తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Sunday, August 29, 2010

మూడు కాలాల భోజనం

విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భాగవతోత్తముడు తన న్యాయార్జితమైన సొమ్ముతో ఏడాది పొడవునా అడిగినవారికి లేదనకుండా అన్నికాలాలందు తగువిధమైన భోజనాలు పెట్టి సత్కరించేవాడు. మరి రాయలు ఆ భోజనాలను స్వయంగా చూసాడేమో అన్నట్టుగా నోరూరించేరీతిగా పద్యాలనందించాడు. మనము వానాకాలం చలికాలం, ఎండాకాలంలో ఒకేరకమైన వంటకాలు చేసుకుంటాము. కాని ఈ బ్రాహ్మణోత్తముడు ఆయాకాలాలకు తగినట్టుగా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అతిధులకు వడ్డించేవాడు.


చ. గగనము నీరుబుగ్గ కెనగా జడివట్టిననాళ్లు భార్య కన్
బొగ సొరకుండ నారికెడంపుంబొఱియ ల్దవిలించి వండ న
య్యగపల ముంచిపెట్టుఁ గలమాన్నము నొల్చినప్రప్పు నాలు గే
న్పొగపినకూరలున్ వడియముల్ వరుగుల్ పెరుగున్ ఘృతప్లుతిన్

( ఈ పద్యం భైరవభట్ల కామేశ్వరరావుగారి స్వరంలో)

వానాకాలంలో ఆకాశం నీటి ఊటలాగా మారి ముసురుపట్టి ఉంది. ఈ కాలంలో ఎండు కట్టెలు దొరకడం చాలా కష్టం. అసాధ్యం అని చెప్పవచ్చు. అలాటి వాతావరణంలో తడిసిన కట్టెలతో వంట చేస్తే తన భార్యకు కళ్ళలో పొగ చేరుతుందని, విష్ణుచిత్తుడు నీరు తీసేసి ఎండబెట్టిన కొబ్బరికాయల టెంకలతో పొయ్యి వెలిగిస్తాడు. అతని భార్య వివిధ రకములైన శాకములు తయారు చేస్తుంది. ఆ టెంకాయ చిప్పలనే గరిటలుగా వరి అన్నము, పొట్టు తీసిన పప్పు బద్దలతో వండిన పప్పు, నాలుగైదు తాళింపుకూరలు, వడియాలు, వరుగులు, పెరుగు, నెయ్యితో కలిపి అతిథులకు వడ్డిస్తాడు.



చ . తెలినులివెచ్చ యోగిరముఁ దియ్యని చారులుఁ దిమ్మనంబులున్
బలుచనియంబళు ల్చెఱకుపా లెడనీళ్లు రసావళు ల్ఫలం
బులును సుగంధిశీతజలము ల్వడపిందెలు నీరుఁజల్లయు
న్వెలయఁగఁ బెట్టు భోజనము వేసవిఁ జందనచర్చ మున్నుగన్


(ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

ఇక ఎండాకాలంలో ఐతే అతిథులకు ముందుగా చల్లబడడానికి చందనం ఇస్తాడు. తర్వాత తెల్లని, గోరువెచ్చగా ఉన్న అన్నము, తియ్యని చారులు, మజ్జిగపులుసులు, పలుచని అంబలి, చెఱకు పాలు, లేత కొబ్బరికాయ నీళ్ళు, భక్ష్యములు, వివిధ రకములైన ఫలాలు, వట్టివేళ్ళు మొదలైనవాటితో చల్లబరిచి, సుగంధభరితం చేసిన మంచి నీరు, శరీరానికి వేడి చేయకుండా ఉండడానికి ఊరవేసిన మామిడిపిందెలు, మజ్జిగ మొదలగు పదార్థములతో సుష్టుగా భోజనము పెడతాడు.



మ.పునుఁగుం దావి నవౌదనంబు మిరియంపుం బొళ్లతోఁ జట్టి చు
య్యను నా దాఱని కూరగుంపు, ముకుమం దై యేర్చునావం జిగు
ర్కొనువచ్చళ్లును, బాయస్నానములు, నూరుంగాయలున్, జేసుఱు
క్కను నేయుం, జిఱుపాలు వెల్లువగ నాహారం బిడున్ శీతునన్.


( పద్యం భైరవభట్ల కామేశ్వరరావుగారి స్వరంలో)

ఇక గజగజ వణికిచే చలికాలంలో కమ్మని రాజనాల బియ్యంతో వండిన వేడి వేడి అన్నము, మిరియాల పొడితో తిరగమోత పెట్టగా చుయ్యిమనుచు ఘుమ ఘుమలాడే కూరలు, ముక్కులోని జలుబును కూడా తక్షణమే వదలగొట్టగల ఆవపిండి వేసి గుచ్చెత్తిన ఊరగాయలు, చేతి మీద పడగానే చుర్రుమనే వేడి నెయ్యి, గోరువెచ్చని పాలతో సుష్టిగా భోజనం పెడతాడు విష్ణుచిత్తుడు.
ఇలా తన సౌలభ్యం గురించి ఆలోచించకుండా ఆతిధుల సౌఖ్యము, ఆరోగ్యము కూడా దృష్టిలో పెట్టుకుని పలురకములైన వంటకాలను వినయవిధేయతలతో వడ్డించి వారిని సంతృప్తి పరచేవాడు విష్ణుచిత్తుడు.



శా. ఆ నిష్ఠానిధి గేహసీమ నడురే యాలించిన న్ర్మోయు నెం
తే నాగేంద్రశయానుపుణ్యకథలుం దివ్యప్రబంధానుసం
ధానధ్వానము 'నాస్తి శాకబహుతా, నా స్త్యుష్ణతా, నాస్త్యపూ
పో, నాస్త్యోదనసౌష్ఠవంచ, కృపయాభోక్తవ్య' మన్పల్కులున్



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

సదాచార సంపన్నుడైన విష్ణుచిత్తుడు తన జీవితం భగవంతుని సేవలో, అతిధి సత్కారములు, అన్నదానాలలో గడిపేవాడు. ఈ అన్నదానం పగటిపూటయందేకాక అర్ధరాత్రులలో కూడా జరిగేది. నడిరేయిలో కూడా ఆ పుణ్యమూర్తి ఇంట్లో విష్ణు పుణ్య కథాగానము, దివ్యప్రబంధ పారాయణములతో పాటు భోక్తలతో అన్నము వేడిగా లేదు, కూరలు ఎక్కువగా లేవు,పిండివంటలు కూడా లేవు, అంత సుష్టుగా లేని భోజనము. ఎలాగోలా సర్దుకోండి అని వినయంగా విష్ణుచిత్తుడు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఎల్లవేళలా దైవనామ స్మరణకు, అన్నప్రసాదాలకు విష్ణుచిత్తుడి నివాసం పెట్టింది పేరు అయింది.

Thursday, August 19, 2010

సాయంకాలపు దేవాలయాలు

రవిగాంచని చోట కవిగాంచును అన్నారు కదా. రాయలుకు ప్రతీ వస్తువు అందంగా కనిపిస్తుంది. విల్లిపుత్తూరులోని మన్నారు కృష్ణుడిగా కొలవబడే శ్రీరంగనాధుని ఆలయం గురించి ఎంత అందంగా వర్ణిస్తున్నాడో.


శా.సాయంకాలములం దదీశ మురజి త్సద్మస్వనద్దుందుభి
స్ఫాయత్కాహళికాప్రతిస్వనత దోఁప న్గుంజగర్భంబుల
న్ర్మోయుం గేళివనిం గులాయ గమన ప్రోత్తిష్ట ద న్తస్సర
స్స్థాయి శ్వేతగరు ద్గరుత్పటపటాత్కారంబుఁ గ్రేంకారమున్


( ఈ పద్యం భైరవభట్ల కామేశ్వరరావుగారి స్వరంలో)

సాయంకాల సమయంలో విల్లిపుత్తూరులోని ఉద్యానవనాలలోని సరస్సులలో ఉన్న హంసలు తమ విహారాలు చాలించి తమ గూటికి వెళ్ళడానికి లేచాయి. అప్పుడు వాటి రెక్కల చప్పుడు ఎలా ఉందంటే ఆ పట్టణపు స్వామియైన మన్నారు కృష్ణుని కోవెలలో సంధ్యవేళలో మ్రోగే భేరీధ్వనులవలె , ఇంటికి వెళ్లడానికి పైకి లేస్తూ అవి చేస్తున్న క్రేంకారములు ఆలయములోని బూర శబ్దము వలె ఎల్లెడలా వ్యాపించి ఆ ఉద్యానవనపు పొదరిల్లలో ప్రతిధ్వనిస్తున్నాయి.



మ. పొలయుం గాడ్పు లుదజ్మహాలయవ దంభోజాక్షవక్షస్తుల
స్యలఘు స్రజ్మకరందబిందువులఁ బణ్యారంపుఁ బుణ్యంపుఁ గం
పులఁ దాపత్రయి మీటి వీట నటన ప్రోద్యోగ సజ్జీభవ
ల్లలనావర్జిత కైకిక క్షరిత కహ్లారాళి నల్లార్చుచున్.



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)
రాయలు విల్లిపుత్తూరులోని ఉద్యానవనాలు, వీధులు, వారకాంతలనే కాదు అక్కడ వీచే గాలిని కూడా అత్యంత మనోహరంగా వర్ణించాడు. ఆ వాయువులు మన్నారు కృష్ణుని వక్షస్థలమందలి తులసీమాలల మీదుగా వీచడం వాళ్ళ వాటి పవిత్రతను , పరిమళాన్ని , ఆలయంలోని భక్ష్యాలు మొదలైనవాటి మీదుగా వీచుట వలన పుణ్య సౌరభము, నాగవాసమనెడి ఉద్యోగానికి సిద్ధమవుతున్న వారకాంతల కొప్పులలోని జారిన చెంగలువలను తాకి, వాటిని కదిలిస్తూ సుగంధభరితమై ఎల్లెడలా సంచరిస్తుంది ఆ గాలి ..




చ. కలమపుటెండుగు ల్ద్రవిడకన్యలు ముంగిటఁ గాచుచుండి, త
జ్జలరుహనాభగేహ రురుశాబము సారెకు బొక్కులాడఁ, గొం
డెలపయి కమ్మ గ్రామ్యతరుణీతతి డించిన పేఁపగంపలం
దల మగుచున్న చెంగలువ దండలఁ దోలుదు రప్పురంబునన్


( ఈ పద్యం భైరవభట్ల కామేశ్వరరావుగారి స్వరంలో)
రాయలవారి ఊహలు చాలా అపురూపంగా ఉంటాయి. కళ్ళంలోనో, వాన పడటం వల్లనో వడ్లు తడిశాయి. ఇంటి ముందు చాప వేసి ఆ వడ్లను ఎండబెట్టారు. ఆ ఇంటి కన్య ఆ వడ్లను గొడ్లు తినిపోకుండా కాపలాగా బయట కూర్చున్నది. గొడ్లు రావడంలేదు కానీ ఒక జింక పిల్ల వచ్చి సారె సారెకూ వడ్లు బొక్కిపోతున్నది. “జలరుహనాభగేహ రురుశాబము” దేవాలయపు జింక పిల్ల. ఎద్దులో, గేదెలో అయితే కర్రతో ఒక దెబ్బ వేయవచ్చు. కానీ అది సున్నితమైన జింక పిల్లాయె, పైగా దేవాలయపు జింక పిల్లాయె, ఊరి మీద పడి గింజలు తినే హక్కు దానికుంది! కర్రతో దానిని కొట్టడానికి చేయి రాదు. సరిగ్గా ఆ సమయానికి చెంగల్వ దండలను వేపగంపలో పెట్టుకొని, అమ్ముకోడానికి పల్లెటూరినుంచి వచ్చిన స్త్రీలు గంపను ఆ ఇంటి ముందు దించారు. ఆ అమ్మాయి, గంపలోని చెంగల్వ పూదండను తీసుకొని దానితో ఆ జింక పిల్లను అదిలిస్తున్నదట - అదీ ఈ పద్య భావం.
తడి వడ్లు ఇంటి బయట ఎండబోసుకోవడమూ, ఆడపిల్లలు గొడ్లు రాకుండా కాచి వుండటమూ, పల్లెటూరి స్త్రీలు పూదండలు అమ్మరావడమూ, దేవాలయపు జింక పిల్ల వడ్లు బొక్కడమూ - ఇవన్నీ ఎంతో సాధారణమైన విషయాలు. ఇవన్నీ ఎప్పుడు చూశాడో ఆ మహారాజు, ఎంతో చక్కగా బొమ్మ కట్టాడు. సున్నితమైన పదాలు వేసి పద్యంలో ఒక ధార సాధించడం కన్నా, చెప్పే విషయం యొక్క అపురూపత మీదనే ఎక్కువ దృష్టి, రాయలకు. ఆయన వ్రాసిన చాలా పద్యాలు అలానే వుంటాయి. ఈ పద్యమూ అంతే. పదాలను కొత్తగా వాడటం ఆయనకు బాగా ఇష్టం. ‘కలమపుటెండుగల్’ అలాంటి ఓ పదం. పదిహేనో శతాబ్దం ఆఖరిభాగంలోనూ, పదహారో శతాబ్దపు ప్రారంభంలోను ప్రవర్తిల్లిన పాండ్యదేశపు సామాజిక జీవితం ఇంత అందంగా తీర్చి దిద్దిన ఈ పద్యం ఎవరికి నచ్చదు?


శా. అం దుండుం ద్వయసద్మ పద్మవదనుం డద్వంద్వుఁ డశ్రాంతయో
గాందూబద్ధమధుద్విషద్ద్వి రదుఁ డన్వర్ధాభిదానుఁ డురు
చ్చందోబృందతదంతవాగపఠనా సంజాతతజ్జన్యని
ష్పందద్వైతసుసం విదాలయుఁడు నిష్ఠ న్విష్ణుచిత్తుం డనన్.



(ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)
ఆ విల్లిపుత్తూరులో విష్ణువును తన చిత్తమునందు ఉంచుకొని నిరంతరము ద్వయానుసంధానము చేయుచు, సుఖదు:ఖాలు, శీతోష్ణములగురించి పట్టించుకోకుండా తన నిరంతర యోగముచే శ్రీరంగనాధుని వశపరుచుకున్నాడు విష్ణుచిత్తుడు. వేదవేదాంగములు చదువకుండానే వాటివలన లభించే నిశ్చల ద్వైతజ్ఞానమునకు తానే నిలయమైనాడు నిష్టాగరిష్టుడైన విష్ణుచిత్తుడను సార్ధకనామదేయముగల భాగవతోత్తముడు .

ఆముక్తమాల్యదను విష్ణుచిత్తీయం అని కూడా అంటారు. ఈ విష్ణుచిత్తుడు శ్రీహరినెప్పుడూ తన హృదయంలో ధ్యానిస్తు ఉంటాడు. ఆ మన్నారు కృష్ణస్వామికి పూలదండలు కట్టి కైంకర్యం చెయ్యటం అతనికి ప్రీతికరమైన పని. తాను న్యాయంగా సంపాయించిన డబ్బుతో ఆ వూరి గుండా వెళ్ళే తీర్థయాత్రికులకి పగలు రాత్రి అన్న తేడా లేకుండా నిత్య అన్నదానాలు చేస్తుంటాడతను.


విష్ణుచిత్తుడు ఆయా కాలాలలకు, వాతావరణానికి తగ్గట్టుగా వడ్డించే ఘుమఘుమల గురించి తర్వాతి టపాలో..

Sunday, August 1, 2010

బాతులు, తోటలు, పళ్ళు

రాయలు విల్లిపుత్తూరులోని పశుపక్షాదులు, పళ్ళు పూల తోటలను కూడా అత్యంత రమణీయంగా వర్ణించాడు. కవియైనవాడికి తాను చూచినా ప్రతీ వస్తువు అందంగానే కనిపిస్తుంది. తన రచనతో ఆ అందాన్ని మరింతగా ఇనుమడింప చేస్తాడు.

మ. తలఁ బక్షచ్చట గ్రుచ్చి బాతువులు కేదారంపుఁ గుల్యాంతర

స్థలి నిద్రింపఁగఁ జూచి యారెకు లుష స్స్నాతప్రయాతద్విజా
వలి పిండీకృత శాటిక ల్సవి దదావాసంబుఁ జేర్పంగ రే
వుల డిగ్గ న్వెస బాఱువానిఁ గని నవ్వు న్శాలిగోప్యోఘముల్


( ఈ పద్యం చదువరి స్వరంలో )

విల్లిపుత్తూరులో వరిమళ్లకోసం తవ్విన పిల్ల కాలువలు ఉన్నాయి. ఆ పంటకాలువలలో బాతులు తమ స్వభావగుణముచేత తలలు రెక్కలలో దూర్చికొని నిద్రిస్తున్నాయి. అది చూసిన భటులు /కాపరులు ప్రాతఃకాలములో స్నానానికి వచ్చిన బ్రాహ్మణులు తమ ధోవతులను పిండి అక్కడే మరచిపోయినట్టున్నారు. వాటిని తీసికెళ్లి వారి ఇంటిలో అప్పగిద్దామని నీటిలోకి దిగారంట. ఆ అలికిడికి ఉలిక్కిపడ్డ బాతులు ఎగిరిపోయాయి. ఆ పక్కనే పొలాలను కాపలా కాసే యువతులు అది చూసి పక్కున నవ్విరంట. తెల్లని బాతులను చూసి బ్రాహ్మణుల పంచెలని భ్రమపడి భంగపడ్డారు ఆ భటులు.. ఈ పద్యం రాయడానికి మరో కారణం కూడా ఉందని అంటారు. కృష్ణదేవరాయలుకు చిన్నాజి అనే సానిపిల్లతో పరిచయం కలిగి అది ప్రగాఢానురాగంగా మారింది. అప్పటికి రాయలు పాతికేళ్ల చిన్నవాడు. తాను రాజ్యాధిపతినైతే చిన్నాజిని తప్పకుండా వివాహమాడతానని వాగ్ధానం చేసాడు. తండ్రిచాటు బిడ్డ కావడంతో రాత్రుళ్లు రహస్యంగా ఆమెను కలుసుకుంటూ ఉండేవాడు. కాని ఈ సంగతి మంత్రి తిమ్మరుసుకు తెలుసు. విజయనగరంలో రాత్రిళ్లు గస్తీలు తిరిగే ఆరెకులు ( రక్షకభటులు) వెయ్యికళ్లతో కాపలా కాసేవారు. వారి కంటపడకుండా తప్పించుకుందామని కృష్ణదేవరాయలు వరిమళ్లలో కాలువపక్క నక్కి కూర్చుంటే ఆరెకులు చూసి ఉంటారు. ఆతని తలగుడ్డ తెల్లగా, బాతురెక్కలా ఉందేమో. అందుకే బాతులను చూసి అరెకులు వస్త్రమని అరెకులు భ్రమించారని రాయలు ఉత్తరోత్తరా ఈ పద్యం చెప్పాడు.




. సొరిదిం బేర్చిన తీఁగమల్లియలు ఖర్జూరంబులు న్బుష్పమం
జరులు న్మామిడిగుత్తులు న్గుసుమము ల్సంపెంగలు న్భచ్చగ
న్నెరులుం బాళలు గల్గి రాజనపుఁ గాంతిం దారు ము ల్సూపి చే
లరుదార న్నగుఁ బూవుఁ దోఁటల బలాకానీకదంభంబునన్

( ఈ పద్యం చదువరి స్వరంలో )


విల్లిపుత్తూరులో పంటపొలాల అందాలు ఎలా ఉన్నాయంటే తెల్లకొంగల బారులు ఎగురుతుంటే పంటపొలాల నవ్వుల్లాగా ఉన్నాయి. అంటే పూలతోటలకంటే తామే గొప్ప అని పంటపొలాలు భావిస్తున్నాయి. వరుసగా ఉన్న తీగమల్లి, ఖర్జూరాలు, పుష్పమంజరులు, మామిడి గుత్తులు, కుసుమాలు,, సంపెంగలు, పచ్చగన్నేరులు, పాళలు.. ఇవన్నీ పూలలోని రకాలు. కాని ఇదే పేరున్న రకాలు వరిధాన్యాలలో కూడా ఉన్నాయి. కాని అదనంగా రాజనాలు అనే రకం వరిధాన్యంలో ఉండి పంటపొలాలను పూలకంటే గొప్పవిగా చేస్తుంది. ఈ రాజనం ధాన్యం చివరలో ముల్లులా ఉండి త్రాసుముల్లులా పంటపొలాలవైపే మొగ్గు చూపుతుంది. ఈ ధీమాతోనే పంటపొలాలు, పూలతోటలను పరిహసిస్తున్నాయని రాయలు ఒక అద్భుత చిత్రాన్ని రచించాడు. ఇక్కడ మరొక విశేషం వరిపొలాలలో కంకులకి ముళ్ళుంటాయి కాబట్టి, త్రాసు ముల్లు వాటి వైపు మొగ్గిందనడానికి అదొక తార్కాణం! రకరకాలు పూలతోటలు, వాటి పక్కనే వరికంకులతో నిండి ఉన్న పంటపొలాలు. పైన ఎగురుతున్న బారులు తీర్చి ఎగురుతున్న కొంగలను చూస్తుంటే తామే గొప్ప అని పంటపొలాలు నవ్వుతున్నట్టుగా అందంగా కనిపిస్తున్నాయి.

. అడుగునఁ బండి వ్రీలి యసలై మధువుట్టఁగఁ, ద్రావఁ దేంట్లు మ
ల్లడి గొని చుట్టు రాఁ బనసల న్బొలుచు న్గలుగుండ్రతోడ నీ
డ్వుడు పెనుఁబండ్లు, భిన్నకట పాంసుల భూరి మదాంబు సేచనా
జడదృఢశృంఖలాయుత వసంతనృప ద్విరదాధిపాకృతిన్.



( ఈ పద్యం చదువరి స్వరంలో )

ఆ విల్లుపుత్తూరులో వేరు పనస పండ్లు చాలా పెద్దవి కావడం చేత భూమిని తాకుతూ, భూమిలోనే పండి పోయేవి. అంతే కాదు, పగిలి పోయేవి కూడ. అలా పగిలి పోయిన ఆ పండ్ల రసం బురద లాగా పైకి వచ్చింది. ఆ వాసనకు తుమ్మెదలు చుట్టు ముట్టాయి. ఈ దృశ్యం ఎలా ఉందంటే, ఆ పండ్లు మదపుటేనుగుల్లా ఉన్నాయి. ఆ ఫల రసం - మదించిన ఏనుగుల కుభస్థలం నుండి ధారాపాతంగా కారుతూ ఉండే మదజల ధారలాగా ఉంది. నల్లని తుమ్మెదల గుంపు ఆ మద గజాన్ని బంధించిన యినుప సంకెలవలె ఉంది. (ఇక్కడ చెపుతున్న ఏనుగులు వసంతుడనే రాజుయొక్క పట్టపుటేనుగులు. పండిన పనసపండ్లు వసంత రాజు పట్టపుటేనుగుల్లా ఉన్నాయి. పనసలు వసంతకాలంలోనే పండుతాయి కాబోలు!)


. చాల దళంబుగాఁ బృథుల చంపక కీలనఁ బొల్చు బొందుఁ దో
మాలె లనంగఁ బండి మహిమండలిఁ జీఱుచు వ్రాలి గంధ మూ
ర్చాలస యైన భృంగతతి నాఁ దుదక ప్పమర స్ఫలావళు
ల్వ్రీలి గెల ల్సుగంధికదళీ వన పంక్తుల నొప్పు నప్పురిన్

( ఈ పద్యం చదువరి స్వరంలో )

విలుఫుత్తూరు పట్టణంలో విరగ పండిన అరటి తోటలని కవి ఇలావర్ణిస్తున్నాడు. ఆ పట్టణంలో అరటి తోటలలో పండే పళ్ళకు సుగంధులు అని పేరు. అవి బాగా పండాయి. నేలకు జీరాడుతున్నాయి. వాటి కొనలు నల్లగా ఉన్నాయి. అందు వల్ల విరగపండిన ఆ అరటి పండ్ల గెలలు సంపెంగ పూల మాల లాగా ఉన్నాయి. ఆ పళ్ళు వికసించిన సంపెంగ పూల లాగా ఉన్నాయి. నల్లగా ఉన్న ఆ పండ్ల చివరలు సంపెంగ పూల మీ వ్రాలి, మత్తిలి మూర్ఛపోయిన తుమ్మెదలలాగా ఉన్నాయి. (తోమాలెలు - ఆకులు పువ్వులతో కలిపికట్టిన దండలు. ఇవి ముఖ్యంగా వైష్ణవులు స్వామికి వేసే దండలు. అంచేత ఆ అరటి తోటలు ఆ విలుబుత్తూరు స్వామికి వేసిన సంపెంగ మాలల్లాగా ఉన్నాయి అని అనుకోవచ్చు.)
Related Posts Plugin for WordPress, Blogger...