తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Sunday, February 26, 2012

ఆముక్తమాల్యద - చతుర్దాశ్వాసం

ఆముక్తమాల్యద తృతీయాశ్వాసంలో విష్ణుచిత్తుడు పండితులందరిని ఓడించి పాండ్యరాజుకు అష్టాక్షరీ మంత్ర పూర్వకంగా ద్వయమంత్రాన్ని ఉపదేశించి అతన్ని భాగవతోత్తముని చేశాడు. ఇక చతుర్ధాశ్వాసంలోకి ప్రవేశిద్దాం.

శ్రీ మందిర భుజమధ్యమ,
గోమండలకర్షి వేణుగుంభన, దృప్య
ద్భౌమాహృతసురజనయి
త్రీమణితాటంక! వృషగిరిస్థ! ఖగాంకా.!


( ఈ పద్యం భైరవభట్ల కామేశ్వర శర్మ స్వరంలో )

శ్రీమహాలక్ష్మికి నివాసమైన వక్షస్ధలం కలిగినవాడా! గోసమూహాన్ని ఆకర్షించే వేణువును పూరించేవాడా! దృప్యత్ అంటే అహంకరించిన. భౌముడంటే భూమి కుమారుడు నరకుడు. అహంకరించిన నరకుడినుండి దేవతామాత అయిన అదితి మణితాటంకాలను తిరిగి తీసుకొనివచ్చినవాడా! గరుడుని కేతనంగా ధరించిన వృషాద్రి నివాసా! అని చతుర్ధాశ్వాస ప్రారంభంలో మహావిష్ణువును ప్రార్ధిస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు.


. బలిమిం ద్రెంపఁగఁ బోలెఁ బాయవడుచుం బర్యాయభంగంబుగాఁ
గల నూలెల్లను నంటుమోవఁ దెగి రాగా, గొంతసే పుండి, తాఁ
బెలుచ న్గంటు పుటుక్కునం దునిసి వే పృధ్విం బడె న్జాలె, మి
న్నుల మ్రోసెన్ సురదుందుభుల్, గురిసె బెన్సోనై విరుల్బోరునన్.



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

విష్ణుచిత్తుడు పరతత్వ నిరూపణ చేయగానే అక్కడ రాజాస్థానంలో విద్యాశుల్కంగా వ్రేలాడగట్టిన వరహాలమూట ఎవరో బలవంతంగా త్రెంచినట్టుగా ఒక్కొక్క పాయ విడిపోయాయి. ఆ అంటుదారం అంచు వరకు కొద్దిసేపు ఊగిసలాడి అదే తెగిపోవడంతో దానికి కట్టిన వరహాలమూట జారి క్రిందపడింది. అది చూసిన దేవతలు సంతోషంగా దుందుభులు మ్రోగించి పుష్పవర్షం కురిపించారు. "బలిమిన్ ద్రెంపఁగఁ బోలె" అనడంలో ఏదో అదృశ్యశక్తి చేత అలా జరిగిందని ధ్వనిస్తోంది. జాగ్రత్తగా గమనిస్తే, ఈ వర్ణనలో, భవబంధాలు ఒకొటొకటీ తెగి జీవుడు మోక్షాన్ని పొందే విధానం స్ఫురిస్తుంది. విష్ణుభక్తే ఆ అదృశ్యశక్తి. విష్ణుచిత్తుని ఉపదేశాన్ని పొందిన పాండ్యరాజుకి అతను కోరుకున్న ముక్తి లభించిందనే ధ్వని ఇందులో ఉంది.


ఈ విధంగా విష్ణుచిత్తుడు పాండ్యరాజు కొలువులోని పండితులను జయించి వేదవేద్యమైన విష్ణుతత్త్వాన్ని రాజుకు తెలియజెప్పి భగవంతునికి శరణాగతిచేసి లోకానికి హితం కూర్చాడు.

శా. అద్ధా వాగ్విబుధం, బహోవచన కవ్యాహార, మాహావచ
స్సిద్ధం, బాః కృతతాం గతః కలి రితి శ్రీసూక్తి విద్యాధరం,
బిద్ధౌద్ధత్య మగాల్లయం హి కుధియా మిత్థంవద త్కిన్నరం,
బద్ధీరాగ్రణి గెల్పుటుత్సవమునం దయ్యెన్ నభం బంతయున్

( ఈ పద్యం రాఘవ స్వరంలో - రాగం హిందోళం )


ఆ ధీరాగ్రణి విష్ణుచిత్తుని గెల్పుటుత్సవము చూసి, ఆకాశంలో ఉన్న దేవతలు "అద్ధా!" అన్నారు. పితృదేవతలు "అహో" అని, సిద్ధులు "ఆహా" అని మెచ్చుకున్నారు. విద్యాధరులు "ఆహ్! కలియుగం కృతయుగం అయినట్టుగా ఉంది" అన్నారు. కుత్సితమైన బుద్ధి గలవారి గర్వమణిగిందని కిన్నెరులు మెచ్చుకుని సంతోషించారు.


ఈ పద్యంలో మొదటి మూడు పాదాలూ పూర్తిగా సంస్కృతం. ఇది రాయలు తన సంస్కృత పాండిత్యాన్ని ప్రదర్శించడానికి చేసిన రచన కాదు. ఇక్కడ విష్ణుచిత్తుని విజయాన్ని చూసి మెచ్చుకొన్నవారెవరు? దేవతలు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, కిన్నరులు. వీరందరూ గీర్వాణులు. అందువల్ల, వారు పొందిన ఆశ్చర్యానుభూతిని వారి భాషలో ప్రకటించడమే చాలా ఉచితం. ఉచితజ్ఞుడైన కవి కాబట్టే రాయలవారు అలా వర్ణించారు.


పాండ్యరాజు విష్ణుచిత్తుని రత్నాలు, ఆభరణాలు, పట్టువస్త్రాలతో సత్కరించి, అటుపిమ్మట ఊరేగించడానికి గజారూఢుని చేసాడు. రాకుమారులను పిలిచి ఈ మహాత్ముని ఊరేగించి విల్లిపుత్తూరు చేర్పించి రమ్మని పంపాడు.

. ఇంగిలికంబునం దడిపి యెత్తు కసీసపు రెంటెమో యనన్
నింగి గరుత్ప్రంపరల నిగ్గున లేఁదొగ రెక్కె; నంత వీ
చెం గలశాబ్ధిమీఁగడల జి డ్డెఱిఁగించెడు కమ్మగాడ్పు; నిం
డెం గడు మ్రోఁత; పెన్దిరువడిం గని రా ఖగరాజు మూఁపునన్.


( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో )

విష్ణుచిత్తుని గజారూఢుని చేసి మంగళవాద్యాలు, స్తోత్రాలు, రకరకాల వాద్యలతో ఘనంగా ఊరేగిస్తూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. ఎఱ్ఱని ఇంగిలీకంలో ముంచి తీస్తున్న నల్లని నేత వస్త్రమో అన్నట్టుగా నీలాకాశం గరుత్మంతుని రెక్కల కాంతితో ఎరుపెక్కింది. క్షీరసాగరపు పాలమీగడల జిడ్డు వాసనలతో కూడిన కమ్మని గాలులు వీచాయి. అంతలోనే గరుత్మంతుని రెక్కల సవ్వడి వినిపించింది. గరుత్మంతుడు కనిపించాడు. ఆతని వీపుమీద వేంచేసిన విష్ణుమూర్తి సాక్షాత్కరించాడు. ఇది ఒక ఉదాత్త రమణీయమైన వర్ణన. ముందుగా ఱెక్కల కాంతి, ఆపై పాలమీగడల వాసన, ఆ తర్వాత రెక్కల మ్రోత, చివరగా రూపం - యిలా చక్కని సహజ క్రమంలో మనోహరంగా సాగిన వర్ణన రాయల కవితాశక్తికి ఒక మచ్చు తునక. ద్రవిడ భాషలో "అడి" అంటే పాదమని అర్థం. తెలుగులో "అడుగు" అన్న మాటకి మూలం అదే. పెన్+తిరు+అడి = పెందిరువడి, అంటే పూజ్యపాదులలో పెద్దవాడు అని. గరుత్మంతుని పెందిరువడి అంటారు.

సీ. చివురుబొట్లపుదోయి జెందమ్ము లనఁ దార్క్ష్య
హస్తోదరముల దివ్యాంఘ్ర లమర
నునుఁగప్పుమేనఁ దోఁచిన తదూర్ధ్వచ్చాయ
లీలఁ దాల్చుపసిండిచేల మెఱయ
వ్రాలిన యోగివర్గము నిర్మలాంతఃక
రణములువోలె హారములు దనర,
సిరికిఁ బుట్టింటినెచ్చెలు లౌట మనవికి
డాసె నా మకరకుండలము లమర

శ్రిత సితచ్ఛద వాత్యాభిహత పరాగ
వలయమండిత కల్పశాఖలొ యనంగ
శంఖచక్రాంచితోరుహస్తములు దనర
దోచె గమలేక్షణుండు చతుర్భుజుండు

( ఈ పద్యం రాఘవ స్వరంలో - రాగం పూర్వీ కళ్యాణి )

భక్తునికొరకు దివినుండి భువికి దిగివచ్చిన శ్రీహరి ముగ్ధమోహనమైన రూపంతో అలరించాడు. ఆ రూపాన్ని రాయలవారీ పద్యంలో వర్ణిస్తున్నారు.

గరుత్మంతుని రెక్కల మధ్య స్వామి దివ్యాంఘ్రులున్నాయి. అవి రెండు చిగురాకు పొట్లాలలో ఉన్న ఎర్రని తామరపువ్వుల్లాగా ఉన్నాయట! ఎంత మనోజ్ఞమైన ఉపమానం! స్వామివారి పాదాలు పద్మాలు. గరుడుని కెంజాయ ఱెక్కలు చిగురాకులు. తామరపూవులను చిగురాకులెంత మృదులంగా పొదువుకుంటాయో స్వామి పాదాలని గరుత్మంతుని గరుత్తులు అలా పొదువుకున్నాయి. స్వామి దేహం స్నిగ్ధ నీలవర్ణం, దాని చుట్టుకొని పీతాంబరమున్నది. అది ఎలా ఉందంటే, గరుత్మంతుని బంగారు శరీరచ్చాయ పైకి ప్రసరించినదేమో అన్నట్టుగా ఉందట! స్వామి మెడలో ముత్యాలహారాలు వ్రేలాడుతున్నాయి. నిరతము తనను ధ్యానించే యోగివర్యుల నిష్కళంకములైన అంతఃకరణములవలె (మనోబుద్ధి చిత్తాహంకారాలు ) ప్రకాశిస్తున్నాయట అవి! ఇదెంతటి ఔచితీమంతమైన పోలిక! యోగుల అంతఃకరణములు పరమ స్వచ్ఛములు. స్వచ్ఛత్వానికి ప్రతీక తెలుపు. అంతే కాదు, అవి పారదర్శకములు, ప్రకాశవంతములు. ముత్యాలు కూడా అంతే కదా! స్వచ్ఛమైన ఆ యోగుల అంతఃకరణములు స్వామివారి హృదయానికి అత్యంత సమీపములు. స్వామి చెవులకు మకరకుండలాలున్నాయి. అవి మహావిష్ణువు ధర్మపత్ని సిరికి పుట్టింటి చెలికత్తెలు కావడంతో చనువుకొద్ది ఆయనతో ఏదో మనవిచేసుకోడానికి దగ్గరకి వచ్చినట్టుగా ఉన్నాయట. కమలేక్షణుడైన స్వామి చతుర్భుజుడై దర్శనమిచ్చాడు. ఆ చేతులలో శంఖ చక్రాలు అమరి ఉన్నాయి. ఆ చేతులు కల్పవృక్ష శాఖలు. ఒక కొమ్మమీద తెల్లని హంస వాలినట్టుగా ఒక చేతిలో శంఖమున్నది. పూల పుప్పొడి సుడిగాలికి లేచి వలయంగా ఏర్పడినట్టుగా మరొక చేతిలో చక్రం అలరారుతోంది. ఆ స్వామి భక్తుల పాలిట కల్పతరువు!


తే. సమ్మద దిదృక్షు ఖస్థ రక్షః పిశాచ
పుంజ మహిభుక్పతత్త్ర ప్రభంజనములు
సోఁకఁ వెఱఁ బాఱెఁ కళ్లాన శూర్పవాత
ఘట్టనలఁ బాఱు పెనుఁబొల్లకట్టు వోలె.


( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో )

దేవతలతో పాటు రాక్షసులు, పిశాచగణాలు కూడా ఆకాశంలో నిలుచుని విష్ణుచిత్తుని ఊరేగింపును, వైభవాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు . ఎప్పుడైతే నాగాంతకుడైన గరుత్మంతుని రెక్కల తీవ్రవాయువులు వచ్చి తాకినవో వారు భయపడి పారిపోయారు. ఎలాగంటే కళ్లంలోని ధాన్యం మీద చేటలతో విసరగానే దానిపై పొట్టు ఎగిరిపోయినట్టుగా చెల్లాచెదరైపోయారు. దేవతలు మాత్రం నిలిచి స్వామికి వినయంగా నమస్కరించారు. శూర్పము అంటే చేట. ఇది కర్షకవృత్తినుండి గ్రహించబడ్డ సొగసైన పోలిక. రాయలవారికి దేశీయ జీవనమ్మీద ఉన్న మక్కువకి యిదొక తార్కాణం.


తే. అట్లు ప్రత్యక్షమైనపద్మాక్షు నంత
రిక్షమునఁ గాంచి ముని ప్రమోదాక్షిజలము
నిగుడఁ బులకించి, కరటిఘంటికలె తాళ
ములుగ నిట్లని యమ్మహాత్ముని నుతించె.


( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

విష్ణుచిత్తుడు ఆకాశంలో తనకోసం ప్రత్యక్షమైన పద్మాక్షుడిని చూసి నిలువెల్లా పులకించిపోయాడు. కళ్ళనుండి ఆనందబాష్ఫాలు ఉబికిరాగా, తాను ఊరేగుతున్న ఏనుగుకు కట్టిన గంటల మ్రోతలే తాళధ్వనులుగా ఆ స్వామిని స్తుతించాడు. ఇప్పటికీ మధుర మీనాక్షి గుడి కెదురుగా దగ్గరలో విష్ణువు కోవెల ఉంది. అది ఎక్కడ స్వామి విష్ణుచిత్తునికి సాక్షాత్కరించాడో, ఆ చతుష్పథంలో గుర్తుగా రాజు నిర్మించాడట. విష్ణు సాక్షాత్కారమైన సందర్భంలో విష్ణుచిత్తుడు పరమానందంతో ఆ భగవంతుని సౌందర్యాన్ని తనివితీరా వర్ణిస్తూ, ఆయనకు దృష్టిదోషం తగలకుండుగాక అని "తిరుప్పల్లండు" అని తమిళ భాషలో స్త్రోత్రాగుచ్ఛాన్ని రచించాడు. అయితే ఈ కావ్యంలో రాయలవారు వాటిని అనువదించక, స్వతంత్రమైన దశావతార వర్ణన చేసారు. ఆ వర్ణన వచ్చే టపాలో చూద్దాం.

Sunday, January 22, 2012

తృతీయాశ్వాసం - సింహావలోకనం


ఆముక్తమాల్యద మూడాశ్వాసాలు పూర్తిచేసుకున్నాం. మొదటి రెండు ఆశ్వాసాలలో ఎక్కువ భాగం వర్ణనలు, ప్రధాన పాత్రల పరిచయాలు జరిగాయి. రెండవ ఆశ్వాసం చివరలో కథలోకి ప్రవేశించాం. ఒక పండితుని శ్లోకం విన్న పాండ్యరాజుకి వైరాగ్యభావం అంకురిస్తుంది. పండితులందరినీ సమావేశపరచి పరమాత్మ తత్త్వాన్ని గురించిన శాస్త్రచర్చ మొదలుపెడతాడు. ఎవరి వాదాలు వారు వినిపిస్తూ చర్చించుకుంటూ ఉంటారు. విష్ణుచిత్తునికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై, పాండ్యరాజు సభకి వెళ్ళి అక్కడ శ్రీవైష్ణవాన్ని స్థాపించమని పురమాయిస్తాడు. విష్ణుచిత్తుడు పాండ్యరాజ సభలో చేసిన వాదము, విశిష్టాద్వైత మతస్థాపనం తృతీయాశ్వాసం. అందులో భాగంగానే ఖాండిక్య కేశిధ్వజుల కథ వచ్చింది. ఇదీ, స్థూలంగా యిప్పటి వరకూ జరిగిన కథ.

ఈ మూడవ ఆశ్వాసం బాగా అర్థం కావాలంటే, భారతీయ తత్త్వచింతన గురించి కొద్దిపాటి పరిచయం అవసరం. భారతీయ తత్త్వచింతనకి మూలాలు వేదాలలోనే కనిపిస్తాయి. వేదాలు నాలుగన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే, ఋగ్యజుస్సామాధర్వణ వేదాలు. వేదానికి నాలుగు విభాగాలున్నాయి - సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు. ప్రాచీన జీవనవిధానంలో నాలుగు ఆశ్రమాలు కూడా ఉన్నాయి. అవి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాసాలు. వేదంలో ఒకో విభాగమూ ఒకో ఆశ్రమానికి ఉపయోగపడేదని భావించవచ్చు. సంహిత మంత్ర సముదాయం. బ్రహ్మచారులకు పఠన ప్రధానమైన కర్మ. కాబట్టి వారికి ప్రధానం సంహిత, అందులోని వేదమంత్రాల పఠనం. సంహితలోని మంత్రాలను వివరించేవి బ్రాహ్మణాలు. ఇవి మంత్రార్థాలను వివరిస్తూ యజ్ఞయాగాదులను ఎలా నిర్వహించాలో విశదపరుస్తాయి. వీటిని ఆసక్తికరంగా వివరించడానికి కథలు ఉపాఖ్యానాలు కూడా వీటిలో ఉంటాయి. యజ్ఞయాగాదులను చేసే అధికారం గృహస్థాశ్రమవాసులకే ఉంది. కాబట్టి బ్రాహ్మణాలు వారికి ఉపయోగపడేవి. ఆరణ్యకాలు వానప్రస్థ ఆశ్రమవాసులకి ఉపయోగపడేవి. ఆరణ్యకమంటే అరణ్య సంబంధమైనది. అంటే వానప్రస్థ ఆశ్రమం స్వీకరించి అడవులలో నివసించేవారు ఆలోచించవలసిన విషయాలు ఆరణ్యకాలలో ఉంటాయి. యజ్ఞయాగాదుల గురించిన తాత్త్విక విశ్లేషణ వీటిలో కనిపిస్తుంది. బ్రాహ్మణాలలో కర్మ ప్రధానమయితే, ఆరణ్యకాలలో ఉపాసన ప్రధానం. చివరిదైన ఉపనిషత్తు జ్ఞాన ప్రధానం. వేదాలలోని తత్త్వ చింతనాసారం మనకి ఉపనిషత్తులలో కనిపిస్తుంది. సన్న్యాసాశ్రమవాసులకు జ్ఞానచింతన ఒక్కటే ప్రధానం కాబట్టి వారికి ఎక్కువగా ఉపయోగపడేవి ఉపనిషత్తులు. వేదాలని సరిగా చదవడానికీ, అందులో చెప్పిన యజ్ఞయాగాది కర్మలను సరిగ్గా ఆచరించడానికీ, వేదాలలోని తత్త్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోడానికీ వేదాంగాలు ఏర్పడ్డాయి. అవి శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము.

తత్త్వచింతన మూలాలు వేదాలలో (ముఖ్యంగా ఉపనిషత్తులలో) కనిపించినా, అది విస్తృతి చెంది గొప్ప సైద్ధాంతిక రూపాన్ని పొందినది మాత్రం షడ్దర్శనాలలో. మూడు జంటలుగా ఉన్న ఆరు దర్శనాలు. ఇవి సాంఖ్యము-యోగము, న్యాయము-వైశేషికము, మీమాంస-వేదాంతము. ప్రతి దర్శనాన్ని గురించి వివరించడం యిక్కడ సాధ్యమయ్యే పని కాదు. దీని గురించి తెలుగులో సులువుగా అర్థమయ్యేట్టు నండూరి రామమోహనరావుగారు తన "విశ్వదర్శనం - భారతీయ చింతన" పుస్తకంలో వివరించారు. ఆసక్తి ఉన్నవారు వీటిని పరిచయం చేసుకోడానికి ఆ పుస్తకం చదవవచ్చు. అయితే యీ దర్శనాల గురించి తెలుసుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలు మాత్రం యిప్పుడు ప్రస్తావిస్తాను. మొదటగా, యీ దర్శనాలు ఆరూ కూడా వేదాలను ఆధారంగా చేసుకొని నిర్మించబడ్డవే! కాని వాటి సిద్ధాంతాల మధ్య మౌలికంగా ఎన్నెన్నో తేడాలు. ఇవి ముఖ్యంగా వాటి దృక్పథాల మధ్య భేదం వల్ల ఏర్పడ్డాయి. కొన్ని బ్రాహ్మణాలలోని కర్మకి ప్రాధాన్యమిస్తే, కొన్ని ఉపనిస్థత్తులలోని జ్ఞానాకి ప్రాధాన్యమిచ్చాయి. దర్శనాలనగానే యివేవో దేవుడు, ఆత్మ లాంటి అంతుబట్టని విషయాల గురించి మాత్రమే విచారిస్తాయని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. వీటి ముఖ్యోద్దేశం సత్యాన్వేషణ. ఆ అన్వేషణ, కనిపించే యీ సృష్టినుండే మొదలవుతుంది. ఒక శాస్త్రీయ పద్ధతిలో సాగుతుంది. దీనికి మనిషే కేంద్రం. పదార్థ తత్త్వం, వాటి గుణాలు, సంబంధాలు (దీనినే ఇంగ్లీషులో Ontology అంటారు) మొదలుకొని, అసలు జ్ఞానమంటే ఏమిటి, జ్ఞానాన్ని ఎలా సముపార్జిస్తాము, దానికవసరమయ్యే సాధనాలేమిటి (దీనినే ఇంగ్లీషులో Epistemology అంటారు), తర్కశాస్త్రం (Logic) మొదలైన ఎన్నో తత్త్వశాస్త్ర సంబంధమైన అంశాలకు పటిష్ఠమైన రూపకల్పన మనకీ దర్శనాలలో దర్శనమిస్తుంది. వీటి ఆధారంగానే జీవ తత్త్వాన్నీ, సృష్టి విధానాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం కనిపిస్తుంది. ఉదాహరణకి, హేతుబద్ధమైన తర్కవాదంలో ఉండే అవయవాలేమిటో న్యాయ దర్శనం చాలా స్పష్టంగా చెపుతుంది. అవి ప్రతిజ్ఞ (Statement), హేతువు (Reason), ఉదాహరణ (example), ఉపనయం (analogy), నిగమనం (conclusion). తర్కాన్ని గురించి ఎంత పకడ్బందీ ఆలోచనో చూసారా! ఇదే కాదు అసలు తర్కమంటే ఏమిటి, వాదం అంటే ఏమిటి, వాదాలలో ఎన్ని రకాలున్నాయి మొదలైనవాటిని చాలా స్పష్టంగా సూత్రీకరిస్తుంది న్యాయ దర్శనం. విష్ణుచిత్తుడు పాండ్యరాజు సభలో చేసిన వాదనాపద్ధతికి మూలం మనకీ న్యాయదర్శనంలోనే కనిపిస్తుంది. సందర్భం వచ్చింది కాబట్టి, చిన్న గమ్మత్తైన విషయం. మనం "చలోక్తి" అంటూ ఉంటాం కదా. చమత్కారమైన మాట అన్న ఉద్దేశంలో వాడుతాం. ఇదెలా వచ్చిందో తెలుసా? "ఛలము" అన్నది న్యాయదర్శనంలో చెప్పిన ఒక రకమైన వాదం. వాది ఒక అర్థంలో ఒక మాటని ఉపయోగిస్తే, ఆ మాటకి ఉన్న మరొక అర్థాన్ని తీసి వాదిని హేళన చేసి ఖండించడాన్ని "ఛలము" అంటారు!

షడ్దర్శనాలలో మీమాంస-వేదాంత ద్వయాన్నే పూర్వమీమాంస-ఉత్తరమీమాంస అనికూడా అంటారు. పూర్వమీమాంస మంత్ర-బ్రాహ్మణాలు ప్రధానంగా కర్మ గురించి ఎక్కువ విచారిస్తుంది. ఉత్తరమీమాంస లేదా వేదాంతదర్శనం ఉపనిషత్తుల ఆధారంగా జ్ఞానవిచారం చేస్తుంది. ప్రతి దర్శనమూ కొన్ని సూత్రాలలో నిబద్ధింపబడింది. వేదాంతదర్శనం "అథాతో బ్రహ్మ జిజ్ఞాస" అన్న సూత్రంతో మొదలవుతుంది. అంటే - ఇప్పుడు బ్రహ్మమును గురించిన జిజ్ఞాస మొదలవుతుంది - అని. వేదాంతదర్శన సూత్రాలకే "బ్రహ్మసూత్రాలు" అని పేరు. వీటిలో ప్రధానంగా బ్రహ్మ, జీవుడు, జగత్తు మొదలైన విషయాల గురించి మీమాంస జరుగుతుంది. తమాషా ఏమిటంటే, సూత్రాలేవైనా, చెప్పే విషయాన్ని చాలా సూక్ష్మంగా చెపుతాయి. అందుచేత అవి అర్థం కావాలంటే వాటికి వివరణ అవసరమవుతుంది. సూత్రాలకు చెప్పే వివరణనే భాష్యమంటారు. సూత్రాలు చాలా సంక్షిప్తంగా ఉంటాయి కాబట్టి వాటికి రకరకాల అన్వయాలు, వివరణలు ఉండే ఆస్కారముంటుంది. దానివల్ల ఒకే సూత్రసమామ్నాయానికి అనేక భాష్యాలు ఏర్పడే అవకాశముంది. బ్రహ్మసూత్రాల విషయంలో సరిగ్గా అదే జరిగింది! ఆదిశంకరులు బ్రహ్మసూత్రాలకు మొట్టమొదట భాష్యం వ్రాసారు. తాను ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంత పరంగా ఉంటుందీ భాష్యం. దీని పేరు శారీరకభాష్యం. అలాగే ఆ తర్వాతి కాలంలో వచ్చిన రామానుజాచార్యులు తాము ప్రతిపాదించిన విశిష్టాద్వైత సిద్ధాంత పరంగా శ్రీభాష్యం వ్రాసారు. ఇలా మధ్వ, నింబక, వల్లభ, భాస్కర మొదలైన ఎందరో ఆచార్యులు వారివారి సిద్ధాంతాలకు అనుగుణంగా బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాసారు.

భారతీయ తత్త్వ చింతన గురించి చెప్పుకొనేటప్పుడు చార్వాక, బౌద్ధ, జైన దర్శనాల గురించి చెప్పుకోకపోతే అది సంపూర్ణం కాదు. వీటిని "నాస్తిక" దర్శనాలు అంటారు. ఇక్కడ "నాస్తిక" అనే పదానికి ఇప్పుడున్న "దేవుడు లేడనడం" అనే అర్థం కాదు. నాస్తికత్వం అంటే వేదాలను, వేద ప్రమాణాన్ని అంగీకరించకపోవడం. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించే సాంఖ్యం మొదలైన కొన్ని దర్శనాలు కూడా సృష్టిస్థితిలయకారకుడైన "ఈశ్వరుడిని" అంగీకరించవు! ఈ తేడా గమనించడం ముఖ్యం. వేద ప్రమాణాన్ని అంగీకరించని దర్శనాలు కూడా ఎన్నో ప్రాచీనకాలంలో మనకుండేవి. అందులో బాగా ప్రసిద్ధి పొందినవి పైన చెప్పిన మూడు. ఈ సిద్ధాంతాలలో మళ్ళీ చాలా విభేదాలున్నాయి.

విష్ణుచిత్తుడు పాండ్యరాజు కొలువులో చేసిన వాదనకి ఆధారం రామానుజాచార్యులు బ్రహ్మసూత్రాలకు వ్రాసిన భాష్యం. దాని ఆధారంగానే విష్ణుచిత్తుడు సాంఖ్యము మొదలైన ఆస్తిక దర్శనాలను, చార్వాకము బౌద్ధము మొదలైన నాస్తిక దర్శనాలను, ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతాన్ని ఖండిస్తాడు.

ఇక యీ ఆశ్వాసంలో రెండో భాగానికి వస్తే, అది ఖాండిక్య-కేశిధ్వజుల కథ. రాయలువారీ కథని ఎందుకు చెప్పారు? విష్ణుస్వరూపం గురించిన జ్ఞానబోధ, విష్ణుచిత్తుడు పాండ్యరాజుకు నేరుగా చెయ్యకుండా కథ ద్వారా ఎందుకు చెప్పాడు? మొదలైన ప్రశ్నలు వేసుకోవాలి. దీనికి రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి, విష్ణుచిత్తుడు ఆచార్యుడు కాదు. కేవలం భక్తుడు. అటు పిమ్మట, విష్ణువు ఆజ్ఞచే ఆ సభలో వాదం చెయ్యడానికి వచ్చినవాడు. అంతే. అందువల్ల అతడు నేరుగా పాండ్యరాజుకి వైష్ణవమతాన్ని బోధించే స్థితిలో లేడు. కాబట్టి అలా కథ ద్వారా చెప్పడమే ఉచితం. ఇక రెండవ కారణం తెలుసుకోవాలంటే భారతీయ వాఙ్మయంలో మరొక కోణాన్ని చూడాలి. వేదాలు, దర్శనాలు, వాటి భాష్యాలు, శాస్త్రాలు మొదలైనవన్నీ ఒక కోవకు చెందినవి. ఇవి ప్రధానంగా బౌద్ధికమైనవి. అంటే కాస్త గట్టిబుఱ్ఱ ఉన్నవాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలవి. సామాన్యులు వీటిని వంటపట్టించుకోవడం చాలా కష్టం. వారికోసం వెలసినవే పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు మొదలైనవి. భారతీయ తత్త్వ సారాన్ని యివి కథల రూపంలో మనకందిస్తాయి. అందుకే అవి సామాన్యజనులకు కూడా ఆసక్తికరంగా ఉండి సులువుగా వారి హృదయాలకు హత్తుకుంటాయి. ఇక్కడ విష్ణుచిత్తుడు ఉపయోగించిన ప్రణాళిక యిదే. పండితులతో అయితే శాస్త్రపద్ధతిలో బ్రహ్మసూత్రాల ఆధారంగా చర్చ జరిపి వారి వాదాలను ఖండించాడు. కాని రాజుగారు తనకి మోక్షాన్ని పొందే మార్గాన్ని ఉపదేశించమన్నప్పుడు, దానికోసం కథని ఆశ్రయించాడు. ఇది విష్ణుచిత్తునికి (రాయలవారికి) భారతీయ వాఙ్మయం గురించిన పరిపూర్ణ జ్ఞానానికి నిదర్శనం. కథల ద్వారా అనేక విషయాలను చెప్పవచ్చు. ఉదాహరణకి ఖాండిక్య-కేశిధ్వజుల కథలో మనకి తెలిసేది విష్ణుతత్త్వాన్ని గురించి మాత్రమే కాదు. రాజనీతి, ధర్మాధర్మాలు, కర్మ-జ్ఞాన మార్గాల మధ్యనున్న భేదము, యిలా అనేక విషయాలు మనకీ కథలో అంతర్లీనంగా గోచరిస్తాయి. వీటన్నిటినీ ఆసక్తికలిగే సంవిధానంతో పాఠకులముందు (శ్రోతలముందు) ఉంచినప్పుడు అవి వారి మనసుకి బాగా హత్తుకొనే అవకాశం కలుగుతుంది. కథవల్ల ఉపయోగమిది. ఆ ఒడుపు తెలిసినవాడు కాబట్టే రాయలు ఖాండిక్య-కేశిధ్వజుల వృత్తాంతాన్ని యీ ఆశ్వాసంలో నిబంధించాడు.

ఆముక్తమాల్యదలో ఒక ప్రధానఘట్ట మీ తృతీయాశ్వాసంతో ముగిసింది. అసలు కథలోకి ప్రవేశించే ముందు ఒక మెట్టెక్కామన్న మాట! చతుర్థాశ్వాసంలో మళ్ళీ యిలాంటి కథే యింకొకటి యింకొక కోణంలో చూడబోతున్నాం. ఆ మెట్టుకూడా ఎక్కితే అప్పుడు అసలు కథలోకి ప్రవేశిస్తాం. "అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ" అని ఊరికే అన్నారా మరి! :-)

Tuesday, December 13, 2011

తృతీయాశ్వాసాంతము

ఖాండిక్యుని కోరిక మేరకు కేశిధ్వజుడు అతనికి బ్రహ్మవిద్యని బోధిస్తాడు. అతడు బోధించిన ఆ విద్యని స్థాలీపులాక న్యాయంగా ఇప్పుడు చూద్దాం. మొదటగా అవిద్య గురించి చెపుతున్నాడు.

ఆ. ఆత్మకాని మేన నాత్మబుద్ధియును న
స్వంబునందు మిగుల స్వత్వమతియు
నవనివర, యవిద్య యను మహాతరువు ను
త్పత్తి కీద్వయంబు విత్తు మొదలు



( ఈ పద్యం రాఘవ స్వరంలో- రాగం సరస్వతి)


రాజా! అజ్ఞానమనే మహావృక్షము ఉత్పత్తికి ఆధారమైన బీజంలో రెండు దళాలున్నాయి. ఆత్మ కాని శరీరం మీద ఆత్మ అనే భావన ఒక దళం, తనది కాని దానిపై తనది అనే ఆలోచన రెండవ దళం.
ఈ పద్యానికి విష్ణుపురాణంలోని ఈ శ్లోకం మూలం:

అనాత్మన్యాత్మబుద్ధిః య అస్వేస్వమితి యా మతిః
అవిద్యాతరు సంభూతి బీజ మేతద్ద్విధా స్థితిం

ఇంకా అవిద్య గురించి యిలా చెపుతాడు. పంచభూతాలకంటే అతీతమై వెలుగుతున్న ఆత్మ వేరే ఉండగా శరీరమే ఆత్మ అనుకోవడం మూర్ఖత్వం. గృహము కళత్రము మొదలైనవి దేహం చేత అనుభవింపబడేవి. పుత్రపౌత్రాదులు శరీరం నుండి పుట్టేవారు. అంచేత ఇవన్నీ దేహసంబంధమైనవే కాని ఆత్మతో వాటికి సంబంధం లేదు. ఎప్పుడైతే శరీరం కంటే ఆత్మ వేరైనదన్న అనుభవం కలిగిందో అపుడు ఈ భోగాలేవీ ఆత్మకి అంటవు. అలా కాక శరీరమే ఆత్మ అనుకుంటే అంటుకుంటాయి. అని, యింకా యిలా చెపుతున్నాడు.


మ. జని సాహస్రబహుప్రయాణ మగు సంసారంపుఁ ద్రోవన్ సదా
చనుచుండున్ ఘన మోహఖేద మలమన్ సంసారిపాంథుండు, వా
సన లన్ ధూళి ముసుంగు గాఁగ: నెపుడేన్ జ్ఞానంపు టుష్ణోదకం
బునఁ దత్ క్షాళన సేయు వాని కపు డమ్మోహశ్రమంబున్ జనున్



సంసారి అన్న బాటసారి వేల వేల జన్మలెత్తుతూ జనన మరణ రూపమగు సంసార మార్గం వెంట ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణంలో అతనికి మోహం, దుఖం అనే దుమ్ము అంటుకుంటూ ఉంటుంది. పూర్వజన్మ వాసనలు అన్న ధూళి ముసుగులా అతన్ని కప్పివేస్తుంది. అయితే, ఎప్పుడైనా జ్ఞానం అనే వేడినీళ్లతో అతను స్నానం చేస్తే, అప్పుడు అతని మోహం, శ్రమ అన్నీ వదిలిపోతాయి.
వేడినీళ్ళతో శుభ్రంగా స్నానం చేస్తే ప్రయాణంలోని శ్రమ తీరడం మనకి అనుభవం లోనిదే. ఈ లోకానుభవాన్ని తెచ్చి జ్ఞానంతో సంసారం క్షాళనం చేసుకోవడమన్న మహావిషయాన్ని చెప్పడం గొప్ప కవితాశక్తి.

తే. అట్టి మోహశ్రమం బాఱ నా శరీరి
స్వస్థుఁ డై తా ననన్యాతిశయ మబాధ
మనఁగ విలసిల్లు నిర్వాణమును భజించు
ననఘ తొల్లియు నిర్వాణ ఖనియ కాన.




( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)
అట్టి మోహ క్లేశాలు తీరిపోవడంతో జీవుడు తన స్వస్వరూపం తెలుసుకొని అనన్యమూ, అతిశయమూ, అబాధమూ అయిన నిర్వాణ పథాన్ని అనుసరిస్తాడు. ఎందుకంటే అతను మొదటినుండి మోక్షవిద్యకు గనిలాంటివాడు కాబట్టి.

ఇంకా అవిద్య లక్షణాలని వివరించి, ఈ అవిద్యాక్లేశాలని నాశనం చేయడానికి యోగమే మార్గమని చెపుతాడు కేశిధ్వజుడు. ఆ యోగవిద్యని తనకు చెప్పమని అర్థిస్తాడు ఖాండిక్యుడు. అప్పుడు కేశిధ్వజుడు సావధానంగా వినమని, విష్ణు సాధర్మ్యాన్ని (విష్ణువుతో సమానత్వం కలగడం) పొందే యోగాన్ని వివరిస్తాడు.

ఆ. ప్రాణికోటి కెల్ల బంధంబు మోక్షంబు
చేరుటకును మనసు కారణంబు:
విషయసంగి యైన , విను బంధకారి; ని
ర్విషయ మైన, ముక్తి విభవకారి.



( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం శుద్ధసావేరి )

జీవకోటికి అంతటికీ బంధానికైనా, మోక్షానికైనా మనసే కారణం. ఆ మనస్సుకు విషయాసక్తి ఉండడమే బంధం. లేకపోవడం మోక్షం. ఆ మనసు శరీరభోగాల వైపు ఆకర్షితమై ఆసక్తి పెంచుకోంటే బంధాలు కలిగిస్తుంది, బందీని చెస్తుంది. అలా ఆకర్షింపబడక , ఆ ఆసక్తి పెంచుకోకుండా ఉంటే అదే ముక్తి లేదా మోక్షాన్ని కలిగిస్తుంది.

అధ్యాత్మ విజ్ఞానంతో మనస్సు బాహ్యవిషయాలపై ఆకర్షణను లోపలకు కుదించి, పరమాత్మయైన సర్వేశ్వరుని నిత్యమూ ధ్యానించాలి. అలా ధ్యానించినవానికి పరమాత్మ తన స్వరూపాన్ని అనుగ్రహిస్తాడు. యమనియమాదులవల్ల స్వఛ్చమైన మనసును బ్రహ్మవైపుకు మళ్ళించడమే యోగం. దాన్ని ఆచరించేవాడే యోగి. ఏదైనా ఫలితాలను కోరి యోగాన్ని అభ్యసిస్తే శక్తులు లభిస్తాయి. కోరికలు లేనప్పుడు ముక్తి లభిస్తుంది. ఈ విధంగా చెప్పి కేశిధ్వజుడు, యమము నియమము ఆసనము ధ్యానము ప్రత్యాహారము మొదలైన యోగ పద్ధతులన్నిటినీ వివరిస్తాడు.

క. మనమున కెద్ది శుభాశ్రయ,
మనఘ! యెఱింగింపు, మఱి సమస్తాధారం
బనఁ జను యద్వస్తువు? య
న్మనన మశేషోరుదుఃఖ మండలిఁ జెఱుచున్?



( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)
కేశిధ్వజుడి బోధలు విన్న తర్వాత ఖాండిక్యుడు కుతూహలంతో, "ఓ పుణ్యాత్ముడా! మనస్సును కేంద్రీకరింపదగిన శుభప్రదమైన ఆశ్రయం ఏది? వాటన్నింటికీ ఆదారమైనదేది? ఎవరి మననం సమస్త దుఃఖాన్ని నిర్మూలిస్తుంది. దయతో సెలవివ్వు", అని అడిగాడు. "యత్" అన్నది సంస్కృత సర్వనామం. "ఏ", "దేని" అని అర్థాలు. యత్+వస్తువు = యద్వస్తువు. యత్+మననము = యన్మననము. ఇలా సంస్కృత సర్వనామాలని తెలుగు వాక్యలలో వాడడం చాలా అరుదుగా కనిపిస్తుంది.

తే. అనినఁ గేశిధ్వజుఁడు వాని కనియె; 'బ్రహ్మ
మాశ్రయంబు మనంబున; కదియ పరము
నపరము ననంగఁ బొలుచు; నం దపర మనగ
మూర్తము, పరం బనంగ నమూర్త మనఘ.



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

అప్పుడు కేశీధ్వజుడు ఇలా అన్నాడు. బ్రహ్మమే మనస్సుకు శుభాశ్రయము. అది రెండు రకాలు. ఒకటి సగుణ (మూర్తమైన) బ్రహ్మము. దీనినే అపరము అని పిలుస్తారు. రెండవది నిర్గుణ (అమూర్తమైన) బ్రహ్మము. అది పరము.. అని చెప్పి ఆ బ్రహ్మస్వరూపాన్ని ఇంకా యిలా వివరిస్తాడు.

పర, అపర బ్రహ్మలలో పరము కేవల సచ్చిదానందమై సృష్టికి దూరంగా ఉన్నందువల్ల అమూర్తమైనందువల్ల ఉపాసనకి అందదు. రెండవదైన అపరబ్రహ్మము ఉపాసనకందుతుంది. కాని అది బ్రహ్మాది దేవతారూపమైన బద్ధజీవులు శరీరంగా కలది. కాబట్టి అది ఉపాసనకి తగదు. విశ్వంగా పరిణమించే బ్రహ్మ మొదలైన వారికంటె వేరైనది పరబ్రహ్మము. అది నిత్యము, సత్యము. జ్ఞానంతో నిరూపించ దగ్గది. ఈ పర అపర శక్తిరూపాలకి అతీతమైనది మరొకటి ఉన్నది, అదే విష్ణుశక్తి. ఈ విష్ణుశక్తే పర, అపర, కర్మ అనే మూడు రూపాలు పొందుతుంది. కర్మచేత కప్పబడిన అపరశక్తి, క్షేత్రజ్ఞశక్తి లేదా ఆత్మశక్తి అనే పేరుతో సంసార తాపాలని అనుభవిస్తూ కర్మలకి తగిన రూపాలను ధరిస్తూ ఉంటుంది. ఇది స్థావరాదులలో కొంచెం ఉంటుంది. దానికంటె జంగమాలైన జీవాలలోను, అంతకన్న ఎక్కువగా పక్షులలోను, అంతకంటె జంతువులలోను, అంతకంటె ఏనుగు, ఆవు మొదలైన పశువులలోను, అంతకంటె మనుష్య, యక్ష, గంధర్వ, నాగులలో ఎక్కువగా ఉంటుంది. అంతకంటె ఎక్కువగా ఈ ఆత్మశక్తి దేవతలలో ఉంటుంది. దేవతలందరిలో ఇంద్రునిలోను, అతనికంటె ప్రజాపతి, అంతకంటె బ్రహ్మలో ఎక్కువగా ఉంటుంది.

ఆ. ఇట్టిరూపకోటు లెల్ల నవ్విష్ణుని
తనుచయంబు సుమ్ము ధరణినాధ
యతఁ డచింత్యశక్తి నఖిలభూతముల నా
కసమువోలె నిండి యెసగుఁ గాన


( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

ఆకాశం ఏ విధంగా సకల వస్తువులలో, లోపల బయట కూడా ఆవరించి ఉంటుందో, అలాగే విష్ణుశక్తి సకల రూపాల్లోను నిండి ఉంటుంది. అందుకే ఈ రూపాలన్ని విష్ణువు శరీరము వంటివి.
ఆకాశమంటే మనకి దూరంగా పైన కనిపించే sky కాదు. అంతటా పరుచుకొని ఉన్న space.

ఆ. కర్మభుక్తికొఱకుఁ గా దిట్టి తల్లీల;
యతఁడు సకలజాతులందుఁ బుట్టుఁ;
బుట్టినట్టి యతని భూరిచేష్టితము ల
వ్యాహతములు రావణాదివలన.


(ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)

అమూర్తమైన పరాశక్తి రూపమైన విష్ణువే ఒక లీలగా విశ్వ రూపాన్ని ధరిస్తోంది. అయితే విష్ణువిలా రూపాలని ధరించడం కర్మని అనుభవించడానికి కాదు. ఎందుకంటే అతనికి కర్మ అంటదు. అతను అన్ని రకాల జాతులలోనూ పుడతాడు. రావణాదులవల్ల కూడా భంగింపబడకుండా ఆ చేష్టలు సాగిపోతూ ఉంటాయి.

ఇలా విష్ణుతత్త్వాన్ని వివరించిన కేశిధ్వజుడు ఆ తర్వాత, యోగికి ధ్యానయోగ్యమైన విష్ణుస్వరూపాన్ని ఇలా వర్ణిస్తున్నాడు.
సీ. శరదిందు చకచకస్మయజి త్ర్పసన్నాస్యు,
దొడ్డకెందమ్మి కన్దోయివాని,
నతికమ్ర గల్లభాగాభోగ ఫాలాఢ్యు,
మకరాంక రత్నకర్ణికలవానిఁ,
గాంబవోద్యచ్చ్రీవిడంబి వృత్త శీరోధి,
సిరిపొల్చుమచ్చ పేరురమువాని
నతనాభియుత వళిత్రితయ శాతోదరు,
జానులంబి చతుర్భుజములవానిఁ.

గరివరకరోరు, రుచిర జంఘా మనోజ్ఞు
సమతబొందిన పదపల్లవములవాని
హైమవసను గిరీట హారాంగదాది
కలితు, శంఖరథాంగాదు లలరువాని



(ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం చారుకేశి )

శరత్కాలపు చంద్రుని వెన్నెలని జయించే ప్రసన్నమైన ముఖం, ఎర్ర తామరల్లాంటి వెడల్పయిన కళ్ళు, అందమైన చెక్కిళ్ళు, విశాలమైన నుదురు, మొసలి గుర్తుగల రత్నకుండలాలు, శంఖంలా ప్రకాశించే గుండ్రని మెడ, పెద్ద వక్షస్థలం, అందులో శ్రీవత్సం అన్న మచ్చ, లోతైన పొక్కిలి, మూడు ముడతలతో అందంగా వున్న పల్చని పొట్ట. పొడవుగా మోకాళ్ల దాకా వున్న నాలుగు భుజాలు. మదగజ తుండమువంటి ఊరువులు, కాంతివంతమైన పిక్కలు, సమమైన చిగురుటాకులవంటి పాదాలు, పట్టు పీతాంబరము, కిరీటము, అందమైన హారాలు, శంఖ చక్రాది ఆయుధాలు. ఇది అతని స్వరూపం! ఒక్కముక్కలో చెప్పాలంటే సర్వ సల్లక్షణ సమన్వితమైన స్ఫురత్ సౌందర్య రూపం! ప్రసన్నాస్యు, ఫాలాఢ్యు వంటి సమాసభంధురత ఒకవైపు, కన్దోయివాని, రత్నకర్ణికలవాని మొదలైన శిథిలబంధం మరొకవైపు జోడుగా సాగే రచనాశిల్పం పద్యానికి ఒక చక్కని తూగునిస్తోంది.

ఇటువంటి స్వరూపాన్ని యోగులు నిరంతరం ధ్యానించాలి. వర్ణింపబడిన ఒక్కో అంగాన్ని తాదాత్మ్య భావంతో చింతిస్తే, ఆ అవయవం మనస్సులో ముద్రితమవుతుంది. అలా ఒక్కో అంగాన్నీ చింతిస్తూ అభ్యాసం చేస్తే కొన్నాళ్ళకు మొత్తం ఆ రూపమంతా మనస్సులో నాటుకుంటుంది. అన్ని వేళాలా ఏ పని చేస్తున్నా మనస్సులో ఆ రూపం చెదరకుండా ఉంటే అజ్ఞానం తొలగిపోయి, యోగి భగవంతునితో సారూప్యం, సామ్యం పొందుతాడు.

ఈ విధంగా వివరించి కేశిధ్వజుడు ఇలా అన్నాడు:

క. నరవర! యిటు బంధచ్యుతి
కొఱ కగు నంగాష్టకాఖ్య గురుయోగము వి
స్తరముగఁ జెప్పితి, నింకన్
గరణీయం బెద్ది నాకుఁ గల్పింపు' మనన్.



( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో )
ఓ నరవరా! ఇలా అజ్ఞానబంధాన్ని తొలగించ గలిగిన అష్టాంగయోగ మార్గాన్ని నీకు వివరంగా చెప్పాను. ఇక నాకు తదుపరి కర్తవ్యమేమిటో అనుగ్రహించు అని అడిగాడు కేశీధ్వజుడు. ఇక్కడ "నరవరా" అంటే "అర్జునుడు" అనే అర్థం స్ఫురిస్తుంది. అర్జునుడికి గీతాచార్యుడు ఏ యోగవిద్యని బోధించాడో, నీకు అదే చెప్పాననే ధ్వని ఉంది!

కేశిధ్వజుడు తనకి యోగవిద్యని బోధించినందుకు ఎంతో సంతోషించిన ఖాండిక్యుడు, ఇంతకన్నా ఇంకేమిటి కావాలని చెప్పి కేశిధ్వజుని పూజించాడు. వద్దంటున్నా కేశిధ్వజుడు తనకి తిరిగిచ్చిన రాజ్యానికి తన కొడుకుని రాజుని చేసి, ఖాండిక్యుడు భక్తియోగ మార్గంలో విష్ణుసాధర్మ్యాన్ని పొందాడు. కేశిధ్వజుడు తన ధర్మాన్ని అనుసరించి తిరిగి రాజ్యాన్ని చేసాడు.

ఇది ఖాండిక్య కేశిధ్వజుల కథ. ఈ కథని చెప్పి, విష్ణుచిత్తుడు పాండ్యరాజునికూడా శ్రీహరినే ఆశ్రయించమని చెప్పి శ్రీవైష్ణవ మత స్థాపన చేస్తాడు. ఈ కథతో ఆముక్తమాల్యదలో తృతీయాశ్వాసం ముగిసింది. ఆశ్వాసాంత పద్యాలు:

క. ఊరీకృతపాండవరథ
సారథ్య! సయూథ్యగోపశాబకసహ కే
లీరత! భక్తప్రహ్లా
దారచితస్తోత్రపులకితాంచితగాత్రా!



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

ఆశ్వాసాంతంలో ఆ దేవదేవుని స్తుతిస్తున్నాడు కవి. అర్జునుని రథానికి సారథి యైనట్టివాడా, గోపబాలురతో ఆటలాడుటయందు ఆసక్తి కలవాడా, భాగవతోతత్తముడైన ప్రహ్లాదుని స్తుతిచే పులకించిన దేహము కలవాడా అని అర్ధం..
స్రగ్విణి:
ఆస్థి తాహీంద్ర శయ్యా, దవీయస్తర
ప్రస్థితాంఘ్రీ, శ్రిత వ్రాత చేతోఘదా
కస్థలప్రస్పృశత్ కాళియ క్ష్వేళ మూ
ర్ధస్థలీ నృత్త మత్తల్లి హల్లీసకా!



(ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో )

ఆదిశేషువును శయ్యగా చేసుకున్నవాడు, వామనావతారంలో మిక్కిలి పొడవుగా సాగిన పాదములు కలవాడు, భక్తుల మనస్సులలోని పాపములను ఖండించువాడు, సరస్సులోనున్న కాళీయుడనే విషనాగు శిరస్సుపై నాట్యమాడినవాడు ఆ శ్రీహరి. మత్తల్లి, హల్లీసకము అనేవి దేశీయ నృత్యవిశేషాలు. హల్లీసకము కోలాటమువంటి నృత్యము. ఈ పద్యం ఛందస్సు స్రగ్విణి. పాదానికి నాలుగు రగణాలు. ఏడవ అక్షరం యతి.

మ. ఇది పాత్ర ప్రహరేశ్వర ప్రభృతి బంహిష్ఠోత్కలానీక గు
ప్త దివిస్పృక్పటుయంత్ర కొండపలి హృద్బాహాసి కద్రూజ దీ
వ్యదుదారోద్యమ కృష్ణరాయనృప సంజ్ఞాస్మత్కృతాముక్తమా
ల్యద నాశ్వాసము హృద్యపద్యము తృతీయంబై మహిం బొల్పగున్..



(ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం.శ్రీ )

ఈ ఆశ్వాసాంత పద్యంలో కృష్ణరాయల కొండపల్లి విజయం ప్రస్తావించబడింది. ప్రహ్రేశ్వరపాత్రుడు మొదలైన ఉత్కల (ఓఢ్ర, ఒరిస్సా) రాజసమూహం చేత రక్షింపబడేది, ఆకాశాన్ని అంటే యంత్రాలు (కోటని రక్షించే యంత్రాలు) కలదీ అయిన కొండపల్లి దుర్గాన్ని జయించే భుజమునందు ఖడ్గమనే గొప్ప సర్పం వెలుగుతున్న కృష్ణరాయలనే పేరుగల నాచేత రచింపబడిన ఆముక్తమాల్యద కావ్యమునందు ఇది తృతీయాశ్వాసమై ఒప్పుతోంది - అని అర్థం.

దీనితో ఆముక్తమాల్యద తృతీయాశ్వాసం సంపూర్ణం
Related Posts Plugin for WordPress, Blogger...