తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Tuesday, June 25, 2019

వసంతకాల వర్ణన

ఉ.నైపుణి జందనాద్రి గహనద్రుమ సౌరభ వీచి దామ్రప
ర్ణీ పరిలబ్ధ మౌక్తిక మణి ప్రకరంబులు దోచి దక్షిణా
శాప వనుండు సల్లు వెద జల్ల జనించెన కాక వీనికే
లా పొడమంగ నప్పొలప మప్పుడు నావని దోచె గ్రొన్ననల్ (5-114)

ఆ వసంత ఋతువులో సువాసన గల పూమొగ్గలు అంతటా ఆహ్లాద పరుస్తున్నాయి. చందన పర్వతం నుండి తామ్రపర్ణీ నది పుట్టింది. దక్షిణ వాయువూ పుట్టింది. దక్షిణ వాయువు తామ్రపర్ణీ నదిలోని ముత్యాలను చందన వాసనల ప్రవాహంలో నానబెట్టి అంతటా వెదజల్లిందట. కనుకనే మొగ్గలకు సువాసన వచ్చిందట. ఈ పద్యంలో వెదను చెప్పాడు. వెద రెండు రకాలు. చల్లు వెద. గొర్తి వెద. రైతులు భూమిని దున్ని విత్తనాలను చేతితో పొలంలో చల్లుతారు. ఇది చల్లు వెద. వెదజల్లడం. అలా కాకుండా గొర్తి అనే సాధనంతో విత్తనాలను భూమిలో పడేటట్టు వేస్తారు. చాళ్లలో లెక్క మీద పడి, మొలకెత్తుతాయి. అది గొర్తివెద. ఈ రోజుల్లో విత్తనశుద్ధికి అనేక ద్రావణాలలో నానబెట్టడం చూస్తున్నాం. పూర్వం కూడా అవసరం మేరకు ద్రావణాల్లో నానబెట్టడం ఉందని దీనిని బట్టి తెలుస్తోంది.

చ. తనయుదరంబునం బొడమి తామ్రరుచిచ్ఛట లుల్లసిల్లఁ గో
ల్కొను ధరణీజ సంతతికిఁ గోరకదంతము లించుకంత ని
క్కినయది యాదిగాఁగఁ జెలగెన్ వనలక్ష్మి గడుం జెలంగఁగాఁ 
జనుఁ బ్రియుఁడైన మాధవుని సంగతి మీఁదటఁ జాలఁ గల్గుటన్ (5-116)

వనలక్ష్మికి సంతోషం కలిగింది ఎందుకంటే తన కడుపున పుట్టిన వృక్షములనే సంతానానికి ఎర్రనెర్రని కాంతులు విరజిమ్ముతూ ఎదుగుతుంటే, వాటికి అప్పుడప్పుడే మొగ్గలు అనే పాలపండ్లు వస్తుంటే అప్పటినుండీ సంతోషం పెరిగిపోతున్నది ఎందుకంటారా ఇక ఆమెకు తన నాధుడైన మాధవునితో సంపర్కం కలుగబోతున్నది.కనుక ఆమెకు సంతోషం కలగడం సమంజసమే కదా! ఋతుపరంగా వసంతరుతువులో చెట్లూ చేమలూ చిగిర్చి, దిన దినాభివృద్ది చెందుతూ మొగ్గలు తొడిగి, ఫలించి పుష్పించి వసంతం పులకించి పోతున్నట్లుగా ఉంటుంది ప్రకృతి. ఆ తరువాత మాధవునితో, అంటే వైశాఖ మాసంతో కలయిక జరుగుతుంది, చిత్రం తరువాత వైశాఖం వస్తుంది. వసంతఋతువు వసంతలక్ష్మి అనే స్త్రీ గా మారింది. ఆమె సంతానం అయినటువంటి లతలకు, వృక్షాలకు తొడిగిన చివుళ్ళు పిల్లలకు వచ్చే పాలపండ్లు అయినాయి. ఇక్కడ రాయలవారు ఒక విశేషం చెప్తున్నాడు. స్త్రీపరంగా చూసినట్లైతే, స్త్రీ ప్రసవించి, ఆ శిశువు దినదినాభివృద్ది చెందడం ఒక సంతోష కారణం ఇంకా ఆ తరువాత పాలపండ్లురావడం యింకా సంతోషదాయకం అంటున్నాడు రసిక రాయలు. ఎందుకో తెలుసా! నెలలు ముదిరినదగ్గరినుండీ శిశువుకు పాలపండ్లు వచ్చేంతవరకూ దంపతులు మైథునంలో పాల్గొనకూడదు అని భారతీయ స్మృతిశాస్త్ర నిర్దేశం. యిక ఆ హద్దు చెరిగిపోయింది కనుక, విరహము తీరిపోతుంది. ఇక తరువాయి తన నాధుడు ఐన 'మాధవుని'తో కలయికకు తరుణం వచ్చింది అని వసంత'లక్ష్మి' అనే తల్లి, తరుణి   సంతోషపడుతున్నది అని చమత్కారంగా రాశారు రాయలవారు.

సీ.మును ననల్దమిఁ బట్టి ముంగాళ్ళ ముక్కుజో
డనలఁ బీలిచి పసర్కొనిన విడిచి
పరువంపువిరిగొందు లరసి చాలై త్రోవఁ
బెట్టి యీరము లీఁగు పిండుఁ దగిలి
క్రొవ్విరిఁ దొలుత నొక్కఁడు కని యది వ్రాలు
తరి దాని నిలబడఁ దాఁచి క్రోలి
యాకురాలుపుగండ్ల నానెడు నాస నిం
తడుగూది బం కంటి యంగలార్చి

తే.గీ.యెట్టకేలకు నొకఁ డబ్బఁ బొట్టనిండఁ
గ్రోలి యది గాలిఁ గదలినఁ గూలు నగుచు
బ్రమదవనపాలికలు వేడ్కఁ బట్ట నగుచు
మధుదినాది క్షుధాభ్రమన్మధుపచయము (5-117)

రాయలవారు ఎంత చమత్కారియో గమనించండి . గత ప్రబంధాలలో ఎందరో కవులు వసంతకాలంలోని  తరువులను, లతలను, పుష్పములను, స్త్రీపురుషుల విలాసాన్ని, కోకిల పాటలను వర్ణించార్రు. అలాగే  తుమ్మెదల ఝంకారాలను, మత్తగజఘీంకారాలను, మదవతుల మదనక్రీడాలంకారాలను, ప్రకృతిని స్త్రీపురుషులను గెలిచిన వసంతునిసేనల అహంకారాలను వర్ణించినవారు ఉన్నారు. కానీ, పనిగట్టుకుని కేవలం తుమ్మెదల దినచర్యను వర్ణించిన కవులు ఎవరూ లేరు. అది మన రాయలవారే! పైన పద్యం చూడండి రాయలవారు ఎంత రసరమ్యంగా చెప్పారో తెలుస్తుంది.

తుమ్మెదలు మొదట మొగ్గలను మోహంతో పట్టుకుని, ముంగాళ్ళతో అదిమిపట్టి, నాసికా రంధ్రాలతో తేనెను పీల్చి, అవి మొగ్గలు కనుక, కొద్దిగా పసరు, వగరు తగిలి వదిలిపెడుతాయి. అక్కడినుండి పక్వములైన పూలు ఉన్న గొందులు, సందులు వెతుక్కుంటూ గుంపులుగట్టి జోరున పొదలలో దూరి వెళ్తాయి. అక్కడ అదివరకే మధుపానం చేస్తున్న ఒక తుమ్మెదను చూస్తాయి. మధుపానాసక్తతతో, అంతకుముందు కొద్దిగా చేసిన మధుపానోత్సాహంతో ఆ తుమ్మెదను నిలబడకుండా తన్నివేసి, నేలమీద పడేసి, అక్కడినుండి తరిమేస్తాయి. ఆ  కొత్తగా పూర్తిగా విరిసిన పుష్పపు మధువును తాము త్రాగిపారేస్తాయి. యింకా ఆశ చావదు. ఆకలి తీరదు. తీగనుండి ఆకులు రాలిన చోట, పూలు రాలినచోట పడిన గండ్లు కనిపించి, అక్కడి తేనెను త్రాగుదామని వ్రాలి, ఆ ఆకులు, పూలు రాలినప్పుడు కొద్దిగా స్రవించే బంకగా ఉన్న పదార్ధ వాటి కాళ్ళకు అంటుకుని కాళ్ళు లాక్కోలేక, పీక్కోలేక తంటాలు పడుతాయి. సరే! ఎలాగోలా వదిలించుకుని బయటపడి, చివరికి యింకొక పుష్పం కంటబడి పొట్టనిండా దాని తేనెను త్రాగుతాయి. యిక వాటి పరిస్థితి ఏమిటి? వాటి శరీరాలు అదుపులో  లేనంత మత్తు వచ్చేస్తుంది. గాలికి  పూవు,  తీగె కొంచెం అటూ ఇటూ కదిలినా సరే మత్తుగా నేలమీదకు పడిపోతాయి, ఆ తోటలకు కావలిగా ఉండే తరుణులకు అవి తేలిగ్గా దొరికిపోతాయి. తుమ్మెదలను సరదాగా, ఆటకు పట్టుకునే పడతులకు చిక్కిపోతాయి. ఈ రకంగా వసంతఋతువు తొలి దినాన, ఆ రోజు మొదలుకొని 'తాగుబోతులైన' తుమ్మెదలు తిరుగుతుంటాయి. అప్పటి ఆ తుమ్మెదలే కాదు, యిప్పటి తుమ్మెదలూ మధుపానం కోసం యిలాగే తిరుగుతుంటాయి, రాయలవారు ఎంత్గ గమ్మత్తుగా గమనించి వ్రాశాడా అనిపిస్తుంది ఈ పద్యం.

Friday, May 17, 2019

గోదాదేవి వృత్తాంతము - 4

స్వామిని ఆముక్తమాల్యద అర్చనాదులతో గొలువనారంభించినది.

“వ. ఇత్తెఱంగున సకల కాలంబుల నారటంబునకు  నూరట గానకుండియు నప్పుండరీకాక్షి యందుండు నప్పుండరీకాక్షు నారాధనంబున నా రాధారమణుం గ్రమ్మర జెంద డెందంబునన్ దలంచి” (5-88)
ఆ పడతి అహోరాత్రములు పరితాపమునకు ఊరట పొందనిదై శ్రీవిల్లిపుత్తూరునందున్న శ్రీమహావిష్ణువును పూజచేయుచు ఆ స్వామిని పొందుటకు మనసులో తలచుకొని పూజోపచారములు జేయుచుండగా..

ఉ. కుందరదాగ్ర నెన్నొసల గుమ్మడిగింజ తెరంగు పాండు మృ
ద్బిందువుఁ దీర్చి చెందిరము పేచక శీర్షముపైఁ  బలె న్గటిం
జందుర కావిజీ బమరఁ  జల్లని రేయిటి తట్టుపున్గళు
ల్విందులఁ దేల నూనెముడి వెండ్రుకలం దడి తావు లీనగన్ (5-90)

ఆమె ప్రతి రోజూ కోవెలకు బయలుదేరే తీరు వర్ణిస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు. మల్లె మొగ్గల్లాంటి దంతములున్న ఆ సుందరి నుదుటిమీద గుమ్మడిగింజ ఆకారంలో తిరుమణి తిలకాన్ని పెట్టుకుంటుంది. ఎత్తైన విశాలమైన పిరుదులమీద సిందూరవర్ణ వల్కలాన్ని ధరిస్తుంది. అది చూడడానికి ఏనుగు కుంభస్థలం మీద సిందూరం పూత పూసినట్లు కనిపిస్తుంది. గతరాత్రి  అలముకున్న పరిమళ ద్రవ్యములసువాసనలకు తుమ్మెదలు శరీరానికి మూగుతుండగా, అంతకుముందు ఎప్పుడో రాసుకున్న నూనెవెంట్రుకలకు తడి అంటుకునీ, అంటుకొనక వింత  శోభలను చేకూరుస్తుంటాయి. అలా దురితలతాలవిత్రయై, విచిత్ర పవిత్ర పరిమళసముచ్చయంగా కోవెలకు బయలుదేరుతుంది. 
శ్రీహరిని భర్తగా పొందడం కోసం గోదాదేవి వ్రతం చేయడం ప్రారంభించింది. ఆ విధానాన్ని వర్ణన చేస్తున్నాడు రాయలవారు.

తే.బోటి గట్టిన చెంగల్వ పూవుటెత్తుఁ 
దరు పరిణ తోరుకదళిమంజరియుఁ గొనుడుఁ 
బోయి గుడి నంబి విజనంబుఁ జేయఁ జొచ్చి
మ్రొక్కి వేదికఁ బలువన్నె మ్రుగ్గు వెట్టి (5-91)

చెలికత్తె కట్టి ఇచ్చినటువంటి పెద్ద ఎర్రకలువల పూదండను, చెట్టుమీదే పండిన అరటిగెలను పట్టించుకుని పోయి, గుడిలో అర్చకుడు జనులనందరినీ పంపివేసిన తర్వాత  ఏకాంతంగా, ప్రశాంతంగా  కోవెలలోకి ప్రవేశించి, స్వామికి నమస్కరించి, వేదిక మీద రంగు రంగుల ముగ్గులు పెడుతుంది. జనులనందరినీ  పంపించి వేయడం అంటే వెళ్ళగొట్టడం కాదు, చిరు పూజలున్నవారిని వారి వారి పూజలు చేయించి పంపించి,  విశేష పూజలు అర్చనలు చేసేవారిని తర్వాత లోపలి రప్పించి వారి పూజలు నిర్వహించడం అని అర్ధం తీసుకోవాలి.

తే.గీ.కపిలగవిసర్పిఁ బృథు దీపకళికఁ దీర్చి    
ద్వయముతో వక్షమునఁ గల్వదండసేర్చి
యగరు ధూపంబు లిడి శర్కరాజ్య యుక్త
హృదయ కదళీఫలాళి నైవేద్యమిచ్చి (5-92)

కపిలధేనువు పాలను కాచి, వెన్నను తీసి కరిగించి చేసిన నేయితో పెద్ద దీపమును వెలిగించి, ద్వయమంత్రమును పఠిస్తూ స్వామి వక్షస్థలము మీద ఎర్రకలువల దండను అలంకరించి, అగరు పొడితో ధూపం ఇచ్చి, చక్కర, నేయి, అరటిపండ్లను నైవేద్యం పెడుతుంది.

కం.ఖండిత పూగీ నాగర
ఖండంబులు ఘన శశాంక ఖండంబులచే
హిండితములు గావించి య
ఖండస్థిరభక్తి నొసఁగి కదలి చెలులతోన్ (5-93)

కత్తిరించిన పోకచెక్కలు, సొంటిముక్కలు శ్రేష్ఠమైన కర్పూరపు తునుకలతో కలిపి అఖండమైన భక్తితో తాంబూలాన్ని స్వామికి సమర్పించి చెలికత్తెలతో కదలిపోతుంది.

చెలువ గర్భగృహ ప్రదక్షిణముఁ జేసి
వినతయై మౌళి శఠకోపమును ధరించి
చరణతీర్థముఁ గొని తత్ప్రసాద లబ్ధ
మయినమాల్యముఁ  దాల్చి గేహమునకరుగు (5-94)

ఆ సుందరి గర్భగృహానికి ప్రదక్షిణ జేసి, వినమ్రంగా శఠకోపమును తీసుకుని స్వామీ చరణతీర్థమును తీసుకుని  ఆ స్వామి ప్రసాదముగా అర్చకస్వామి ఇచ్చిన మాలను తీసుకుని ధరించి, యింటికి వెడుతుంది.

కం.ప్రతిదినము నిట్లు చని య
చ్యుత పూజ యొనర్చి వచ్చి సుదతి వియోగ
చ్యుతధైర్య యగుచు నయ్యదు
పతిగుణములు ద్రవిడభాషఁ బాడుచునుండున్ (5-95)


ప్రతిదినమూ యిలాగే కోవెలకు వెళ్లి అచ్యుతుని పూజ చేసి వచ్చి ఆమె వియోగ బాధచే సడలిన ధైర్యముతో  ఆ యాదవప్రభువు గుణములను, శ్రీకృష్ణుని గుణములను ద్రావిడ భాషలో పాడుతూ ఉంటుంది. యిలా ఆమె  ఆ ద్రావిడ భాషలో పాడిన పాటలే పాశురములు లేక తిరుప్పావై అంటారు. యిలా కేవలం రెండు ముక్కల్లో అమ్మవారి  దివ్యసారస్వతమైన తిరుప్పావైని లీలామాత్రంగా సూచించాడు శ్రీకృష్ణ దేవరాయలు. రాయలవారి  సర్వతంత్ర స్వతంత్ర సార్వభౌమ లక్షణానికి యిది ఒక ఉదాహరణ. ఎందుకంటే వేరే ఎవరైనా గోదాదేవి నాయికగా  ఉన్న కావ్యములో తిరుప్పావైని విస్తృతంగా ఉదాహరించకుండా ఉండడం అంటే భయపడేవారు, విమర్శలకు,  భక్తితో కూడా. కానీ యిది ఆధ్యాత్మిక గ్రంథం కాదు, ప్రబంధం. కనుక ప్రబంధ లక్షణాలకే ప్రాధాన్యతను ఇచ్చారు  రాయలవారు. యింతలో వసంత ఋతువు ప్రవేశించింది.

Sunday, March 31, 2019

గోదాదేవి వృత్తాంతము - 3

ఆ ఇందువదన సౌందర్యాన్ని అనేక పద్యములలో వివరించి రాయలవారు సరాసరి ఆమే దైనందిన కృత్యానికి వచ్చేశారు.
సీ. తమ తండ్రి శ్రీశ దత్త శ్రీలు గృహమున
ద్రవ్వి తండములయ్యు దనదు తొంటి
స్రగ్వి నిర్మాణ దాస్యంబ నుత్సేకత
జరపుచు బ్రజ్ఞ వైష్ణవ పురాణ
సంహితా వ్యాఖ్యారచన బ్రొద్దు గడుపుచు
గట్టెడు కమ్మ చెంగలువ విరుల
తోమాలె లలకలు దువ్వి కంతునకు నా
ర్ద్ర నిబద్ధ ఖేటకం బనగ నీల
తే.గీ. వృషక కుద్రేఖ నెడమకొక్కింత యొఱగ
నిడిన ధమిల్ల వలయంబు నడుగునందు
గొంతసేపర్ధి గీలించి కూపవారి
నీడ వీక్షించి క్రమ్మఱ గూడ నునుచు.

ఆ చంద్రవదన తన తండ్రియగు విష్ణుచిత్తుండు శ్రియ: పతి కృపవలన అధికమగు సంపదలు గలిగినను, గర్వింపక యధావిధి పుష్పమాలికా కైంకర్యము జేయుచు శ్రీ విష్ణుపురాణ వ్యాఖ్యానము చేత కాలక్షేపము జేయుచు, ఆయనకు సమకూర్చెడి చెంగలువ దండలను తాను కొప్పులో ధరించి నూతిలో నీడ చూచుకొని మరల వానిని బుట్టలో ఉంచెడిది. ఆమె కొప్పు ఎడమవైపుకు ఒరిగి ఉండెడిది.

. నవలా యలంతి పసుపాడి దుకూలము దాల్చి గుబ్బచన్
గోనల దావులుప్పతిల గుంకుమ తేటల నిగ్గు దేరగ
ప్రానన నాభి దీర్చి పితృబద్ధ లతాంతము లర్ధి గొప్పునం
బూని యొకింత సేపునిచిపుచ్చి చెలింగని వెచ్చ నూర్చుచున్.

ఆ యింతి పసుపుతోడి స్నానము చేసి తెల్లని వస్త్రములు ధరించి చనుగుబ్బలు పరిమళములు ఉదయించునట్లు, కుంకుమ కాంతుల యొక్క నిగారింపు కానరాగా కర్పూరము చేతనే తిరుమణిని తీర్చిదిద్ది, తండ్రియగు విష్ణుచిత్తుని చేత కట్టబడిన పుష్పములను కోరిక అతిశయించగా కొప్పున ధరియించి కొంచెంసేపు ఉంచుకొని మరల దీసి చెలికత్తెను జూచి ఉచ్ఛ్వసించును.

ఆమెకు శ్రీమహావిష్ణువుపై గలిగిన మోహం దాని వలన దాను పడుచున్న బాధలు వివరిస్తున్నాడు రాయలవారు.

.ఎఱుగరుగా యొకద్భుతము, నీ చెలి దీర్ఘిక దీర్ధమాడ నా
యఱుత దగిల్చి పోవుదన హారము వోయిన నేను బోవుదున్
మఱవక వెంట బోవ జలమగ్నత నౌ నది సున్నమైన దా
గఱకరి బెట్టి సొమ్మడుగు గాని నిజార్తి ఎరుంగదేమియున్

ఆమె విరహతాపముచేత గ్రాగుడు వలన శరీరమందలి ముక్తాహారములు పెటిలి యున్నాయనీ, ఆమె చెలికత్తెలతో స్నానమాడునపుడు నీటిలో మునుగగా విరిసి సున్నముగా మారెనని..అంత తాప మీమె భరించు చున్నదని చమత్కరిస్తున్నాడు రాయలవారు.
ఆయమ ఇట్లు దు:ఖింప సాగినది.

.అట్టి మురారి కప్పుడును గైమరి ఈకలి వేళ గ్రమ్మఱం
బుట్టి వియోగ వేదనల బొక్కెడు నీ తనువేల తండ్రి దా
నిట్టగు నన్ను నింకొకని కియ్యక తొల్తన యోగశక్తి బో
బెట్టెద దీని వెండియు నుపేంద్ర పదాంబురుహంబు పట్టెదన్

ఆమె శ్రీమహావిష్ణువును ప్రేమించి ఆయననే విహామాడవలెనని నిశ్చయించుకొన్నది. కానీ తన తండ్రి వేరే ఎవరికైనా ఇచ్చి తనకు వివాహము జరుపునేమో నని భయము గలుగుటచేత, యోగశక్తిచే ప్రాణములు విడచి ఆ త్రివిక్రముని పాదచరణముల వద్దకు చేరెదను అని చెప్పుచున్నది.
అని పలుకగా చెలికత్తెలు విని యామెతో నిట్లనిరి.

తే.గీ. అనిన వారలు పల్కి రాయదు వతంస
మెందు జన్నాడు విను రంగ మందె నిల్చె
వేగపాటేల? యతడ నీ విభుడగుటకు
నర్చనాదుల నివ్వీటి హరి భజింపు.


చెలికత్తెలు ఆమె ఎక్కడ ప్రాణత్యాగమొనరించునో అని భయపడి, నీ శ్రీకృష్ణుడెక్కడికినూ బోలేదు. శ్రీరంగమందే కొలువై యున్నాడు. కావున అతడు నీ భర్త కావలనంటే నీ ఊరిలో ఉన్నటువంటి వడపెరుంగోయిలుడయ నను స్వామిని పూజ, అర్చనాదులతో గొలువుమని చెప్పిరి.
Related Posts Plugin for WordPress, Blogger...