తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Tuesday, December 21, 2010

చతుర్వర్ణాల వర్ణన

అష్టాదశ వర్ణనల సంప్రదాయాన్ని పాటిస్తూ రాయలు మధురాపురంలోని చతుర్వర్ణాలవారైన బ్రాహ్మణులు, క్షత్రియులు, కోమట్లు, కాపులను గురించి వర్ణించాడు. మనఃప్రవృత్తికి అనుగుణమైన వృత్తులకి చిహ్నంగా ఉండేవి వర్ణాలు. రాజ్య పరిపాలన వర్ణాశ్రమాచారాన్ని పరిరక్షించే విధంగా ఉండేది. ఇది సామాజిక భద్రతను చూచించే పరిపాలనా విషయంగా ఆ నాటి కవులు వర్ణించేవారు.


. చిరసముపార్జితాగ్ని తడిఁ జెంది నశించు నటంచునో, కృతా

ధ్వరతఁ దదగ్ని మై నునికి దాన నొకంగము తాఁచుచేతనో,

పుర ధరణీసురు ల్నిగమభూధరము ల్జపయజ్ఞ శీలు రా

హరి ధనదాదులైన వలహస్తము సాఁపరు దానధారకున్.-



( ఈ పద్యం సనత్ స్వరంలో )


మధురాపురంలోని బ్రాహ్మణులు పరమనిష్ఠా గరిష్టులు. వేద పర్వతాలు. నిత్యాగ్నిహోత్రులు. వారందరూ సోమయాజులగుటచే వారి దక్షిణ హస్తమునందు అగ్ని ఉంటుందని అంటారు. దానోదకముచే (దానం ఇచ్చేటప్పుడు వదిలే నీళ్ళు) తేమ తాకి ఆ అగ్ని చల్లారుతుందని దేవేంద్ర, కుబేరాదులు వచ్చి దానమిస్తానన్నా తమ దక్షిణ హస్తమును (కుడిచేతిని) చాపరు. ప్రతినిత్యమూ జపయజ్ఞములు చేసే ఈ బ్రాహ్మణోత్తములు ఎవరికీ చేయి చాపరు అని భావము.

అగ్నిహోత్రం బ్రాహ్మణులకు ఎంత ముఖ్యమో “నచికేతోపాఖ్యానం” లో దగ్గుపల్లి దుగ్గన ఇలా చెప్తాడు.

"వినుము బ్రాహ్మణునకు వేదంబు ముఖ్యంబు
వేదములును యాగ విధుల నొడవు
యజ్ఞములకు మూలమగ్నిహోత్రముగాన
నగ్ని హోత్ర సేవ యాత్మ సేవ."

అలాగే రాయలు కూడా మధురాపురంలోని బ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రులుగా కొనియాడాడు. ఇతర కావ్యాలలో సాధారణంగా బ్రాహ్మణులని పండితులుగా వర్ణించడం కనిపిస్తుంది. కాని రాయలవారిక్కడ బ్రాహ్మణుల వైదిక కర్మ నిష్ఠని వర్ణించారు.


. ఉరవడిఁ బోరికై కవచ మొల్లరు మంత్రములందుఁ దక్క, సు

స్థిరభుజశక్తి నైదుపది సేయరు దత్తిన తక్క, మంటికై

పొరల రధీశుడీ కమలబుద్ధి ఖళూరికఁ దక్క, వజ్రదోః

పరఘవశీకృతాన్యనరపాలకు లప్పురి రాకుమారకుల్.-


(ఈ పద్యం రాఘవ స్వరంలో )

ఇక క్షత్రియకుమారులు మహావీరులు. వజ్ర సమానమైన బాహువులు అనే పరిఘలతో శత్రు రాజులను లొంగదీసుకోగలరు. వీరు ఎంత బలశాలులు, ధైర్యవంతులంటే యుద్ధమునందు కూడా కవచము ధరించరు. కాని వీళ్లు కవచం వాడేది ఒకే సందర్భంలో. అది మంత్రోచ్చారణ సమయంలో. రాకుమారులు నేర్చుకునే ప్రతి అస్త్రము ప్రయోగించడానికి ప్రత్యేకమైన మంత్రము ఉంటుంది. ప్రతి మంత్రానికి మంత్రకవచం ఉంటుంది. అందుకే ఆ అస్త్రప్రయోగ సమయంలోనే కవచం వాడతారు అని శ్లేషగా చెప్పాడు కవి. అంతే కాక గొప్ప భుజశక్తి గల ఈ రాకుమారులు రెండు చేతుల ఐదేసి వేళ్లు కలిపి పదిగా చేసి అంటే చేతులు జోడించి ఆశ్రయించరు. కాని అదే రెండు చేతులు కలిపి దోసిలితో దానం చేయడానికి మాత్రం వెనుకాడరు. సాధారణంగా రాజ్యం కోసం మహారాజు ముందు మట్టిలో పొర్లి దణ్ణాలు పెడతారు. ఈ రాజకుమారులు అలా చేయరు. కాని వీళ్లు కూడా మట్టిలో పొర్లుతారు. ఎక్కడంటే ఖళూరిక అనే సాము గరిడీ చేసే ప్రదేశంలో. దీనివల్ల మధురాపురంలోని రాజకుమారులు సాముగరిడీలో కూడా నిష్ణాతులే అని తెలుస్తుంది. "అయిదు పది చెయ్యడం" అన్నది చక్కని తెలుగు నుడికారం.


శా. దంభాపేతవితీర్ణితోయములు రథ్యం దొట్టి హట్టస్ధిత

స్తంభంబు ల్చిగిరించుచున్నవి యనన్ ధర్మైకనిత్యార్జనన్

సంభూతం బగుపైడికోటి కొకడై నానాఁటికిన్ హెచ్చు చ

య్యంభోదావళి గప్ప గేతువులు వైశ్యశ్రేణి పొల్చున్ బురిన్



( ఈ పద్యం భైరవభట్ల కామేశ్వరరావు స్వరంలో)


మధురపురంలోని కోమట్లు ధర్మము వీడక నిజాయితీగా వ్యాపారం చేసేవారు. పూర్వం కోటీశ్వరులు తమ సంపదకి గుర్తుగా ఒక్కొక్క కోటికి ఒకో జెండాని ఎగరేసేవారు (కోటికి పడగలెత్తడం అన్న నానుడి ఇలా వచ్చిందే). ఆ నగరంలోని వైశ్య వీథులు అలా ఎగరేసిన జెండాలతో ఎంతగా నిండిపోయిందంటే, అవి ఆ పైనున్న మబ్బులని కూడా కప్పేసాయిట! అంటే ఆ నగరంలోని వైశ్యులు అంత ధనవంతులన్న మాట. ధనవంతులవ్వడమే కాదు. ఎలాంటి గర్వం లేకుండా వారు నిరంతరం దానాలు చేసేవారు. ఆ దానధారలు ఏరులై పారి, ఆ నీటికి వీథులలోని స్తంభాలు కూడా చిగురించాయా అన్నట్టుగా ఉన్నాయట ఆ పతాకలు.

ప్రాచీన సమాజంలో వైశ్యులు వ్యాపారులు, ధన రక్షకులు. బ్రాహ్మణులు విద్యారక్షకులు, క్షత్రియులు రాజ్య రక్షకులు, శూద్రులు సస్య క్షేత్ర రక్షకులు. అందరూ కాపులే. నిరంతర దానం వైశ్యులకి విధి. బుద్ధునికి విరివిగా విహారాదులు కట్టించినది వైశ్యులే అని చరిత్ర చెబుతోంది. కనుక ఈ పద్యం ప్రాచీన సమాజంలో వైశ్యులంటే ఎలా ఉండేవారన్నది చక్కగా వర్ణిస్తోంది. ఇతర కావ్యాల్లో వైశ్యులు కుబేరులని మాత్రమే వర్ణించబడితే, ఇక్కడ దానధర్ములని చెప్పడం రాయలవారి సామాజిక పరిజ్ఞానాన్ని పట్టిచూపుతోంది. ఈ వైశ్యుల దానం దంభాపేతం. అంటే ఏదో మిషతో చెయ్యడం కాకుండా పవిత్ర దృష్టితో చేస్తున్న దానం అన్నమాట. పద్యం ఇక్కడ ప్రారంభం కావడం కూడా వారి స్వభావానికి గీటురాయి.


తే. నృపులపదహల రేఖల కెల్ల మా భు

జాగ్ర హలరేఖలే మూల మనుచుఁ గోటి

కొండలుగ ధాన్యరాసులు పండువీట

సుజనభజనైక విఖ్యాతి శూద్రజాతి



( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో )


ఆపురంలోని చెప్పుకోదగిన మరో ముఖ్యమైన జాతి సస్య రక్షకులైన శూద్రజాతి. వారి భుజాలమీది మోసిన నాగలి గుర్తులే మహారాజుల పాదములలోని హలాకార రేఖలు అనుకుంటారు. తాము నాగలి పట్టి వ్యవసాయం చేసి కోట్ల కొండలుగా నానావిధ ధాన్యరాశులను పండిస్తున్నారు. అన్నదాతలై సత్పురుషులకు సేవచేస్తూ సుఖసంతోషాలు పొందుతున్నారు. సాముద్రిక శాస్త్రంలో పాదాలందు హలరేఖ పంచ మహాపురుష లక్షణాలలో ఒకటిగా చెప్పబడింది. హల రేఖలు మహా వైభవాన్ని సూచిస్తాయి. రాజులకి తద్వారా రాజ్యానికి ఆ వైభవాన్ని ఇస్తున్నది రైతులే అని తాత్పర్యం.

Friday, December 3, 2010

పుష్పలావికలు, గజ, అశ్వ వర్ణన...

అష్టాదశ వర్ణనలు కన్నడం నుంచి నన్నెచోడుడు గ్రహించాడని అంటారు కొంతమంది. ఏది ఎమైనా.. ఈ అష్టాదశ వర్ణనలు వివరంగా తెలుసుకొవలసిన అవసరం ఎంతైనా ఉంది. అవి ఏమిటంటే..

1. పుర వర్ణన.
2. గిరి వర్ణన.
3. వన వర్ణన.
4. నది వర్ణన.
5. సముద్ర వర్ణన.
6. ద్యూత వర్ణన.
7. వివాహ వర్ణన.
8. విరహ వర్ణన.
9. యుద్ధ వర్ణన.
10. షడృతువుల వర్ణన.
11. ప్రాత: సంధ్యాకాల వర్ణన.
12. సూర్యోదయ సూర్యాస్తమాన వర్ణన.
13. మధుపాన వర్ణన.
14. రాయబార వర్ణన.
15. స్త్రీ వర్ణన.
16. బ్రాహ్మణాది చాతుర్వర్ణముల వర్ణన.
17. చతురంగ సైన్య వర్ణన.
18. వేదాంత విచారణ.

ఇవి ఏ ప్రబంధంలో అయినా ఉండి తీరాలని ఆర్యోక్తి.

ఇదే విధంగా అష్టాదశవర్ణనలలో భాగంగా రాయలు పురవర్ణన, సౌధవర్ణన తర్వాత మధురాపురంలోని పుష్పలావికల గురించి ఈ విధంగా చెప్తున్నాడు. పుష్పలావికలంటే పువ్వులమ్మే వాళ్ళు.

సీ. ఇంద మన్‌తఱి దంతకుందాభ గూడి ని
చ్చలపుఁజూపులు మున్న సంభ్రమింప,
వెల యొప్ప కవలఁ బో విఱుచు మోవియుఁ గోప
మొదవెడుచూపు మోమోటఁ ద్రిప్పఁ
దిరిగిన సస్మితోక్తియుఁ జూపుటొయ్యార
ములు నగుఁ గాదను పలుకు లుడుప,
నవి గాని కావొ నీకను పరసాపత్న్య
సంపాదనం బుబ్బు నింపుఁ బెనుపఁ

తే. జతురవచనవిలాసాంగసౌష్ఠవములఁ
బసిఁడిఁ దా నిచ్చినట్టి యప్పణఁతి మఱవఁ
బతికిఁ గైదువు లందిచ్చు రతి విధమున
విటుల కిత్తురు మఱి వారు విరులు పురిని



( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)







మధురాపురంలో పుష్పలావికలు చాలా చతురులు. ఇదిగో పువ్వులు అనేటప్పటికే వాళ్ళ మల్లెపూలవంటి దంతకాంతులు పువ్వులు కొనే విటులని ముగ్ధులని చేసేస్తాయి. చెప్పిన ధర కుదరక విటులు వేరే పూలమ్మి దగ్గరకి వెళ్ళబోతే వీళ్ళ పెదవివిఱుపు కళ్ళల్లో చూపించే చిరుకోపం మళ్ళీ ఆ విటులని వీళ్ళ దగ్గరకే తీసుకువస్తాయి. ఆపై ఒకింత గర్వముతో, ఒకింత సరసముతో ఆ పువ్వులే కాని మా పువ్వులు నీకు ఇష్టము కావా? అని అలక నటిస్తారు. యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు భర్తకు ఆయుధములు అందించు రతిదేవి వలే ఈ పుష్పలావికలు తమ ఒయ్యారపు విలాసాలతో, చాతుర్యపు మాటలతో ఆకర్షిస్తూ విటులకు పువ్వులు విక్రయిస్తున్నారు. మన్మథుడి ఆయుధాలు పువ్వులే కదా మరి! యుద్ధానికి వెళ్ళేప్పుడల్లా భర్తకి ఆయుధాలు అందించే ప్రత్యేకత బహుశా ఒక్క రతిదేవికే దక్కుతుంది. మధురాపురంలో పువ్వులమ్మే స్త్రీలు సాక్షాత్తు రతిదేవిలేనట! ఒక పద్యంలో మొత్తం ఒక సజీవ దృశ్యాన్ని సాక్షాత్కరింప చెయ్యడం రాయలవారి ప్రత్యేకత. అది ఈ పద్యంలోనూ కనిపిస్తుంది.

. దలమగు చంద్రఖండములు దారలు, సాంకవ మొప్పు పాణి పా
టలమగు దంతపుంగరవటంబు శశాంకుఁడు , గుంకుమైన చీ
రల జిగి కెంపుగా బయటి రధ్యల నొప్పుదు రిందుకాంతవే
దులపయి సంధ్యయే బహుతఁ దోఁచెననన్ బురి గట్టివాల్సతుల్



(ఈ పద్యం రవి స్వరంలో)
మధురానగరంలో మరొక దృశ్యాన్ని అద్భుతమైన ఉత్ప్రేక్షతో వర్ణిస్తున్నాడు రాయలు. ఆ నగరంలో సుగంధ పరిమళ ద్రవ్యములు అమ్ముతున్న స్త్రీలు వీధిలోని పాలరాతి తిన్నెలపై కూర్చుని వ్యాపారం సాగిస్తున్నారు. ఆ దృశ్యం ఎలా ఉందంటే - వాళ్ళమ్ముతున్న సుగంధద్రవ్యాల్లో మిలమిలా మెరుస్తున్న కర్పూరపు తునకలున్నాయి. అవి నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. వాళ్ళ చేతుల్లో తెల్లగా మెరుస్తున్న దంతపు భరిణ ఉంది. దానికి నల్లని జవ్వాది అంటుకుని ఉంది. వాళ్ళ చేతుల లేత ఎఱుపు రంగు ఆ దంతపు భరిణలో ప్రతిఫలిస్తోంది. లేత ఎఱుపు రంగు, మధ్యలో మచ్చలా జవ్వాది కలిసి ఆ భరిణ అప్పుడే ఉదయిస్తున్న చంద్రబింబంలా ఉంది. కుంకుమ అంటిన చీరలకాంతి తెల్లని పాలరాతి తిన్నలపై ప్రతిఫలిస్తూ, అవి రాగరంజితమైన సంధ్యాకాశంలా ఉన్నాయి. అలా సంధ్యాకాలం అక్కడంతా అనేక రూపాల్లో దర్శనమిచ్చిందా అన్నట్టుగా ఉందట ఆ దృశ్యం. ఎంత మనోహరమైన వర్ణన!

. పై ననిశంబు సల్లుకొను పాంసువుపై ఖగతుండఖండితా
లానమహామహీరుహఫలచ్యుత బీజము లుత్క్షిపత్కరాం
భోనిబిడాఫ్లుతి న్మొలవఁ బొల్చు నగమ్యతఁ దూలుచు న్బురో
ద్యానముల న్మదేభములు ప్రాణముతోడినగంబులో యనన్.


( ఈ పద్యం రాఘవ స్వరంలో. రాగం. ఆభేరి.. )
ఇక ఆ పట్టణంలోని ఏనుగులు ప్రాణములున్న పర్వతములవలె ఉన్నాయి. అదెలాగంటే ఏనుగులు తమ స్వభావసిద్ధంగా నిత్యం శరీరంపై దుమ్ముధూళి చల్లుకుంటాయి. ఆ మట్టిలో పక్షులు తిని పడేసిన ఫలాల విత్తనాలు, యేనుగులు తొండముతో తమపై చల్లుకొను నీటివల్ల తడిసి మొక్కలు వచ్చి చెట్లుగా మారాయి. అందుకే పురవీధులలో ఊగుతూ తిరుగుతున్న మదపుటేనుగులు ప్రాణమున్న పర్వతాల్లాగా అగుపిస్తున్నాయి. అంత భారీగా ఉన్నాయని కవి భావం.

శా. మౌనిక్రోధ విధూత పత్త్రములమౌ మాతో సపత్త్రల్గదా
కానీ రండని కేకరాక్షిరుచి మొక్క ల్ప్రక్కల న్శార్ఙ్గతూ
ణానల్పాహిపకల్ప కాండతతులం దారం బురిం బొల్చు నా
జానేయంబులు ఫేనహాస మిడి కైజామోర లల్లార్చుచున్.


(ఈ పద్యం సనత్ స్వరంలో )
ఏనుగులే కాక మధురాపురంలోని అశ్వములు కూడా మేలుజాతికి చెందినవే. కళ్లెము పైకెత్తి బిగించికట్టుటవలన సదా పరుగుతీయడానికి సర్వసన్నద్ధమై ఉంటాయి. ఆ గుఱ్ఱాలు కళ్లెము బిగించబడిన ముఖము అల్లార్చుతూ, కడకంటితో అటునిటు వ్రేలాడకట్టబడ్డ ధనుర్బాణాలని చూస్తున్నాయి. ఆ చూపులు ఎలా ఉన్నాయంటే - "మాకు మునిశాపము వలన ఎగిరిపోవడానికి ఱెక్కలు లేవు. సర్పరాజుల్లాంటి బాణాల్లారా! మీకేమో ఱెక్కలు ఉన్నాయి. ఐనా పర్లేదు పరిగెత్తే వేగంలో మాతో పోటీకి రండి చూద్దాం" అని ఆ బాణములతో సవాలు చేస్తున్నట్టుగా ఉన్నాయి. వాటి నోటినుండి వస్తున్న నురగ వాటి పరిహాసంలా ఉంది. కడకంటి చూపు, నోటి నురుగు, కైజామోర ఇవన్నీ గుఱ్ఱాలకి సహజ లక్షణాలు. ఈ లక్షణాలని బాణాలతో పోటీ పడ్డట్టుగా చిత్రించడం ఉత్ప్రేక్ష. అంటే ఆ గుఱ్ఱాలు బాణం కన్నా వేగంగా పరిగెత్తగలవన్న మాట!

ఆజానేయం అన్నది ఆఫ్రికా ఖండంలో ఒక దేశమట. అక్కడనుంచి దిగుమతయిన గుఱ్ఱాలు ఆజానేయములు. గజ, తురగ, రథ, కాల్ బలాలు చతురంగబలాలు. రాయల కాలంలో గజ సైన్యం ఎక్కువగల రాజులు గజపతులు. అశ్వసైన్యం ఎక్కువ కలవారు మహమ్మదీయ రాజులు. విజయనగర రాజులు నరపతులు. అంటే కాల్బలం ఎక్కువ ఉన్నవాళ్ళు. మహమ్మదీయ రాజులని జయించడానికి రాయలు అశ్వసైన్యాన్ని బాగా అభివృద్ధి చేసాడని చరిత్ర చెపుతోంది.

Sunday, October 31, 2010

సౌధ వర్ణన

ప్రబంధాలకు అష్టాదశవర్ణనలు సర్వసాధారణం. అందునా అష్టదిగ్గజాలతో నిత్యం గడిపే రాయలవారి సంగతి వేరే చెప్పేదేముంది?

ఆదికవి అన్న బిరుదు లేకపోతే మరేం ఫర్వాలేదుగానీ అసలు ఈ అష్టాదశ వర్ణనలకు ఆద్యుడు నన్నెచోడుడే! అలాగే వస్తుకవిత అనే పదం వాడి ముందు తరాలవారికి నాంది పలికిందీ ఆయనే.. ఆయనబాటనే అందరూ పట్టారు. ప్రకృతిని వాస్తవంగా కళ్లకు కట్టినట్టు వర్ణించేది వస్తుకవిత అని ఆర్యోక్తి. రాయలవారు ప్రాజ్ఞనన్నయ యుగం నుండి ప్రబంధయుగం వరకూ వచ్చిన ప్రబంధాలన్నీ తెలుసుకొని కవితారచన చేబట్టాడేమో! లేకపోతే కత్తి పట్టి కదనరంగాన కుత్తుకలు కత్తిరించే చక్రవర్తి కలం నుండి ఇంత అందమైన వర్ణనలా? అందుకే ఆముక్తమాల్యద ప్రౌఢ ప్రబంధం అంటారు.

. అడుగున నుండియు నృదిలమై చద లంటెడుకోట నొప్పు ప్రో
ల్చెడనికడంక దంచనపుఁ జేతుల గంగను కాసెఁ దూఱంగా
నడుమన యున్కిఁజేసి యల నాకపురిన్ సరికై పెనంగి లా
వెడలఁగఁ బట్టివ్రేయుటకు నెత్తైనన న్జను మల్లుపోరునన్.


( పై పద్యం రవి స్వరంలో )

ఎంత మంచి వర్ణన! మధురాపురంలోని కోట పునాదులనుండి ప్రాకారాల వరకు మిక్కిలి బలిష్టంగా నిర్మించబడింది. దాని ప్రాకారాలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. ఆకాశగంగ స్వర్గాన్ని చుట్టుకుని వలయాకారంగా ఉంటుంది. అది ఎలా కనిపిస్తుందంటే స్వర్గమనే యోధుడు గంగను కాసెగా(నడుముకు చుట్టుకునే వస్త్రం) చుట్టుకున్నట్టుగా ఉంది. ఇక కోట ప్రాకారం పైన ఉన్న పొడవైన దంచనం లేదా ఫిరంగులు మధురాపురమనే మల్లయోధుడి దీర్ఘబాహువులుగా ఉన్నాయి. ఇక్కడ మనం ఒక విశేషం చెప్పుకోవచ్చు. మల్లయుద్ధంలో బలిష్టుడైన యోధుడు వైరియోధుడి నడుముకు ఉన్న కాసెను పట్టుకుని ఎత్తి పడవేస్తారు. ఇది మల్లయుద్ధంలోని బంధ విశేషం. అదే విధంగా మధురాపురమనే యోధుడు స్వర్గమనే వైరియోధుడి నడుముకు కాసెగా ఉన్న గంగను పట్టుకుని ఎత్తి పడవేయడానికి చాచిన చేతుల్లా ఉన్నాయట దంచనాలు ( గొప్ప పొడవైన ఆయుధ విశేషం ). అంటే కోట ప్రాకారాలు స్వర్గాన్ని తాకుతున్నట్టే కదా. ఇక్కడ ఇద్దరు యోధులను గురించి ప్రస్తావించాడు కవి. గంగను కాసెగా చుట్టుకున్న స్వర్గం ఒకడు, మధురాపురమనే జెట్టి ఇంకొకడు. ప్రస్తావన వల్ల మధురాపురంలోని కోట శత్రుదుర్భేధ్యంగా ఉన్నదని అర్ధమవుతుంది..



. స్థిరసౌధాగ్రవిహారి యౌవతరతిచ్చిన్నాచ్ఛహారస్ఫుర
ద్గురుముక్తావళిఁజేటిక ల్విరులతోఁ గూడంగఁ ద్రోయ, న్నిజో
దరలగ్నం బగుదాని, నెమ్మొగి లదస్థ్సంబై తఱిన్ రాల్ప, నా
కర మభ్రం బని యండ్రుగా కుదధిఁ దక్క న్బుట్టునే ముత్తెముల్.


( పద్యం రాఘవ స్వరంలో .. రాగం . హంసధ్వని )

పురవర్ణనలో మేడలు,మిద్దెలు, వాడలు, తోటలూ, దారులు, ఉద్యానవనాలు విపులంగా,రమణీయంగా వర్ణించడం ఆచారం. ఊరిలోని ఇళ్లు, మేడలకూ ఎంత అతిశయోక్తి!
మధురాపురిలో ఉన్న మేడలు ఆకాశంలో ఉన్న మేఘాలను తాకుతూ ఉన్నాయి. ఒక్కోసారి మేఘాలకంటే కూడా ఎత్తులో ఉన్నాయంట. అక్కడి మేడలలో ఉండే స్త్రీలు రతిక్రీడ సమయంలో వారి కంఠహారాలు తెగి ముత్యాలు రాలిపోయాయి. ఉదయం కసువు చిమ్మేవేళ పరిచారికలు పూలతోపాటు నేలరాలిన ముత్యాలను కూడా చిమ్మి మేఘాల్లోకి తోసేసారు. వర్షాకాలంలో మేఘాలలోని ముత్యాలు వర్షంతో పాటు భూమి మీద పడినప్పుడు ప్రజలు ఆహా ముత్యాల జన్మస్థానం సముద్రమొక్కటే కాదు మేఘాల నుండి కూడా ముత్యాలు పుడతాయి అని అనుకున్నారంట.



. ఘనసౌధాళి వియద్ధునీజలధి వీఁక న్నావలై నీడదోఁ
నెలంత ల్వణిగాకృతి న్సరకు మార్పన్గోలల న్గట్టి యి
చ్చు నిజద్వీపవిచిత్రట్టవసనస్తోమంబు నాఁ బొల్చుఁ బె
ల్లనిలాన్యోన్యవిమర్శితన్న గరనాకానేక కేతుచ్ఛటల్.


( ఈ పద్యం రాఘవ స్వరంలో... రాగం బిళహరి)
మధురాపురంలో ఉన్న మేడలు చాలా ఎత్తుగా, పెద్దగా ఉన్నాయి. ఆకాశగంగ అనే సముద్రంలో మేడలనీడ ఓడల మాదిరిగా కనిపిస్తుంది. మేడలమీద ఉన్న స్త్రీలు, వ్యాపారార్ధం ఓడలమీద ఉన్న బేరగాళ్ల మాదిరిగా ఉన్నారు. మేడలమీద గడలకు కట్టిన వస్త్రాలు గాలికి రెపరెపలాడుతున్న దృశ్యం ఎలా ఉందంటే స్త్రీలు తమ ద్వీపంలోని పట్టువస్త్రాలను ద్వీపాంతరవాసులకు భాండ ప్రతిభాండ పద్ధతిలో విక్రయిస్తున్నట్టుగా రెపరెపలాడుతూ ప్రకాశిస్తున్నాయి అని ఉత్ప్రేక్షాలంకారంతో చక్కగా వివరించాడు కవి.



.సోరణగండ్ల రాఁ గొదమచుక్కలు పట్ట సతు ల్కవాటము
ల్చేరుప మౌక్తికంబు లని చిల్లులు వుత్తురు మ్మటంచుఁ బొ
ల్పారువితానహారములయం దొగి హారత వ్రేలి ప్రొద్దు వోఁ
గా రతి డస్సి గాడ్పులకుఁగాఁ దెఱవ న్జను విచ్చి మేడలన్


(పై పద్యం రాఘవ స్వరంలో)
రాగం: కల్యాణి

విల్లిపుత్తూరులాగా మధురానగరంలో కూడా మేడలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. మేడల పై అంతస్థులోని కిటికీలు తెరిచి ఉంటే చిన్న చిన్న నక్షత్రాలు వాటినుండి ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. వాటిని పట్టుకోవడానికి ఇళ్లలోని స్త్రీలు కిటికీ తలుపులు మూసేస్తారు. అప్పుడు అవి అక్కడే చిక్కుబడిపోతాయి. స్త్రీలు తమను పట్టుకొని ముత్యాలలాగా భావించి , చిల్లులు పొడిచి హారాలలో కట్టుకుంటారేమోనని భయపడి చుక్కలు వాళ్లకు దొరక్కుండా ఇళ్లల్లో వేలాడే ముత్యాల చాందినీల మధ్య కలిసిపోయి కనబడకుండా యిరుక్కుంటాయి. రాత్రి గడిచిన తర్వాత రతిక్రీడలో అలిసిన స్త్రీలు గాలికోసం కిటికీ తలుపులు తీస్తారు. అప్పుడు చుక్కలు చల్లగా తప్పించుకొని బయటకు వెళ్లిపోతాయి. ఇంత వర్ణన ఎందుకా అనుకుంటే మేడలు ఆకాశంవరకు ఉన్నాయని చెప్పడానికేగా.



.ఆపురి సౌధవీధి నధరాధరభూముల గర్జ మున్నుగా
నాపయికి న్వినంబడనియట్లుగ వ్రాలుఘనాళిఁ దార్చి లీ
లాపరతన్ ఘటింపుదురు లాస్యము సేయంగ మెఘరంజి నా
లాపాము సేసి పోషికలాపిఁ గలాపికలాపకుంతలల్.


( పై పద్యం రాఘవ స్వరంలో)
రాగం : మేఘరంజని

మధురానగరంలో మేడలు చాలా ఎత్తైనవి అని చెప్పుకున్నాం కదా. ఎత్తు కూడా మేఘాలకంటే పైన ఆకాశంలో ఉన్నాయంట. మేఘాలు కింది అంతస్థుల ప్రాంతంలో ఉంటాయి. అవి ఉరిమినా పై అంతస్థులో ఉన్నవారికి వినబడవు. పై అంతస్థుల్లో నెమలి పింఛాల్లాంటి కుంతలాలు గల స్త్రీలు ఉంటారు. వాళ్లు నెమళ్లను పెంచుతున్నారు. కాని మేఘగర్జన నెమళ్లకు వినపడని కారణంగా అవి పురివిప్పి ఆడవు. అందుకే సంగీతంలో నిపుణులైన స్త్రీలు కమ్మగా మేఘరంజని రాగాన్ని ఆలపిస్తారు. రాగానికి ఆకర్షితులై మేఘాలు మెల్లిగా పై అంతస్థుల వైపు కదులుతాయి. అప్పుడు మేఘాల గర్జనకు పులకించిన నెమళ్లు ఆడతాయి. నెమళ్ల ఆటను చూసి స్త్రీలు మురిసిపోతారు. పోషిత కలాపి.. కలాపికలాప కుంతలల్ ....ఎంత రమ్యమైనదీ పదప్రయోగం..

. రవి యనుదివ్వెఁ గేతువు చెఱంగున మూసి ధృతోర్ధ్వయంత్రవా
రవిరళఘర్మ యై కలరవాల్పరవోక్తుల వాంతధూపరా
జివరనిశ న్జనన్మదనచేతులఁ జాతురి నెయ్యపుంగురుం
జువిదలు దార్ప విష్ణుపద మొత్తుఁ బురీగృహలక్ష్మి నూత్న తన్.


( పై పద్యం రవి స్వరంలో)
పురవర్ణనలో మన కవులు అందరినీ వర్ణిస్తారుగాని ఎందుకో పత్రివ్రతల జోలికెళ్లరు. చిమ్మపూడి అమరేశ్వరుడు మాత్రం తన విక్రమసేనంలో ఇలా చెప్పాడు.
తరుణ వయస్కుల యోరన
పరిపాకుల వృద్ధజనుల భటులను నిజసో
దరులను గురులనుగాజూ
తురుపురము పత్రివ్రతా సతుల్ పుణ్యవతుల్
పురంలో ఉండే పత్రివ్రతలు అందరూ పురుషులనూ సోదరులుగా, గురువులుగా భావించి గౌరవిస్తారు అని భావం.

మరి రాయలు పురస్త్రీల గురించి ఏం చెప్పాడో చూడండి. పట్టణంలో ఉండే ధ్వజపటాలు సూర్యుణ్ణి కప్పివేసాయి. ధూపదీపాలు ధూమాలు మెఱిసే విధంగా పురలక్ష్మి ఆకాశాన్ని తాకిందనే అర్ధం చెబుతూ.... కొత్తగా వివాహమైన స్త్రీలు, రాత్రి కాగానే చెలికత్తెల ద్వారా భర్తను చేరి , దీపాన్ని తగ్గించివేసి చిన్నగా భర్తతో సరస సంభాషణ చేస్తున్నారు. గృహంలో ధూపవాసనలు వచ్చుచుండగా భర్త పాదములు ఒత్తుతుంది. ఇది గృహిణుల నిత్యకృత్యం. సర్వసాధారణం. అలాగే మధురాపురలక్ష్మి యనే స్త్రీ రాత్రికాలంలో రత్యనుకూలమై విష్ణుపదములను ఒత్తెను అని.. పురలక్ష్మి తన పెనిమిటియగు విష్ణువు దగ్గరకు చేరునప్పుడు తన పైటచెఱగుతో సూర్యుని కప్పివేసి వెలుగును తగ్గించి, పురసౌధాముల గవాక్షములనుండి వస్తున్న అగరుశ్రీగంధముల ధూపము వ్యాపించగా రాత్రియందు ఆకశమునెడి విష్ణుపాదములు ఒత్తింది అని కవి భావన.. ఎత్తైన భవనాల కురుజులమీద అమర్చిన దారువులు(చేతులవలె) ఆకాశాన్ని తాకుతున్నాయట. అదీ సంగతి.



. గిఱికొనుగోపురా గ్రపరికీలితపంకజరాగరశ్మిఁ
ట్టెఱ యగుచాయఁ బొల్చుదివసేంద్రుఁడు సక్కనమింటఁబోవుచో
మఱచి విధాత పాటలిమ మధ్యమసంధ్యకుఁ జేయ లేనియా
కొఱఁతయుఁ దీర్చుకోఁ దొగరు కొల్పినకై వడిఁ బట్టణంబునన్.


( పై పద్యం రవి స్వరంలో)

అది మధ్యాహ్నవేళ మధురాపురంలోని గోపురాల పైభాగాన సూర్యుడు ప్రకాశిస్తున్న సమయం. బ్రహ్మదేవుడు సృష్టి చేసే సమయంలో ప్రాతః కాలానికి, సంధ్యాకాలానికి ఎర్రని కాంతులనిచ్చాడు. కాని మధ్యాహ్న సమయాన్ని మరచిపోయాడేమో. అందుకే కొఱత తీర్చడానికే సూర్యుడు మధురాపుర ద్వారాలకు చెక్కబడిన పద్మరాగమణులపై ప్రకాశించి ఎఱ్ఱనైన కాంతిని కలుగచేస్తున్నాడంట..

Friday, October 15, 2010

మధురానగర వర్ణన

ఆముక్తమాల్యద ద్వితీయ ఆశ్వాసం మధురాపుర వర్ణనతో మొదలవుతుంది. పాండ్యరాజ్యానికి రాజధాని మధురాపురము. ఇక ఆ పురవర్ణనలు ఏ విధంగా ఉన్నాయో చూడండి.


సీ. ఏవీట సతులపాలిండ్లపై గంబూర
నవహారములచిప్ప కవుచు మాన్చు
మలయజం బేవీటఁ దొలుచెక్క డులిచి మే
డలకిడ్డ మిగుల భూములకు డిగ్గుఁ
గలఁచు నేవీటి సింహళగజంబుల గాలి
చైత్రవేళ నుదగ్దిశాగజంబుఁ
దాల్తు రేవీటి ప్రాక్తనభూపనిర్మాల్య
మరకతంబులు పెఱధరణిపతులు.

తే. కపివర నియుక్త గిరిసదృ గ్గహననిలయ
గాత్రగాహితకనకముక్తాకవాట
గోపురావేదితోచ్చతాక్షోభ్యవప్ర
దనరు దక్షిణమధుర సాంద్ర ద్రుమ ధుర.

( ఈ పద్యం రాఘవ స్వరంలో)
రాగం . మలయ మారుతం

ఈ పట్టణములోని స్త్రీలు తమ స్తనముల మీద కర్పూరం అద్దుకున్నారు. ఆ కర్పూరపు సువాసనలు వారు ధరించిన ముత్యాల హారములలోని ముత్యాలకు అంటుకున్న చిప్పవాసనను పోగొడుతున్నాయి. అంటే అక్కడికి సమీపంలో ఉన్న తామ్రపర్ణీ నదిలో నుండి వెలికితీసిన ముత్యపుచిప్పలనుండి తీసిన తాజా ముత్యాలను ఆ స్త్రీలు ధరించేవారన్నమాట. వాటికి అంటుకున్న చిప్పవాసన పోగొట్టడానికే ఆ కర్పూరధారణం.. ఇక్కడ మనం మరో విషయం చెప్పుకోవచ్చు. అన్నమయ్య రాసిన ఒక గీతం

ఉదయాద్రి తెలుపాయె నుడు రాజు కొలు వీడె
అద నెరిగి రాడాయె నమ్మ నా విభుడు... అంటూ..
పన్నీట జలక మార్చి పచ్చకప్పురము మెత్తి
చెన్ను గంగొప్పున విరులు చెరువందురిమీ..

అని ఒక విరహ నాయికను వర్ణిస్తాడు అన్నమయ్య.
అంటే ఆ రోజుల్లో.. స్త్రీలు అలంకరణ విధానము తెలుస్తోంది. పన్నీట జలకమాడడం, పచ్చకర్పూరాన్ని స్తనాలపై అద్దుకోవడం ఆనాటి ఆచారం అని తెలుస్తోంది.

ఇక ఆ పట్టణంలోని మేడలన్నింటిని మలయపర్వతం నుండి తెచ్చిన శ్రీగంధపు చెక్క వాడేవారు. ఆ మేడల నిర్మాణం అయ్యాక మిగిలిన గంధపు చెక్కను ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. ఆ నగరంలో సింహళ దేశంనుంచి తెప్పించిన ఏనుగులున్నాయి. చైత్రమాసంలో (వసంతంలో) ఆ ఏనుగుల మదపువాసనతో దక్షిణంనుండి ఉత్తరంగా వీచే గాలి ఉత్తర దిగ్గజం మనసుని కలతపెడుతోంది. ఉత్తర దిక్కు గజం పేరు "అంగన". అంచేత అది ఆడఏనుగు. మధురలో ఉన్న సింహళ ఏనుగులు మదపుటేనుగులు. అంచేత వాటి మదపు వాసనకి ఆ ఉత్తర గజం వ్యామోహితమవుతోంది. ఇక్కడ ఏనుగులను గురించి మరో విషయం గురించి చెప్పుకోచ్చు.. అదేమిటంటే.. మహా భాగవతం లో రుక్మిణీ సందేశం లో.. "ధన్యున్, లోక మనోభిరాముఁ, గుల విద్యా రూప తారుణ్య సౌజన్య అనే పద్యం లో, రుక్మిణి.. "రాజన్యానేకపసింహ!" అంటుంది కృష్ణుడిని.. అంటే.. ఈ పద్యములో రుక్మిణి, ఆ శౌరిని ఉద్దేశించి ఒక గంభీరమైన సంబోధన ప్రయోగించింది. "రాజన్యానేకపసింహ!" అనేది ఆ సంబోధన! "అనేకపము" అంటే "మదపుటేనుగు" అని అర్థం. "రాజన్యానేకపసింహ" అనగా "మదించిన ఏనుగుల్లాగా గర్వంతో క్రొవ్వి సంచరించే రాజులకు సింహంలాంటివాడు" అనే అర్థం వస్తుంది. కృష్ణుడిని.. మదపుటేనుగు తో పోల్చాడు పోతన. అది కవి సందర్భం. మదపు వాసనకి ఆ ఉత్తర గజం వ్యామోహితమయినట్టుగా.. రుక్మిణి..కృష్ణుడి వశమయిందనా? లేక, రాబోయే రణాన్ని గూర్చి అలా అనిందనుకోవలా? ఏమైనా అనుకోవచ్చు. ఆ ఊరి పూర్వరాజులు ధరించి వదిలేసిన పచ్చలను ఇతర రాజులు ధరించేవారు. అనడంలో ఆ పట్టణం ఉత్తమ రత్నాలకు నెలవుగా ఉండేదని కవి భావం. చివరి ఎత్తుగీతిలో భావానికి వాల్మీకి రామాయణంలోని ఈ శ్లోకం ఆధారం. సుగ్రీవుడు వానరులందరినీ దక్షిణ దిక్కుకి పంపిస్తూ అక్కడ దేశాల గురించి వివరిస్తాడు. అందులో పాండ్యదేశ ప్రసక్తి వస్తుంది.

తతో హేమమయం దివ్యం ముక్తా మణి విభూషితం
యుక్తం కవాటం పాణ్డ్యానాం గతా ద్రక్ష్యథ వానరాః

పాండ్యరాజ్యంలో ముత్యాలతోనూ, మణులతోనూ అలంకరింపబడిన సువర్ణమయమైన ముఖద్వారంతో ఉన్న కోట గోడ కనిపిస్తుంది. ఆ రాజ్యంలో కూడా సీతని వెతకండి. అని దీని అర్థం.
అలా సుగ్రీవుని ఆజ్ఞతో కొండలవంటి శరీరంగల వానరులు ప్రవేశించడానికి వీలైనంత ఎత్తైన ద్వారాలు కలిగి ఉంది మధుర కోట అని ఈ పద్యంలో వర్ణించారు రాయలవారు.

కం. శమనరిపుత్రిపురభిదో
ద్యమవద్దోర్వర్జ్యవలయిత స్వర్ణగిరి
భ్రమదంబై కాంచనవ
ప్రము దీప్రం బగుచు నప్పురంబున నొప్పున్.


( ఈ పద్యం రాఘవ స్వరంలో)
రాగం .... కదనకుతూహలం

మధురాపురిలోని బంగారుకోట వలయాకారంలో, శివుడు త్రిపురములు గెలుచుటకు ఉపయోగించిన మేరుపర్వతమనే ధనుస్సుని యుద్ధం ముగిసాక ఇక్కడ పడవేసాడా అన్నట్టుగా ఉంది! ఆ కోట ఎంత దుర్భేద్యమో అనే ఊహ ధ్వనిస్తోంది. అప్పటి కోట నిర్మాణం అంత పటిష్టంగా, శత్రుదుర్భేద్యంగా నిర్మించేవారు. అందుకే దాన్ని మేరుపర్వతమంత శక్తివంతమైన శివుని ధనుస్సులా ఉందని కవి వర్ణిస్తున్నాడు.

తే.సొరిదిఁ గనుపట్టు హేమరశ్ములు సెలంగఁ
బొడవుకతమున సూక్షమై పొల్చుఁ జూడఁ
బట్టణము కోటకొమ్మలపంక్తి గగన
మండలశ్రీకి సంపంగిదండవోలె.


( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

మధురాపురిలోని కోట చాలా పొడవుగా నిర్మించబడింది. సువర్ణప్రభలు విజృంభించుచున్నవేల వరుసగా ఉన్న ఆ కోటబురుజులు ఆకాశలక్ష్మి ధరించిన సంపంగి దండలవలే ప్రకాశిస్తున్నాయి. దీనివల్ల ఈ కోట ఆకాశంలా చాలా విశాలంగా ఉందని అర్ధమవుతుంది.


తే. కాద్రవేయులు భూమియుఁ గైకొనంగ
నురగలోకంబు వెడలి తత్పరిఖనీట
నెగసి తోడనె క్రుంకుదు ర్నిలువ లేక
తత్తటాబద్ధగారుత్మతముల కులికి


( ఈ పద్యం రవి స్వరంలో)

సర్పములు భూమిని కూడా ఆక్రమించాలనే దురుద్ధేశంతో పాతాళలోకం నుండి బయలుదేరి ఆ పురములోని అగడ్త నీటినుండి పైకి లంఘించాయి. కాని ఆ అగడ్త ఒడ్డునంతా చెక్కబడిన గరుడపచ్చలను చూసి బెదిరి , భయపడి వెంటనే అదే నీటిలో మునిగిపోయాయి. సర్పములకు గరుత్మంతుడు శత్రువు. ఆ పచ్చలు ఆ గరుత్మంతుని చాయను తలపిస్తున్నాయని ఇక్కడ కవి భావము. ఆ మధురానగర కోట చుట్టూ ఉన్న అగడ్త పాతాళమంత లోతన్నమాట! గరుత్మంతుని నేత్రాలు ..పచ్చని మణి భూషితాల్లాగా.. ప్రకాశిస్తూ ఉంటాయి అని రాయలు సందర్భోచితంగా, అందంగా, అన్యాపదేశంగా చెప్పాడు. అయినా రాయలకు పచ్చలంటే భలే ఇష్టం. 1519లో రాయలు సింహాద్రినాథుని దర్శించుకుని కోట్ల విలువైన పచ్చలపతకం, కంఠాభరణాలు, శంకుచక్ర పతకం, కిరీటం వంటి ఆభరణాలు సమర్పించారు. అయన కిరీటం లో పచ్చల మణి తేజో వంతం గా ప్రకాశించేదని అంటారు. అందువల్ల రాయలవారు "పచ్చల" ప్రసక్తి వస్తే.. చాలు, రెచ్చిపోతారు. ఉపమా కాళిదాసస్య.. అన్నట్టు.. దేనితోనైనా పోలుస్తూ ఉంటారు.
Related Posts Plugin for WordPress, Blogger...