గతంలో మనం మాలదాసరి వృత్తాంతంలో దారిలో కొండలా ఉన్న ఒక బ్రహ్మరాక్షసుడిని చూశాడు. మరి ఆ సమయంలో జరిగిందేమిటో
చూద్దాం.
ఉ. వాడును గంటి బోకుమని వ్రాలె మహీరుహ పాళి
నుగ్గుగా
వీడును మున్ను రేవగటి వేళకు మానిసియౌట బోరిలో
వాడిమి గొంతకాల మిల వ్రాలుట లావరియౌట నిల్చి
యా
వాడి శరంబుచే నడువ వాడది ద్రుంపుడు వీడు
నుద్ధతిన్.
చూసిన వెంటనే వాడు "ఒహ్హో...నిన్ను
చూశాను. ఎక్కడికీ వెళ్ళకు" అని చెప్పి ఒక్కసారి ఆ చెట్టుమీదనుండి ఆ కొమ్మలు నుగ్గు
నుగ్గు అయేట్టుగా క్రిందికి దూకాడు. యుద్ధము చేయాలని దూకిన బ్రహ్మరాక్షసుని నిలువరించాడు
మాలదాసరి. దాసరి కూడా ఎదురు నిలిచాడు. ఇరువురు ఒకరికొకరు మల్లయుద్ధరీతిలో బల ప్రదర్శనం
గావిస్తున్నారు. మాలదాసరి కూడా పరాక్రమంలో
ఏమీ తీసిపోవడంలేదు. రాక్షసుడిని కాళ్ళతో చేతులతో కుమ్మి కుమ్మి నిలువరిస్తున్నాడు.
అది చూసి వానిని కాస్తా ఆపి బ్రహ్మరాక్షసుడి
కోపం తారాస్తాయినందుకుంటుండగా ఇలా అన్నాడు.
శా. సారాస్వాదన బ్రాణ పంచకము తృష్ణంబాసి
సంతర్పణ
న్మూరింబో నసి ద్రుంచి పొంగెడు భవన్ముండాస్రధారోష్మ
మిం
పారం గ్రోలి పిశాచి నీదు కరకుట్లందీ నదస్తాలకాం
తారాంతర్ నృకపాల కుండ విగళన్మై రేయముం గ్రోలెదన్.
ఓరీ..నిన్ను ఇప్పుడే కత్తితో నీ తలను మొండెము
నుండి వేరు చేసి నీ వేడి వేడి రక్తమును నా పంచప్రాణాలు శాంతించేవిధంగా మంచి కమ్మనైన
రుచిగా త్రాగేస్తాను. ఆ తర్వాత నా పిశాచి భార్య నీ మాంసం వండి వేడి వేడిగా తెస్తుంది.
ఆ మాంసంతింటూ మనిషి పుర్రె పాత్రలతో ఇక్కడ ఉన్న తాటికల్లును తాగుతాను అని హూంకరించాడు.
క. నన్నిం తలయించిన ఖలు
నిన్నున్ ఋజువిధి వధింతునే యని యార్పుల్
మిన్నందగ బుసకొట్టుచు
నన్నీచుడు పొగరు వెడలు నవ్యక్తోక్తిన్.
ఓయీ నువ్వెవరో తెలియదు నన్ను ఇంత బాధ పెట్టావు
కాబట్టి నిన్ను ఊరకే వదలే ప్రసక్తే లేదు. చిత్ర వధ చేసేస్తాను అని అరుస్తూ అస్పష్టమైన
మాటలతో తిడుతూ ఉన్నాడు.
చ. వినుమొక మాట రాత్రిచర! వేగిర మేటికి నిన్
జయింతురే
యనిమిషులైన? భాజనగతాన్నమ నేనిక నెందు బోయెదన్
బెనగక ప్రాణరక్షణ ముపేక్ష యొనర్చుట పాపమిందుకై
కనలకు నాకు మేనియెడ గాంక్షయు లేదిది పోవుటే
యురున్
ఆమాటలకు దాసరి ఇలా అంటున్నాడు. ఓ రాకసుడా!
ఒక మాట చెప్తా విను. తొందర ఎందుకు నేను నీకు ఆహారంగా చిక్కిపోయాను కదా! కోపం తగ్గించుకో.
నిన్ను దేవతలు కూడా జయించలేరు అంత బలం ఉన్న వాడివి నీవు. నాకు ఈ దేహం అంటే ఏమాత్రం
అపేక్షలేదని తెలుసుకో.
ఆ. హీన జన్మ మరుట యెవ్వడె నొకప్రాణి
సంతసిలుట ముక్తి పొంత గనుట
మేలె కాదె శిబియ మేల్బంతి గాడె న
శ్వరపు దేహమమ్మి పరము గొనుట
నా దేహం నీకు ఆహారంగా అయితే నాకొక మేలు జరుగుతుంది.
అది ఏమిటంటావా? నాకు ఈ చండాలమైన జన్మ తొలిగి
పోతుంది.నాకు మోక్షం లభిస్తుంది.శిబి చక్రవర్తి తన దేహంలో ని తొడను కోసి ఇచ్చి పుణ్యలోకములకు
వెళ్ళలేదా చెప్పు అని అంటున్నాడు.
చ. తెవు లయినం, గ్రహం బయిన, దేలయినం, గరమైన,
నాత్మ పెం
దెవు లయినన్, జలంబయిన, దెక్కలి యైన, మృగాగ్నులైన,
మే
ల్తవు లయిన, న్వ్రణం బయిన, ద్రాచయినన్, బిడుగైన
దీర్చు పే
లవ తను వూరకే చెడ కిలన్ గృశునొక్కని బ్రోచుటొప్పదే.
ఈ దేహం ఎలాంటిదో తెలుసునా నీకు? రోగం, దయ్యం,
తేలువిషం, గొప్ప మనోవ్యాధి, బందిపోట్లు, అగ్ని, క్రూర జంతువులతో చంపబడే ఈ దేహం నీకు
ఆహారం అవడం నా అదృష్టం అంటూ అనేక వేదాంత విషయాలు చెప్పి ఎప్పటికైనా ఎంత వాడికైనా మరణము
అనేది తధ్యం కదా అని చెప్తున్నాడు దాసరి.