తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Saturday, July 2, 2011

మధురానగర ప్రయాణము - ద్వితీయ ఆశ్వాసాంతం

పాండ్యరాజు కొలువులో పండితులు ఏ దైవాన్ని పూజిస్తే ముక్తి కలుగుతుందన్న విషయంపై వాదన జరుపుతూ ఉన్నారు. అయితే వాదనలు చేసారే కాని ఎవ్వరూ ఏదీ తేల్చి చెప్పలేకపోయారు. ముక్తి మార్గాన్ని ఆశ్రయించిన ఒక పరమ భక్తుడికే అది సాధ్యమవుతుంది. అది విష్ణుచిత్తుడి వలన జరగవలసిన కార్యం. అతనెక్కడో విల్లిపుత్తూరులో స్వామి సేవ చేసుకుంటూ ఉన్నాడు. అతనిక్కడికి ఎలా ఎందుకు వస్తాడు. అతణ్ణి రప్పించడానికి స్వయంగా విష్ణుమూర్తే పూనుకున్నాడు!

తే. విల్లిపుత్తూరిలో నల్ల విష్ణుచిత్తుఁ

డతుల తులసీసుగంధిమాల్యమును మూల

మంత్రమున నక్కుఁ జేర్చుచో మన్ననా రు

దారమధురోక్తి నవ్విధ మానతిచ్చి.



విల్లిపుత్తూరులో ఉన్న విష్ణుచిత్తుడు అష్టాక్షరి అనే మహామంత్రమైన మూలమంత్రాన్ని జపిస్తూ శ్రేష్ఠమైన, పరిమళభరితమైన తులసీదళాలతో చేసిన మాలతో స్వామివారి వక్షస్ధలాన్ని అలంకరిస్తుండగా ఆ మన్నారు స్వామి గంభీరంగా ఈ విధంగా ఆనతినిచ్చాడు..


ఉ. నేఁడు మహామతీ! మధుర నీవు రయంబునఁ జొచ్చి యందుఁ బాం

డీఁడు దివాణము న్నెఱయ నించినఁ బ్రేలెడు దుర్మదాంధులన్

బోఁడిమి మాన్చి మన్మహిమముం బ్రకటించి హరింపు శుల్కమున్

వాఁడును రోసినాఁ డిహము వైష్ణవుఁగా నొనరింపు సత్కృపన్.




మహాబుద్దిశాలి అయిన విష్ణుచిత్తుడా! నీవు ఈరోజే మధురకు ప్రయాణము కట్టి అక్కడి పాండ్యరాజు యొక్క కొలువులో కూర్చుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న దుర్మదాంధుల గర్వమణచి నా మహిమలను గురించి తెలియజేసి విజయశుల్కాన్ని తీసుకో.అలాగే ఈ లోకముపై విరక్తి కలిగిన పాండ్యరాజును ఉత్తముడైన వైష్ణవుడిగా మార్చుము అని మన్నారుస్వామి ఆదేశించాడు.

సభలోని పండితులని పట్టుకొని దుర్మదాంధులనే పెద్దమాట ఎందుకన్నాడు మన్నారుస్వామి? వారు భగవత్ తత్త్వం నిజంగా తెలుసుకోకుండానే తమకి తెలుసునని అహంకరిస్తున్నారు కాబట్టి. అలాంటి అహంకారం వల్ల వాళ్ళు నిజంగా ఆ దైవాన్ని తెలుసుకోలేక పోతున్నారని. అంటే భక్తులకి తప్ప పండితులకి భగవంతుని గురించి తెలియదని ఆముక్తమాల్యద నిశ్చయం. ఇది విశిష్టాద్వైత మతం.


తే. అనిన వడవడ వడఁకి సాష్టాంగ మెఱఁగి

సమ్మదాశ్రులు పులకలు ముమ్మరింప

వినయవినమితగాత్రుఁడై విప్రవరుఁడు

వెన్నునకు భక్తి నిట్లని విన్నవించె.





తను నిత్యం కొలిచే దైవం ఒక్కసారిగా ప్రత్యక్షమై తనతో మాట్లాడితే, అదీ తను కలలో కూడా ఊహించని విషయాన్ని గురించి చెపితే ఆ భక్తుని పరిస్థితి ఎలా ఉంటుంది. అప్పటి విష్ణుచిత్తుని స్థితిని వివరిస్తున్న పద్యం. మన్నారుస్వామి మాటలు విన్న విష్ణుచిత్తుడు గడగడ వణికిపోయాడు. ఆనందబాష్పాలు రాల్చాడు. పులకించిపోయాడు. సాష్టాంగ ప్రణామము చేసాడు. బ్రాహ్మణోత్తముడైన విష్ణుచిత్తుడు ఆ విష్ణవుకు, వినయంతో , భక్తితో ఈ విధంగా విన్నవించాడు.


శా.స్వామీ! నన్ను నితఃపురాపఠితశాస్త్ర గ్రంథజాత్యంధు, నా

రామక్ష్మాఖననక్రియా ఖరఖనిత్రగ్రాహితోద్యత్కిణ

స్తోమాస్నిగ్ధ కరున్, భవద్భనదాసు, న్వాదిఁగాఁ బంపుచో

భూమీభృత్సభ నోట మైన నయశంబు ల్మీకు రాకుండునే?




స్వామీ! నేను ఇంతవరకూ ఏ గ్రంధమూ చదవక జ్ఞానములో పుట్టుగుడ్డివాడిని (ఇతః పురా అపఠిత శాస్త్రగ్రంథున్).

ఆరామ క్ష్మా ఖననక్రియా ఖర ఖనిత్ర ఉద్యత్ కిణ స్తోమ అస్నిగ్ధ కరున్ - నిత్యం పూలతోటలో భూమిని గునపముతో తవ్వుటవలన కాయలు కాచిన బిరుసైన చేతులు కలిగినవాడిని. నీ కోవెలకు సేవకుడిని. అలాంటి నన్ను రాజాస్దానములో వాదనకు పంపుతున్నావు. అక్కడ అజ్ఞానుడనైన నా మూలంగా గెలుపు లభించక ఓటమి కలిగినచో ఆ అపకీర్తి నీకే కదా ... అని వాపోయాడు విష్ణుచిత్తుడు.


మ. గృహసమ్మార్జనమో, జలాహరణమో, శృంగారపల్యంకికా

వహనంబో, వనమాలికాకరణమో, వాల్లభ్యలభ్యధ్వజ

గ్రహణంబో, వ్యజనాతపత్రధృతియో, ప్రాగ్దీపికారోపమో,

నృహరీ వాదము లేల? లేరె యితరు ల్నీ లీలకుం బాత్రముల్





"స్వామీ .. మీ కోవెల శుభ్రపరచడమో, తీర్ధము తేవడమో, దేవరవారు విలాసానికి ఊరేగే పల్లకీ మోయడమో, తులసీదండలు కట్టి అలంకరించడమో, గరుత్మంతుని బొమ్మగల ధ్వజము మోయడమో, విసనకఱ్ఱ, గొడుగు మొదలైనవి పట్టుకోవడమో, నీ గుడిముంధు దీపం పెట్టడమో - ఇలాంటి పనులైతే నేను చెయ్యగలను కాని వాదానికి వెళ్ళమంటావేమిటి! నీ లీలకి వేరే ఎవరూ తగినవారే దొరకలేదా!" అని విన్నవించుకుంటున్నాడు విష్ణుచిత్తుడు. వాల్లభ్యము అంటే గరుత్మంతుని గుర్తుగల జెండా. దీన్ని పట్టుకోడం పరమ భగవద్దాసులకే లభించే అనుగ్రహ విశేషం). ఈ పద్యంలో వర్ణించిన పనులన్నీ స్వామికైంకర్యంలో భాగం. శ్రీవైష్ణవంలో ఇది పరమ సేవగా భావింపబడింది. "నీ లీల" అన్నాడు కాబట్టి, వాదన చేసేది ఎవరైనా చేయించేది విష్ణువే అన్న జ్ఞానం విష్ణుచిత్తునిలో పరిపూర్ణంగా ఉంది. ఆ జ్ఞానమే ఇతర పండితులలో లోపించింది. అందుకే విష్ణువు విష్ణుచిత్తుణ్ణి ఎన్నుకున్నది.


తే. అనినఁ దద్భక్తి కెద మెచ్చి యచ్యుతుండు

మొలకనగ వొప్ప శ్రీదేవి మోము సూచి

'వా దితనిచేత గెలిపింతు: నాదుమహిమ

మువిద కను' మని ప్రాభవం బొప్పఁ బలికి.





విష్ణుచిత్తుడి మాటలు విన్న శ్రీహరి అతని భక్తికి మెచ్చుకొని చిరునవ్వుతో తన దేవేరి లక్ష్మీదేవి మోమును చూసి దేవీ నా మహిమతో పాండ్యరాజు కొలువులో ఈ విష్ణుచిత్తుని వాదమున గెలిపిస్తాను చూడుము అని మరొక్కమాట ఆనతినిచ్చాడు . "మొలకనగ వొప్ప శ్రీదేవి మోము సూచి" - ఎంత సొగసైన వాక్యం!

ఇంతకీ హఠాత్తుగా లక్ష్మీదేవి ఎక్కడనుండి వచ్చింది? ఎందుకు రావలసి వచ్చింది? ఎందుకంటే కావ్యంలోని మతం శ్రీవైష్ణవం. అంటే ఇందులో విష్ణువు ఎల్లెప్పుడూ లక్ష్మీదేవితోనే ఉంటాడు. ఉంటుంది సరే, మరి కవి ఈ మాటలు విష్ణుమూర్తి చేత లక్ష్మీదేవితో ఎందుకు చెప్పించాడు? ఎందుకంటే ఈ కావ్యంలో నాయకుడు విష్ణువే కాబట్టి. విష్ణుచిత్తుడు పాండ్యరాజు కొలువులో వాదనలో గెలవబోతున్న గెలుపు నిజానికి నాయకుడైన విష్ణుమూర్తిదే. ఇదొక రకంగా అతని జైత్రయాత్ర సన్నాహం. నాయికతో తన ప్రభావాన్ని గూర్చి, గెలుపు గూర్చి నాయకుడు పలకడం వీర రసపోషకం.


క. నీయిచ్చయె? మిన్నక పో

వోయి, మునిప్రవర! నిన్ను నొప్పింతును భూ

నాయకసభ, నిందులకై

యేయడ్డము వలవ దవల నే నున్నాఁడన్




ఇవి కూడా వీరుని ప్రతాపాన్ని పలికించే మాటలే. "ఓ మునిశ్రేష్ఠుడా! ఇందులో నీ యిష్టంతో పనేముంది? నీవు మారు మాటాడక పాండ్యరాజు సభకు వెళ్లు. నిన్నా సభలో ఒప్పించి (గెలిపించి) తీరుతాను. దానికి అడ్డుచెప్పకు. అన్నిటికీ నేనున్నానుగా.", అని పలికాడు మన్నారుస్వామి. శ్రీవైష్ణవంలో ప్రపత్తియోగం అంటారు దీన్ని. భగవంతుని శరణు అని అతని ఆనతి చొప్పున నడుచుకోడమే ప్రపత్తి యోగం. దాని లక్షణమే ఈ పద్యంలో చెప్పబడింది.


ఇంకేముంది, స్వామి అలా ఆనతిస్తే భక్తుడు శిరసావహించ వలసిందే కదా. మధురానగర ప్రయాణానికి సంసిద్ధుడయ్యాడు. అంత దూరం ప్రయాణం, అక్కడ బస - ఈ ఏర్పాట్లన్నీ చూసుకోమని ఆ గుడి పూజారికి మన్నారుస్వామే ఆనతిచ్చాడు. ఆ పూజారి మాట మేరకు ఆలయ పారుపత్తేదారు (ధర్మకర్త వంటివాడు) గుడి భాండాగారం నుండి కావలసినంత సంబడం (దారి ఖరుచు), తన పల్లకీని విష్ణుచిత్తునికి ఇచ్చాడు. ప్రయాణాన్ని ప్రారంభించాడు విష్ణుచిత్తుడు.


సీ. భక్తిఁ ద్రోవకు సాధ్వి పరికరంబులు వెట్టి

కట్టిన పొరివిళంగాయ గమియు

నెసటిపోఁతలు గాఁగ నేర్పరించిన చిరం

తనపు శాలిక్షేమతండులములు

వడిఁబెట్టి లోఁ జెఱకడము సాఁబా లూన్పఁ

జెలఁగు సంబారంపుఁ జింతపండు

పెల్లు లోహండి కావళ్ల కొమ్ముల వ్రేలు

గిడ్డిమొత్తపు నేతిలడ్డిగలును



బెరుఁగువడియంబులును, బచ్చివరుగు, బేడ,

లురుతరాచ్యుతపూజోపకరణపేటి

కలును, చాత్తిన చాత్తని కులము బలసి

విధినిషేధము లెఱిఁగి తే మధుర కరిగె.



భర్త ఇతర ప్రదేశాలకు ప్రయాణం కట్టినప్పుడు అతని ఇల్లాలు ఎటువంటి లోటు రాకుండా అన్నీ అమర్చి పెడుతుంది. ముఖ్యంగా భోజన సామగ్రి. అదే విధంగా మన్నారుస్వామి ఆదేశం మేరకు విష్ణుచిత్తుడు మధురకు ప్రయాణం కట్టగా సాద్వీమణియైన ఆతని ఇల్లాలు దారికి అవసరమైన తిండి పదార్థాలు వగైరా జాగ్రత్తగా కట్టి ఇచ్చింది. అవి ఏంటి అంటే...

1. మూటగట్టిన పొరివిళంగాయగములు - ఈ పదార్ధములు ఏంటి? ఎలా ఉంటాయి?? దారిలో తినడానికి అంటే వెలగపండులాంటివి ఐతే కావు. మన నిఘంటువులు 'పొరి'పదానికి వండిన శాకము లేదా కూర అని చెప్తున్నాయి. తమిళంలో కూరను పారి అంటారు. కన్నడంలో 'పురి' అంటారు. ఆచార్య లంకసాని చక్రధర రావుగారు తెలుగు వ్యత్పత్తికోశంలో 'పారు' లేదా 'పొరి విళంగాయ'ని పెసరపిండి, పంచదార కలిపి తయారు చేసిన ఒక తీపి పదార్ధం అని అర్ధం చెప్పారు. 11వ శతాబ్దినాటి కన్నడ మానసోల్లాస గ్రంధంలో 'పురి విళంగాయ'లను మరమరాలు లేదా బొరుగులు, వేయించిన పెసరపప్పు, బెల్లం పాకంలో ఉడికించి చేసే ఉండలు అని చెప్పారు.

2. ఎసటిలో పోసి వండుకోడానికి వీలుగా శుభ్రపరచిన పాత బియ్యము

3. నలుసులు వగైరా లేకుండా శుభ్రం చేసిన జీలకర్ర, బెల్లము, తగువిధముగా దినుసులు కలిపి దంచిన చింతపండు

ఇంకా కావళ్ల కొనలయందు ఆవునేతితో నింపిన చిన్న మూతికల పిడతలను వ్రేలాడగట్టి, పెరుగు వడియాలు, వరుగులు, చాయపప్పు ఉన్నాయి. ఆ ఇల్లాలు తాను వెంట లేకున్నా భర్తకు ఎటువంటి లోటు కలగకుండా ఈ సంభారాలు ఇచ్చింది. ఇవియే కాక విష్ణుపూజకు కావలసిన పరికరములు మొదలైనవి ఉంచిన పెట్టెలను బ్రాహ్మణోత్తములైన శ్రీవైష్ణవులు, చాత్తాదులు ఎవ్వరెవ్వరేమేమి తేవడానికి అర్హులో ఆయా వస్తువులు తీసుకొస్తుండగా ఆ విష్ణుచిత్తుడు మధురకు ప్రయాణమయ్యాడు. (ఇక్కడ చాత్తిన, చాత్తని అనే పదప్రయోగం గురించి తెలుసుకుంటే .. చాత్తినవారనగా ద్రావిడ ప్రబంధాన్ని చదివి భగవతుని సన్నిధిలో అర్పించిన బ్రాహ్మణోత్తములైన శ్రీవైష్ణవులు, చాత్తనివారనగా ద్రావిడ ప్రబంధాన్ని చదివినా కూడా భగవంతుని సన్నిదిలో అర్పణచేసే అధికారం లేని ఇతర వర్ణ వైష్ణవులు.. )



ఇంతటితో ద్వితీయాశ్వాసం కథ ముగిసింది. ఇక ఆశ్వాసాంత పద్యాలు.


చ. యమనియమాదిలభ్య, ద్రుహిణాది జరన్మరుదిభ్య, సంసృతి

శ్రమహరనామకీర్తన, మురప్రవికర్తన, పాతకావలీ

దమన, రమాంగనాకమన, తామరసాయతనేత్ర, భక్త హృ

ద్ర్భమతృణదాత్ర, భూయువతి రంజన, వర్ణ జితాభ్రఖంజనా!




రాయలు ఆ దేవదేవుని ప్రార్ధనతో ఈ ఆశ్వాసం ముగిస్తూ ఆ మన్నారుస్వామిని వేనోళ్ల స్తుతించాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయమ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ,సమాధులనే అష్టాంగ యోగములచే పొంద సాధ్యమైనట్టివాడా, బ్రహ్మాది ముసలి దేవతలకు కూడా ప్రభువైనట్టివాడా, జనన మరణాది రూప సంసారమందలి శ్రమను హరించే నామసంకీర్తనము గలవాడా, మురాసురిని ఖండించినవాడా, పాపసమూహమును హరియించువాడా, లక్ష్మీదేవికి ప్రియమైనవాడా, తామరరేకులవంటి విశాలమైన నేత్రములు గలవాడా, భక్తజన హృదయములలోని అజ్ఞానమన్న గడ్డిని కోయు కొడవలివంటివాడా, భూమియను స్త్రీని సంతోషపెట్టువాడా, నిజదేహకాంతిచే మేఘాలను గెలిచి వాటి కాంతిని కాటుకగా ధరించినవాడా అని శ్రీహరిని స్తోత్రం చేసాడు.


మాలిని.

ద్రుహిణజముఖమౌని స్తోమ నిస్తంద్ర భాస్వ

ద్దహరవిహరమాణాతామ్ర పాదాంబుజాతా

బహిర బహిరపార ప్రాణికోటి ప్రపూర్ణా!

మహిమ వినుత వాణీ మాధురీ వేద్యపర్ణా.




బ్రహ్మవలన పుట్టిన నారదుడు మొదలైన మునిబృందముయొక్క హృదయమనే ఆకాశంలో విహరిస్తున్న ఎఱ్ఱని కమలములవంటి పాదములు కలవాడా! లోపలా బయటా అంతటా అనంతమైన జీవసముదాయంతో నిండినవాడా! ఎవరి మహిమను సరస్వతి గానం చేస్తూంటే ఆ మాధుర్యానికి పార్వతి సంతోషిస్తున్నదో, అలాంటి శ్రీవేంకటేశ్వరుని స్తుతిస్తున్నాడు రాయలు.


మ. ఇది భూమండన కొండవీడుధరణీభృద్దుర్గపూర్వాద్రి భా

స్వదిభేశాత్మజ వీరభద్రజన జీవగ్రాహ రాహూయమా

ణ దృఢాంచద్భుజ కృష్ణరాయమహిభృన్నామాస్మదాము క్తమా

ల్యద నాశ్వాసము హృద్యపద్యము ద్వితీయంబై మహిం బొల్పగున్.



ఆముక్తమాల్యదలో ఇది రెండవ ఆశ్వాసం. అది హృద్యపద్యాలతో శోభిస్తున్నది. దాని కర్త శ్రీకృష్ణదేవరాయలన్న పేరుగల చక్రవర్తి. ఆ రాయలు, కొండవీడూ ఉదయగిరి దుర్గాలకి ఏకిక అయిన వీరభద్రగజపతి సేనల ప్రాణాలని రాహువులా తన ప్రకాశించే దృఢమైన బాహువులతో గ్రహించినవాడు.
===

ఈ టపాలోని పద్యాలన్నీ లంకా గిరిధర్ స్వరంలో ...

0 comments:

Related Posts Plugin for WordPress, Blogger...