సీ. మదగంధతారతమ్యము యామ్యకరికిఁ ద
త్కరులకుం గనబలెఁ గటము లొరసి,
సురతశ్రమజ మౌటఁ జూపోపకయుబలె?
గామినీ మృదుగండఘర్మ ముడిపి
పరిమళవాహేచ్ఛఁ బ్రాణమీబలెఁ జించు
మృగనాభిచర్మభస్త్రికలు దూఱి
అహితపన్నగభేదు లనబలె గృహవిటం
కపుఁగలాపుల నొయ్యగఱులు నిమిరి.
తే. వీటిసామగ్రిఁ గనుఁగొన వేగపడక
నడవఁ దనదిక్కు పుష్పదంతద్విపంబు
నెక్కెనో యన జడగతి నెపుడుఁ బొలయు
నందుఁ జందనశిఖరిమందానిలుండు.
(పై పద్యం లంక గిరిధర్ స్వరంలో )
యముని దిక్కునున్న(దక్షిణ దిక్కు) ఏనుగుకు, మధురాపురంలోని గజములకు గల మదవాసనల తేడా తెలుసుకోవడానికో అన్నట్టు ఆ ఏనుగుల గంఢస్థలములను తాకుతూ అందున్న పరిమళాన్ని గ్రహిస్తోంది. మలయపర్వతం ఉండేది దక్షిణం వైపు కాబట్టి దక్షిణపు గాలినే మలయమారుతమంటారు. రతిక్రీడ తర్వాత అలసిన వనిత చెక్కిళ్ల చెమటను ఆర్చునట్టుగా వాటిని తాకి అక్కడి సుగంధమును గ్రహిస్తోంది, చించిన బొడ్డు కలిగి పడి ఉన్న కస్తూరీ మృగములకు ప్రాణము కలిగించునట్టుగా వాటి బొడ్డులోని చర్మపు తిత్తులలోకి జొరబడి ఆ సుగంధమును కూడా గ్రహిస్తోంది. తమకు శత్రువులైన పాములను భేదించేట్టుగా ఉన్న గృహాలలో పెంపుడు నెమళ్లను స్నేహంతో దువ్వినటుల వాటి ఱెక్కలను నిమురుతోంది. గాలిని తినేవి పాములు. ఆ పాములని చంపుతున్నవి నెమళ్ళు. శత్రువుకి శత్రువు మిత్రుడు కదా! అందుకా గాలికి నెమళ్ళతో స్నేహం!
ఆ పట్టణములోని సకల సమృద్ధిని చూడాలనే కోరికతో తొందరపడకుండా, తనే దిక్కునుండి వచ్చిందో ఆ దిక్కునున్న (దక్షిణపు దిక్కు) పుష్పదంతమనే ఏనుగుపై స్వారీ చేస్తూ మెల్లిగా సంచరిస్తున్నట్టుగా, గంధపుకొండ మీదుగా మలయమారుతం సువాసనాభరితమై మధురాపురములో వీస్తున్నదని భావం.. విలిబుత్తూరులో గాలి భక్తి పారవశ్యం కలదైతే, ఇక్కడి గాలి రాచఠీవి కలిగినది.
ఇప్పుడింక ఆ మధురానగరాన్ని ఏలుతున్న రాజుని వర్ణిస్తున్నాడు.
సీ. ద్విద్వయోపాయ ధీవిద్వద్వతంసంబు,
షాడ్గుణ్యచాతురీ చక్రవర్తి
క్రీడాచలీకృత శ్రీఖండగిరిరాజు,
కనకాద్రిముద్రణ గ్రంథకర్త
యందూనిబద్ధాబ్ద
బృంద వేదండాళి,
వననిధి స్తంభ నాధునికరఘువు
తామ్రపర్ణ్యమలపాథః కేళిహంసంబు,
లంకేశమైత్రీ ప్రియంకరుండు
తే. స్వస్తికృద్వాస్తవస్తుత్యగస్తి, మఘవ
మకుటమోటన శతకోటి మంత్రభృత్య
భూతభూతాత్తశాంభవ భూమికుండు
దత్పురం బేలుఁ బాండ్య మత్స్యధ్వజుండు.
( ఈ పద్యం కామేశ్వరరావు స్వరంలో )
మధురానగరానికి మహారాజు మత్స్యధ్వజుడు, అంటే చేప గుర్తున్న జెండా కల రాజు.
ఆయన రెండు రెళ్ళు(ద్విద్వయ) నాలుగు ఉపాయాల (సామ, దాన, భేద, దండ ఉపాయాలు) ప్రావీణ్యంగల పండితులలో శ్రేష్టుడు. షడ్గుణములయందు చతురత కలిగినవాడు.
షడ్గుణాలు: సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైదీభావం, సమాశ్రయం.
సంధి: కొన్ని షరతులతో శత్రువుతో చేయి కలపడం.
విగ్రహం: దండెత్తివచ్చిన శత్రువును యుద్ధముచే అడ్డుకోవడం.
యానం: శత్రువు మీదికి దండెట్టి వెళ్ళడం,
ఆసనం: విగ్రహము ప్రారంభించి తన దేశంలోనే ఉండడం.
ద్వైదీభావం: సగం సేన తో దండెత్తి వెళ్ళడం.
సమాశ్రయం: మధ్యస్తుని గా శరణు జొచ్చడం
మలయపర్వతముపై విలాస యాత్రలు చేసేవాడు. బంగారుకొండపై తన బిరుదును ప్రకటించుకున్నవాడు. ఏనుగులను కట్టినట్టు మేఘాలను బంధించినవాడు. సముద్రం మీద వంతెన నిర్మించిన నేటి కాలపు రఘురాముడు. తమిళ సింహళ దేశాల మధ్య చారిత్రక సంబంధాలున్నాయి కనుక అతను కూడా రామునిలా వారధి నిర్మించి ఉండాలి. మేఘాలను బంధించడం అన్నది విచిత్ర విషయం. మంత్రశక్తితో కావలసినప్పుడు వానలు కురిపించే శక్తి ఇతనికి ఉందని అర్థం చేసుకోవాలి. తామ్రపర్ణి నదిలో విహరించే హంస. విభీషణునితో చెలిమి చేసినవాడు. రామాయణంలో ఈ రాజు గురించి వచ్చిన ప్రస్తావనల ఆధారంగా చేసిన వర్ణనలివి.
అగస్త్యముని దక్షిణ దిక్కుకు వచ్చి పాండ్యదేశంలో ఆశ్రమం కట్టుకున్నాడని పురాణోక్తి. కాబట్టి నిత్యమూ అతని ఆశీర్వాదాలు పొందినవాడు పాండ్యరాజు. ఇంద్రుని కిరీటాన్ని మొట్టే బాణసమూహం కలవాడు, అంటే ఇంద్రుకి మించిన పరాక్రమం కలవాడని. మంత్రశక్తితో భూతగణాలను స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి ఆ భూతనాథుడైన శివునిలా ఉన్నాడు.
ఇక్కడీ పాండ్యరాజు వర్ణనని విష్ణుచిత్తుని వర్ణనతో పోల్చుకోవాలి. పోల్చుకోమని కవి చెప్పకనే చెపుతున్నాడు. అక్కడ "ద్వయసద్మం" ఉంటే ఇక్కడ "ద్విద్వయోపాయం" ఉంది. అక్కడున్నది భక్తి, ఇక్కడున్నది రాజనీతి. అలాగే అక్కడ కూడా సంకెలకి "అందూ" అన్న మాటే ప్రయోగించడం గుర్తుందా! ఇక్కడ పాండ్యరాజు మేఘాలనే ఎనుగులని గొలుసులతో కట్టినట్టు బంధిస్తే విష్ణుచిత్తుడు ఏకంగా విష్ణుమూర్తి అనే ఏనుగునే యోగమనే సంకెలతో బంధించాడక్కడ. అంటే పాండ్యరాజుది భౌతికతశక్తి, విష్ణుచిత్తునిది ఆధ్యాత్మికశక్తి. భౌతికశక్తి పరిమితిని చెప్పి, దానికి మించిన ఆధ్యాత్మికశక్తి మనిషికి ఎలా అవసరమో పాండ్యరాజ విష్ణుచిత్తుల కథ ద్వారా నిరూపించబోతున్నాడు. ఆ సూచనగానే వారిరువురి వర్ణనలూ ఔచిత్యంతో శోభిల్లాయి!
ఉ. ఇందుకులావతంస మతఁ డేతఱి నేతరిగాఁ; డరిం బ్రజ
ల్కందఁ గొనం; డొరుం డొరుతల న్వినిపించినమాట డెందముం
జెంద ముదంబు దక్కి చెడఁ జేయఁ డొరు; న్వినతాస్యుఁ డౌ నుతిం
పం దనుఁ; బందనుం గొఱత వల్కఁడు శూరతఁ దానుమించియున్.
( ఈ పద్యం రాఘవ స్వరంలో.. రాగం . బేగడ )
చంద్రవంశభూషణుడగు మత్స్యధ్వజుడు ఎప్పుడూ నీతి తప్పనివాడు, ధీరుడు, ఉదాత్తుడు, వినయశీలి, ప్రజలు కష్టపడేలా పన్నులు వేయడు, చెప్పుడు మాటలు విని జనులను బాధపెట్టడు, తనను ఎంతగా పొగిడినా పొంగిపోక, పరాక్రమముచేత గర్వముతో ఎవ్వరినీ తక్కువ చేయనివాడు. ఇటువంటి సద్గుణాలుకలిగిన ఆ మహారాజు
జనరంజకముగా రాజ్యమును పాలించేవాడు.
శా. దానత్యాగపతత్త్రమై తొలు పతత్త్రం బంబుధార న్సదా
నానం, దత్సితకీర్తిహంసి చనుమింటం; గ్రొత్త నా నేల,నా
నానీరార్ద్రపతత్త్ర యయ్యు వడి మింటం బాఱు తజ్జాతి కే
లా నిల్చుంగతి యన్యపత్రి గతిఁ బత్త్రైక ప్రదేశాఫ్లుతిన్?
( ఈ పద్యం రవి స్వరంలో)
ఈ పద్యంలో మత్స్యధ్వజుడి కీర్తిని హంసతో పోల్చాడు రాయలు.
కీర్తి తెల్లగా ఉంటుందని కవి సమయం, అది స్వచ్ఛతకి చిహ్నం. అందుకే తెల్లని వస్తువులతో పోల్చడం ఆనవాయితీ (వెన్నెల, ఐరావతం మొదలైనవి. "నరసింహ కృష్ణరాయని
కరమరుదగు కీర్తి" గురించిన చాటువు బాగా ప్రసిద్ధమైనదే!). ఇక్కడ రాయలవారు పాండ్యరాజు కీర్తిని హంసతో పోలుస్తున్నారు. హంసతో పోల్చడంలో ఉన్న మరొక ఔచిత్యం, అది దశదిశలా ఎగురుతుంది (వ్యాపిస్తుంది). అలాగే హంస శ్రేష్ఠతకి కూడా సూచకం. ఇంతవరకూ చెప్పి ఊరుకుంటే అతను కృష్ణదేవరాయలే అవ్వడు! ఆ కీర్తి అనే హంసకి రెండు రెక్కలూ దానం, త్యాగమునట. అంటే నిరంతర దాన త్యాగల వల్లనే ఆయన కీర్తి హంస ఎగురుతోందన్నమాట. దానమంటే నీరు ధారపోసి అడిగినవారికి ఇచ్చేది. త్యాగమంటే అదేమీ లేకుండా తన దగ్గరున్న వస్తువుని ఇచ్చివేయడం. అంచేత దానమనే ఒక రెక్క ఎప్పుడూ తడుస్తూనే ఉందన్న మాట. మామూలుగా పక్షులు తడి రెక్కలతో ఎగరలేవు. అయితే హంస మాత్రం రెండు రెక్కలూ తడిసినా ఎగరగలదు. ఇక్కడ తడుస్తున్నది ఒక రెక్కనే కదా. అంచేత కీర్తి అనే ఆ హంస ఎగరడంలో ఆశ్చర్యమేమీ లేదు అని సమర్థించాడు. ఒక ఊహని రాయలవారు ఎంత సమగ్రంగా ఆలోచిస్తారో అన్న దానికి ఇదొక చక్కని ఉదాహరణ.
రాజు అనేవాడు ఎలా ఉండాలో రాయలవారు ఒక రాజుగా చెప్పడంలో ఏమీ విశేషము లేదు. ఐతే ఆ వర్ణనామాధురి అధ్బుతం. పై మూడు పద్యాల తర్వాత ఇంకా తెలుసుకోవాలంటే..నీతి సారంలో ప్రతాపరుద్రుడు ఏమంటాడో చూద్దాము.
"జనపతి పర్జన్యుగతిం
దనభూప్రజ బ్రోవవలయు, దగ బ్రోవడయే
దను బాసిపోవు నా ప్రజ
ఘన నీరస సరసి బాయ ఖగముల భంగిన్."
అలాగే క్షేమేంద్రుడు.. తన సకల నీతి సమ్మతంలో..
"రాజ రాజ వంశ భూజన పతులీలి
రకట! మంత్రి తొలగి యలికి నాడు
యేది పసుపుసేయ నిటు నిల్వబోలదు
రాజు లేని కయ్య మోజు పడునె"
అలా రాజు అన్నవాడు ప్రజల మెప్పుగోరి పన్నులకై ప్రజలను బాధించక మంత్రి మాట విని, పొగడినా ఉబ్బక, కన్నబిడ్డల్లా చూడాలని రాయలు చెప్పడం చాలా ఔచిత్యం గా ఉంది.
0 comments:
Post a Comment