ఆముక్తమాల్యద ద్వితీయ ఆశ్వాసం మధురాపుర వర్ణనతో మొదలవుతుంది. పాండ్యరాజ్యానికి రాజధాని మధురాపురము. ఇక ఆ పురవర్ణనలు ఏ విధంగా ఉన్నాయో చూడండి.
సీ. ఏవీట సతులపాలిండ్లపై గంబూర
నవహారములచిప్ప కవుచు మాన్చు
మలయజం బేవీటఁ దొలుచెక్క డులిచి మే
డలకిడ్డ మిగుల భూములకు డిగ్గుఁ
గలఁచు నేవీటి సింహళగజంబుల గాలి
చైత్రవేళ నుదగ్దిశాగజంబుఁ
దాల్తు రేవీటి ప్రాక్తనభూపనిర్మాల్య
మరకతంబులు పెఱధరణిపతులు.
తే. కపివర నియుక్త గిరిసదృ గ్గహననిలయ
గాత్రగాహితకనకముక్తాకవాట
గోపురావేదితోచ్చతాక్షోభ్యవప్ర
దనరు దక్షిణమధుర సాంద్ర ద్రుమ ధుర.
( ఈ పద్యం రాఘవ స్వరంలో)
రాగం . మలయ మారుతం
ఈ పట్టణములోని స్త్రీలు తమ స్తనముల మీద కర్పూరం అద్దుకున్నారు. ఆ కర్పూరపు సువాసనలు వారు ధరించిన ముత్యాల హారములలోని ముత్యాలకు అంటుకున్న చిప్పవాసనను పోగొడుతున్నాయి. అంటే అక్కడికి సమీపంలో ఉన్న తామ్రపర్ణీ నదిలో నుండి వెలికితీసిన ముత్యపుచిప్పలనుండి తీసిన తాజా ముత్యాలను ఆ స్త్రీలు ధరించేవారన్నమాట. వాటికి అంటుకున్న చిప్పవాసన పోగొట్టడానికే ఆ కర్పూరధారణం.. ఇక్కడ మనం మరో విషయం చెప్పుకోవచ్చు. అన్నమయ్య రాసిన ఒక గీతం
ఉదయాద్రి తెలుపాయె నుడు రాజు కొలు వీడె
అద నెరిగి రాడాయె నమ్మ నా విభుడు... అంటూ..
పన్నీట జలక మార్చి పచ్చకప్పురము మెత్తి
చెన్ను గంగొప్పున విరులు చెరువందురిమీ..
అని ఒక విరహ నాయికను వర్ణిస్తాడు అన్నమయ్య.
అంటే ఆ రోజుల్లో.. స్త్రీలు అలంకరణ విధానము తెలుస్తోంది. పన్నీట జలకమాడడం, పచ్చకర్పూరాన్ని స్తనాలపై అద్దుకోవడం ఆనాటి ఆచారం అని తెలుస్తోంది.
ఇక ఆ పట్టణంలోని మేడలన్నింటిని మలయపర్వతం నుండి తెచ్చిన శ్రీగంధపు చెక్క వాడేవారు. ఆ మేడల నిర్మాణం అయ్యాక మిగిలిన గంధపు చెక్కను ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. ఆ నగరంలో సింహళ దేశంనుంచి తెప్పించిన ఏనుగులున్నాయి. చైత్రమాసంలో (వసంతంలో) ఆ ఏనుగుల మదపువాసనతో దక్షిణంనుండి ఉత్తరంగా వీచే గాలి ఉత్తర దిగ్గజం మనసుని కలతపెడుతోంది. ఉత్తర దిక్కు గజం పేరు "అంగన". అంచేత అది ఆడఏనుగు. మధురలో ఉన్న సింహళ ఏనుగులు మదపుటేనుగులు. అంచేత వాటి మదపు వాసనకి ఆ ఉత్తర గజం వ్యామోహితమవుతోంది. ఇక్కడ ఏనుగులను గురించి మరో విషయం గురించి చెప్పుకోచ్చు.. అదేమిటంటే.. మహా భాగవతం లో రుక్మిణీ సందేశం లో.. "ధన్యున్, లోక మనోభిరాముఁ, గుల విద్యా రూప తారుణ్య సౌజన్య అనే పద్యం లో, రుక్మిణి.. "రాజన్యానేకపసింహ!" అంటుంది కృష్ణుడిని.. అంటే.. ఈ పద్యములో రుక్మిణి, ఆ శౌరిని ఉద్దేశించి ఒక గంభీరమైన సంబోధన ప్రయోగించింది. "రాజన్యానేకపసింహ!" అనేది ఆ సంబోధన! "అనేకపము" అంటే "మదపుటేనుగు" అని అర్థం. "రాజన్యానేకపసింహ" అనగా "మదించిన ఏనుగుల్లాగా గర్వంతో క్రొవ్వి సంచరించే రాజులకు సింహంలాంటివాడు" అనే అర్థం వస్తుంది. కృష్ణుడిని.. మదపుటేనుగు తో పోల్చాడు పోతన. అది కవి సందర్భం. మదపు వాసనకి ఆ ఉత్తర గజం వ్యామోహితమయినట్టుగా.. రుక్మిణి..కృష్ణుడి వశమయిందనా? లేక, రాబోయే రణాన్ని గూర్చి అలా అనిందనుకోవలా? ఏమైనా అనుకోవచ్చు. ఆ ఊరి పూర్వరాజులు ధరించి వదిలేసిన పచ్చలను ఇతర రాజులు ధరించేవారు. అనడంలో ఆ పట్టణం ఉత్తమ రత్నాలకు నెలవుగా ఉండేదని కవి భావం. చివరి ఎత్తుగీతిలో భావానికి వాల్మీకి రామాయణంలోని ఈ శ్లోకం ఆధారం. సుగ్రీవుడు వానరులందరినీ దక్షిణ దిక్కుకి పంపిస్తూ అక్కడ దేశాల గురించి వివరిస్తాడు. అందులో పాండ్యదేశ ప్రసక్తి వస్తుంది.
తతో హేమమయం దివ్యం ముక్తా మణి విభూషితం
యుక్తం కవాటం పాణ్డ్యానాం గతా ద్రక్ష్యథ వానరాః
పాండ్యరాజ్యంలో ముత్యాలతోనూ, మణులతోనూ అలంకరింపబడిన సువర్ణమయమైన ముఖద్వారంతో ఉన్న కోట గోడ కనిపిస్తుంది. ఆ రాజ్యంలో కూడా సీతని వెతకండి. అని దీని అర్థం.
అలా సుగ్రీవుని ఆజ్ఞతో కొండలవంటి శరీరంగల వానరులు ప్రవేశించడానికి వీలైనంత ఎత్తైన ద్వారాలు కలిగి ఉంది మధుర కోట అని ఈ పద్యంలో వర్ణించారు రాయలవారు.
కం. శమనరిపుత్రిపురభిదో
ద్యమవద్దోర్వర్జ్యవలయిత స్వర్ణగిరి
భ్రమదంబై కాంచనవ
ప్రము దీప్రం బగుచు నప్పురంబున నొప్పున్.
( ఈ పద్యం రాఘవ స్వరంలో)
రాగం .... కదనకుతూహలం
మధురాపురిలోని బంగారుకోట వలయాకారంలో, శివుడు త్రిపురములు గెలుచుటకు ఉపయోగించిన మేరుపర్వతమనే ధనుస్సుని యుద్ధం ముగిసాక ఇక్కడ పడవేసాడా అన్నట్టుగా ఉంది! ఆ కోట ఎంత దుర్భేద్యమో అనే ఊహ ధ్వనిస్తోంది. అప్పటి కోట నిర్మాణం అంత పటిష్టంగా, శత్రుదుర్భేద్యంగా నిర్మించేవారు. అందుకే దాన్ని మేరుపర్వతమంత శక్తివంతమైన శివుని ధనుస్సులా ఉందని కవి వర్ణిస్తున్నాడు.
తే.సొరిదిఁ గనుపట్టు హేమరశ్ములు సెలంగఁ
బొడవుకతమున సూక్షమై పొల్చుఁ జూడఁ
బట్టణము కోటకొమ్మలపంక్తి గగన
మండలశ్రీకి సంపంగిదండవోలె.
( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )
మధురాపురిలోని కోట చాలా పొడవుగా నిర్మించబడింది. సువర్ణప్రభలు విజృంభించుచున్నవేల వరుసగా ఉన్న ఆ కోటబురుజులు ఆకాశలక్ష్మి ధరించిన సంపంగి దండలవలే ప్రకాశిస్తున్నాయి. దీనివల్ల ఈ కోట ఆకాశంలా చాలా విశాలంగా ఉందని అర్ధమవుతుంది.
తే. కాద్రవేయులు భూమియుఁ గైకొనంగ
నురగలోకంబు వెడలి తత్పరిఖనీట
నెగసి తోడనె క్రుంకుదు ర్నిలువ లేక
తత్తటాబద్ధగారుత్మతముల కులికి
( ఈ పద్యం రవి స్వరంలో)
సర్పములు భూమిని కూడా ఆక్రమించాలనే దురుద్ధేశంతో పాతాళలోకం నుండి బయలుదేరి ఆ పురములోని అగడ్త నీటినుండి పైకి లంఘించాయి. కాని ఆ అగడ్త ఒడ్డునంతా చెక్కబడిన గరుడపచ్చలను చూసి బెదిరి , భయపడి వెంటనే అదే నీటిలో మునిగిపోయాయి. సర్పములకు గరుత్మంతుడు శత్రువు. ఆ పచ్చలు ఆ గరుత్మంతుని చాయను తలపిస్తున్నాయని ఇక్కడ కవి భావము. ఆ మధురానగర కోట చుట్టూ ఉన్న అగడ్త పాతాళమంత లోతన్నమాట! గరుత్మంతుని నేత్రాలు ..పచ్చని మణి భూషితాల్లాగా.. ప్రకాశిస్తూ ఉంటాయి అని రాయలు సందర్భోచితంగా, అందంగా, అన్యాపదేశంగా చెప్పాడు. అయినా రాయలకు పచ్చలంటే భలే ఇష్టం. 1519లో రాయలు సింహాద్రినాథుని దర్శించుకుని కోట్ల విలువైన పచ్చలపతకం, కంఠాభరణాలు, శంకుచక్ర పతకం, కిరీటం వంటి ఆభరణాలు సమర్పించారు. అయన కిరీటం లో పచ్చల మణి తేజో వంతం గా ప్రకాశించేదని అంటారు. అందువల్ల రాయలవారు "పచ్చల" ప్రసక్తి వస్తే.. చాలు, రెచ్చిపోతారు. ఉపమా కాళిదాసస్య.. అన్నట్టు.. దేనితోనైనా పోలుస్తూ ఉంటారు.
Friday, October 15, 2010
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
బాగుంది మీ వ్యాఖ్యానం. ఈలాగే ఇంకా కేవలం అముక్త మాల్యద పద్యాల వర్ణన కాకుండా.. ఇంకా.. హృదయోల్లాస వ్యాఖ్యానం చెయ్యండి. విశేషాలూ.. వర్ణనలూ చెప్పండి. ఆశీస్సులతో... వెంకటప్పయ్య టేకుమళ్ళ.
Post a Comment