షష్ఠశ్వాసంలోకి ప్రవేశించాం. ప్రధమంగా దైవప్రార్ధన "శ్రీకారి కృపార్ద్రేక్షణ" అంటూ సాగించాడు. స్వామిని పరిపరివిధాల తన కుమార్తె అవస్థ ఏమిటో తెలియజేయమని ప్రార్ధించాడు. అనంతరం విష్ణుమూర్తి మాలదాసరి కధ విష్ణుచిత్తునితో చెప్తున్నాడు.
కలడొకరుండు పేరుకొనగాని కులంబు మదీయ భక్తుడు
య్యులమును వాడు వామన తనే వసియింపనొ పుణ్యభూమినం
దులకొక యోజనత్రయపు దూరపుటూరు వసించి బ్రహ్మవే
ళల జనుదెంచి పాడుమము లాలస మంగళకైశికిన్
మాలదాసరి’ కథను ప్రారంభించాడు. పంచమ కులమున బుట్టిన నా భక్తుడొకడు గలడు. అతడు నేను వామనావతారం ధరించి వసించిన గ్రామమునకు మూడు ఆమడల దూరంలో ఉన్నాడు. ప్రభాత వేళలలో మనగళ కైశికిలో నా నామగానం చేస్తూ ఉంటాడు.
ఆ భక్తుడు తన జాతికి తగినవాడుగా ఉండి వర్ణాశ్రమ ధర్మము పాటించుచు, మా సంతోషము కొరకు "శ్రేయాన్ స్వధర్మో విగుణ: పరధర్మాత్స్వనుష్టితాత్! అను గీతా వాక్యము ననుసరించి తన శరీరము చండాల సంగమమైనను అతి పవిత్రముగ ఉంచుకొనుచూ మసిగుడ్డ యందలి మాణిక్యమై వెలుగొందుచున్నాడు. ఆ మాలదాసరి ఎలా ఉన్నాడయ్యా అంటే...అతడు ధరించిన వస్తు విశేషాలను కూడా ఇలా వర్ణిస్తాడు...
సీ. చమురైన తోల్కుబుసంబు టెక్కియును నిత్తడిశంఖ చక్రకుండలములమర
దివెదారికొమ్ముదోల్తిత్తియు జోడమ్ము మెడమీది మొగలాకు గొడుగుదనర
మత్పాదరక్షయుమావు పెన్వెఱకగుట్టిన మోటి తిపిరిదండెయును మెఱయ
జిటితాళములు సంకపుటికనొక్కొక మాటు గతిరయంబున దాకి కలసి మెరయ
వలుద వనమాల కంటెయు మలిన తనువు
బట్టె తిరుమన్ను బెదురు గెంబుట్టుజూపు
బసుపు బొడితోలు వల్లంబు నెసకమెసగ
వచ్చు సేవింప సురియాళు వైష్ణవుండు.
తోలు వస్తువులను ధరించి, చెవులకు ఇత్తడి శంఖచక్రాలను పెట్టుకుని, విష్ణు పాదుకలు, మెడలో తులసిహారాలను అలంకరించుకుని కిన్నెరను మీటుతూ ఆ మాలదాసరి రోజూ దేవాలయానికి పోయి వస్తున్నాడట. క్రీ.శ 11, 12 శతాబ్దాల్లో కుల వ్యవస్థ కరాళనృత్యం చేస్తున్న సమయంలో విశిష్టాద్వైతమత సిద్ధాంత కర్త, పరమ వైష్ణవులు శ్రీ మద్భగవత్ రామానుజాచార్యులు కులాలన్నీ ఒకటేనని, భగవంతుడు అందరికీ ఒక్కడేనని నినదించారు. శ్రీరంగంలో అందరికీ తారక మంత్రోపదేశం చేశారు. అదే కాలంలో పల్నాడు ప్రాంతంలో బ్రహ్మనాయుడు విశిష్టాద్వైత మత ప్రచారంలో భాగంగా పద్దెనిమిది కులాల వారిని కలిపి రామానుజ కూటంగా ఏర్పాటు చేశాడు. చాపకూటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి, మాలలకు దేవాలయ ప్రవేశం చేయించాడు. అలా వాళ్లంతా చెన్నకేశవ భక్తులుగా మారారు. విష్ణు భక్తి ప్రచారానికి శూద్రుల్లో సాతానులను, మాలల్లో మాలదాసులను ఏర్పాటు చేశారు. వీరు వివాహాది శుభకార్యాలు, అపరకర్మలు నిర్వహిస్తారు. వీళ్లలో మాలదాసరులు.. విష్ణువుకు ప్రీతిపాత్రమైన ధనుర్మాసం ప్రారంభం కాగానే ‘హరిదాసులు’గా ఊరూరా సంచరిస్తూ ఆధ్యాత్మిక పరిమళాలను పంచుతుంటారు. హరిదాసులు ధనుర్మాస ప్రారంభం నుంచి మకర సంక్రమణ వరకు వేకువజామునే లేచి తలంటుస్నానం చేస్తారు. నొసట తిరుమణి, తిరుచూర్ణం, పట్టెనామాలు ధరించి కొత్త బట్టలు ధరిస్తారు. తెల్లపంచె/ కాషాయ పంచె, చొక్కా/ అంగి, నడుముకు గుడ్డ, కాలికి అందెలు కట్టుకుని.. మెడలో పూలదండ. తలపై కలశం (అక్షయపాత్ర), కుడిభుజంపై తంబుర, ఎడమచేతిలో చిటికెలు ధరించి హరినామ సంకీర్తన చేస్తూ ఇంటింటికీ తిరుగుతారు. మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలా తిరిగి ఇంటికి వచ్చేస్తారు. స్నానం చేసి పూజా కార్యక్రమాలు ముగించాకే ఆహారం తీసుకుంటారు. ఈ నెల రోజులు వీళ్లు చాలా నిష్ఠగా ఉంటారు. నేలపడక, ఒంటిపూట భోజనం చేస్తారు. తర్వాత రోజుల్లో వీళ్లు వీధి నాటకాలను ప్రదర్శిస్తారు. కొందరు బుర్రకథలు గానం చేస్తారు. ఈ మూడు ఆచారాలూ వీళ్లకి వంశపారంపర్యంగా వస్తున్నాయి. మాలదాసులుగా, హరిదాసులుగా వ్యవహారంలో ఉన్న వీళ్లు మాలల్లో ఒక తెగవారు. పన్నెండో శతాబ్దం నుంచి రామానుజ సిద్ధాంతాలను పాటిస్తూ, ఆయన బోధనలను వ్యాప్తి చేస్తూ వస్తున్నారు. మాలలకు వివాహాది శుభకార్యాలు, అపరకర్మలు నిర్వహిస్తూ భజన కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు.
ఆవిధముగా పెరుమాళ్ళును నిత్యము సేవించునట్టి యా మాలదాసరి గుణంబులెట్టివనిన.. ఉత్తమజాతికి చెందినవారొచ్చినచో దూరముగా బోవును. ఎండను గాలిని లెక్కచేయక ఎంతసేపైనను ఆ స్వామి ప్రసాద కైంకర్యము కొరకు వేచి ఉండెడివాడు. ఎవరైన ప్రసాదమును ఇచ్చినచో చేతితో స్వీకరించక తన కిన్నెరను జాపి దానిమీద పెట్టుడని చెప్పి స్వీకరించెడివాడు. ఆ దాత ఇచ్చిన తీర్ధమును త్రావును. తన చండాల గుణముచేత లోపలికి రాక బయట నీరు వెలువడు ప్రదేశమునందుండి ప్రార్ధించి వెడలుచుండేవాడు.
కం. అద్దమరేయద్దాసరి
యద్దండ బిడాల గాహి తాలయ కృకవా
కూద్దండ రవము విని చను
ప్రొద్దాయనటంచు బాడబోవుచు ద్రోవన్
ఇట్లుండగా ఒకనాడు అర్ధరాత్రి ఒక పిల్లి ఆ ఇంటిలోనికి ప్రవేశించగా అలికిడికి కోళ్ళు కూత పెట్టగా, ఎరుంగని ఆ దాసరి ప్రాత:కాలమయినదని భావించి, నా గురించి కీర్తించుటకు బయలుదేరెను. (సశేషం)