడానికి భర్తపై చేయిచాచినట్లు నదులు దీర్ఘంగా సాగాయి. నదిలో కొత్తనీరు కదా, గడ్డి తేలుతోంది. అవి భూదేవి పొందిన గగుర్పాటుకి గుర్తుల్లాగా ఉన్నాయి. శరీరమ్మీద పులకలన్న మాట. ఆ నదిలో నీటిపక్షులు కిలకిలమంటున్నాయి. అవి, ఆ నదులనే చేతులకి ధరించిన గాజుల గలగలల్లాగ ఉన్నాయి. వానాకాలంలో బురదకూడా ఉంటుంది కదా. అది భూదేవి తాల్చిన గంధపుపూతలాగా ఉందట! అలా, ఆ వర్షాకాలపు నదులు సముద్రంలో సంగమించడం, భీతిల్లిన భూకాంత తన ప్రియుని కౌగిలించుకున్నట్టుగా ఉన్నదని కవి ఊహ. ఇక్కడ మళ్ళీ మనం గుర్తుకు తెచ్చుకోవలసిన విషయం - ఈ కావ్యంలో ప్రధానరసం శృంగారం. పైగా కావ్యనాయిక అయిన గోదాదేవి భూదేవి అవతారం. అంచేత అక్కడక్కడా యిలాంటి వర్ణనలు ఆ రసస్ఫురణను కలిగిస్తాయి.



 క. ఘనవృష్టి కతన ఫణు లే

    పున నల వల్మీకరంధ్రములు మూయఁగ నె

    త్తినగొడుగు లనఁగ చత్రా

    కనికాయం బవని నెల్లకడలం బొడమెన్.

ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో...

వానాకాలంలో ఎక్కడ చూసినా పుట్టగొడుగులు గుంపులుగుంపులుగా పొటమరించాయి. ఇది ఎలా ఉందంటే - వానలు పెల్లుగా కురియటం వల్ల పాములు పుట్టల్లో దూరి వానధారలు లోపలకు రాకుండా కన్నాల మీద గొడుగులు విప్పుకొని లోపల కూర్చున్నాయా - అన్నట్ట్లు ఉందట. బహుశా "పుట్టగొడుగు" అనే పేరుకి ఇంత చక్కని అర్థం చెప్పిన కవి ఒక్క రాయలేనేమో!



 క. కాకోదరాహితుల వ

    ల్మీకంబులఁ దూర్చె మెఱసి మేఘుం, డని గుం

    పై కనుఁగొని పొగడె నన్

    భేకధ్వను లెసఁగె వృత్త భేదానుకృతిన్

ఈ  పద్యం రాఘవ స్వరంలో.. రాగం - భూపాలం


పై పద్యంలో పాములు పుట్టల్లోకి దూరిపోవడం చిత్రించబడింది కదా. అలా తమ శత్రువులైన పాములని మేఘుడు పరాక్రమంతో, మెరుపులనే ఆయుధాలతో దండెత్తి వాటిని పుట్టల్లో దూరిపోయేట్టు చేసి తమని కాపాడినందుకు అతన్ని ప్రశంసిస్తూ రకరకాల ఛందస్సులలో కప్పలు స్తుతిస్తున్నాయా అన్నట్టు కప్పల అరుపులు (భేక ధ్వనులు) వినిపుస్తున్నాయట! వేదంలో భేకసూక్తాలని ఉన్నాయి. వాటి పరమార్థమేమిటో మనకు తెలియలేదు. కాని అర్థం మాత్రము, వానలు వచ్చి తమకు ఆనందం కలిగించాయని మేఘుని ప్రశంసించడం - అని బోధపడింది. ఛందమంటే వేదం కనక వృత్తభేదమన్న పదంతో వేదంలోని భేకసూక్తాలని కవి సూచిస్తున్నట్టుగా భావించవచ్చు.

 

 చం. తడి తల డిగ్గి ముంప, జడతం దుదఱెప్పలఁ గన్ను విప్పి, పు

       ల్పొడచుచు నీరు ముంగఱల పోలిక ముక్కునఁ గూడ, నోటఁ గొం

       తొడియుచు గూఁటి కఱ్ఱ సగ మొత్తుచు ఱెక్క విదుర్పు మున్నుగా

       వడఁకుటె కాక చేష్టుడిగె పక్షులు వక్షము జానువుల్ చొరన్..


వాననీటిలో తడిసిన పక్షుల అవస్థ చక్కని స్వభావోక్తిలో అత్యంత సహజంగా చిత్రించే వర్ణన యిది. వాననీరు తలపైనుంచి దిగి శరీరమంతటినీ తడిపేసింది. రెప్పలార్పడానికి కూడా అవ్వడం లేదు. కంటి తుదలతో మెల్లగా కళ్ళను తెరుస్తున్నాయి. అప్పుడా నీటిచుక్కలు ముక్కు మీద పడి ముంగరలాగ మెరుస్తూ, మెల్లగా నోట్లోకి జారుతున్నాయి. ఆ నీటిని కొంత తాగి, మరికొంత తమ గూటికున్న పుల్లలకి రాస్తున్నాయి. వణుకుతూ రెక్కలు విదిలిస్తున్నాయి. చివరకి, చలి పోగొట్టుకోడానికి మోకాళ్ళను రెక్కలు కప్పిన రొమ్ములోకి జొనిపి, అలా చేష్టలుడిగి మునగదీసుకు కూర్చుండిపోయాయి.



 ఉ. కాలునిదున్న నందినయి గంటలు దున్నక మంటినా, మహా

     కాలుని నంది దున్ననయి కర్దమమగ్నత లేక మంటి నా,

     హాలికు లెన్నఁడుం దెగని యౌరులచేలును జాకుమళ్ళునుం

     గా లలి నేరుసాఁగి రిలఁ గల్గుపసింగొని పేద మున్నుగన్.

ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో...

వ్యవసాయంలో మెఱకదుక్కి, దమ్ము(రొంపి)దుక్కి అని రెండు రకాల దుక్కులు (దున్నడం) ఉన్నాయి. మెఱకదుక్కి అంటే మెట్టపొలాలు (బురద లేని బీడు పొలాలు) దున్నడం, ఏడ్లతోనే తప్ప దున్నపోతుల చేత చేయించరు. రొంపిదుక్కి అంటే బురదతో ఉన్న పొలాన్ని చదను చేయడం. ఇది దున్నలచేత చేయిస్తారు, ఎడ్లతో కాదు. యామునాచార్యుని రాజ్యంలోని రైతులు ఈ రెండు రకాల పొలాలనూ (ఔరుగంట్ల పొదలతో ఉన్న మెరకచేనుని, బురదతోనిండిన జాకుమళ్ళనీ కూడా) ఎక్కడెక్కడ ఉన్న ఎడ్లతోనూ దున్నపోతులతోనూ దున్నిస్తున్నారట. అది చూసి యముని వాహనమైన దున్నపోతుకీ, శివుని వాహనమైన నందికీ (ఎద్దు) భయం పట్టుకుంది, తమ చేత కూడా దుక్కి చేయిస్తారేమోనని! కాని మళ్ళీ వాటికవే సర్దిచెప్పుకున్నాయట. ఏమిటని? నేను ఎద్దుని కాదు కదా, అంచేత నాకు మెరక దున్నే బాధ తప్పిందని యముని మహిషమూ, నేను దున్నని కాదు కదా, అంచేత బురదలో పొర్లే బాధ తప్పిందని శివుని వృషభమూ సంతోషించాయట! అంత సమృద్ధిగా పేదరైతులు సైతం ఏరువాక సాగించారు.

 

 క. వరుజుబడి రొంపిఁ ద్రొక్కం

    జరణంబులఁ జుట్టి పసిఁడి చాయకడుపులం

    బొరి నీరుకట్టె లమరెను

    బిరుదులు హాలికులు దున్నఁ బెట్టిరొ యనఁగన్.

ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో...


రైతులు రొంపి దుక్కిలో పొలంగట్ట్ల వెంబడి బురద తొక్కుతూ ఉన్నారు. వాళ్ళ కాళ్ళకి వానపాములు చుట్టుకున్నాయి. వాటి కడుపులు బంగారు రంగులో మెరుస్తున్నాయి. అది ఎలా ఉందంటే, వ్యవసాయంలో గొప్ప పండితులైన ఆ రైతులు, తమ పాండిత్యానికి చిహ్నంగా బంగారు గండపెండేరాలను ధరించారా అన్నట్టుగా ఉన్నదట!

 

 మ. గురుగుం జెంచలిఁ దుమ్మి లేఁదగిరిసాకుం దింత్రిణీపల్లవో

      త్కరముం గూడఁ బొరంటి నూనియలతోఁ గట్టావికుట్టారికో

      గిరముల్ మెక్కి తమిం బసుసుల్ పొలము వో గ్రేఁపుల్ మెయిన్ నాక మేఁ

      కెరువుంగుంపటి మంచ మెక్కిరి ప్రభుత్త్వైకా ప్తి రెడ్లజ్జడిన్..



ఇంత వర్షంలో కూడా ఇల్లాల్లు తమ భర్తలకోసం ఆ కాలంలో దొరికిన కూరలు, ఆకుకూరలతోనే రుచికరమైన భోజనం తయారుచేస్తారు. వర్షాకాలంలో పొలాల గట్ల మీద, బీళ్ళలో, గోడలమీద దొరికే కురకటము (గురుగాకు), చెంచెలియాకు, తుమ్మియాకు, లేత తగిరిసాకు, చింతచిగురుతో కలిపి నూనెతో యిగురుబెట్టి, ఆవిరి తేలుతున్న కుఱుచయారికల (కుట్టారికల) అన్నం కడుపునిండా తిని (పీకలదాకా మెక్కి!), పశువులని పొలాలకి తోలి, మేకెరువుతో రాజుకున్న కుంపటి మంచం కింద పెట్టుకొని, గుడిసెలో ఓ మూల కట్టేసిన దూడలు తమ శరీరాలను నాకుతున్నా పట్టించుకోకుండా, తమ పెద్దరికం ఉట్టిపడుతూ ఉండగా, హాయిగా గుఱ్ఱుపెట్టి పడుకుంటారట ఆ ఊరి రెడ్లు. ఇక్కడ కర్షకజీవన సౌందర్యం అద్భుతంగా వర్ణించబడింది. మేకెరువు చాలా ఆరోగ్యకరమట. ముఖ్యంగా క్షయరోగాన్ని నివారిస్తుందట! "ఓగిరము మెక్కి" అనడంలో ఎంత తృప్తిగా భుజించారో ధ్వనిస్తుంది. "మంచమెక్కిరి" అనడంలో "హాయిగా మంచమెక్కి పడుకున్నారు" అనే ధ్వని ఉంది.


ఇలా మొత్తం అరవై పద్యాలలో వర్షాకాల వర్ణన చేసారు కృష్ణదేవరాయలు. మచ్చుకి కొన్ని పద్యాలు మాత్రం ఇక్కడ వివరించడం జరిగింది. ఆ వర్ణనల్లో శాస్త్రవిషయాలు, సమాజ జీవితం, అద్భుత కల్పనలు, స్వభావోక్తి - అన్నీ కనిపిస్తాయి. వర్ష ఋతువు తర్వాత శరదృతు వర్ణన వస్తుంది. ఆ వర్ణనావైవిధ్యం, వైదుష్యం, తర్వాతి టపాలో...
Related Posts Plugin for WordPress, Blogger...