ఇప్పటికి ఆముక్తమాల్యద రెండు ఆశ్వాసాలు పూర్తయ్యాయి. విలిబుత్తూరులో పరమవైష్ణవ భాగవతుడైన విష్ణుచిత్తుని పరిచయం జరిగింది. విలిబుత్తూరు ఏ రాజ్యంలో అయితే ఉన్నదో ఆ పాండ్యరాజ్య రాజధాని మధురానగరము, ఆ రాజ్యాన్ని ఏలే పాండ్యరాజు మత్స్యధ్వజుడూ కూడా పరిచయమయ్యారు. మత్స్యధ్వజుడు సామాన్యమైనవాడు కాదు. రాజనీతి ధురంధరుడు. ధీరుడు, ఉదాత్తుడు, వినయశీలి. రామునిలా సముద్రంపై సేతువుని నిర్మించిన రాజు. పరాక్రమంలో ఇంద్రుని మించినవాడు. మంత్రశక్తి కలవాడు. విలాసపురుషుడు. అలాంటి ఆ రాజు ఒకనాటి రాత్రి తన భోగిని వద్దకు వెళుతూ ఉంటే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగుతుంది. అవి వేసవి రోజులు. మధురానగరం సమీపంలో ఉన్న వృషభగిరి అనే విష్ణుక్షేత్రంలో తెప్ప తిరుణాళ్ళు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాలు చూడ్డానికి వచ్చిన ఒక బ్రాహ్మణుడు, తిరుగు ప్రయాణంలో మధురానగరం చూడ్డానికి వస్తాడు. రాజపురోహితుని ఇంట విడిది చేసి, రాత్రి ఫలాహారము తీసుకున్నాక అరుగు మీద పడుకొని తోటి పండితులతో శ్లోకాలు గీతాలు మొదలైనవి చదువుతూ ఉంటాడు. అతను చదివిన ఒక శ్లోకం, ఆ తోవనే వెళుతున్న పాండ్యరాజు చెవిన పడుతుంది. దానితో రాజుకి మనసులో వైరాగ్యభావం ఉదయిస్తుంది. తానిన్నాళ్ళూ ఇహలోక భోగాలలో పడి పరాన్ని గూర్చి మరిచిపోయానన్న జ్ఞానం కలుగుతుంది. ధర్మార్థకామాలనే వర్గత్రయమే ప్రధానంగా జీవితాన్ని సాగిస్తే, జననమరణ చక్రంనుండి విముక్తి లేదని తెలుసుకుంటాడు. మోక్షాన్ని సాధించే మార్గమేదో తెలుసుకోవాలనుకుంటాడు. ఏ దేవుడిని కొలిస్తే మోక్షం లభిస్తుందన్న విషయాన్ని తేల్చడానికి రాజసభలో పెద్ద చర్చ మొదలుపెడతాడు. పండితులు ఎవరికి తోచినట్లు వారు వాదిస్తారు కాని ఏదీ తేలదు. అప్పుడు స్వయంగా విష్ణుమూర్తి విష్ణుచిత్తునికి ప్రత్యక్షమై అతడినా రాజసభకు వెళ్ళి తన మహిమని చాటి వాదంలో గెలిచి విరక్తుడైన పాండ్యరాజుని వైష్ణవునిగా మార్చమని చెపుతాడు. సందేహించిన విష్ణుచిత్తునికి తాను వెనకన ఉండి అంతా నడిపిస్తాననే భరోసా యిచ్చి ఒప్పిస్తాడు. ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లను కూడా ఆలయ పూజారి ధర్మకర్తల ద్వారా విష్ణువే చేయిస్తాడు. విష్ణుచిత్తుడు పాండ్యరాజ సభకి ప్రయాణమవుతాడు.
ఇదీ ఇప్పటి వరకూ జరిగిన కథ. ఒకసారి ఈ రెండు ఆశ్వాసాలు సింహావలోకనం చేస్తే, ఆముక్తమాల్యదలో వర్ణనలది సింహభాగమని అనిపించక మానదు. అది నిజమే కూడా. కావ్యరచనలో ఒకో కవిదీ ఒకో ప్రత్యేక శైలి. రాయలకి కథని బిగువుగా నడిపించడం మీద దృష్టి లేదు. అనంతమైన తన ఊహశక్తికి రూపాన్నివ్వడమూ అనేక తాత్త్విక రాజనైతిక విషయాలని వివరించడమూ మొదలైన వాటిపైననే అతనికి మక్కువ ఎక్కువ. ఆముక్తమాల్యదలో మనకి అదే దర్శనమిస్తుంది. అయితే అందులో తనదైన ప్రకర్షని విశిష్టతని చూపించగలిగాడు కాబట్టే అది ఒక మంచి కావ్యంగా నిలిచింది. ఉదాహరణకి మధురాపుర వర్ణనలో భాగంగా ఉన్న చతుర్వర్ణాల వర్ణనని మనుచరిత్రలో అదే వర్ణనతో పోల్చి చూస్తే రాయల విలక్షణత స్పష్టంగా తెలుస్తుంది. మనుచరిత్రలో ఇలా ఉంటుంది:
అచటి విప్రులు మెచ్చ రఖిలవిద్యాప్రౌఢి
ముది మదితప్పిన మొదటివేల్పు
నచటి రాజులు బంటునంపి భార్గవునైన
బింకాన పిలిపింతు రంకమునకు
అచటి మేటికిరాటు లలకాధిపతినైన
మును సంచిమొదలిచ్చి మనుప దక్షు
లచటి నాలవజాతి హలముఖాత్తవిభూతి
నాదిభిక్షువు భైక్షమైన మాన్చు
ఇది పెద్దన దృష్టి. ఇంచుమించు ఆ కాలంలోని ఇతర కవుల దృష్టి కూడా ఇదే. విప్రులు మహాపండితులు. రాజులు గొప్ప పరాక్రమవంతులు. వైశ్యులు అధిక ధనవంతులు. శూద్రులు సస్యసంపదలో సమృద్ధులు. వారి వర్ణనలో అతిశయోక్తులే ఎక్కువ. రాయల దృష్టి మరికొంత విపులమైనది. మరింత వాస్తవికమైనది. ఇతను వర్ణించిన బ్రాహ్మణులు పరమ నిష్ఠాగరిష్ఠులు, వేదనిధులు, నిత్యాగ్నిహోత్రులు. ఎవరి ముందూ చేయిచాపని ఆత్మగౌరవ సంపన్నులు. అలాగే క్షత్రియులు వీరులే కాదు, సదాచారపరులు. దానవ్రతులు. సాముగారడీ వంటి విద్యల్లో ఆరితేరినవారు. వైశ్యులు కూడా, ధనవంతులే కాదు ఏ మాత్రమూ గర్వము లేకుండా నిరంతరమూ దానం చేసేవారు. రైతుల ధాన్యరాసులు రాజ్యవైభవానికి కారకమైనవి. ఈ వర్ణనలో కేవలం ఆయా వర్ణాలవారి వ్యక్తిగత గుణగణాలే కాక, అవి సమాజ అభ్యున్నతికి ఎలా ఉపయోగపడతాయో కూడా మనకి స్పష్టమవుతుంది. అది రాయలవారి ప్రత్యేక దృష్టి.
రాయలవారి వర్ణనలన్నీ కూడా విలక్షణమైనవే. సామాన్య జనజీవితాన్ని వర్ణనలలో చిత్రీకరించడం రాయలవారి విశిష్టత. ఆముక్తమాల్యదలో కనిపించేటంత సామాజికచిత్రణ మరే ఇతర సమకాలీన కావ్యంలోనూ మనకి కనిపించదు. ద్వితీయాశ్వాసంలో సూదీర్ఘమైన గ్రీష్మ ఋతు వర్ణనలలో మనకిది కనిపించింది కదా. అసలీ సామాజిక చిత్రణ కోసమే ప్రత్యేకంగా రాయలు అంతటి సుదీర్ఘ వర్ణనలకి పూనుకున్నాడేమో అని కూడా అనిపిస్తుంది! జానపద గేయాలు, ఏతాములు, నీటికి తడిసిన మట్టివాసన, ఆ వాసనకి తోడు రాలిన పాదిరి పూల పరిమళం, మామిడిముక్కల తాలింపుతో చేసిన చేపల కూర, ఇసుకలో పాతిపెట్టిన చల్లని కొబ్బరిబొండాలు - ఇలా ఎన్నెన్నో జానపదుల బతుకు చూడికలు మనకా వర్ణనల్లో కనిపిస్తాయి. రాయల దృష్టి మనుషులతో ఆగిపోదు. కొంగల గుంపులు బొమ్మిడాయులని తినడం, ఎఱ్ఱచీమలు గుడ్లను మోస్తూనే ఆహారాన్ని సేకరించడం మొదలైన వాటిని కూడా సునిశితంగా పరిశీలిస్తుంది! అంతేకాదు, రాయల దృష్టి ఎంత నిశితమో అతని ఊహ అంత విశాలం! అది కూడా గ్రీష్మ ఋతు వర్ణనలలో మనకి కనిపిస్తుంది.
అతివృష్టిన్ మును వార్ధి గూర్చు నెడకాడౌటం దమిం గూర్చునన్
మతి లంచంబుగ హేమ టంకములు మింటం బొల్చు పర్జన్య దే
వత కీ నెత్తిన కేలనా బొలిచె నిర్వారిస్రవంతిన్ బయ
శ్చ్యుతి నమ్రచ్ఛద దృశ్య కర్ణికములై యున్నాళ నాళీకముల్
వేసవికాలంలో ఏరులన్నీ ఎండిపోయాయి. అక్కడక్కడ ఉన్న బురదలో వాడిపోయిన తామర తూళ్ళు పైకి వచ్చి వేలాడుతున్నాయి. పువ్వుకున్న రేకులు వడలి వాలిపోవడంతో మధ్యనున్న పసుపుపచ్చని దుద్దులు (కర్ణికలు) స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యం ఎలా ఉన్నదంటే - వర్షాకాలంలో తమని (నదులని) తమ చెలికాడైన సముద్రునితో జతగూర్చే పర్జన్య దేవతకి త్వరగా వచ్చి కరుణించమని చేతులెత్తి మొక్కుకుంటూ, బంగారు నాణాలు లంచంగా ఇవ్వబూనుతున్నాయా అన్నట్టుగా ఉందిట! వాడిపోయిన సన్నని తామరతూళ్ళు చేతులు. పసుపుప్పచ్చని దుద్దులే బంగారు దీనారాలు. అదీ కృష్ణరాయని ఊహ! పైగా ఈ పద్యం వల్ల రాయల కాలానికే "లంచం" అన్న పద్ధతి ఉన్నదని కూడా మనకి తెలుస్తోంది (బహుశా, మొట్టమొదట తిక్కన భారతంలో కనిపిస్తుందీ "లంచం"!).
వట్టి వర్ణనలే కాకుండా, ప్రధానకథకి బీజం పడింది కూడా ద్వితీయాశ్వాసంలోనే అని గమనించవచ్చు. పాండ్యరాజ సభలో విష్ణుచిత్తుని వాదన, అతని విజయము, ఆ తరువాత జరిగే కథాక్రమానికంతా ద్వితీయాశ్వాసంలోనే విత్తు నాటుకుంది. అంతే కాదు, ఈ కావ్య కథానాయకుడైన విష్ణుమూర్తి నేరుగా కావ్యంలోకి ప్రవేశించింది కూడా యీ ఆశ్వాసంలోనే! ఆముక్తమాల్యద కావ్య నాయకుడు విష్ణువా విష్ణుచిత్తుడా అని సందేహం రావచ్చు. కావ్య సంప్రదాయాన్ని అనుసరించి విష్ణుమూర్తే నాయకుడవుతాడని విమర్శకులు తేల్చారు. ఎందుకంటే ఆముక్తమాల్యద కావ్యంలో ప్రధానకథ గోదా కల్యాణం. గోదాదేవి నాయిక. కాబట్టి ఆ రంగనాథుడే నాయకుడు. పైగా, విష్ణుచిత్తుడు ఏమి చేసినా అది స్వామి ఆదేశంతోనూ అనుగ్రహంతోనే కాబట్టి అతడు నాయక స్థానానికి అర్హుడు కాదు. కావ్యాలలో కూడా అనేక రకాలున్నాయి. పారిజాతాపహరణము వసుచరిత్ర వంటి కావ్యాలలో నాయకుడెవరన్నది సుస్పష్టం. అలాంటి కావ్యాలలో మొత్తం కథంతా ఒకే సూత్రమ్మీద నడుస్తుంది. కాశీఖండం, పాండురంగమాహాత్మ్యం వంటి స్థలపురాణ ప్రధానమైన కావ్యాలలో ప్రత్యేకంగా నాయకుడని ఎవరూ ఉండరు. కథలో ఏకసూత్రత కూడా ఉండదు. అనేక కథల సమాహరంగా ఉంటాయి. మనుచరిత్ర, ఆముక్తమాల్యద వంటి కావ్యాలు వేరే తరహాకి చెందినవి. ఇటువంటి కావ్యాలలో అనేక కథలుంటాయి కాని, అవి ఒకే గమ్యం దిశగా సాగుతాయి. ఒకో కథలో ఒకో పాత్ర ప్రధానంగా కనిపిస్తుంది. ఇటువంటి కావ్యాలలో నాయక నిర్ణయం కొద్దిగా కష్టమవుతుంది. అంతిమ గమ్యాన్ని గమనించి, కథలలో ఉన్న ఏకసూత్రతని గుర్తించడం ద్వారా నాయకుడెవరన్నది నిర్ణయించాలని విమర్శకుల మతం. ఆ దృష్టితో విచారిస్తే ఆముక్తమాల్యద నాయకుడు విష్ణుమూర్తి అన్నది స్పష్టమవుతుంది.
విష్ణువు నాయకుడు కావడం వల్లనే, తనే స్వయంగా పూనుకొని విష్ణుచిత్తుని పాండ్యరాజు దగ్గరకి ప్రయాణం కట్టించాడు. విష్ణుమహిమ చేతనే అక్కడ సభలో విష్ణుచిత్తుడు వాదంలో విజయం సాధిస్తాడు. విష్ణుచిత్తుడు చేసిన చర్చ ఏమిటి, అతను వాదంలో ఎలా గెలిచాడన్నది తృతీయాశ్వసంలో మనం చూడబోతున్నాము. ఇందులో చాలా గాఢమైన ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి. లోతైన విచారణ అవసరమవుతుంది. దానికోసం సిద్ధం కండి!
Monday, July 11, 2011
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
చక్కగా వ్రాసారు కామేశ్వరరావు గారు..
ఇలాంటి బృహత్తర కార్యక్రమం రొండు ఆశ్వాశాలు పూర్తి చెయ్యడం కూడా ఓ గొప్ప పని గా చెప్పుకోవచ్చు. ఈ బృందానికి ధన్యవాదాలు. ఇలాగే కొనసాగి తెలుగు సాహిత్య చరిత్రలో ఆముక్త మాల్యద కు సుస్తిర స్తానం తో బాటూ మీ కీర్తి ప్రతిష్టలూ నిల్చిపోతాయి ఆచంద్రతారార్కమూ.. తధాస్టు. టేకుమళ్ళ వెంకటప్పయ్య.
Post a Comment