విష్ణుచిత్తుడు పాండ్యరాజు కొలువులో పండితులను తన వాదంతో ఓడించి నారాయణుని తత్వాన్ని విశదీకరించి అతని సాక్షాత్కారాన్ని ఉపకరించే మరో ఉపనిషత్ కథ ఖాండిక్య కేశీధ్వజ సంవాదాన్ని చెప్పడం ప్రారంభించాడు.
మ. జనకాఖ్యాఖిలరాజ మొప్పు నిమివంశం; బందు ధర్మధ్వజుం
డను భూజాని మితధ్వజాఖ్య వసుధాధ్యక్షుం జగద్రక్షణా
వనజాతాక్షు గృతధ్వజాఖ్యుఁ గనియె; న్వారిద్దఱు న్గర్మఠున్
ఘనవిజ్ఞానుఁ గ్రమంబునం గనిరి తత్ఖాండిక్యుఁ గేశీధ్వజున్..
( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)
|
( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)
నిమి వంశంలో జన్మించిన ప్రతీ ఒక్కరికి జనకుడని పేరు ఉంటుంది. ఆ వంశంలోని ధర్మధ్వజుడనే మహారాజుకు మితధ్వజుడు, కృతధ్వజుడనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో మితధ్వజుడికి కర్మశూరుడైన ఖాండిక్యుడు, కృతధ్వజునికి బ్రహ్మజ్ఞాని అయిన కేశీధ్వజుడు జన్మించారు.
క. వారివురు దమలోపల
వేరము గొని, రాజ్యకాంక్ష విజిగీషువు లై
హోరాహోరిగఁ బోరిరి
బారాదిదినంబు లవని ప్రజలు దలంకన్.
( ఈ పద్యం రాఘవ స్వరంలో.. రాగం కుంతలవరాళి )
|
( ఈ పద్యం రాఘవ స్వరంలో.. రాగం కుంతలవరాళి )
ఖాండిక్య కేశీధ్వజులు సోదరులైనా పరస్పరం వైరము పెంచుకొని , రాజ్యాపేక్ష చేత యుద్ధానికి సిద్ధపడ్డారు. వారి రాజ్యాలలోని ప్రజలు భయభ్రాంతులను చేస్తూ రోజుల తరబడి యుద్ధం చేసేవారు.
జేతుమిఛ్చా జిగీష - గెలవాలనే కోరిక జిగీష. బారాది అన్న పదం హిందుస్తానీ "బారా" (పన్నెండు) నుండి వచ్చినది. శ్రీనాథుని కాలంనుండీ ఉరుదూ పారసీ హిందుస్తానీ పదాలు తెలుగు సాహిత్యంలో హెచ్చుగా కనిపిస్తాయి. "హోరాహోరీ" అంటే గంటల తరబడి అని మనకి తెలుసు. ఇది "హోరా" అన్న పదంనుంచి పుట్టిన పదం. హోరా అంటే గంట. ఇది గ్రీకునుండి సంస్కృతంలోకి వచ్చిన పదం. బహుశా ఇంగ్లీషులోని "hour"కి కూడా ఇదే మూలం.
ఇక్షుమతీ నదీతీరాన ఎన్నో రోజులు యుద్ధం చేసిన తర్వాత కేశీధ్వజుని ధాటికి తట్టుకోలేక ఖాండిక్యుడు యుద్ధభూమిని వీడి పారిపోయాడు. అడవిలోకి వలసపోయాడు. ఎంతయినా రాజే కనక, అక్కడ ఒక రహస్యప్రదేశంలో గుడిసెలు ఏర్పాటు చేసి, చిన్నపాటి ఊరు నెలకొల్పాడు. తనతో వచ్చిన గురు భట పరివారంతో అక్కడ నివసింప సాగాడు. దారి పొడుగునా శత్రు సంచారాన్ని పసిగట్టి చెప్పడానికి వేగులని ఏర్పాటు చేసాడు.
శా. ఆ కేశీధ్వజుఁ డంత నా నృపుని రాజ్యం బెల్లఁ జేర, న్ఫలం
బాకాంక్షింపక 'గెల్తు మృత్యువు నవిద్య న్బుట్టకుందుం దుదన్
జాకుందు న్వడి' నంచు యోగ నియతిం జ్ఞానాశ్రయుం డై మఖా
నీకంబుల్ రచియించు చం దొకటికిం దీక్షించి తా నున్న చోన్.
( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )
|
( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )
గెలిచిన కేశీధ్వజుడు ఖాండిక్యుని రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని తన రాజ్యంలో కలుపుకున్నాడు. అయినా అమృతత్వాన్ని(మోక్షాన్ని) కోరుకొని యోగాసక్తితో జ్ఞానమును ఆశ్రయించి ఎన్నో యాగములు చేసాడు. అలా ఒక యజ్ఞమును ప్రారంభించి దీక్ష వహించి ఉండగా.
ఈ పద్యంలో "గెల్తు మృత్యువు నవిద్య , న్బుట్టకుందుం, దుదన్జాకుందు న్వడి" అన్నదానికి అన్వయం కొద్దిగా తికమక పెట్టేది. ఒక రకమైన అర్థం - "మృత్యువును, అవిద్యను గెల్చెదను. చావుపుట్టుకలు లేని మోక్షాన్ని పొందుతాను" అని. ఇది సులువయిన అన్వయం. అయితే దీనికి వ్యాఖ్యానం వ్రాసిన వేదం వేంకటరాయశాస్త్రిగారు, తుమ్మపూడి కోటేశ్వరరావుగారు ఇద్దరూ కూడా వేరే అర్థాన్ని ఇచ్చారు. అదేమిటంటే, "అవిద్య చేత మృత్యువుని గెలుస్తాను. జనన మరణ ప్రవాహ రూపమయిన సంసారాన్ని దాటి మోక్షాన్ని పొందుతాను" అని. ఇక్కడ అవిద్య చేత మృత్యువుని గెలవడం ఏమిటి? అన్న సందేహం వస్తుంది. దానికి వారు ఈశోపనిషత్తులోని ఒక వాక్యం ఉదహరించారు - "అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే". అంటే అవిద్య ద్వారా మృత్యువుని తరించి విద్యద్వారా అమృతత్వాన్ని పొందాలి అని. దీనికి వ్యాఖ్యానం - అవిద్య అంటే కర్మమార్గం. విద్య జ్ఞానమార్గం. అమృతత్వం అంటే ముక్తి. అంటే యజ్ఞ యాగాదుల ద్వారా మృత్యువుని జయించవచ్చు (స్వర్గాది లోకాలను పొంది). అయితే అది ముక్తి కాదు. ముక్తి కేవలం జ్ఞానం ద్వారానే లభ్యమవుతుంది. విశిష్టాద్వైతం కర్మ, జ్ఞానమార్గాల సముచ్చయం. అందుకే ఇక్కడ కేశిధ్వజుడు జ్ఞానాశ్రయుడయినా యజ్ఞాలని ఆచరించాడు. బహుశా దాన్ని బలపరచడం కోసం పద్యాన్ని యిలా వ్యాఖ్యానించారు కాబోలు.
చ. పులు మఖశాలికానికటభూముల మేయుచు నేటి వెంటఁ బె
ల్లల మెడునీఱముం దఱిపి యామ్యపతాకన ఘర్మధేను వా
కెళవున నాడువాల భుజగిం గని గోండ్రని యంగలార్చుచున్
గళగతఘంటమ్రోయ నుఱుకం బిడుగుం బలె దాఁకి యుద్ధతిన్
(ఈ పద్యం రాఘవ స్వరంలో..రాగం రంజని )
|
(ఈ పద్యం రాఘవ స్వరంలో..రాగం రంజని )
ప్రతి యాగానికి ఒక యాగధేనువు (గోవు) ఉంటుంది. అది చాలా పవిత్రమయినది. అది లేకుండా యాగం సాగదు.
ఈ యాగం జరుగుతూండగా, దాని యాగధేనువు ఆ యజ్ఞశాలకు సమీప ప్రదేశంలో గడ్డి మేస్తూ, అక్కడికి దగ్గరలోనే ఏటి ఒడ్డున బాగా దుబ్బుగా పెరిగిన పొదలవైపు వెళ్లింది. అంతలో ఆ పొదలమధ్య యముని పతాకంలా, పాములాగా కదులుతున్న పులితోకను గమనించింది. వెంటనే భయంతో గోండ్రు గోండ్రుమని అరుస్తూ మెడగంటలు మ్రోగుతుండగా పరుగెత్తింది. అయితే అంతకు మించిన వేగంతో పులి కూడా పరిగెత్తుకుంటూ పిడుగులాగా ఆవు మీదికి దూకింది.
ఉ. గబ్బు సమక్షికం బయి మొగం బడువ, న్దరుపర్ణముల్పడన్
ద్రొబ్బుచుఁ, గార్మొగిళ్ల రొదతోఁ జెఱలాడెడు బొబ్బరింత గా
డ్పుబ్బి విసంజ్ఞగాఁగఁ జెవు లూఁదిన, వల్లవుఁ డుర్విఁ గూలఁగా
బెబ్బులి గొంతుక్రోల్గఱచి పెల్లున మార్మెడ ద్రెళ్ల దాఁటుచున్
( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో )
|
( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో )
ఈగలతో కూడిన దుర్గంధం పులి ముఖాన కొడుతుండగా, చెట్ల ఆకులు రాలునట్టుగ ఆవును తోస్తూ, వర్షాకాలపు మేఘాల వలె గాండ్రిస్తూ దాని మీదకు దూకింది పులి. ఆ శబ్దానికి పశులకాపరి కింద పడి మూర్చపోయాడు. ఆ పెద్దపులి ఆవు కంఠనాళాన్ని కొరికి మెడను విరిచింది.
ఆ. తనువుఁ గొమ్ము గొరిజ గొనకుంఢ మలఁపుచుఁ
జప్పు డెసఁగఁ దోఁక నప్పళించి,
శోణితంబు గ్రోలుచునె నేర్పుమై ఘర్మ
గవిని గవికి నీడ్చు నవసరమున.
( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)
|
( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)
పెద్దపులి ఆవు కొమ్ముగాని, కాలిగిట్ట కాని తనకు తగలకుండా నేర్పుతో దానిని తిప్పుతూ పెద్ద చప్పుడయ్యేట్టు తోకతో కొడుతూ, రక్తాన్ని తాగుతూ, ఆ యాగధేనువుని తన గుహకి ఈడ్చుకు పోతోంది.
చ.పొలమరు లంది కూఁత లిడ, భూసురు లన్నదిలోన వార్చి, మ్రాఁ
కుల తుద లెక్కి, చప్పటలు గొట్టి యదల్పఁగ, సాహిణీలు మా
వులఁ బఱపంగ, వైచి సెలవు ల్వెస నాకుచుఁ బోయె వృక్షమం
డలికయి తేలుచున్ గుటగుటధ్వని సారె మలంగి చూచుచున్
(ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో )
|
(ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో )
పులి ఆవును లాక్కెళుతూ ఉండగా చూసి ఆ ప్రాంతంలో అక్కడక్కడా ఉన్న పొలం పనులు చేసుకునేవారు గట్టిగా అరుస్తూ వచ్చారు, అక్కడి నదిలో సంధ్యవార్చడానికి వచ్చిన బ్రాహ్మణులు చెట్లపైకి ఎక్కి చప్పట్లు కొట్టి అదిలించారు. అంతలో కొందరు రౌతులు గుర్రాలెక్కి పులిని వెంట తరిమారు. ఆ హడావిడికి పులి ఆవుని వదిలిపెట్టి పెదవి మూలలు నాకుతూ గుటగుట శబ్దం చేస్తూ వెనుదిరిగి చూస్తూ వెళ్లిపోయింది.
క. జుఱుజుఱుకని నెత్తురు వెలి
కుఱుకుచు రొదసేయ, నఱితి యొడపినె యూర్పుల్
పఱవ, మిడిగ్రుడ్ల వణఁకుచుఁ
గొఱప్రాణముతోడఁ దన్నుకొను నమ్మొదవున్
( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )
|
( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )
ఆవు గొంతునుండి రక్తం వెచ్చగా జుఱుకు జుఱుకు మను శభ్దంతో వుబికి వస్తూ ఉంది. గొంతులో తెగిన నాళాలనుండి దాని నిట్టూర్పు గాడ్పులు ప్రసరించడం తెలుస్తూనే ఉంది. ఇటువంటి దయనీయమైన స్థితిలో కళ్లు తేలవేసి కొనవూపిరితో కొట్టుకుంటుంది ఆ ఆవు.
ఇక ఆవు బతకదని నిశ్చయించుకొని, పశులకాపరులు వేళ్ళి రాజుకా వార్త విన్నవించారు. దీనికింక ప్రాయశ్చిత్తమేమిటని రాజు ఋత్విక్కులని అడిగాడు. వారు తమకి తెలియదని కసేరువన్న అతడిని అడగమన్నారు. కసేరువన్న అతను శునకుడన్న మరొకడిని అడగమని చెప్పాడు. తనకి కూడా తెలియదని, దీని గురించి చెప్పగలిగినవాడు ఒక్క ఖాండిక్యుడేనని, నీకు మంచిదనిపిస్తే వెళ్ళి అతడినే అడగమని చెపుతాడు శునకుడు.
చ. నరపతి పల్కె 'మౌని వర, నారిపు నిష్కృతి వేఁడఁబోయిన
న్ధర హతుఁ జేసెనేని సవనంపు ఫలం బొడఁగూడుఁ; గా కమ
త్సరగతిఁ జెప్పె నేని మఖతంత్ర మతంత్రముఁ గాక పూర్ణ మౌ
నిరుదెఱఁగు న్మదీప్సితమె, యేఁగెద'నంచు రథాధిరూఢుడై.
అప్పుడా శునకునితో కేశిధ్వజుడు ఇలా అన్నాడు, "మునివర్యా! అలాగే తప్పకుండా వెళ్ళి అడుగుతాను. ప్రాయశ్చితాన్ని అడగడానికి వెళ్లినప్పుడు నా శత్రువైన ఖాండిక్యుడు పూర్వ వైరంతో నన్ను చంపినచో యజ్ఞం మధ్యలో ప్రాణాలు వీడుటచేత యజ్ఞఫలము నాకే లభించును. లేదా మాత్సర్యాన్ని వదిలి ప్రాయశ్చితం చెప్పినచో యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తి అవుతుంది. కావున రెండు విధాలు నాకు లాభం చేకూరుస్తాయి. ఏది జరిగినా నాకు సమ్మతమే", అని చెప్పి రధమును ఎక్కి బయలుదేరాడు.
ఆనాటి రాజుల స్వభావాలు ఈ కథలో చాలా అందంగా చిత్రించబడ్డాయి. ఇక్కడ కేశిధ్వజుడు ప్రాణాలను పణంగా పెట్టి ఖాండిక్యుని దగ్గరకి వెళుతున్నాడు. అతనికి యజ్ఞం పూర్తికావాలన్న తపనే కాని ప్రాణభీతి లేదు. పైగా తనవల్ల అడవులు పట్టినవాడి దగ్గరకు వెళ్ళడం ఎంత సాహసం! "ఏగెదనంచు రథాధిరూఢుడై" - వెళతాను అంటూనే రథం ఎక్కేసాడన్న మాట. అంటే యాగాన్ని పూర్తి చెయ్యాలని అంత ఆతృత!
మరి తనని అడవులపాలు జేసిన కేశిధ్వజునికి ఖాండిక్యుడు ప్రాయశ్చిత్తాని చెప్పాడా లేదా ఏం చేసాడన్నది వచ్చే టపాల్లో చూద్దాం.
2 comments:
అతికష్టమ్మీద ఆడియోలు ప్లే అయి ఒక్కటి మాత్రం విన్నా .....నా నెట్వర్క్ ప్రాబ్లం అయ్యి ఉండవచ్చు....
విన్నదానిలో చిన్న సవరణ:
@ లంక గిరిధర్
వ్రాత: తత్ఖాండిక్యుఁ గేశిధ్వజన్
ఆడియో: తత్ఖాండిక్యుఁ గేశిధ్వజున్
వంశీగారు,, అది అచ్చుతప్పు సరిచేసాను. ధన్యవాదాలు. నాకు ఆడియో బానే వినిపిస్తుంది కదా. అన్నీ సరి చూసుకునే పెట్టాను. divshare వాడికి మాయరోగం వచ్చింది. అందుకే esnips లో పెట్టాను. వాడు బాగయ్యాక మళ్లీ మారుస్తాను..
Post a Comment