తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Friday, December 3, 2010

పుష్పలావికలు, గజ, అశ్వ వర్ణన...

అష్టాదశ వర్ణనలు కన్నడం నుంచి నన్నెచోడుడు గ్రహించాడని అంటారు కొంతమంది. ఏది ఎమైనా.. ఈ అష్టాదశ వర్ణనలు వివరంగా తెలుసుకొవలసిన అవసరం ఎంతైనా ఉంది. అవి ఏమిటంటే..

1. పుర వర్ణన.
2. గిరి వర్ణన.
3. వన వర్ణన.
4. నది వర్ణన.
5. సముద్ర వర్ణన.
6. ద్యూత వర్ణన.
7. వివాహ వర్ణన.
8. విరహ వర్ణన.
9. యుద్ధ వర్ణన.
10. షడృతువుల వర్ణన.
11. ప్రాత: సంధ్యాకాల వర్ణన.
12. సూర్యోదయ సూర్యాస్తమాన వర్ణన.
13. మధుపాన వర్ణన.
14. రాయబార వర్ణన.
15. స్త్రీ వర్ణన.
16. బ్రాహ్మణాది చాతుర్వర్ణముల వర్ణన.
17. చతురంగ సైన్య వర్ణన.
18. వేదాంత విచారణ.

ఇవి ఏ ప్రబంధంలో అయినా ఉండి తీరాలని ఆర్యోక్తి.

ఇదే విధంగా అష్టాదశవర్ణనలలో భాగంగా రాయలు పురవర్ణన, సౌధవర్ణన తర్వాత మధురాపురంలోని పుష్పలావికల గురించి ఈ విధంగా చెప్తున్నాడు. పుష్పలావికలంటే పువ్వులమ్మే వాళ్ళు.

సీ. ఇంద మన్‌తఱి దంతకుందాభ గూడి ని
చ్చలపుఁజూపులు మున్న సంభ్రమింప,
వెల యొప్ప కవలఁ బో విఱుచు మోవియుఁ గోప
మొదవెడుచూపు మోమోటఁ ద్రిప్పఁ
దిరిగిన సస్మితోక్తియుఁ జూపుటొయ్యార
ములు నగుఁ గాదను పలుకు లుడుప,
నవి గాని కావొ నీకను పరసాపత్న్య
సంపాదనం బుబ్బు నింపుఁ బెనుపఁ

తే. జతురవచనవిలాసాంగసౌష్ఠవములఁ
బసిఁడిఁ దా నిచ్చినట్టి యప్పణఁతి మఱవఁ
బతికిఁ గైదువు లందిచ్చు రతి విధమున
విటుల కిత్తురు మఱి వారు విరులు పురిని



( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)







మధురాపురంలో పుష్పలావికలు చాలా చతురులు. ఇదిగో పువ్వులు అనేటప్పటికే వాళ్ళ మల్లెపూలవంటి దంతకాంతులు పువ్వులు కొనే విటులని ముగ్ధులని చేసేస్తాయి. చెప్పిన ధర కుదరక విటులు వేరే పూలమ్మి దగ్గరకి వెళ్ళబోతే వీళ్ళ పెదవివిఱుపు కళ్ళల్లో చూపించే చిరుకోపం మళ్ళీ ఆ విటులని వీళ్ళ దగ్గరకే తీసుకువస్తాయి. ఆపై ఒకింత గర్వముతో, ఒకింత సరసముతో ఆ పువ్వులే కాని మా పువ్వులు నీకు ఇష్టము కావా? అని అలక నటిస్తారు. యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు భర్తకు ఆయుధములు అందించు రతిదేవి వలే ఈ పుష్పలావికలు తమ ఒయ్యారపు విలాసాలతో, చాతుర్యపు మాటలతో ఆకర్షిస్తూ విటులకు పువ్వులు విక్రయిస్తున్నారు. మన్మథుడి ఆయుధాలు పువ్వులే కదా మరి! యుద్ధానికి వెళ్ళేప్పుడల్లా భర్తకి ఆయుధాలు అందించే ప్రత్యేకత బహుశా ఒక్క రతిదేవికే దక్కుతుంది. మధురాపురంలో పువ్వులమ్మే స్త్రీలు సాక్షాత్తు రతిదేవిలేనట! ఒక పద్యంలో మొత్తం ఒక సజీవ దృశ్యాన్ని సాక్షాత్కరింప చెయ్యడం రాయలవారి ప్రత్యేకత. అది ఈ పద్యంలోనూ కనిపిస్తుంది.

. దలమగు చంద్రఖండములు దారలు, సాంకవ మొప్పు పాణి పా
టలమగు దంతపుంగరవటంబు శశాంకుఁడు , గుంకుమైన చీ
రల జిగి కెంపుగా బయటి రధ్యల నొప్పుదు రిందుకాంతవే
దులపయి సంధ్యయే బహుతఁ దోఁచెననన్ బురి గట్టివాల్సతుల్



(ఈ పద్యం రవి స్వరంలో)
మధురానగరంలో మరొక దృశ్యాన్ని అద్భుతమైన ఉత్ప్రేక్షతో వర్ణిస్తున్నాడు రాయలు. ఆ నగరంలో సుగంధ పరిమళ ద్రవ్యములు అమ్ముతున్న స్త్రీలు వీధిలోని పాలరాతి తిన్నెలపై కూర్చుని వ్యాపారం సాగిస్తున్నారు. ఆ దృశ్యం ఎలా ఉందంటే - వాళ్ళమ్ముతున్న సుగంధద్రవ్యాల్లో మిలమిలా మెరుస్తున్న కర్పూరపు తునకలున్నాయి. అవి నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. వాళ్ళ చేతుల్లో తెల్లగా మెరుస్తున్న దంతపు భరిణ ఉంది. దానికి నల్లని జవ్వాది అంటుకుని ఉంది. వాళ్ళ చేతుల లేత ఎఱుపు రంగు ఆ దంతపు భరిణలో ప్రతిఫలిస్తోంది. లేత ఎఱుపు రంగు, మధ్యలో మచ్చలా జవ్వాది కలిసి ఆ భరిణ అప్పుడే ఉదయిస్తున్న చంద్రబింబంలా ఉంది. కుంకుమ అంటిన చీరలకాంతి తెల్లని పాలరాతి తిన్నలపై ప్రతిఫలిస్తూ, అవి రాగరంజితమైన సంధ్యాకాశంలా ఉన్నాయి. అలా సంధ్యాకాలం అక్కడంతా అనేక రూపాల్లో దర్శనమిచ్చిందా అన్నట్టుగా ఉందట ఆ దృశ్యం. ఎంత మనోహరమైన వర్ణన!

. పై ననిశంబు సల్లుకొను పాంసువుపై ఖగతుండఖండితా
లానమహామహీరుహఫలచ్యుత బీజము లుత్క్షిపత్కరాం
భోనిబిడాఫ్లుతి న్మొలవఁ బొల్చు నగమ్యతఁ దూలుచు న్బురో
ద్యానముల న్మదేభములు ప్రాణముతోడినగంబులో యనన్.


( ఈ పద్యం రాఘవ స్వరంలో. రాగం. ఆభేరి.. )
ఇక ఆ పట్టణంలోని ఏనుగులు ప్రాణములున్న పర్వతములవలె ఉన్నాయి. అదెలాగంటే ఏనుగులు తమ స్వభావసిద్ధంగా నిత్యం శరీరంపై దుమ్ముధూళి చల్లుకుంటాయి. ఆ మట్టిలో పక్షులు తిని పడేసిన ఫలాల విత్తనాలు, యేనుగులు తొండముతో తమపై చల్లుకొను నీటివల్ల తడిసి మొక్కలు వచ్చి చెట్లుగా మారాయి. అందుకే పురవీధులలో ఊగుతూ తిరుగుతున్న మదపుటేనుగులు ప్రాణమున్న పర్వతాల్లాగా అగుపిస్తున్నాయి. అంత భారీగా ఉన్నాయని కవి భావం.

శా. మౌనిక్రోధ విధూత పత్త్రములమౌ మాతో సపత్త్రల్గదా
కానీ రండని కేకరాక్షిరుచి మొక్క ల్ప్రక్కల న్శార్ఙ్గతూ
ణానల్పాహిపకల్ప కాండతతులం దారం బురిం బొల్చు నా
జానేయంబులు ఫేనహాస మిడి కైజామోర లల్లార్చుచున్.


(ఈ పద్యం సనత్ స్వరంలో )
ఏనుగులే కాక మధురాపురంలోని అశ్వములు కూడా మేలుజాతికి చెందినవే. కళ్లెము పైకెత్తి బిగించికట్టుటవలన సదా పరుగుతీయడానికి సర్వసన్నద్ధమై ఉంటాయి. ఆ గుఱ్ఱాలు కళ్లెము బిగించబడిన ముఖము అల్లార్చుతూ, కడకంటితో అటునిటు వ్రేలాడకట్టబడ్డ ధనుర్బాణాలని చూస్తున్నాయి. ఆ చూపులు ఎలా ఉన్నాయంటే - "మాకు మునిశాపము వలన ఎగిరిపోవడానికి ఱెక్కలు లేవు. సర్పరాజుల్లాంటి బాణాల్లారా! మీకేమో ఱెక్కలు ఉన్నాయి. ఐనా పర్లేదు పరిగెత్తే వేగంలో మాతో పోటీకి రండి చూద్దాం" అని ఆ బాణములతో సవాలు చేస్తున్నట్టుగా ఉన్నాయి. వాటి నోటినుండి వస్తున్న నురగ వాటి పరిహాసంలా ఉంది. కడకంటి చూపు, నోటి నురుగు, కైజామోర ఇవన్నీ గుఱ్ఱాలకి సహజ లక్షణాలు. ఈ లక్షణాలని బాణాలతో పోటీ పడ్డట్టుగా చిత్రించడం ఉత్ప్రేక్ష. అంటే ఆ గుఱ్ఱాలు బాణం కన్నా వేగంగా పరిగెత్తగలవన్న మాట!

ఆజానేయం అన్నది ఆఫ్రికా ఖండంలో ఒక దేశమట. అక్కడనుంచి దిగుమతయిన గుఱ్ఱాలు ఆజానేయములు. గజ, తురగ, రథ, కాల్ బలాలు చతురంగబలాలు. రాయల కాలంలో గజ సైన్యం ఎక్కువగల రాజులు గజపతులు. అశ్వసైన్యం ఎక్కువ కలవారు మహమ్మదీయ రాజులు. విజయనగర రాజులు నరపతులు. అంటే కాల్బలం ఎక్కువ ఉన్నవాళ్ళు. మహమ్మదీయ రాజులని జయించడానికి రాయలు అశ్వసైన్యాన్ని బాగా అభివృద్ధి చేసాడని చరిత్ర చెపుతోంది.

0 comments:

Related Posts Plugin for WordPress, Blogger...