తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Friday, January 11, 2019

యామునాచార్యుని రాజనీతి బోధ - 2

ఆముక్త మాల్యద బ్లాగు ఆగి చాలా కాలం అయింది.  కారణాలు అనేకం.  మీకు కొంచెం వెనక్కి వెళ్ళి…కధ చెప్పి మళ్ళీ పద్యాల్లోకి వస్తాను.  మనం చతుర్ధాశ్వాసం లో ఉన్నాం.   వాదములో యామునాచార్యుడు నెగ్గడంతో  రాజు తన రాజ్యంలో కొంత భాగానికి  యామునాచార్యుని రాజును చేసితన చెల్లెలినిచ్చి పెళ్ళి చేసాడు. అతడు దివ్యాస్త్ర మహిమ కలవాడు గనుక దిగ్విజయము చేయవలెనని కోరిక కలిగి  సర్వరాజులను జయించి రాజ్య భోగలాలసుడయ్యాడు. యామునాచార్యుని తండ్రి  నాథముని. ఆయన గొప్ప భక్తుడు. ఆయన శిష్యుడు పుండరీకాక్షుడు. ఆయన కూడా గొప్ప భక్తుడు. ఆయన శిష్యుడు శ్రీరామమిశ్రుడు యామునాచార్యుని చూసి రాజ్య వ్యసనమేమిటీ? పాపమేమిటని వాపోయాడుఅతని మనసు మార్చడానికి ఏదైనా చేయాలని అనుకుని, రాజదర్శనము చేసుకునిరాజా! మీ పూర్వులు నిక్షేపమును కావేరినది యొక్క ఒకానొక ద్వీపమున ఉంచారు దాని చుట్టూ పాము ఉంటుంది. పద్మము శంఖము కూడా వుంటాయి.” అని రాజును తీసుకుని శ్రీరంగనాథుని చూపించడం వరకూ తెలుసుకున్నాము. తర్వాత శ్రీరామమిశ్రుడు రాజును తీసుకుని వెళ్ళి శ్రీరంగనాథుని చూపించాడు. వెంటనే యామునాచార్యునికి తను చేసిన తప్పు తెలిసి జ్ఞానము కలిగింది. వెంటనే  తన కొడుకుకు రాజ్యాన్ని అప్పగించి తాను సన్యాసము తీసుకున్నాడు. తరువాత కొడుకుకు రాజనీతిని బోధించసాగాడు. ఎలుగుబంటి చెట్టుకొమ్మ మీద నిద్రించునప్పుడు ఒక కన్ను మూసి, ఒక కన్ను తెరిచి ఉంటుందిరాజు కూడా అదే విధంగా  అన్నివేళలా అప్రమత్తుడై ఉండాలి. ఇంటాబయటా ఉన్న శత్రువులను ఒక కంట కనిపెడుతూ ఉండక తప్పదని చెప్తాడు. తర్వాయి, యమునాచార్యుడు రాజనీతిని కొనసాగిస్తున్నాడు. సన్యాసులు, జడధారులకు అగ్రహారములవంటివి దానమీయరాదు. అటుల యిచ్చిన యెడల వారు వారి వారి కర్తవ్యములను విస్మరించి భోగలాలసులగుదురు. వధించవలసినంతటి నేరము చేసినవారికి ముమ్మారు అవకాశమీయుము. ఇంకను దుశ్చర్యలు ఆపనిచో వధించవలెను. రాజ్యములో వందిమాగద బృందాన్ని కనిపెట్టి ఉండాలి. విదేశములనుండి గుర్రములు, గజములు దిగుమతి చేసుకొనుచుండవలయును. ఎవరైనా రోగగ్రస్తులైన వారు విదేశములనుండి వచ్చినచో వారిని వారి జాతివారి వద్దకే పంపవలెను. శతృవర్గపు రాజులతో చాలా జాగ్రత్తగా మెలగవలెను. నీచ ప్రవృత్తితోను, మోసముతోను వారిని జయించుట తగదు.


కం. అహితుడు వేడిన నేలెడు
మహి సగమేనిచ్చి తెగని మైత్రిగొని విభుం
డహి భయము మాన్పుకోదగు
నహిభయ మహిభయముకంటె నధికము గాదే

రాజుకు బయటి శత్రువు కన్నను, తన పక్షము వారు పగబూనినట్లైతే అత్యంత ప్రమాదమని గ్రహించాలి. అది పాము కంటే భయంకరము. బయటి శతృవు కోరితే సగం భూభాగం యిచ్చి అయినా భయం పోగొట్టుకొని, తర్వాత స్వపక్ష భయమును సమర్ధవంతంగా నిర్మూలించుకొనాలి.

వేయి మాటలెందుకు? కంటకులను తుదముట్టించని రాజ్యములో రాజుకు గానీ ప్రజలకు గానీ సుఖశాంతులుండవని గమనించుకోవలెను. బెస్తవానికి చిక్కిన చేప నేలపైబడి గింజుకొనునంతవరకు ఓపికవహించి తర్వాత బుట్టలో వేసుకున్నట్టుగా బలవంతుల విషయంలో తొందర పడకూడదు. నెమ్మదిగా కార్య సాధనకై అడుగులు వేయాలి. అన్నింటికంటే ముఖ్యమైన దండనీతిని గురించి తెలుసుకోనాలి. వ్యసనములు - పాన స్త్రీ మృగయా ద్యూత వాక్పారుష్య దండపారుష్యార్ధ దూషణముల గురించి తెలియ జెప్పెదను వినుము.

సీ. దండపారుష్యంబు, కొండెంబున నతర్క
మరి సంధి కెడయీక మర్ల బడుట................(1)
యవలితప్పెన్నికన్న విదేశ్యు జెరుచుట
ప్రతి ప్రవర్తకున కేర్పడగ జేత........................(2)
జనునవిశ్వాసంబు గనుగొని మెలగుట
విశ్వసనీయుని వేర్పరచుట..........................(3)
మోమోట మంత్రంబుచో మిక్కిలిడుకొంట
మంత్రభేత్తకు నాజ్ఞ మరచియుంట.................(4)

తే.గీ. వింత పుట్టిన గనుగల్గి చింతసేయు
కుంట, మాన్యుల పట్టున నొక్క చూపె
చూడకుంట, విహీనుల గూడుకొంట
వ్యసనియై ఉంట, చలముంట వలదు పతికి.
అని సెలవిచ్చిన యమునాచార్యుడు కొడుకుకు రాజనీతిని కొనసాగిస్తున్నాడు.

1. దండ పారుష్యమునందు నేరమునకు మించి శిక్షలను విధించరాదు. కొండెములు చెప్పినవారిని నమ్మి శిక్షలు విధించరాదు. నిజమా కాదా అని జాగ్రత్తగా విచారించుకోవాలి. 2. తనకు దేశాంతరరాజు చేసిన అపరాధములను చెప్పవచ్చిన విదేశీయుని వానిని వాని దేశపు రాజుకు పట్టి యిచ్చుట. 3. తనకు ద్వేషము చేయునని యెరింగియు వారలతో స్నేహము చేయుట తగదు. 4. మంత్రులు యితర అధికారులు చెప్పిన మాటలు నమ్మి విచారించక శిక్షలు విధించుట చేయరాదు. అలాగే పూజ్యులను నిందించుట, మోసగాండ్రకు స్థానమిచ్చుట, సప్తవ్యసనములలో ఉండుట, మాత్సర్యము వహించుట అనునవి రాజుకు ఏమాత్రము తగదు.


లోక స్వభావమునకు వ్యతిరేకమైన ఉత్పాతములు జరిగినప్పుడు బ్రాహ్మణులను పూజించుట, దేవతలకు పూజలు చేయుట, అగ్నికి హోమము చేయుట మొదలగు కార్యములు నిర్వర్తింపవలయును. రాజు అధికారులకు పోటీలు పెట్టడం వలన వారి వారి గొప్పలు చెప్పుకోవడమే గాక యితరుల లోపములను చెప్పెదరు. ఆవిధముగా అందరి బలములు, అందరి బలహీనతలను రాజు నిత్యము తెలుసుకొనుచుండవలెను. 

0 comments:

Related Posts Plugin for WordPress, Blogger...