మధురాపుర వర్ణన అయింది. మహారాజు మత్స్యధ్వజుని పరిచయం అయ్యింది. అమిత వైభోగంతో ఆ పాండ్యరాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అటువంటి రాజుతో పరమ భాగవతుడైన విష్ణుచిత్తునితో పరిచయం ఎలా సంఘటించబోతోంది? శృంగార పురుషుడయిన పాండ్యరాజుకి భక్తి ఎలా జనిస్తుంది? వసంతకాలం శృంగార రసబంధురం. దాన్ని విరిచేది గ్రీష్మం. అలాంటి గ్రీష్మం అప్పుడు ప్రవేశించింది. ఎండల తీవ్రత హెచ్చరిల్లింది. ఆ వేసవి కాలాన్ని సుమారు డెబ్భై పద్యాలలో మహాద్భుతంగా వర్ణించాడు రాయలు. అందులో కొన్నిటిని మాత్రం రుచిచూద్దాం. ఈ వర్ణనల్లో ఎంత ఊహవైచిత్ర ఉంటుందో అంత సహజ సామాజిక చిత్రణ ఉంటుంది.
తే. పాటల వసుంధరారుహ భాగధేయ
మాతతమరీచికాంబువర్షాగమంబు
ధరణిఁ బొడసూపె నంత నిదాఘసమయ
మదుటుతో శాల్మలీఫల విదళనంబు
(ఈ పద్యం కామేశ్వరరావు స్వరంలో)
వేసవి కాలం ఉద్ధతితో వచ్చింది. అది ఎలాంటిదంటే, పాదిరి చెట్లను చెట్ల పాలిటి అదృష్టదేవత. ఎండమావులనే నీటికి వర్షాకాలాము., బూరుగుకాయలని పగులకొట్టేది. వేసవి రాకతో పాటల వృక్షాలు పుష్పించడం, ఎండమావు లేర్పడటం, బూరుగుకాయలు పగిలిపోవడం సహజంగా జరిగే పరిణామాలు.
మ. దవధూమంపుఁదమంబులోఁ దమరస ద్రవ్యంబుఁ బంకేజబాం
ధవభానుప్రతతుల్ హరింపఁ గుయివెంటన్వెళ్లు శూన్యోరుకూ
ప వితానం బనఁ జూడఁజూడఁ బుడమిన్ బాటిల్లి పైవిప్పులై
యవసం బంచుల నాడఁగా నెగసె వాత్యాళి న్రజశ్చక్రముల్.
( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)
వేసవిలో సుడిగాలులు (వాత్యాళి) రేగుతున్నాయి. ఆ సుడిగాలుల్లో చిక్కిన దుమ్ము గుండ్రంగా తిరుగుతూ పైగి ఎగురుతోంది, అవే రజశ్చక్రములు. అలా ఎగురుతున్న ఆ ధూళి చక్రాలు ఎలా ఉన్నాయంటే, ఎండిపోయిన పెద్ద పెద్ద బావులు మెల్ల మెల్లగా పైకెగిరిపోయున్నాయా అన్నట్టు ఉన్నాయిట. ఎందుకా బావులు పైకెగరుతున్నాయి? వేసవిలో కారుచిచ్చులు బాగా అంటుకుంటాయి కదా. ఆ కార్చిచ్చుపొగల(దవధూమము) చీకటిలో (తమంబు), తమ రసము (నీరు) అనే ద్రవయాన్ని (డబ్బుని) సూర్య కిరణాలు అనే దొంగల గుంపు దొంగిలించేసాయి (చీకట్లోనే కదా దొంగతనాలు జరిగేవి!). సూర్యుడు రాజులాంటి వాడైతే అతని కిరణాలు రాజోద్యోగులవంటి వారు. మరి అలాంటి రాజ సేవకులు తమ సంపదని హరిస్తే అవి రాజు దగ్గర మొరపెట్టుకుంటాయి కదా. అలా ఆ పెద్ద బావులన్నీ కలిసి సూర్యుడి దగ్గర మొరపెట్టుకోడానికి ఆకాశంపైకి ఎగురుతున్నట్టుగా ఉన్నాయిట దుమ్ముతో కూడిన ఆ సుడిగాలులు.
వేసవిలో కనిపించే సహజ దృశ్యాలన్నిటినీ ఒక దానికొకటి గుదిగుచ్చి ఒక అద్భుతమైన ఊహ చెయ్యడం ఈ పద్యంలో మనం చూడవచ్చు. కారుచిచ్చు, ధూళినిండిన సుడిగాలులు, ఎండిపోయిన పెద్ద పెద్ద బావులు - ఇవన్నీ వేసవిలో కనిపించే దృశ్యాలే కదా!
చ. పడమర వెట్ట నయ్యుడుకుఁ బ్రాశన మొల్లక కూటిపేదలై
బడలిక నూడు నచ్చిలువ ప్రగ్గములన్ రవియాజ్ఞ మాటికిన్
ముడియిడఁ బిచ్చుగుంటు రథమున్ నిలుపన్ బయనంబు సాగమిన్
జడను వహించె నాఁగ దివసంబులు దీర్ఘము లయ్యెనత్తఱిన్
( ఈ పద్యం చదువరి స్వరంలో)
వేసవికాలంలో పగలు ఎక్కువగా, రాత్రుళ్లు తక్కువగా ఉంటాయి. వేడికి పగలు మరీ ఎక్కువగా అనిపిస్తుంది. ఇది సహజం. కాని రాయలు ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడో చూడండి. సూర్యుడు రథసారధి అనూరుడు. గరుత్మంతుని అన్నయైన ఇతడు ఊరువులు లేనివాడు. అందుకే పిచ్చుగుంటు అని కూడా వ్యవహరిస్తారు. అతనికి పగ్గాలు పాములు. అవి గాలినే ఆహారముగా తీసుకుంటాయి. వాటికి వాయుభుక్కులు, గాలిమేపరులు అని పేరు. గ్రీష్మంలో పడమరనుండి వీస్తున్న తీవ్రమైన వేడి గాలులు (ఎదురుగాలులన్న మాట) అవి భుజించలేకపోతున్నాయి. ఆహారము లేక నీరసపడిపోతున్నాయి. దానితో రథసారధి చేతిలో ఉన్న పగ్గాలు ముడులు విడిపొతున్నాయి. సూర్యుడి ఆజ్ఞప్రకారం రధాన్ని ముందుకు నడిపించక తప్పదు. అందుకే విడిపొయిన పగ్గాలను మళ్లీ ముడులేసుకుంటూ, రథాన్ని ఆపుకుంటూ నడపడం వల్ల సూర్యుడి ప్రయాణం ఆలస్యమై పగలు దీర్ఘమవుతున్నాయి. ఏం ఊహ!
చ. భరితనిజాంబుబింబిత విభాకరబింబ విజృంభితప్రభాం
కురముల నధ్వనీకకృతకూపకపంక్తులు వొల్చె నబ్ధిరా
డ్విరహభరంబున న్బొడమువెచ్చకు శాంతి యొనర్ప వాహినీ
తరుణులు మేన దట్టముగఁ దాల్చిన ముత్తెపుఁబేరులో యనన్
యాత్రికులు నీళ్లను తాగడానికి నదులలో చేసుకున్న చెలమలచాళ్లలో సూర్యకిరణాలు ప్రతింబింభిస్తున్నాయి. ఆ కిరణాలు ఎలా ఉన్నాయంటే సముద్రుడితో వేసవి మూలంగా కలవకుండుటచే విరహవేదన వలన పుట్టిన వేడికి ఉపశమింపచేయడానికి నదులనే స్త్రీలు ధరించిన ముత్యపుదండలవలె ప్రకాశిస్తున్నాయి. సూర్యకిరణాల స్వచ్చతను, ప్రకాశాన్ని ముత్యాలతో పోల్చాడు కవి.
ఉ. మీటగు మీలనెల్ల మును మ్రింగి క్రమంబున నైనయొండ పె
న్బీటిక వెంటఁ దోఁచుతొగవేరుబడి న్గొడుపై చెలంగఁగా
ద్రోటికఁ గర్దమద్రవముతోనె నశించిన బొమ్మడాయ డా
త్కూటకులంబులం దినె బకోటకులంబు జలహ్రదంబులన్.
( ఈ పద్యం చదువరి స్వరంలో)
కొంగల గుంపులు ఆ నీళ్ళు లేని చెరువుల్లో దిగి చేపలను వేటాడుతున్నాయి. ముందుగా నోటికందిన పెద్ద పెద్ద చేపలని తినేసాయి. క్రమంగా ఎండలు ముదరడంతో చెరువుల్లో బురద కూడా నెర్రెలు పారింది. ఆ నెర్రెలలోంచి (పగుళ్ళలోంచి) కలువపువ్వుల వేరులు నీటికోసం అడుగుకి పోయాయి. వాటి పక్కనే బొమ్మిడాయులు (చేపల్లో రకం) గుచ్చబడ్డ పుల్లల్లాగా ఉన్నాయి. అవి కూడా నీటికోసం నెర్రెల్లో నుండి లోపలకి వెళుతూ ఉంటే తడి ఆరిపోయి బురద గట్టిపడిపోయింది. అందులో చిక్కుకుని బొమ్మిడాయిలు ఇతర చిన్న చిన్న చేపలు చచ్చిపోయాయి. కొంగలు తమ ముక్కులను లోపలికంటూ గుచ్చి వాటిని తింటున్నాయి.
ఇంతటి చిత్రాన్ని ఒక్క పద్యంలో మనకి రాయలవారు చూపిస్తున్నారు! ఎంతగా ప్రకృతిని పరిశీలిస్తే ఇలాంటి వర్ణనలు చెయ్యగలరు!
శా. ప్రాతర్వేళల నట్టివెట్ట సొగసై పాటిల్లెఁ గుంభోంభనో
ద్భూతాంబుధ్వని వాద్యమై మరుదధఃపుంజీభవత్పాటల
వ్రాతామ్రేడితసిక్తభూసురభిళారామాంబుకుల్యాబహు
స్రోతస్సంధుల నంధుయంత్రనతికృత్ప్రోద్గీత గేయౌఘముల్.
( ఈ పద్యం రాఘవ స్వరంలో. రాగం భూపాల రాగం)
అలాంటి వేసవిలోనూ ప్రాతర్వేళలు (పొద్దుపొడుపు వేళలు) చాలా సొగసుగా ఉన్నాయిట. ఏవిటా సొగసంటే, బావుల పైనుండే ఏతాములను (అంధు యంత్రాలు) త్రొక్కేవారు (అతికృత్) గొంతెత్తి (ప్రోద్గీత) గేయాలెన్నిటినో పాడుతూ ఉన్నారు. ఆ పాటలకి తాళం వేస్తున్నట్టు ఆ ఏతాములకున్న కుంభాలను (బానలను) ముంచడం వల్ల (ఉంభన) పుట్టిన (ఉద్భూత) అభు ధ్వని (నీటి చప్పుడు) వస్తోంది. ఆ జానపదగేయ మాధుర్యాన్ని రెట్టింపు చేసేది మరొకటి ఉంది. అదేమిటంటే, పాటలీ వృక్షాల కింద పాదుల్లో రాత్రికి రాలిన పువ్వులు గాలికి గుట్టలుగా పేరుకుని ఉన్నాయి. మడవలలో నుండి నీరు ప్రవహిస్తూ ఉంటే తడిసిన నేల వాసనను రెట్టిస్తూ ఆ పూల వాసనలు వ్యాపిస్తున్నాయి. ఆ వాసనలు, ఏతాము తోడేవాళ్ళ పాటలు, దానికి లయబద్ధంగా వస్తున్న ఏతాపు బాన చేసే చప్పుడు అన్నీ కలిసి ఆ పొద్దుపొడుపులకి ఎంతో సొగసు చేకూరుస్తున్నాయి.
జానపద గేయాలు, ఏతాములు, నీటికి తడిసిన మట్టివాసన, ఆ వాసనకి తోడు రాలిన పాదిరి పూల పరిమళం - ఎంత సహజమైన, స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణమో!
తే . మెండుమీఱిన పతఘి బీఱెండ దాఁకి
యొల్లఁబోయిన లేబొండుమల్లెపొదల
తుదలఁ జప్పటలై కడుదొడ్డ లగుచుఁ
బొడమె మొగ్గలగము లగ్గిబొబ్బలట్లు
( ఈ పద్యం రాఘవ స్వరంలో... రాగం.. నాట)
వేసవిలోనే విరిసే మల్లెపూల గురించి చెప్పేదేముంది. మండువేసవిలొని వేడికి బొండుమల్లెల పొదల చివళ్ళు వాడి అణిగిపోయి ఉన్నాయి. ఆ కొనలనున్న పెద్ద పెద్ద మల్లె మొగ్గలు అగ్గి బొబ్బల్లాగా కనిపిస్తున్నాయి.
తే. ఎసఁగు కట్టావిక్రియ నావి రెగయఁ బగటి
యెండ యుడుకాఱకుండు భూమండలమునఁ
బొలిచె మాపటఁ బండువెన్నెల చకోర
పోతవితతికిం జాఁపట్టు వోసినట్టు.
(ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)
తీవ్రమైన ఎండవేడికి నేల పెనంలా ఉందని అనడం సర్వసాధారణం. రాత్రుళ్లు కూడా భూమిలోంచి వేడి ఆవిర్లు పైకి వస్తున్నాయి.. రాత్రి పండు వెన్నెల కూడా కురుస్తోంది. అదెలా ఉందంటే, ప్రకృతి మాత చకోరపు పిల్లలకొసం వేడి పెనం లాంటి భూమిపై పండువెన్నెలని అట్టులా వేస్తే ఆవిరి పైకెగసినట్టుగా ఉందని అని చమత్కరించాడు కవి.
శా. తారుణ్యాతిగ చూతనూత్న ఫలయుక్ తైలాభిఘూర స్వన
ద్ధారా ధూపిత శుష్యదంబుహృత మాత్స్యచ్చేద పాకోద్గతో
ద్గారంపుంగన రార్చు భోగులకు సంధ్యావేళలం గేళికాం
తారాభ్యంతర వాలుకాస్థిత హిమాంత ర్నారికే ళాంబువుల్
( ఈ పద్యం కామేశ్వరరావు స్వరంలో)
వేసవిలో ఆహారము సాత్వికముగా ఉండాలి. అలా లేకున్న వేడిమి చేసి విపరీతముగా త్రేపులు వచ్చి ఇబ్బందిగా ఉంటుంది. అరోగ్యం కూడా తేడా చేస్తుంది. గ్రీష్మకాలంలో భోగులు, అప్పుడే పచ్చిదనం పోతున్న మామిడికాయ ముక్కలు, చేపల ముక్కలు కలిపి కూర వండుకుని తిన్నారు. ఆ కూరలో నూనెతో తిరగమోత పెట్టారు. ఆ తిరగమోతకి అందులో నీరు చుయ్యిమంటూ పొగ చిమ్ముతూ ఇగిరిపోయింది. అలాంటి కూరను వాళ్ళు తినడం వల్ల అది వేడి చెసి త్రేపులు మొదలయ్యాయి. ఆ అవస్థ నుండి తప్పించుకోవడానికి వాళ్లు సాయంకాలసమయంలో తోటల్లో ఇసుకలో పాతిపెట్టిన చల్లని కొబ్బరిబొండాలని కొట్టుకొని తాగుతున్నారు.
ఇసకలో పాతిపెట్టడం పైన ఎండవేడి కొట్టకుండా చల్లగా ఉండడానికి. తాటికాయలు కూడా ఇలాగే రాత్రులు బావిలో వానవేసి తెల్లవారినంతనే వాటిని కొట్టుకొని చల్లని తాటిముంజులు తినడం కూడా పల్లెటూళ్ళలో జరిగేదే.
తే. తోఁటఁ బగ లుండి, మల్లెలు దుఱిమి, కావు
లమర మాపైన నిక్షుయంత్రముల కొయ్యఁ
జేరుప్రజ వొల్చె భావివృష్టికిని గ్రుడ్డు
తో మధురిమేచ్చ దిగు నెఱ్ఱచీమ లనగ
( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)
పగలంతా తోటలో పని పాటలు చేసుకుంటూ అలసిపోయి సూర్యాస్తమయం కాగానే కొప్పుల్లో మల్లెపూలు పెట్టుకుని (ఆ రోజుల్లో మగవాళ్ళు కూడా కొప్పుల్లో పువ్వులు పెట్టుకొనేవారు), కావిరంగు బట్టలతో (బహుశా మట్టికొట్టుకు పోవడం వల్ల అయ్యుండొచ్చు), చెఱకు గానుగల (ఇక్షుయంత్రాలు) వద్ద మూగుతున్నారు ప్రజలు. ఎర్రరంగు ఒంటిపై తెల్లని మల్లెల్లతో వాళ్ళు ఎలా ఉన్నారంటే, రాబోయే వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని, తియ్యని ఆహారం సేకరించడానికి తమ గుడ్లతో సహా ఆ చెఱకు గానుగల దగ్గర చేరారా అన్నట్టుగా ఉన్నారు.
ఇదొక ఆశ్చర్యకరమైన పోలిక!
1 comments:
తెలుగు భాషపై యెంతో మక్కువ గల నా వంటి ప్రవాసాంధ్రులకు ఆముక్తమాల్యద మిక్కిలి ఆనందాన్ని కలుగజేసింది.పద్యాలు చెవులకు ఇంపు కలిగించేయి.ఇట్టి కృషి ముదావహం.
జాబాలిముని
Post a Comment