ప్రబంధాలకు అష్టాదశవర్ణనలు సర్వసాధారణం. అందునా అష్టదిగ్గజాలతో నిత్యం గడిపే రాయలవారి సంగతి వేరే చెప్పేదేముంది?
ఆదికవి అన్న బిరుదు లేకపోతే మరేం ఫర్వాలేదుగానీ అసలు ఈ అష్టాదశ వర్ణనలకు ఆద్యుడు నన్నెచోడుడే! అలాగే వస్తుకవిత అనే పదం వాడి ముందు తరాలవారికి నాంది పలికిందీ ఆయనే.. ఆయనబాటనే అందరూ పట్టారు. ప్రకృతిని వాస్తవంగా కళ్లకు కట్టినట్టు వర్ణించేది వస్తుకవిత అని ఆర్యోక్తి. రాయలవారు ప్రాజ్ఞనన్నయ యుగం నుండి ప్రబంధయుగం వరకూ వచ్చిన ప్రబంధాలన్నీ తెలుసుకొని కవితారచన చేబట్టాడేమో! లేకపోతే కత్తి పట్టి కదనరంగాన కుత్తుకలు కత్తిరించే చక్రవర్తి కలం నుండి ఇంత అందమైన వర్ణనలా? అందుకే ఆముక్తమాల్యద ప్రౌఢ ప్రబంధం అంటారు.
చ. అడుగున నుండియు నృదిలమై చద లంటెడుకోట నొప్పు ప్రో
ల్చెడనికడంక దంచనపుఁ జేతుల గంగను కాసెఁ దూఱంగా
నడుమన యున్కిఁజేసి యల నాకపురిన్ సరికై పెనంగి లా
వెడలఁగఁ బట్టివ్రేయుటకు నెత్తైనన న్జను మల్లుపోరునన్.
( పై పద్యం రవి స్వరంలో )
ఎంత మంచి వర్ణన! మధురాపురంలోని కోట పునాదులనుండి ప్రాకారాల వరకు మిక్కిలి బలిష్టంగా నిర్మించబడింది. దాని ప్రాకారాలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. ఆకాశగంగ స్వర్గాన్ని చుట్టుకుని వలయాకారంగా ఉంటుంది. అది ఎలా కనిపిస్తుందంటే స్వర్గమనే యోధుడు గంగను కాసెగా(నడుముకు చుట్టుకునే వస్త్రం) చుట్టుకున్నట్టుగా ఉంది. ఇక కోట ప్రాకారం పైన ఉన్న పొడవైన దంచనం లేదా ఫిరంగులు మధురాపురమనే మల్లయోధుడి దీర్ఘబాహువులుగా ఉన్నాయి. ఇక్కడ మనం ఒక విశేషం చెప్పుకోవచ్చు. మల్లయుద్ధంలో బలిష్టుడైన యోధుడు వైరియోధుడి నడుముకు ఉన్న కాసెను పట్టుకుని ఎత్తి పడవేస్తారు. ఇది మల్లయుద్ధంలోని బంధ విశేషం. అదే విధంగా మధురాపురమనే యోధుడు స్వర్గమనే వైరియోధుడి నడుముకు కాసెగా ఉన్న గంగను పట్టుకుని ఎత్తి పడవేయడానికి చాచిన చేతుల్లా ఉన్నాయట ఆ దంచనాలు ( గొప్ప పొడవైన ఆయుధ విశేషం ). అంటే కోట ప్రాకారాలు స్వర్గాన్ని తాకుతున్నట్టే కదా. ఇక్కడ ఇద్దరు యోధులను గురించి ప్రస్తావించాడు కవి. గంగను కాసెగా చుట్టుకున్న స్వర్గం ఒకడు, మధురాపురమనే జెట్టి ఇంకొకడు. ఈ ప్రస్తావన వల్ల మధురాపురంలోని కోట శత్రుదుర్భేధ్యంగా ఉన్నదని అర్ధమవుతుంది..
మ. స్థిరసౌధాగ్రవిహారి యౌవతరతిచ్చిన్నాచ్ఛహారస్ఫుర
ద్గురుముక్తావళిఁజేటిక ల్విరులతోఁ గూడంగఁ ద్రోయ, న్నిజో
దరలగ్నం బగుదాని, నెమ్మొగి లదస్థ్సంబై తఱిన్ రాల్ప, నా
కర మభ్రం బని యండ్రుగా కుదధిఁ దక్క న్బుట్టునే ముత్తెముల్.
( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం . హంసధ్వని )
పురవర్ణనలో మేడలు,మిద్దెలు, వాడలు, తోటలూ, దారులు, ఉద్యానవనాలు విపులంగా,రమణీయంగా వర్ణించడం ఆచారం. ఊరిలోని ఇళ్లు, మేడలకూ ఎంత అతిశయోక్తి!
మధురాపురిలో ఉన్న మేడలు ఆకాశంలో ఉన్న మేఘాలను తాకుతూ ఉన్నాయి. ఒక్కోసారి మేఘాలకంటే కూడా ఎత్తులో ఉన్నాయంట. అక్కడి మేడలలో ఉండే స్త్రీలు రతిక్రీడ సమయంలో వారి కంఠహారాలు తెగి ముత్యాలు రాలిపోయాయి. ఉదయం కసువు చిమ్మేవేళ పరిచారికలు పూలతోపాటు నేలరాలిన ముత్యాలను కూడా చిమ్మి మేఘాల్లోకి తోసేసారు. వర్షాకాలంలో ఆ మేఘాలలోని ముత్యాలు వర్షంతో పాటు భూమి మీద పడినప్పుడు ప్రజలు ఆహా ముత్యాల జన్మస్థానం సముద్రమొక్కటే కాదు మేఘాల నుండి కూడా ముత్యాలు పుడతాయి అని అనుకున్నారంట.
మ. ఘనసౌధాళి వియద్ధునీజలధి వీఁక న్నావలై నీడదోఁ
ప నెలంత ల్వణిగాకృతి న్సరకు మార్పన్గోలల న్గట్టి యి
చ్చు నిజద్వీపవిచిత్రట్టవసనస్తోమంబు నాఁ బొల్చుఁ బె
ల్లనిలాన్యోన్యవిమర్శితన్న గరనాకానేక కేతుచ్ఛటల్.
( ఈ పద్యం రాఘవ స్వరంలో... రాగం బిళహరి)
మధురాపురంలో ఉన్న మేడలు చాలా ఎత్తుగా, పెద్దగా ఉన్నాయి. ఆకాశగంగ అనే సముద్రంలో ఆ మేడలనీడ ఓడల మాదిరిగా కనిపిస్తుంది. ఆ మేడలమీద ఉన్న స్త్రీలు, వ్యాపారార్ధం ఓడలమీద ఉన్న బేరగాళ్ల మాదిరిగా ఉన్నారు. మేడలమీద గడలకు కట్టిన వస్త్రాలు గాలికి రెపరెపలాడుతున్న దృశ్యం ఎలా ఉందంటే ఆ స్త్రీలు తమ ద్వీపంలోని పట్టువస్త్రాలను ద్వీపాంతరవాసులకు భాండ ప్రతిభాండ పద్ధతిలో విక్రయిస్తున్నట్టుగా రెపరెపలాడుతూ ప్రకాశిస్తున్నాయి అని ఉత్ప్రేక్షాలంకారంతో చక్కగా వివరించాడు కవి.
ఉ.సోరణగండ్ల రాఁ గొదమచుక్కలు పట్ట సతు ల్కవాటము
ల్చేరుప మౌక్తికంబు లని చిల్లులు వుత్తురు ద మ్మటంచుఁ బొ
ల్పారువితానహారములయం దొగి హారత వ్రేలి ప్రొద్దు వోఁ
గా రతి డస్సి గాడ్పులకుఁగాఁ దెఱవ న్జను విచ్చి మేడలన్
(పై పద్యం రాఘవ స్వరంలో)
రాగం: కల్యాణి
విల్లిపుత్తూరులాగా మధురానగరంలో కూడా మేడలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. ఆ మేడల పై అంతస్థులోని కిటికీలు తెరిచి ఉంటే చిన్న చిన్న నక్షత్రాలు వాటినుండి ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. వాటిని పట్టుకోవడానికి ఆ ఇళ్లలోని స్త్రీలు కిటికీ తలుపులు మూసేస్తారు. అప్పుడు అవి అక్కడే చిక్కుబడిపోతాయి. ఆ స్త్రీలు తమను పట్టుకొని ముత్యాలలాగా భావించి , చిల్లులు పొడిచి హారాలలో కట్టుకుంటారేమోనని భయపడి ఆ చుక్కలు వాళ్లకు దొరక్కుండా ఆ ఇళ్లల్లో వేలాడే ముత్యాల చాందినీల మధ్య కలిసిపోయి కనబడకుండా యిరుక్కుంటాయి. రాత్రి గడిచిన తర్వాత రతిక్రీడలో అలిసిన స్త్రీలు గాలికోసం కిటికీ తలుపులు తీస్తారు. అప్పుడు ఆ చుక్కలు చల్లగా తప్పించుకొని బయటకు వెళ్లిపోతాయి. ఇంత వర్ణన ఎందుకా అనుకుంటే ఆ మేడలు ఆకాశంవరకు ఉన్నాయని చెప్పడానికేగా.
ఉ.ఆపురి సౌధవీధి నధరాధరభూముల గర్జ మున్నుగా
నాపయికి న్వినంబడనియట్లుగ వ్రాలుఘనాళిఁ దార్చి లీ
లాపరతన్ ఘటింపుదురు లాస్యము సేయంగ మెఘరంజి నా
లాపాము సేసి పోషికలాపిఁ గలాపికలాపకుంతలల్.
( పై పద్యం రాఘవ స్వరంలో)
రాగం : మేఘరంజని
మధురానగరంలో మేడలు చాలా ఎత్తైనవి అని చెప్పుకున్నాం కదా. ఆ ఎత్తు కూడా మేఘాలకంటే పైన ఆకాశంలో ఉన్నాయంట. మేఘాలు కింది అంతస్థుల ప్రాంతంలో ఉంటాయి. అవి ఉరిమినా పై అంతస్థులో ఉన్నవారికి వినబడవు. పై అంతస్థుల్లో నెమలి పింఛాల్లాంటి కుంతలాలు గల స్త్రీలు ఉంటారు. వాళ్లు నెమళ్లను పెంచుతున్నారు. కాని ఈ మేఘగర్జన ఆ నెమళ్లకు వినపడని కారణంగా అవి పురివిప్పి ఆడవు. అందుకే సంగీతంలో నిపుణులైన ఆ స్త్రీలు కమ్మగా మేఘరంజని రాగాన్ని ఆలపిస్తారు. ఆ రాగానికి ఆకర్షితులై మేఘాలు మెల్లిగా పై అంతస్థుల వైపు కదులుతాయి. అప్పుడు ఆ మేఘాల గర్జనకు పులకించిన నెమళ్లు ఆడతాయి. ఆ నెమళ్ల ఆటను చూసి ఆ స్త్రీలు మురిసిపోతారు. పోషిత కలాపి.. కలాపికలాప కుంతలల్ ....ఎంత రమ్యమైనదీ పదప్రయోగం..
చ. రవి యనుదివ్వెఁ గేతువు చెఱంగున మూసి ధృతోర్ధ్వయంత్రవా
రవిరళఘర్మ యై కలరవాల్పరవోక్తుల వాంతధూపరా
జివరనిశ న్జనన్మదనచేతులఁ జాతురి నెయ్యపుంగురుం
జువిదలు దార్ప విష్ణుపద మొత్తుఁ బురీగృహలక్ష్మి నూత్న తన్.
( పై పద్యం రవి స్వరంలో)
పురవర్ణనలో మన కవులు అందరినీ వర్ణిస్తారుగాని ఎందుకో పత్రివ్రతల జోలికెళ్లరు. చిమ్మపూడి అమరేశ్వరుడు మాత్రం తన విక్రమసేనంలో ఇలా చెప్పాడు.
తరుణ వయస్కుల యోరన
పరిపాకుల వృద్ధజనుల భటులను నిజసో
దరులను గురులనుగాజూ
తురుపురము పత్రివ్రతా సతుల్ పుణ్యవతుల్ ”
ఆ పురంలో ఉండే పత్రివ్రతలు అందరూ పురుషులనూ సోదరులుగా, గురువులుగా భావించి గౌరవిస్తారు అని భావం.
మరి రాయలు ఆ పురస్త్రీల గురించి ఏం చెప్పాడో చూడండి. ఆ పట్టణంలో ఉండే ధ్వజపటాలు సూర్యుణ్ణి కప్పివేసాయి. ధూపదీపాలు ధూమాలు మెఱిసే విధంగా పురలక్ష్మి ఆకాశాన్ని తాకిందనే అర్ధం చెబుతూ.... కొత్తగా వివాహమైన స్త్రీలు, రాత్రి కాగానే చెలికత్తెల ద్వారా భర్తను చేరి , దీపాన్ని తగ్గించివేసి చిన్నగా భర్తతో సరస సంభాషణ చేస్తున్నారు. ఆ గృహంలో ధూపవాసనలు వచ్చుచుండగా భర్త పాదములు ఒత్తుతుంది. ఇది గృహిణుల నిత్యకృత్యం. సర్వసాధారణం. అలాగే మధురాపురలక్ష్మి యనే స్త్రీ రాత్రికాలంలో రత్యనుకూలమై విష్ణుపదములను ఒత్తెను అని.. పురలక్ష్మి తన పెనిమిటియగు విష్ణువు దగ్గరకు చేరునప్పుడు తన పైటచెఱగుతో సూర్యుని కప్పివేసి వెలుగును తగ్గించి, పురసౌధాముల గవాక్షములనుండి వస్తున్న అగరుశ్రీగంధముల ధూపము వ్యాపించగా రాత్రియందు ఆకశమునెడి విష్ణుపాదములు ఒత్తింది అని కవి భావన.. ఎత్తైన భవనాల కురుజులమీద అమర్చిన దారువులు(చేతులవలె) ఆకాశాన్ని తాకుతున్నాయట. అదీ సంగతి.
చ. గిఱికొనుగోపురా గ్రపరికీలితపంకజరాగరశ్మిఁ గ
ట్టెఱ యగుచాయఁ బొల్చుదివసేంద్రుఁడు సక్కనమింటఁబోవుచో
మఱచి విధాత పాటలిమ మధ్యమసంధ్యకుఁ జేయ లేనియా
కొఱఁతయుఁ దీర్చుకోఁ దొగరు కొల్పినకై వడిఁ బట్టణంబునన్.
( పై పద్యం రవి స్వరంలో)
అది మధ్యాహ్నవేళ మధురాపురంలోని గోపురాల పైభాగాన సూర్యుడు ప్రకాశిస్తున్న సమయం. బ్రహ్మదేవుడు సృష్టి చేసే సమయంలో ప్రాతః కాలానికి, సంధ్యాకాలానికి ఎర్రని కాంతులనిచ్చాడు. కాని మధ్యాహ్న సమయాన్ని మరచిపోయాడేమో. అందుకే ఆ కొఱత తీర్చడానికే సూర్యుడు మధురాపుర ద్వారాలకు చెక్కబడిన పద్మరాగమణులపై ప్రకాశించి ఎఱ్ఱనైన కాంతిని కలుగచేస్తున్నాడంట..
Sunday, October 31, 2010
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
ఆపుర సౌధవీధిలో అన్న పద్యంలో మధురాపుర స్త్రీలు మేఘాలను పైకి రప్పించడానికి మేఘరంజని రాగాలాపన చేసారని రాఘవ ఆ రాగం నేర్చుకుని మరీ ఈ పద్యం ఆలాపించాడు. ఇంత నిబద్ధతతో పద్యాలకోసమే కొత్త కొత్త రాగాలు నేర్చుకుంటున్న రాఘవకు ఆశీర్వాదాలు..
నారికేళపాకాన్ని అరటిపండు వలిచిఇచ్చినట్టుగా అందిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. "కలాపికలాప కుంతలల్" పద్యాన్ని ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు.
రవిగారు ఓ సారి మొదటి పద్యంలోని ఈ లైను చూడండి...ఆడియో / సాహిత్యం - ఏదో ఒకటి మారాలి....
నడుమన యున్కిఁజేసి యల "నాకపురిన్" సరికై పెనంగి లా
అలాగే కింద నుంచి రెండో దానిలో ఇది కూడా మారాలి :
జివరనిశ న్జనన్మదనచేతులఁ జాతురి "నెయ్యపుంగురుం"
వంశీ గారు, సూచనకు ధన్యవాదాలు. సవరిస్తున్నాను.
మీ కృషి అత్యంత శ్లాఘనీయం, ఈ బ్లాగుని గురించి నా బ్లాగులో పరిచయం చేయ వచ్చా!మీ ఆమోదం నా ఈమెయిలు కి తెలియ చేస్తే సంతోషిస్తాను .
నా ఈమెయిలు karlapalwm2010@gmail.com
Post a Comment