తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Wednesday, February 20, 2019

గోదాదేవి వృత్తాంతము - 1

మనం ప్రస్తుతం పంచమాశ్వాసంలోకి ప్రవేశించాం. అన్ని ప్రబంధాలలో ఆశ్వాసాంతంలో దైవప్రార్ధనతో స్వస్తి పలికినట్లే ఆశ్వాసారంభం కూడా దైవ ప్రార్ధనతోనే ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణుని కీర్తిస్తూ ఆరంభించాడు. ఇక చదవండి.
కం.శ్రీ నీళా జాంబవతీ
మానస తామరస విహార మాణ మిళిందా
భా నద్యుదయ కళిందా
నానాంఘ్రిశిరోక్ష శేషనగ హర్యక్షా!    (5-1)
శ్రీకృష్ణ భగవానునికి రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, భద్ర, సుదంత, మిత్రవింద, లక్షణ అనేపేర్లు గల ఎనిమిది మంది భార్యలు. అందు కుంభుడను గొల్లదొర కూతురు నీళాదేవి, జాంబవంతుని కుమార్తె జాంబవతి వీరిద్దరూ పట్టపు రాణులు. వారి హృదయములయందు స్వామి తుమ్మెద తామర పూలలో ఎట్లు విహరించునో అట్లు విహరిస్తాడు అని చెప్పి స్వామి వర్ణన కొనసాగిస్తూ, నల్లనైన కళింద పర్వతము నుండి నల్లనైన యమునానది జనించిన రీతిగా నల్లని దేహకాంతి కలిగినవాడా అని కీర్తిస్తూ, లెక్కలేని పాదములు, లెక్కలేని నేత్రములు, లెక్కలేనన్ని శిరస్సులు కలిగినవాడా అని శ్రీమహావిష్ణువును కీర్తిస్తున్నాడు. ఏదైనా ఒక కొండ గుహలో సింహము నివసించినట్లు శేషాచలం అనే కొండలో నివసించే శ్రీవేంకటాధిపా అని అత్యంత విశిష్టంగా కీర్తిస్తూ ఆశ్వాసారంభం జరిగింది.
రాయలవారు పురుషసూక్తం నిత్యం పఠించేవారని పై పద్యం వలన తెలుస్తుంది. దానిలో "ఓం సహస్రశ్శీర్షా పురుష: సహస్స్రాక్షాత్ సహస్రపాత్" అని మొదలెడతాం. భావం మొత్తం యధాతధంగా విరాట్స్వరూపుడైన శ్రీమహావిష్ణువు యొక్క అనంతమైన శిరస్సులను, నేత్రాలను, పాదాలను ఒక్కసారి తలుచుకుని ఆరంభించడం వలన  రాయలవారికే గాక ఈ కావ్యం చదివినవారికి కూడా సర్వపుణ్యలోకాలు లభించగలవు.
"అవధరింపు మవ్విష్ణుచిత్తుండు" (5-2)  అనే వచనం ముందున్న పద్యానికి కర్తృత్వంగా భావించవలెను.
మహాస్రగ్ధర: ఒకనాడామ్రాంకు రౌఘం బురు కుసుమ కుడుం గోదర క్షోణి దల్ప
ప్రకరంబై కాంక్షచే మున్పతుల బదరిపై బ్రౌఢి వాటించి నిట్టూ
ర్పెక దొట్టం డస్సి వీరాయిత మఱి మఱితా రెట్ల  మున్నట్ల యౌనా
యికలం గందర్పుడోటం బెఱిగి తఱిమి వీపేసెనానంటు తోటన్ (5-3)

వసంత ఋతువు వచ్చింది. పూదోటలోని పొదరిండ్లన్నీ నిండార పుష్పించి సుమధురంగా శోభిస్తున్నాయి. వానిలోపల వున్న విశాలమైన ప్రదేశాలలో లేమావి చిగుళ్ళ మొత్తలు ఆ పొదలకు పాన్పులాగా అమరి యుండగా అనుదులో స్త్రీపురుషులు విశృంఖలంగా రతిక్రీడా నిమగ్నులై యున్న విధం చెప్తున్నాడు రాయలవారు. నాయికలు మొడట సమరతియందున్నవారు, తర్వాత నాయకులను బెదిరించి పురుషాయితమునకు బాల్పడి, దాని వలన డస్సి, మరలా యధాతధంగా క్రిందకు చేరుతున్నారు. తద్వరా  ఆ పొదలలోని మావి చిగుళ్ళు పురుషుల వెనుకభాగాన వీపులకు అంటుకున్నాయి. ఆ అంటుకొన్న విధాన్ని ఎలా చమత్కారంగా ఒక ఉత్ప్రేక్షాలంకారంలో రాయలవారు చెప్పడం గమనించవలసి యున్నది. మరునికళలో ఓడినందువలన మన్మధుడు వారిని తరిమి వీపులపై చరిచినట్లున్నది అని చెప్తున్నాడు.
ఇట్టి వనమునందు ఒక నాడు విష్ణుచిత్తుడు అని ముందు పద్యంతో అన్వయం ఉంది. ముఖ్యంగా ఈ పద్య నేపధ్యం అర్ధం చేసుకోవలసిన అగత్యం ఉంది. ఆ పూలతోటలో కాముకులు స్వేఛ్ఛగా తిరగటాన్ని పద్యంలో వర్ణించటం చేత, ఏ పెళ్ళికాని తల్లో, తండ్రో ఆ పసిగుడ్డుని ఈ పూలతోటలో వదిలి వెళ్ళినట్టుగా రాబోయే పద్యాలలో గోదాదేవిని విష్ణుచిత్తుడు దర్శించడానికి ఏర్పరచిన గొప్ప నేపధ్యాన్ని నర్మగర్భంగా రాయలవారు సూచించారని తెలుస్తున్నది.

ఉ. వింగడమైన యొక్క వనవీధి గనుంగొనె నీడ సున్నపున్
రంగుట రంగు పచ్చల యరంగయి పో వెలిదమ్మి బావికిం
జెంగట నుల్లసిల్లు తులసీవన సీమ శుభాంగి నొక్క బా
లం గురువింద కందళ దళ ప్రతిమాంఘ్రి కరోదరాధరన్. (5-4)
 
విష్ణుచిత్తుడు ఆ శృంగారవీధిలో నడుస్తూ చెట్ల నీడలచేత మరకత మయమయినట్లుగా కనపడుచుండగా దాని సమీపమున ఉన్న ఒక తులసీవనములో శుభలక్షణాలను కలిగి యున్న ఒక ఆడ శిశువును చూశాడు.  భావం విషయం కాసేపు ప్రక్కన బెట్టి ఇక్కడి విశేషాన్ని గమనిస్తే కృష్ణదేవరాయలు ఆ పుష్పవనంలో “ఒక్కబాలంకనుగొనె అని మాత్రమే  కావ్యంలో వ్రాశాడు. ‘అయోనిజ లాగా సీతాదేవి దొరికిందని వ్రాయలేదు. గోదాదేవి  దేవాతామూర్తిగా పూజలందుకున్న వ్యక్తి చరిత్ర కాబట్టి ఎన్ని మహత్తుల నైనా ఆపాదించి రాసేందుకు అవకాశం ఉన్నప్పటికీ, రాయలు సామాజిక దృష్టి తోనే ఈ కావ్య రచనచేశాడని దీన్ని బట్టి భావించాలి. కానీ, సీత పొలంలో దొరికినట్టే, గోదాదేవి పూదోటలో దొరికినట్టు రాయల తరువాతి కవులు పోల్చే ప్రయత్నం చేశారు.
అలరుల నందనంబున
అలరారుచు నొక్క కన్య యావిర్భవమై
అలసీత మున్ను భూమిని
చెలువుగ నుదయించినట్లు శ్రీయొప్పారెన్
పైన పేర్కొన్న పద్యం 17వ శతాబ్దికి చెందిన నందవర భాస్కర శేషాచలామాత్యుడు గారి “నాచ్చారు పరిణయం కావ్యంలోది “అలరులు నిండిన ఆ తోటలో అలరారె ఒక పాపాయి అలనాడు సీతభూమిలో దొరికినట్టు చెలువుగ ఉదయించింది వెలుగులు నిండగా!” అంటాడీ పద్యంలో కవి. అంతేకాదు తాళ్ళపాక తిరువేంగళనాథుడు కూడా ‘పరమయోగి విలాసంలో ఇదే అర్థంలో గోదాదేవిని వర్ణించాడు. ఎవరి భక్తి వాళ్ళది! కొందరికి దేవుడు ముఖ్యం. కొందరికి సమాజమేదేవుడు! రాయలవారి ఆనాటి సమాజదర్పణం ఈ కావ్యం.

చ. కనుగొని విస్మయం బొదవగా గదియంజని సౌకుమార్యముం
దను రుచియు న్సులక్షణ వితానము దేజము జెల్వు గొంత సే
పనిమిష దృష్టి జూచి యహహా!యనపత్యున కమ్ముకుందు డే
తనయగ నాకు నీ శిశువు దా గృప సేసె నటంచు హృష్టుడై (5-5)

ఆ శిశువును చూసి ఆశ్చర్యపడ్డాడు విష్ణుచిత్తుడు. దగ్గరకు వెళ్ళి ఆ శరీర కోమలత్వము, మేని వన్నెను, శుభలక్షణాలను గమనించాడు. కొంత వడి రెప్పలార్చక చూసిన పిమ్మట ఆహా! ఏమి నా భాగ్యము.నా పుణ్యము. నేను బిడ్డలు లేని వాడినని తలచి నా మీద కరుణించి ఆ శ్రీమన్నారాయణుడు నాకు ఈమెను కూతురుగా ప్రసాదించాడు అని సంతోషంతో ఎంతో పొంగిపోయాడు. ఆమె భగవన్నిర్ణయముగా భావించి పాలిచ్చి పెంచు చుండెను. ఆమె వయసునకు వచ్చిన విధమును వర్ణిస్తున్నాడు రాయలవారు.
సీ.వాతెఱ తొంటికై వడి మాట లాడదు
కుటిలవృత్తి వహించె గుంతలంబు
లక్షులు సిరులురా నరచూడ్కి గనుగొనె
నాడించె బొమగొని యాననంబు
సనుగొమ ల్నెగయ వక్ష ముపేక్ష గడకొత్తె
బాణిపాదము లెఱ్ఱవాఱదొడగె
సారెకు మధ్యంబు దారిద్ర్యములె చెప్పె
ఱొచ్చోర్వ కీటు లోగజొచ్చె మేను
తే.గీ వట్టిగాంభీర్య మొక్కడు వెట్టుకొనియె
నాభి నానాటి కీగతి నాటిపొందు
చవుకయైనట్టి యిచ్చట జనదు నిలువ
ననుచు జాఱినకరణి బాల్యంబు జాఱె. (5-7)

ఆమె అధరోష్టము పూర్వమువలె మాటాడడంలేదనడంలో ఆమెలో రాజసం హెచ్చిందన్న భావం స్ఫురింపజేశాడుతల వెండ్రుకలు పూర్వంలాగా సాధారణంగా ఉండడంలేదు, వంకరలు తిరిగాయి ఆరాళ కుంతల అయిందని చెప్తున్నాడు. కంటి చూపు చిన్ననాటివలె చూడడం లేదు. యౌవనాతిశయం చేత నీల, రక్త, శ్వేత వర్ణములచే మెరుగెక్కి విలాసవంతమయినాయట. కనుబొమలకు కాంతి హెచ్చింది. స్తనములనెడి వస్త్వంతరములు కలిగిన యనంతరం తన్నుపేక్షించి జేరనీక మూలకు ద్రోచెను అనగా జవ్వనమందు చన్నులు చెన్నుమీరెనను భావము. యౌవనం అంకురించగా కాళ్ళు చేతులు ఎరుపెక్కసాగాయి. లేమియే గానీ చిన్ననాటి కలిమి నడుముకు లేదనడంలో నడుము చిక్కి సన్నబడినదని అర్ధము. సందడి కోర్వదు. గతంలో వలె గాక బెట్టుగా యుంటూ ఉన్నది. అలనాటి స్నేహము ఇప్పుడు వుండగూడదన్నట్టుగా శరీరంలో బాల్యం తొలిగిపోయిందని భావము.

0 comments:

Related Posts Plugin for WordPress, Blogger...