ఆముక్తమాల్యద తృతీయాశ్వాసంలో విష్ణుచిత్తుడు పండితులందరిని ఓడించి పాండ్యరాజుకు అష్టాక్షరీ మంత్ర పూర్వకంగా ద్వయమంత్రాన్ని ఉపదేశించి అతన్ని భాగవతోత్తముని చేశాడు. ఇక చతుర్ధాశ్వాసంలోకి ప్రవేశిద్దాం.
శ్రీ మందిర భుజమధ్యమ,
గోమండలకర్షి వేణుగుంభన, దృప్య
ద్భౌమాహృతసురజనయి
త్రీమణితాటంక! వృషగిరిస్థ! ఖగాంకా.!
( ఈ పద్యం భైరవభట్ల కామేశ్వర శర్మ స్వరంలో )
శ్రీమహాలక్ష్మికి నివాసమైన వక్షస్ధలం కలిగినవాడా! గోసమూహాన్ని ఆకర్షించే వేణువును పూరించేవాడా! దృప్యత్ అంటే అహంకరించిన. భౌముడంటే భూమి కుమారుడు నరకుడు. అహంకరించిన నరకుడినుండి దేవతామాత అయిన అదితి మణితాటంకాలను తిరిగి తీసుకొనివచ్చినవాడా! గరుడుని కేతనంగా ధరించిన వృషాద్రి నివాసా! అని చతుర్ధాశ్వాస ప్రారంభంలో మహావిష్ణువును ప్రార్ధిస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు.
మ. బలిమిం ద్రెంపఁగఁ బోలెఁ బాయవడుచుం బర్యాయభంగంబుగాఁ
గల నూలెల్లను నంటుమోవఁ దెగి రాగా, గొంతసే పుండి, తాఁ
బెలుచ న్గంటు పుటుక్కునం దునిసి వే పృధ్విం బడె న్జాలె, మి
న్నుల మ్రోసెన్ సురదుందుభుల్, గురిసె బెన్సోనై విరుల్బోరునన్.
( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )
విష్ణుచిత్తుడు పరతత్వ నిరూపణ చేయగానే అక్కడ రాజాస్థానంలో విద్యాశుల్కంగా వ్రేలాడగట్టిన వరహాలమూట ఎవరో బలవంతంగా త్రెంచినట్టుగా ఒక్కొక్క పాయ విడిపోయాయి. ఆ అంటుదారం అంచు వరకు కొద్దిసేపు ఊగిసలాడి అదే తెగిపోవడంతో దానికి కట్టిన వరహాలమూట జారి క్రిందపడింది. అది చూసిన దేవతలు సంతోషంగా దుందుభులు మ్రోగించి పుష్పవర్షం కురిపించారు. "బలిమిన్ ద్రెంపఁగఁ బోలె" అనడంలో ఏదో అదృశ్యశక్తి చేత అలా జరిగిందని ధ్వనిస్తోంది. జాగ్రత్తగా గమనిస్తే, ఈ వర్ణనలో, భవబంధాలు ఒకొటొకటీ తెగి జీవుడు మోక్షాన్ని పొందే విధానం స్ఫురిస్తుంది. విష్ణుభక్తే ఆ అదృశ్యశక్తి. విష్ణుచిత్తుని ఉపదేశాన్ని పొందిన పాండ్యరాజుకి అతను కోరుకున్న ముక్తి లభించిందనే ధ్వని ఇందులో ఉంది.
ఈ విధంగా విష్ణుచిత్తుడు పాండ్యరాజు కొలువులోని పండితులను జయించి వేదవేద్యమైన విష్ణుతత్త్వాన్ని రాజుకు తెలియజెప్పి భగవంతునికి శరణాగతిచేసి లోకానికి హితం కూర్చాడు.
శా. అద్ధా వాగ్విబుధం, బహోవచన కవ్యాహార, మాహావచ
స్సిద్ధం, బాః కృతతాం గతః కలి రితి శ్రీసూక్తి విద్యాధరం,
బిద్ధౌద్ధత్య మగాల్లయం హి కుధియా మిత్థంవద త్కిన్నరం,
బద్ధీరాగ్రణి గెల్పుటుత్సవమునం దయ్యెన్ నభం బంతయున్
( ఈ పద్యం రాఘవ స్వరంలో - రాగం హిందోళం )
ఆ ధీరాగ్రణి విష్ణుచిత్తుని గెల్పుటుత్సవము చూసి, ఆకాశంలో ఉన్న దేవతలు "అద్ధా!" అన్నారు. పితృదేవతలు "అహో" అని, సిద్ధులు "ఆహా" అని మెచ్చుకున్నారు. విద్యాధరులు "ఆహ్! కలియుగం కృతయుగం అయినట్టుగా ఉంది" అన్నారు. కుత్సితమైన బుద్ధి గలవారి గర్వమణిగిందని కిన్నెరులు మెచ్చుకుని సంతోషించారు.
ఈ పద్యంలో మొదటి మూడు పాదాలూ పూర్తిగా సంస్కృతం. ఇది రాయలు తన సంస్కృత పాండిత్యాన్ని ప్రదర్శించడానికి చేసిన రచన కాదు. ఇక్కడ విష్ణుచిత్తుని విజయాన్ని చూసి మెచ్చుకొన్నవారెవరు? దేవతలు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, కిన్నరులు. వీరందరూ గీర్వాణులు. అందువల్ల, వారు పొందిన ఆశ్చర్యానుభూతిని వారి భాషలో ప్రకటించడమే చాలా ఉచితం. ఉచితజ్ఞుడైన కవి కాబట్టే రాయలవారు అలా వర్ణించారు.
పాండ్యరాజు విష్ణుచిత్తుని రత్నాలు, ఆభరణాలు, పట్టువస్త్రాలతో సత్కరించి, అటుపిమ్మట ఊరేగించడానికి గజారూఢుని చేసాడు. రాకుమారులను పిలిచి ఈ మహాత్ముని ఊరేగించి విల్లిపుత్తూరు చేర్పించి రమ్మని పంపాడు.
ఉ. ఇంగిలికంబునం దడిపి యెత్తు కసీసపు రెంటెమో యనన్
నింగి గరుత్ప్రంపరల నిగ్గున లేఁదొగ రెక్కె; నంత వీ
చెం గలశాబ్ధిమీఁగడల జి డ్డెఱిఁగించెడు కమ్మగాడ్పు; నిం
డెం గడు మ్రోఁత; పెన్దిరువడిం గని రా ఖగరాజు మూఁపునన్.
( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో )
విష్ణుచిత్తుని గజారూఢుని చేసి మంగళవాద్యాలు, స్తోత్రాలు, రకరకాల వాద్యలతో ఘనంగా ఊరేగిస్తూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. ఎఱ్ఱని ఇంగిలీకంలో ముంచి తీస్తున్న నల్లని నేత వస్త్రమో అన్నట్టుగా నీలాకాశం గరుత్మంతుని రెక్కల కాంతితో ఎరుపెక్కింది. క్షీరసాగరపు పాలమీగడల జిడ్డు వాసనలతో కూడిన కమ్మని గాలులు వీచాయి. అంతలోనే గరుత్మంతుని రెక్కల సవ్వడి వినిపించింది. గరుత్మంతుడు కనిపించాడు. ఆతని వీపుమీద వేంచేసిన విష్ణుమూర్తి సాక్షాత్కరించాడు. ఇది ఒక ఉదాత్త రమణీయమైన వర్ణన. ముందుగా ఱెక్కల కాంతి, ఆపై పాలమీగడల వాసన, ఆ తర్వాత రెక్కల మ్రోత, చివరగా రూపం - యిలా చక్కని సహజ క్రమంలో మనోహరంగా సాగిన వర్ణన రాయల కవితాశక్తికి ఒక మచ్చు తునక. ద్రవిడ భాషలో "అడి" అంటే పాదమని అర్థం. తెలుగులో "అడుగు" అన్న మాటకి మూలం అదే. పెన్+తిరు+అడి = పెందిరువడి, అంటే పూజ్యపాదులలో పెద్దవాడు అని. గరుత్మంతుని పెందిరువడి అంటారు.
సీ. చివురుబొట్లపుదోయి జెందమ్ము లనఁ దార్క్ష్య
హస్తోదరముల దివ్యాంఘ్ర లమర
నునుఁగప్పుమేనఁ దోఁచిన తదూర్ధ్వచ్చాయ
లీలఁ దాల్చుపసిండిచేల మెఱయ
వ్రాలిన యోగివర్గము నిర్మలాంతఃక
రణములువోలె హారములు దనర,
సిరికిఁ బుట్టింటినెచ్చెలు లౌట మనవికి
డాసె నా మకరకుండలము లమర
శ్రిత సితచ్ఛద వాత్యాభిహత పరాగ
వలయమండిత కల్పశాఖలొ యనంగ
శంఖచక్రాంచితోరుహస్తములు దనర
దోచె గమలేక్షణుండు చతుర్భుజుండు
( ఈ పద్యం రాఘవ స్వరంలో - రాగం పూర్వీ కళ్యాణి )
భక్తునికొరకు దివినుండి భువికి దిగివచ్చిన శ్రీహరి ముగ్ధమోహనమైన రూపంతో అలరించాడు. ఆ రూపాన్ని రాయలవారీ పద్యంలో వర్ణిస్తున్నారు.
గరుత్మంతుని రెక్కల మధ్య స్వామి దివ్యాంఘ్రులున్నాయి. అవి రెండు చిగురాకు పొట్లాలలో ఉన్న ఎర్రని తామరపువ్వుల్లాగా ఉన్నాయట! ఎంత మనోజ్ఞమైన ఉపమానం! స్వామివారి పాదాలు పద్మాలు. గరుడుని కెంజాయ ఱెక్కలు చిగురాకులు. తామరపూవులను చిగురాకులెంత మృదులంగా పొదువుకుంటాయో స్వామి పాదాలని గరుత్మంతుని గరుత్తులు అలా పొదువుకున్నాయి. స్వామి దేహం స్నిగ్ధ నీలవర్ణం, దాని చుట్టుకొని పీతాంబరమున్నది. అది ఎలా ఉందంటే, గరుత్మంతుని బంగారు శరీరచ్చాయ పైకి ప్రసరించినదేమో అన్నట్టుగా ఉందట! స్వామి మెడలో ముత్యాలహారాలు వ్రేలాడుతున్నాయి. నిరతము తనను ధ్యానించే యోగివర్యుల నిష్కళంకములైన అంతఃకరణములవలె (మనోబుద్ధి చిత్తాహంకారాలు ) ప్రకాశిస్తున్నాయట అవి! ఇదెంతటి ఔచితీమంతమైన పోలిక! యోగుల అంతఃకరణములు పరమ స్వచ్ఛములు. స్వచ్ఛత్వానికి ప్రతీక తెలుపు. అంతే కాదు, అవి పారదర్శకములు, ప్రకాశవంతములు. ముత్యాలు కూడా అంతే కదా! స్వచ్ఛమైన ఆ యోగుల అంతఃకరణములు స్వామివారి హృదయానికి అత్యంత సమీపములు. స్వామి చెవులకు మకరకుండలాలున్నాయి. అవి మహావిష్ణువు ధర్మపత్ని సిరికి పుట్టింటి చెలికత్తెలు కావడంతో చనువుకొద్ది ఆయనతో ఏదో మనవిచేసుకోడానికి దగ్గరకి వచ్చినట్టుగా ఉన్నాయట. కమలేక్షణుడైన స్వామి చతుర్భుజుడై దర్శనమిచ్చాడు. ఆ చేతులలో శంఖ చక్రాలు అమరి ఉన్నాయి. ఆ చేతులు కల్పవృక్ష శాఖలు. ఒక కొమ్మమీద తెల్లని హంస వాలినట్టుగా ఒక చేతిలో శంఖమున్నది. పూల పుప్పొడి సుడిగాలికి లేచి వలయంగా ఏర్పడినట్టుగా మరొక చేతిలో చక్రం అలరారుతోంది. ఆ స్వామి భక్తుల పాలిట కల్పతరువు!
తే. సమ్మద దిదృక్షు ఖస్థ రక్షః పిశాచ
పుంజ మహిభుక్పతత్త్ర ప్రభంజనములు
సోఁకఁ వెఱఁ బాఱెఁ కళ్లాన శూర్పవాత
ఘట్టనలఁ బాఱు పెనుఁబొల్లకట్టు వోలె.
( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో )
దేవతలతో పాటు రాక్షసులు, పిశాచగణాలు కూడా ఆకాశంలో నిలుచుని విష్ణుచిత్తుని ఊరేగింపును, వైభవాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు . ఎప్పుడైతే నాగాంతకుడైన గరుత్మంతుని రెక్కల తీవ్రవాయువులు వచ్చి తాకినవో వారు భయపడి పారిపోయారు. ఎలాగంటే కళ్లంలోని ధాన్యం మీద చేటలతో విసరగానే దానిపై పొట్టు ఎగిరిపోయినట్టుగా చెల్లాచెదరైపోయారు. దేవతలు మాత్రం నిలిచి స్వామికి వినయంగా నమస్కరించారు. శూర్పము అంటే చేట. ఇది కర్షకవృత్తినుండి గ్రహించబడ్డ సొగసైన పోలిక. రాయలవారికి దేశీయ జీవనమ్మీద ఉన్న మక్కువకి యిదొక తార్కాణం.
తే. అట్లు ప్రత్యక్షమైనపద్మాక్షు నంత
రిక్షమునఁ గాంచి ముని ప్రమోదాక్షిజలము
నిగుడఁ బులకించి, కరటిఘంటికలె తాళ
ములుగ నిట్లని యమ్మహాత్ముని నుతించె.
( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)
విష్ణుచిత్తుడు ఆకాశంలో తనకోసం ప్రత్యక్షమైన పద్మాక్షుడిని చూసి నిలువెల్లా పులకించిపోయాడు. కళ్ళనుండి ఆనందబాష్ఫాలు ఉబికిరాగా, తాను ఊరేగుతున్న ఏనుగుకు కట్టిన గంటల మ్రోతలే తాళధ్వనులుగా ఆ స్వామిని స్తుతించాడు. ఇప్పటికీ మధుర మీనాక్షి గుడి కెదురుగా దగ్గరలో విష్ణువు కోవెల ఉంది. అది ఎక్కడ స్వామి విష్ణుచిత్తునికి సాక్షాత్కరించాడో, ఆ చతుష్పథంలో గుర్తుగా రాజు నిర్మించాడట. విష్ణు సాక్షాత్కారమైన సందర్భంలో విష్ణుచిత్తుడు పరమానందంతో ఆ భగవంతుని సౌందర్యాన్ని తనివితీరా వర్ణిస్తూ, ఆయనకు దృష్టిదోషం తగలకుండుగాక అని "తిరుప్పల్లండు" అని తమిళ భాషలో స్త్రోత్రాగుచ్ఛాన్ని రచించాడు. అయితే ఈ కావ్యంలో రాయలవారు వాటిని అనువదించక, స్వతంత్రమైన దశావతార వర్ణన చేసారు. ఆ వర్ణన వచ్చే టపాలో చూద్దాం.
Sunday, February 26, 2012
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
ఇంతటి గొప్ప కావ్యాన్ని భావంతో రాగయుక్తంగా అందిస్తున్న మీ జట్టుకు
శతసహస్రాభివందనాలు.
అభినందనలు.
సీసపద్యంలో ఉన్న పోలికలు అమోఘం. అపూర్వం.
ఎప్పుడూ రాయలు వారు అందించే పోలికలు అద్వితీయంగా ఉంటాయి.
వారు ఒకప్పటి మన రాజు, ఇప్పటికీ తెలుగు రాజు అని చెప్పుకోవటం మనకెంతైనా గర్వపడవలసిన విషయం.
పెన్దిరువడిం గనిరా ఖగరాజు మూఁపునన్.
ఆ ఖగరాజు మూపున పెన్దిరువడిని గనిరి = గరుత్మంతుని మీద ఉన్న నారాయణుని పవిత్ర పాదపద్మాలను చూశారు అని అర్థము. సరిచేయగలరు.
పెన్దిరువడి అంటే మీరిచ్చిన అర్థం ప్రకారమే నారాయణుని పవిత్ర పాదపద్మాలు అని అర్థం.
గరుత్మంతుడు కాదు.
మందాకినిగారు,
శ్రద్ధగా ఇక్కడి ఆముక్తమాల్యద టపాలని చదువుతున్నందుకు చాలా సంతోషం. మీలాంటి వారు ఒకరిద్దరున్నా మా ప్రయత్నం ప్రయోజనాన్ని సాధించినట్టే.
పెన్దిరువడి గురించి. మీరన్నట్టు నారాయణుని పాదపద్మాలనే అర్థాన్ని తీసుకొనే అవకాశం లేకపోలేదు. కాని అక్కడ ఉన్నది తిరువడి కాదు పెన్దిరువడి. గరుత్మంతునికి "పెరియ తిరువడి", హనుమంతునికి "సిరియ తిరువడి" అనే పేర్లు వైష్ణవ సంప్రదాయంలో ప్రసిద్ధం.
http://en.wikipedia.org/wiki/Garuda
ఇక్కడ తిరువడి (శ్రీపాదులు) అంటే శ్రీపాదాలను నిరంతరం ధరించే వారు అనే అర్థం వస్తుందనుకుంటా. అలా ధరించే వారిలో పెద్ద గరుత్మంతుడు. తర్వాత హనుమంతుడు. అంచేత ఇక్కడ పెన్దిరువడి అంటే గరుత్మంతుడనే అర్థం. పైగా ఈ పద్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, ముందు గరుత్మంతుని రెక్కల కాంతి, తర్వాత వాసన, ఆ తర్వాత రెక్కల చప్పుడు మాత్రమే మొదటి మూడు పాదాలలో వర్ణింపబడ్డాయి. గరుత్మంతుడు కనిపించినట్టుగా లేదు. గరుత్మంతుడు కనిపించాడు అని చెప్పకుండా, "ఆ గరుత్మంతుని" మూపుపై నారాయణుని పాదపద్మాలు చూసారు అని వర్ణించడం అంత సమంజసంగా ఉండదు. "కనిరి పెన్దిరువడిన్" అని, "ఆ ఖగరాజు మూపుపై" నారాయణుడు చతుర్భుజుడై కనిపించాడు అని చెప్పడం సముచితంగా ఉంటుంది. "ఆ ఖగరాజు మూపుపై" అన్నది తర్వాతి పద్యంతో అన్వయించుకోవాలి. ఇలా ఒక పద్యం చివరను తర్వాతి పద్యంతో అన్వయించుకోవడం చాలా చోట్ల కావ్యాలలో కనిపించే అంశమే.
ఇక్కడి పద్య వివరణలను ఆముక్తమాల్యదకు శ్రీ తుమ్మపూడి కోటేశ్వరరావుగారు వ్రాసిన సౌందర్యలహరీ వ్యాఖ్యానం ఆధారంగా చేస్తున్నాము. అప్పుడప్పుడూ వేదంవారి వ్యాఖ్యానాన్ని కూడా చూస్తున్నాము (ఈ రెండు పుస్తకాలూ Digital Libraryలో ఉన్నాయి). ఈ రెండు వ్యాఖ్యానాలలోనూ పెన్దిరువడి అంటే గరుత్మంతుడనే అర్థమే ఇచ్చారు.
కామేశ్వరరావు గారు,
మీరు చెప్పిన అన్ని విషయాలు సమంజసంగా ఉన్నాయి.
నన్ను మన్నించండి.
కానీ అజ్ఞానంతో వాగినందుకు మరిన్ని విషయాలు తెలిశాయి.(పెరియ , సిరియ తిరువడి.)
తర్వాతి పద్యంతో అన్వయించుకోవటం గుర్తే రాలేదు.
మీకు ధన్యవాదాలు.
ప్రతి భాగమూ శ్రద్ధగానే చదువుతున్నాను. కానీ వ్యాఖ్య పెట్టాలన్నా ఒక జంకు ఉండేది.
ఈసారి పొరపాటు చేశారేమో అనే ఉద్దేశ్యంతోమాత్రమే తొందరపడి వ్రాశాను.
శ్రద్ధగా వివరించినందుకు అనేక ధన్యవాదాలు.
మందాకినిగారు,
అయ్యో, మన్నించడాల్లాంటి మాటలెందుకండీ! ఇక్కడిచ్చే పద్య వివరణల్లో పొరపాట్లు జరగడమో, లేదా కావలసినంత స్పష్టత లేకపోవడమో జరిగే అవకాశం ఎప్పుడూ ఉంది. కాబట్టి మీరెలాంటి జంకు లేకుండా దయచేసి మీ సందేహాలను వ్యాఖ్యల రూపంలో పెడుతూ ఉండండి. అది మీకూ మాకూ, చదివే పాఠకులందరికీ ఉపయోగపడుతుంది.
ముందు వ్యాఖ్యలోనే చెప్పినట్టు, ఈ పద్యానికి మీరనుకున్న అన్వయం బొత్తిగా అర్థం లేనిది కాదు. నాక్కూడా అలాంటి అనుమానం వచ్చే వేదం వారి వ్యాఖ్యకూడా చూసాను. ఆ తర్వాత గూగులించాను. ఆపైనే నిర్ధారణకి వచ్చాను.
Post a Comment