విష్ణుచిత్తుడు తన ఎదుట ప్రత్యక్షమైన శ్రీమహావిష్ణువును చూసి ఆనందంతో పులకించిపోయాడు. ఆ స్వామిని స్తుతిస్తూ దశావతారాలను వర్ణించాడు. నిజానికి వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్ణుచిత్తుడు చేసినది దశావతారస్తుతి కాదు. భగవంతుని సౌందర్యాన్ని స్తుతిస్తూ, అతనికి దిష్టి తగలకుండుగాక అని, తమిళభాషలో "తిరుప్పల్లాండు" అనే స్తోత్ర సముదాయాన్ని రచించాడు. దానిని ఒక దివ్యప్రబంధంగా నేటికీ శ్రీవైష్ణవులు గానం చేస్తూ ఉంటారు. తిరుప్పల్లాండును అనువదించకుండా ఈ సందర్భంలో రాయలవారు దశావతార వర్ణన చెయ్యడం బహుశా దీనిలో కవితోహలకు ఎక్కువ అవకాశం ఉంటుందని భావించి కాబోలు!
జయ జయ దానవదారణకారణ శార్ఙ్గ రథాంగ గదాసిధరా!
జయ జయ చంద్రదినేంద్రశతాయుత సాంద్రశరీరమహఃప్రసరా!
జయ జయ తామరసోదరసోదర చారుపదోజ్ఝితగాంగఝురా!
జయ జయ కేశవ! కేశినిషూదన! శౌరి! శరజ్జలజాక్ష హరీ!
(ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో )
ఈ పద్యం ఆదిత్య 369 సినిమాలో బాలసుబ్రహ్మణ్యం పాడింది..
దానవులను మట్టుపెట్టడానికై ధనుస్సును(శార్ఙ్గము), చక్రమును(రథాంగము) , గదను, నందకమనే ఖడ్గాన్ని(అసి) ధరించినవాడా!! పది లక్షల (అయుత అంటే పదివేలు. శతాయుత అంటే వంద పదివేలు, అంటే పది లక్షలు) సూర్యచంద్రులవలే ప్రకాశించే దివ్యమంగళరూపం కలవాడా!! తామరస (తామరపువ్వు), ఉదర (లోపలి భాగానికి) సోదర (తోబుట్టువులాంటి), చారు పద (అందమైన పాదాలనుండి) ఉజ్ఝిత (పైకి చిమ్మబడిన) గాంగఝరా (గంగా ప్రవాహం కలవాడా)!! కేశి అనే రాక్షసుని సంహరింఛిన వాడా!! శరత్కాలమందలి కమలములవంటి కన్నులు కలవాడా!! కేశవా! హరీ ! నీకు జయమగుగాక అని మంగళశాసనం చేసాడు. భగవంతుడికన్నా మానవుడు గొప్పవాడా మంగళశాసనం , ఆశీర్వచనం ఇవ్వడానికి అని అనుకునేరు! పూర్వం సీతాదేవి శ్రీరాములవారికి మంగళశాసనం పలికియున్నారు. అలాగే గోపికలు కూడా శ్రీకృష్ణుడికి మంగళశాసనం పలికారని తెలియవస్తుంధి..
ఈ పద్యం ఛందస్సు కవిరాజవిరాజితము అనే వృత్తం. నజజజజజజవ అనేవి గణాలు. 14వ అక్షరం యతి. చాలామంది కవులు మూడు యతులతో (8, 14, 20 అక్షరాలు) కూడా వ్రాసారు. నన్నయ్య తిక్కనలు ఒక యతినే వేసారు. ఇక్కడ రాయలువారు కూడా ఒక్క 14వ అక్షరానికే యతి నియమం పాటించారు. ఈ పద్యం మనుచరిత్రలోకూడా వస్తుంది, చివరన చిన్న తేడాతో. మనుచరిత్రలో పద్యం "శౌరి హరీ దురితాపహరా!" అని ముగుస్తుంది. రాయలవారికి మనుచరిత్రపై, అందులోని పద్యాలపై ఉన్న అమిత మక్కువతో కొన్నిటిని తన ఆముక్తమాల్యద కావ్యంలో వాడుకొన్నారు.
మ. దివిజద్వేషి నుదారవారిచరమూర్తిం ద్రుంచి చాతుర్య మొ
ప్ప వడిం జౌకపుఁదెల్ల కౌచుగమి దంభం బొంద మైఁదాల్చి, వే
దవిశుద్ధాక్షర పంక్తిఁ గ్రమ్మఱఁగ వేధం జేర్చెదో నాఁగఁ, ద
ద్భువనం బబ్ధిసితాంబుబిందు లలమం బ్రోద్యద్రుచిన్ దాటవే.
(ఈ పద్యం భైరవభట్ల కామేశ్వరరావు స్వరంలో)
శ్రీహరీ! పూర్వం వేదాలను దొంగిలించిన సోమకాసురుడనే రక్కసుని మత్స్యావతారమెత్తి సంహరించి, సముద్రంనుండి సత్యలోకానికి లంఘించావు.. ఆ ఎగరడం ఎలా ఉందంటే, ఆ వేద వర్ణాలను జాగ్రత్తగా, నేర్పుగా ఒంటిమీద ధవళకాంతిలో ఉన్న పొలుసులనే మిషతో ధరించి సముద్రంలోని జలబిందువులు చెదిరిపోతున్నట్టుగా పైకెగిరి తీసికెళ్లి బ్రహ్మదేవునికి ఇస్తున్నావన్నట్టుగా ఉంది.
"చౌకపు తెల్లకౌచుగమి" అన్నది ఒక ఆశ్చర్యకరమైన ప్రయోగం. కౌచు అంటే చేపల పొలుసులు. అవి తెల్లగా ఉన్నాయని ఊరుకోలేదు. "చౌకపు" అని పేర్కొన్నారు రాయలు. అంటే నలుచదరంగా ఉన్నాయని. బహూశా నాలుగు వేదాలను ఆ నలుచదరాకారంలో ధ్వనించడానికేమో! చేప ఎగిరే స్వభావం కలది కనక యిక్కడ సముద్రంనుండి సత్యలోకం దాకా ఎగిరినట్లు ఉత్ప్రేక్షించడం చక్కగా ఉంది. వేదమంత్ర సంపుటి బ్రహ్మ ఉచ్ఛ్వాస రూపంలో వెలువడినట్లు సంప్రదాయం. ఇక్కడ ఆ మంత్రాక్షరాలు శ్రీహరికి శరీరంగా చెప్పబడటం భగవంతుడు మంత్రతనువన్న సంప్రదాయాన్ని సూచిస్తోంది.
మ. జలపూరప్లవమానమృణ్మయ మహీసంరక్షకై గార యీ
బలె ముక్తామణిశుక్తిశంఖనికురుంబం బెల్లఁ జూర్ణంబుగా
బలభిద్వజ్రసదృజ్నిజోపరిపరిభ్రామ్యన్మహామందరా
చలసంఘృష్టిఘరట్ట మైన కమఠస్వామి న్నినుం గొల్చెదన్..
( ఈ పద్యం రాఘవ స్వరంలో . రాగం వసంత )
పాలసముద్రంలో దేవదానవులు అమృతమధనం చేస్తుండగా నీవు కూర్మావతారం దాల్చి మంధర పర్వతాన్నీ నీ వీపు మీద మోసావు. అది ఎలా ఉందంటే, సముద్ర జలాల మీద తేలుతున్న మంధరపర్వతపు మట్టి కరిగిపోకుండా గట్టిగా గార (సున్నపు గచ్చు) వేయడానికై, ఇంద్రుడి వజ్రాయిధంతో సమానమైన పటిష్ఠత కలిగిన నీ వీపు చిప్పని మంధరపర్వతానికి తిరగలి రాయిగామార్చి సముద్రంలోని ముత్యాలు, మణులు, ముత్యపుచిప్పలు, శంఖాలు మొదలైనవాటి నన్నింటిని మెత్తగా నూరుతున్నుట్టుగా కనిపిస్తోంది. అలాంటి నీ కూర్మావతారాన్ని కొలుస్తాను.
చ. ఒకమఱి బుడ్డగింప విలయోదకముల్ పయి కుబ్బి, చిప్ప వ్ర
చ్చుకొని, మహాభ్రవీథిఁ జన, సూకరత న్మెయి వెంచి, వెండి క్రిం
దికిఁ గయివ్రాలు తత్సలిల నిర్మలధార నధఃపరిస్ఫుర
త్ప్రకృతికి నీ యజాండమునె బంగరు ముంగఱఁగా నొనర్పవే!
( ఈ పద్యం రాఘవ స్వరంలో - రాగం -సహన)
ఓ విష్ణుమూర్తీ!! వరాహావతారం దాల్చి మహా భీకరాకారుడవై శరీరాన్ని విపరీతంగా పెంచి నీ ముట్టెతో ప్రళయజలధిలోని నీటిని పెళ్లగించినప్పుడు అందులోని నీళ్లు ఈ బ్రహ్మాండమనే చిప్పను చీల్చుకుని వెళ్లేట్టుగా పైకి చిమ్మి వంపు తిరిగి మళ్లీ క్రిందపడుతూ ఉంది. ఆ దృశ్యం ఎలా ఉందంటే, నువ్వు మూలప్రకృతియనే స్త్రీకి, బ్రహ్మాండమనే బంగారు ముక్కెరను అలంకరించినట్టు కనిపిస్తుంది.. అది వట్టి బంగారు ముక్కెర కాదు. ముత్యాలగుత్తితో గూడిన ముక్కెర. వలయాకారంలో లేచి పడుతున్న ఆ నీటిధారే ముత్యాలగుత్తి.
మ. అసురేంద్రాశయకుండి కాచ్చరుధిరవ్యాప్త స్వకచ్చాయఁ గాం
చి, సముద్యత్ర్పతిసింహమత్సర మిళచ్చేష్టన్ దదుద్ధామ దీ
ర్ఘ సటాఝూటముఁ బెల్లగించుగతి నాంత్రశ్రేణిఁ గిన్కన్ వెరం
జు సితక్రూర భవన్నఖావళులు ప్రోచు న్మర్త్యపంచాననా!
(ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )
మర్త్యపంచాననా! - పంచాననం అంటే సింహం. మర్త్యపంచాననా అంటే నరసింహా అని. స్వామీ! నీవు ఉగ్రనరసింహావతారం దాల్చి హిరణ్యకశిపుని గుండెను (ఆశయకుండిక) చీల్చినప్పుడు ఆ రక్తంలో నీ ప్రతిబింబాన్ని చూసి మరో సింహం నీ మీదకు దూకుతుందని భ్రమించి మరింత కోపంతో తెల్లని నీ వాడిగోళ్లతో దాని జూలును పట్టుకుని పెళ్లగిస్తున్నట్టుగా, హిరణ్యకశిపుని కడుపులోని ప్రేగులను బయటకు లాగినావు. అంతటి కఠినమైన నీ తెల్లని గోళ్లు మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించాలి..
మ. బలిదైతేయ భయాంధకారభరిత బ్రహ్మాండ గేహంబులో
పలఁ బై మండెడి తత్ప్రతాపమయ దీపజ్వాల డిందన్, గడుం
దలమై మింటికి గ్రక్కున న్నెగయు నుద్యత్తన్మహాచ్చాయ నాఁ
దలనీలాంగము శింశుమార మొరయంగాఁ బెంపవే వామనా!
( ఈ పద్యం సనత్ స్వరంలో)
ఓ వామనమూర్తీ! రాక్షస రాజైన బలి చక్రవర్తి వల్ల కలిగిన భయమనే అంధకారంతో నిండిన బ్రహ్మాండమనే భవనంలో, పైన ఎత్తుగా అతని ప్రతాపమనే జ్వాల పెద్ద ఎత్తున మండుతూ ఉంది. ఆ జ్వాల గుప్పుమని ఆరిపోతే దాని పెద్దనీడ ముల్లోకాలలో వ్యాపించినట్లు, స్నిగ్ధమైన నీ నల్లని దేహాన్ని, పైకి పైపైకి మొసలి ఆకారంలో ఉన్న శింశుమార చక్రం (నక్షత్ర సముదాయం) వరకు పెంచావు కదా స్వామీ
మ. శమితక్షత్త్రకళత్రనేత్రజలవర్షావేళ నీ కీర్తిహం
సము క్రౌంచస్ఫుటతావకాంబకసుషిం జాఁగంగ నీక్షించి, వ
ర్షము రా నంచలు నంద నేఁడుఁ జను నిచ్చ న్నాటి తచ్చేష్ట వా
యమిఁ; దిర్యక్తతి దా గతానుగతికం బౌఁగా కుఠారీ! హరీ!
( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)
కుఠారము అంటే గొడ్డలి. కుఠారీ అంటే గొడ్డలి ధరించినవాడా అని. హరి అంటే హరించువాడు అని. పరశురామావతారం రాజలోకాన్ని హరించడానికే కదా. ఓ పరశురామా! నీవు ఎందరో రాజులను చంపడంవల్ల వారి భార్యల కన్నీరు వాన కురిసినప్పుడు - గతంలో నీవు క్రౌంచపర్వతాన్ని నీ బాణంతో చేదించావు కదా - అప్పుడు ఏర్పడిన బిలంలోనుండి నీ కీర్తి అనే హంస అవతలికి వెళ్ళి దిగంతాల వ్యాపించింది అది చూసిన ఇతర హంసలు ఇప్పటికీ వర్షాకాలం మొదలుకాగానే ఆ పర్వత బిలం గుండా మానససరస్సులోకి వెళుతున్నాయి. పక్షులు ముందుపోయిన పక్షివెంట అలా వెడలిపోవడం సహజమే కదా!
శివుని దగ్గర పరశురాముడు సుబ్రహ్మణ్యస్వామీ విలువిద్య నేర్చుకున్నారనీ, విద్యా పరీక్షకై యిద్దరూ క్రౌంచ పర్వతాన్ని భేదించారనీ పురాణ కథ. ఆ కథ ఆధారంగా చేసిన కల్పన యిది. వర్షాకాలంలో హంసలు క్రౌంచ పర్వత బిలంలోంచి మానససరోవరానికి ఎగిరిపోతాయనీ, మళ్ళా శరత్తు ప్రవేశించడంతో తిరిగి అదే క్రౌంచ పర్వత బిలంలోంచి మళ్ళీ లోకమ్మీదకి వస్తాయన్నది కవిసమయం. దీనికి ఆద్యుడు బహుశా కాళిదాసు. ఈ క్రౌంచ పర్వతమన్నది ఎక్కడ ఉన్నదీ స్పష్టంగా తెలియదు. ఇది హిమాలయశ్రేణిలోనే ఒక పర్వతమని కొందరంటే, యిది దక్షిణదేశంలో ఉందని మరికొందరు భావిస్తారు.
సీ. స్యందనస్థితబిడౌజఃక్షత్తృజాడ్యకృ
జ్ఘంఝామరుద్గరుజ్ఝాత్కృతములు
క్రవ్యాశిరాడ్గాత్రకనదసృగ్గాహన
స్ఫుటశల్యహవ్యభుక్చూత్కృతములు,
యోధవర్మితహృత్పుటోత్క్రాంత నిజపాత
సాలాశ్మకృతముహుష్ఠాత్కృతములు
పతితోగ్రరక్షఃకబంధభారభృశార్తి
భుగ్నభోగఫణీంధ్రపూత్కృతములు
శ్రాంతరథ్య నిరంతర ఛాయదములు,
దివ్యతావక కార్ముకోత్ప్రేరితములు,
కలుషము లడంచుగాత లంకాపురాంగ
ణాంబర చలత్కలంబ కదంబకములు
(ఈ పద్యం భైరవభట్ల కామేశ్వరరావు స్వరంలో)
రాయలవారి దారుణాఖండలశస్త్ర తుల్యమైన వాక్కు విశ్వరూపం దాల్చిన పద్యమిది! ఈ పద్యంలో వర్ణింపబడుతున్నవి శ్రీరామ బాణాలు, అవి చేస్తున్న రకరకాల శబ్దాలు. సందర్భం రామరావణ యుద్ధం. ఆ యుద్ధంలోని తీవ్రతనంతా శబ్దాలలోనే వ్యక్తీకరిస్తున్న పద్యమిది.
"స్యందనస్థితబిడౌజఃక్షత్తృజాడ్యకృ
జ్ఘంఝామరుద్గరుజ్ఝాత్కృతములు"
స్యందన స్థిత, బిడౌజ క్షత్తృ, జాడ్య కృత్, ఝంఝా మరుత్, గరుత్, ఝాత్ కృతములు.
బిడౌజుడు అంటే ఇంద్రుడు. క్షత్తృ అంటే రథసారధి. బిడౌజక్షత్తృ అంటే ఇంద్రుని రథసారధి, మాతలి. రామరావణ యుద్ధంలో రాముని రథానికి సారథ్యం వహించినది స్వయంగా ఇంద్రుని సారథి అయిన మాతలే. మాతలి రాముని రథాన్ని తోలుతున్నాడు. రాముడు రావణునిపై బాణవృష్టి కురిపిస్తున్నాడు. తమ గరుత్తులు (బాణాల చివరనుండే యీకలు) ఝాత్ ఝాత్ అనే శబ్దాలు చేస్తూండగా ఆ బాణాలు దూసుకుపోతున్నాయి. అవి ఎంతలా దూసుకుపోతున్నాయంటే, ముందుకు వెళ్ళే వాటి వేగానికి, గాలి, తుఫాను ఝంఝామారుతంలాగా వెనక్కి తన్నుకు వస్తోంది. అలా వస్తున్న గాలి, రథ వేగాన్ని అడ్డగిస్తూ దానికి జడత్వాన్ని కలిగిస్తోందిట!
మనం బస్సులోనో రైల్లోనో వెళ్ళేటప్పుడు, అది వెళ్ళే దిశకి వ్యతిరేక దిశలో వేగంగా గాలి మనని తాకడం మనకి తెలిసినదే. ఇక్కడ దాన్ని గుర్తుచేసుకోండి. మహాజవంతో వెళుతున్న రామబాణాల వలన గాలి వాటి వ్యతిరేక దిశలో తుఫానులా హోరెత్తుతోంది. అలా వచ్చే ఆ ఝంఝ రథ వేగాన్ని నిరోధిస్తోందిట! అంటే ఆ బాణ వేగాన్ని మనం ఊహించగలమా! అంతటి వేగాన్ని తట్టుకొని రథాన్ని ముందుకు నడపాలంటే ఆ సారథి ఎంత సమర్థుడై ఉండాలి, ఆ గుఱ్ఱాలకు ఎంతటి జవసత్త్వాలుండాలి!
"క్రవ్యాశిరాడ్గాత్రకనదసృగ్గాహన
స్ఫుటశల్యహవ్యభుక్చూత్కృతములు"
క్రవ్యాశి రాట్, కనత్, గాత్ర, అసృక్, గాహన, స్ఫుట, శల్య, హవ్యభుక్, ఛూత్కృతములు.
క్రవ్యమంటే మాంసము, అశి అంటే భుజించే అని అర్థం. క్రవ్యాశి అంటే రాక్షసులు. క్రవ్యాశి రాట్ - రాక్షసరాజైన రావణుడు. రావణశరీరంలో ప్రవహిస్తున్న నెత్తుటిలో (అసృక్ అంటే నెత్తురు) మునగడం వల్ల బాణపు ములుకులకున్న నిప్పు ఛూత్ అనే శబ్దాన్ని చేస్తున్నదిట! బాగా కాల్చిన చువ్వను నీటిలో ముంచితే "ఛూత్" అని శబ్దం చేస్తూ ఆరిపోతుంది కదా. రామబాణాల చివరలు రావణుని శరీరంలోని రక్తంలో ములిగి వాటి అగ్ని కూడా చల్లారి అలాంటి శబ్దం చేస్తోందట!
"యోధవర్మితహృత్పుటోత్క్రాంత నిజపాత
సాలాశ్మకృతముహుష్ఠాత్కృతములు"
యోధ, వర్మిత, హృత్ పుట, ఉత్క్రాంత, నిజ పాత, సాల, అశ్మ, కృత, ముహుః, ఠాత్ కృతములు
రామబాణాలు ఇంకేమేమి శబ్దాలు చేస్తున్నాయో చెపుతున్నాడు కవి. వర్మము అంటే కవచం. కవచాలు ధరించే వారు కాబట్టే రాజుల పేర్లలో వర్మ పదం ఉండేది. కవచాలు ధరించిన యోధుల హృదయ కోశాలనుండి బయటకు వెళ్ళి తనమీద పడే రామబాణాల వల్ల, గోడల రాళ్ళు (అశ్మములు) కూలిపోతూ కోట మళ్ళీమళ్ళీ ఠాత్ ఠాత్ అనే శబ్దాలు చేస్తోందిట! అంటే రామబాణాలు శత్రుయోధుల కవచాలని చీల్చి, వారి గుండెలను చీల్చుకొని, కోట గోడల రాళ్ళను కూడా బద్దలు కొడుతున్నాయని అర్థం. రామబాణాల తీవ్రత అది!
"పతితోగ్రరక్షఃకబంధభారభృశార్తి
భుగ్నభోగఫణీంధ్రపూత్కృతములు"
పతిత, ఉగ్ర రక్షః, కబంధ భార, భృశ, ఆర్తి, భుగ్న, భోగ, ఫణీంద్ర, ఫూత్ కృతములు
ఉగ్రులైన రాక్షసులు రామబాణాలు తగిలి పడిపోతూ ఉంటే, వారి మొండేల (కబంధాలు) బరువుకు, మిక్కిలి ఆర్తితో వంగిన పడగలు కల ఫణీంద్రుడు (ఆదిశేషువు) ఫూత్కారాలు చేస్తున్నాడట. బరువు మోయలేక అతని ఊర్పులు ఎక్కువయ్యాయి. పాము కదా, అంచేత అవి భుస్ భుస్సనే ఫూత్కారాలు. రాక్షసులే కాదు, సమస్త ప్రాణులూ ఉన్న భూభారాన్ని మోస్తున్న ఆదిశేషువు, ఆ సమయంలో వారి మొండేల బరువు మోయలేక ఎందుకంత ఆర్తి చెందుతున్నాడు అనే అనుమానం రావచ్చు. అది ఆలోచిస్తేనే ఇందులో ఉన్న ధ్వని మనకి తెలుస్తుంది. రాక్షసులు మామూలుగా ఉంటే వారి భారాన్ని మోయడం శేషువుకి అలవాటే. కానీ యిక్కడ రాక్షసులు రామబాణాలకి తల తెగి కిందపడుతున్నారు. ఆ పడే వేగం వల్ల భూమి మీద అపారమైన ఒత్తిడి కలుగుతోంది. ఆ ఒత్తిడి తట్టుకోవడం ఆదిశేషునికి భారమయ్యింది! అంటే రామబాణాలు తగిలి రాక్షసులు అంత వేగంగా కూలి పడుతున్నారన్న మాట!
అవీ రామబాణాలు చేసే రకరకాల ధ్వనులు! అంతే కాదు, ఆ బాణాలు పందిరిగా ఏర్పడి విశ్రాంతి తీసుకుంటున్న తమ రథాలకు నీడనిస్తున్నాయట. ఓ రామా! అలా నీ దివ్య ధనుస్సునుండి వెలువడి లంకా నగర ప్రాంగణమంతటా కదలాడుతున్న బాణాల (కలంబ) గుంపులు (కదంబకములు) సర్వ పాపాలను అణచుగాక అని విష్ణుచిత్తుని ద్వారా రాయలవారు ప్రార్థిస్తున్నారు.
ఇంతటి ప్రౌఢమైన, ఓజోగుణ భూయిష్టమైన పద్యానికి ముందు కాస్త సున్నితమైన పద్యం ఒకటి వస్తుంది, రామావతారాన్ని గురించినదే. అది:
పవిధారాపతనంబు గైకొనని యప్పౌలస్త్యు మై సప్తధా
తువులం దూఱు పరిశ్రమంబునకు నుద్యోగించె నా, సప్త సా
ల విభేదం బొనరించి నిల్వక సలీలన్ జన్న యుష్మన్మరు
జ్జవనాస్త్రం బొసగున్ సిరుల్ రఘుకులస్వామీ! రమావల్లభా!
ఇంత సుకుమారశైలి రాయలవారి కెక్కడిది! ఇది మనుచరిత్రలోని పద్యం. రాయలువారు ఇష్టపడి తిరిగి తన ఆముక్తమాల్యదలో వాడుకున్నది. ఈ పద్యమిక్కడ ప్రస్తావించడానికి కారణాం పద్యం చివరనున్న సంబోధనలు. అవి మనోహరమైన సంబోధనలు. రమావల్లభా అని సంబోధించడంలో ఒక విశేషం ఉంది. దశావతారాలలో రామావతారం వచ్చే వరకూ విష్ణువు రమావల్లభుడు కాడు! అంతకుముందు అవతారాలు సంపూర్ణావతారాలు కాదు. రామావతారమే మొట్ట మొదటి (ఒక రకంగా ఒకేఒక) సంపూర్ణావతారం. అంచేతనే ఆ అవతారంలో మాత్రమే విష్ణువు రమావల్లభుడయ్యాడు. స్వయంగా లక్ష్మీదేవి సీతగా అవతరించింది. ఆ విశేషాన్నంతా ధ్వనించే సంబోధన "రమావల్లభా" అన్నది.
చ. 'క్షితిహలకృష్టిఁ బుట్టి యడఁగెన్ క్షితియందునెసీత' యంచుఁ ద
త్సతి విరహార్తిఁబాండిమముఁ దాలిచి రామశరీర మెత్తి, యా
క్షితిఖననక్రియ న్మగుడఁ జెందగఁ గాక, కళిందజా తట
క్షితి దున నేటికి న్హలముచే మఱి నీ కవశాత్మకతన్ హలీ!
( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)
ఇక్కడ సంబోధన "హలీ!" అని. అంటే హలము ధరించినవాడు, బలరాముడు. స్వామీ! రామావతారంలో జనకుడు భూమిని దున్నిస్తూ ఉండగా సీతాదేవి ఉద్భవించింది. చివరకు ఆ భూమిలోకే అంతర్థానమయింది. అందుకే ఆ రాముడుగా అవతారం చాలించిన తర్వాత బలరాముడవై మరల జన్మించి, ఆ సీతాదేవి విరహము మూలంగా నల్లనివాడివి పాలిపోయి తెల్లనై. సీత భూమిలోనే ఉన్నదనే నమ్మికతో యమునా నది ఒడ్డున నేలను నీవు నాగలితో దున్నితివే గాని, నీకు అలా నేలని దున్నవలసిన అవసరం లేదు కదా! అని రాయలవారు చమత్కరించారు. కృష్ణుని కొడుకు సాంబుడు దుర్యోధనుని కూతురైన లక్షణను పెళ్ళిచేసుకోవడానికి సాహసించి ఆమెను ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తే, కౌరవులు అతన్ని బంధిస్తారు. సాంబుని విడిపించుకు రావడానికి బలరాముడు హస్తినాపురానికి వెళ్ళి, తమకున్న బంధుత్వాన్ని దృష్టిలో ఉంచుకొని సాంబుని వదిలివెయ్యమని అడుగుతాడు. కౌరవులు దానికి ఒప్పుకోక కయ్యానికి కాలు దువ్వుతారు. దానితో కోపించిన బలరాముడు హస్తినాపురాన్ని యమునలో ముంచడానికి తన నాగలితో నగరాన్ని యమున వైపుకి యీడ్చితే నగరం ఒక ప్రక్క క్రుంగిపోతుంది. అప్పుడు భీష్మాదులు వచ్చి బలరాముని ప్రార్థించి లక్షణా సహితంగా సాంబుని అతనికి అప్పగిస్తారు. ఈ పద్యం వెనకనున్న కథ యిది.
ఉ. ఆయతయుష్మదాకృతి కరాగ్ర నగాంచల వాంత వారిధా
రాయుత చంద్రకాంతఫలకావళిబింబిత యై చెలంగ, నా
రాయణమూర్తిమత్కవచరత్నముచేఁ బరిరక్షఁ గాంచె నా
నో యదువీర! వృష్టిఁ బసి యూఱడఁ బ్రోవవె సప్తరాత్రముల్..
( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం మోహన )
శ్రీకృష్ణా! ఒకసారి పంతంతో దేవేంద్రుడు ఏడు రాత్రులు నిరంతరాయంగా వర్షాన్ని కురిపించాడు. ఉన్నతమైన ఆకృతితో నీవు గోవర్ధనగిరిని ఎత్తి గోపకులాన్ని, గోసంపదను దానిక్రిందకు తెచ్చి రక్షించావు.. అప్పుడు గోవర్ధనగిరిని నీ చేతి కొనగోటితో ఎత్తి పట్టినప్పుడు ఆ గిరి అంచులనుండి వేల కొలది కురుస్తున్న చంద్రకాంతశిలల వంటి నీటిధారలలో నీ రూపమే ప్రతిబించింది. అప్పుడు చుట్టూ అంతా నారాయణాకృతే కనిపించసాగింది., నారాయణకవచమే శరీరాకృతి దాల్చి గోవులను, గోపాలురను రక్షించిందన్నట్టుగా ఏడు రాత్రులు వారందరినీ ఊరడించి కాపాడావు!
బలరామ కృష్ణులిద్దరినీ దశావతారాల్లో వర్ణించారేమిటి రాయలవారని సందేహం రావడం సహజం. బలరాముడిని దశావతారాల్లోకి చేరిస్తే, కృష్ణుని కాక బుద్ధుడిని మాత్రమే చేరుస్తారు. ఇక్కడ రాయలవారు బలరాముడినీ, కృష్ణుడినీ, బుద్ధుడినీ కూడా వర్ణించారు. అప్పుడు దశావతారాలు పదకొండైయిపోతాయే! లెక్క తప్పదా? రాయలెందుకిలా వర్ణించారు? దీనిలోని రహస్యం తెలుసుకోవాలంటే, ఈ కృష్ణ వర్ణన మరొక్కసారి జాగ్రత్తగా పరిశీలించాలి.
దశావతారాలలో ఎక్కడా వాడని "నారాయణ" శబ్దాన్ని యీ కృష్ణవర్ణన పద్యంలో వాడారు రాయలవారు. విశిష్టాద్వైతంలో నారాయణుడే పరబ్రహ్మ. శ్రీకృష్ణుడు అవతారమూర్తి కాదు. స్వయంగా నారాయణమూర్తే! దాన్ని ఆ శబ్దంతో యిక్కడ చక్కగా ధ్వనించారు రాయలు. కృష్ణావతార వర్ణనలా పైకి కనిపించినా కృష్ణుడు స్వయంగా నారాయణమూర్తే అని ధ్వనింప చేస్తుందీ పద్యం. అంటే కొందరు కృష్ణుని అవతారమూర్తిగా భావిస్తారు కాని అతను భగవత్స్వరూపుడే అని చెప్పడం రాయలవారి ఆంతర్యం కాబోలు. అంతే కాదు, శ్రీకృష్ణుని "విష్ణు" స్వరూపాన్ని, అంటే సర్వవ్యాపకతను కూడా ఈ పద్యంలో ధ్వనింప చేసారు. చుట్టూ లక్షలకొద్దీ ఉన్న నీటిబిందువులలో కృష్ణుని మూర్తి ప్రతిబింబించి లోకమంతా ఆయనే వ్యాపించినట్టుగా ఉందని చెప్పడంలో ఆ ధ్వని ఉంది. మరొక విశేషం ఏమిటంటే, "నారాయణ" శబ్దానికి "నీటిలో వసించువాడు" అనే అర్థం ఉంది. ఇక్కడ ఆయన కనిపిస్తున్నది కూడా నీటి ధారలలోనే కదా! అంచేత అతను నారాయణమూర్తిగా గోచరించడంలో ఎంతో ఔచిత్యం ఉంది.
1 comments:
I am happy to have come across this blog. I am also interested in old Telugu/Sanskrit literature. Thanks.
Post a Comment