తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Sunday, June 9, 2013

తిరిగి యామునాచార్యుని కథలోకి...

గత రెండు టపాలలో రాయలవారి వర్షశరదృతు వర్ణనావైభవాన్ని కాస్తంత రుచిచూసాం. ఇహ యిప్పుడు మళ్ళీ అసలు కథలోకి ప్రవేశిద్దాం. ఈ వర్షర్తు వర్ణన అసలు ఏ సందర్భంలో వచ్చింది? యామునాచర్య కథలో వచ్చింది. ఆముక్తమాల్యదలో యామునాచార్యుని కథ ఎందుకు వచ్చింది? విష్ణుచిత్తుడు ఎలా అయితే పాండ్యరాజు కొలువుకి వెళ్ళి అక్కడ విశిష్టాద్వైతాన్ని స్థాపించాడో సరిగ్గా అలాగే యామునాచార్యుడు కూడా తన కాలంలో పాండ్యరాజు సభకి వెళ్ళి, అక్కడి పండితులని వాదంలో ఓడించి, విశిష్టాద్వైత మతాన్ని స్థాపిస్తాడు. ఈ కథ స్వయంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెపుతున్నాడు. యామునాచార్యుని గెలుపుకి పాండ్యరాజు పరమానందం చెంది, తన చెల్లిలినిచ్చి అతనికి పెళ్ళి చేస్తాడు. అర్ధరాజ్యాన్నిచ్చి రాజును కూడా చేస్తాడు. అలా ఆ ఆచార్యుడు పాలకుడవుతాడు! శత్రురాజులపై దండయాత్రలు చేసి, వారిని జయించి, రాజ్యాన్ని సురక్షితంగా ఉంచడం రాజధర్మం. అంచేత జైత్రయాత్రలకి బయలుదేరడానికి సిద్ధపడతాడు. కాని వచ్చేది వానాకాలం కాబట్టి, ఆ కాలం దండయాత్రలకి అనువైనది కాదు కాబట్టి, కొంత వేచి ఉండమని మంత్రులు సలహా యిస్తారు. అలా వచ్చిన వానాకాలాన్ని అద్భుతమైన పద్యాలలో వర్ణించారు రాయలవారు. ఆ తర్వాత వచ్చిన శరదృతు వర్ణన కూడా కిందటి టపాలో చూసాం కదా. శరత్తు జైత్రయాత్రలకి మంచి అనువైన కాలం. ఎందుకంటే, అటు తీవ్రమైన ఎండలు కాని, యిటు జడివానలు కాని యీ కాలంలో బాధించవు. చలికూడా అంత తీవ్రంగా ఉండదు. నదీనదాల ప్రవాహ ఉద్ధృతి తగ్గుతుంది. దీర్ఘ ప్రయాణాలు చేయడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ప్రకృతి. అంచేత జైత్రయాత్రలకి అది సరైన సమయం. రామాయణంలో కూడా శరదాగమంతోనే సీతాన్వేషణ మొదలుపెడతుంది వానరసేన. యామునాచార్యుడు కూడా శరత్కాలం ప్రవేశించడంతో దండయాత్ర చేసి శత్రురాజులని జయిస్తాడు.

జన్నములు చేసి, దానము
లన్నానాదేశ విప్రులం దనుపుచుం, సం
పన్నత ననిశము బహుభో
గోన్నతుడై యాదమఱచి యుండె నశంకన్

(ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

శత్రుభయం తొలగడం వల్ల రాజ్యపాలన సుఖశాంతులతో సాగింది. యజ్ఞాలు చేస్తూ, దానాలతో దేశదేశాల విప్రులను సంతృప్తిపరుస్తూ, సకలసంపదలతో నిత్యమూ అనేక భోగాలను అనుభవిస్తూ నిశ్చింతగా (ఆదమఱచి) ఉన్నాడు యామునాచార్యుడు.

 
తత్పితామహుడైన నాథముని శిష్యు
డైన శ్రీపుండరీకాక్షు ననుగు శిష్యు
డైన శ్రీరామమిశ్రాఖ్యు డార్తి దనదు
పరమగురు పౌత్రునకు నిట్టి బంధమెట్లు?
( ఈ పద్యం రాఘవ స్వరంలో ... రాగం - అరభి)

యామునాచార్యుడలా చక్కగా రాజధర్మానుసారంగా పరిపాలనం చేస్తూ ఉన్నాడు. యామునాచార్యుని తాతగారు నాథముని. శ్రీవైష్ణవ ఆచార్య పరంపరలో మొట్టమొదటి ఆచార్యుడు నాథముని. వైష్ణవ ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధాలను (వీటినే నాలాయిర ప్రబంధాలు అంటారు. నాలాయిరం అంటే తమిళంలో నాలుగువేలు అని అర్థం) సేకరించి ప్రచారం చేసిన ఆచార్యుడు నాథముని. ఆ నాథమునికి పుండరీకాక్షుడనే శిష్యుడున్నాడు. ఆ పుండరీకాక్షుని శిష్యుడు శ్రీరామమిశ్రుడు. ఈ శ్రీరామమిశ్రునికి యామునాచార్యుడు అలా రాజ్యపాలనలో మునిగిపోవడం బొత్తిగా నచ్చదు! నాథమునివంటి గొప్ప ఆచార్యునికి మనుమడైన యితను యోగసామ్రాజ్యాన్ని వదిలేసి లౌకిక సామ్రాజ్యానికి దాసుడైపోవడం సరికాదనిపిస్తుంది. 


తొడిబడి విషయాతురు నవి
విడు మనియెడు కంటె గలదె వేఱే పగ? నే
ర్పడర గథాదుల నొక వెం
బడి దోపం బలికి మైత్రి బాపుట యొప్పున్
 
(ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)

అయితే, ఇంద్రియవిషయాలపై మనసు లగ్నమైన వాని దగ్గరకి వెళ్ళి, అవి విడిచిపెట్టు అని తొందరపడి సూటిగా చెప్పేస్తే, అంతకన్నా అయిష్టమైన విషయం అతనికి మరొకటుండదు. నేర్పుగా కథల్లాంటివి చెప్పి, క్రమక్రమంగా తనంత తనకే తోచేట్టుగా స్నేహంగా చెప్పడమే మంచిది - అని అనుకుంటాడు శ్రీరామమిశ్రుడు. లోకంలో కొడుకుల దుర్వ్యసనాలను నివారించడం తండ్రికే సాధ్యపడదే. ఇక రాజ్యవ్యసనం మాన్పించటానికి ఎవడి తరం? - అని కుడా అనుకుంటాడు.నల్లగ్రోల నిచ్చి మెల్లన చివ్వంగి
నోటి జింక దివియు నేరుపొదవు
వేటకాడు వోలె విషయాళి వలన ద
త్తృష్ణ దీరనిచ్చి త్రిప్పుటొప్పు
(ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

నల్ల అంటే నెత్తురు అనే అర్థం ఉంది. చివ్వంగి అంటే సివంగి, చిరుత. సివంగి జింకని వేటాడి పట్టుకుందనుకుందాం. దాని నోటినుండి ఆ జింకని బయటకి లాగాలంటే, ముందు దాన్ని ఆ జింక రక్తాన్ని త్రాగనివ్వాలి. అప్పుడు దానికి కాస్త ఆకలి తీరి కొంత ఆదమరుపు వస్తుంది. అలాంటి సమయం చూసి మెల్లిగా దాని నోటినుండి నేర్పుగా వేటగాడు జింకని బయటకి లాగ గలుగుతాడట! అంతే కాని తొందరపడి ముందే లాగుదామని చూస్తే అది అసలే ఆకలి మీద ఉంటుందేమో, ముందు వీడి మీదపడి వీడి పని కానిచ్చే ప్రమాదం ఉంది. అలాగే విషయలోలుడైన వాడికి కాస్త ఆ దాహాన్ని తీరనిచ్చి ఆపై అతని మనస్సు మళ్ళించే ప్రయత్నం చెయ్యాలి. ఇది రాయల మార్కు పోలిక! సివంగి నోటినుండి జింకని బయటకి ఎలా తీయాలో ప్రపంచ సాహిత్యంలో అసలు వేరే ఎక్కడైనా ఉందా అని నా అనుమానం! అలాంటి విషయాన్ని తీసుకువచ్చి, విషయలోలుడైన వాడి మనస్సుని మరలించే అంశానికి పోలిక చెప్పడం అనేది అనూహ్యం! నిజానికి శ్రీరామమిశ్రుడివంటి వానికి యిలాంటి పోలిక తట్టడం పాత్రపరంగా సరికాదు. ఇంతటి అనూహ్యమైన పోలిక తెచ్చిన రాయలవారి ఊహశక్తికి అబ్బురపాటుతో ఆ అనౌచిత్యాన్ని విస్మరించడమే ఉత్తమం. :)

శ్రీరామమిశ్రుడిలా ఆలోచించి ఆఖరికి యామునాచార్యుడిని యిక విడిచిపెట్టకూడదు, ఎలాగైనా ఉపాయంతో అతని మనసు మార్చాలన్న నిశ్చయానికి వస్తాడు. ఆహారంలో దోషమే వివేకం నశించడానికి అసలు కారణమని, ఆ దోషాన్ని పోగొట్టే మంచి ఆహారం కనక యామునాచార్యుని చేత తినిపిస్తే అతని మనసు మారే అవకాశం ఉందని, నిర్ణయిస్తాడు. అలర్కం అనే ఒక ఆకుకూరని (తెలుగులో దీన్ని ముళ్ళముస్తె అంటారట), ఒక వైష్ణవుడు కానుకగా యిచ్చాడని చెప్పి వంటబ్రాహ్మణుల చేత రాజుకి పంపిస్తాడు. యామునాచార్యుడా కూర వండించుకొని యిష్టంతో తింటాడు. కొన్నాళ్ళకి ఒక రోజు మళ్ళీ ఆ కూర తింటూ ఆలోచించి, దాన్ని పంపిన ఆ వైష్ణవభక్తుణ్ణి తీసుకురమ్మని భటులకి పురమాయిస్తాడు. అప్పుడు శ్రీరామమిశ్రుడు రాజుని కలుస్తాడు. తనకి కానుక పంపాడంటే తన దర్శనం కోరినట్టే కాబట్టి, ఎందుకు తనని కలవాలనుకున్నాడో చెప్పమని అడుగుతాడు యామునాచార్యుడు. అప్పుడు శ్రీరామమిశ్రుడిలా అంటాడు:


మీ పెద్దలు గూర్చిన ని
క్షేపమొకటి సహ్యజాత సింధుజలాంత
ర్ద్వీపమున నుండ నీకుం
జూపంగా వచ్చితిని వసుమతీనాథా!
( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)  
"రాజా! మీ పూర్వులు కూడబెట్టిన నిధి ఒకటి సహ్యపర్వతంనుండి పుట్టిన నది (అంటే కావేరీ నది) మధ్యనున్న ద్వీపంలో ఉంది. దాన్ని నీకు చూపించడానికి వచ్చాను" అని చెపుతాడు. ఇంకా - "నిధినిక్షేపాలు నాకెందుకని అనకు. నిధులూ గనులూ వంటివి రాజుల సొత్తే. కాబట్టి అది నీకు చెందినదే. దాని గూర్చి వివరిస్తాను విను." అని చెప్పి, దాని గురించి యిలా వర్ణిస్తాడు:స్ఫటల మణుల్ గ్రాల శాంతమై శ్వేతమై
నట్టి త్రాచొక్కటి చుట్టియుండు
రక్షోగృహీతమన్ ప్రథ తొల్లి గల దది
పొలయ దందేడాఱు నెలలు గాని
యేపాటి బలియైన జేపడు బ్రాణిహిం
సాది పూజనముల కాసపడదు
తన వెలుంగొగి నిరంజనదృష్టికినె లక్ష్య
మై యుండు నయ్యు నింతంత గాదు

రత్నమొక్కటి పై నపూర్వంబు మెఱయు
గలదు పద్మంబు శంఖంబు, పలుకు లేటి
కక్షయ మనంత మాద్య మేకాంతమందు
భూప! నీకొక్కనికె కాక చూపరాదు


 
( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం - షణ్ముఖప్రియ

తాను చెప్పిన నిధి ఎలాంటిదో వర్ణిస్తున్నాడు శ్రీరామమిశ్రుడు. స్ఫటలు అంటే పడగలు. పడగలపైన మణులు ప్రకాశించే ప్రసన్నమైన తెల్లత్రాచుపాము ఒకటి నిత్యం ఆ నిధిని చుట్టుకొని ఉంటుంది. అది రాక్షసునిచేత గ్రహించబడినదని అనుకుంటూ ఉంటారు కాని, మహా అయితే ఆ రాక్షసుడు ఏడాదికో ఆరునెల్లకో ఒకసారి వచ్చిపోతూ ఉంటాడు అంతే. ఎలాంటి చిన్న పూజకైనా అది వశమైపోతుంది. జంతుబలుల్లాంటి ప్రాణిహింసని ఆశించదు. నిరంజనమైన (అంటే కాటుకలేని ఒక అర్థం, నిర్దోషమైన అని మరో అర్థం) దృష్టికే ఆ నిధినుండి వెలువడే కాంతులు కనిపిస్తాయి. ఆ వెలుగు ఇంతంతని చెప్పలేనంత వెలుగు! పైన ఒక అపూర్వమైన రత్నం మెఱుస్తూ ఉంటుంది. పద్మశంఖాలు కూడా ఉన్నాయి (కుబేరుని నవనిధులలో పద్మశంఖాలు రెండు నిధులు). ఇన్ని మాటలెందుకు. అది అక్షయమైన అనంతమైన నిధి. సర్వశ్రేష్ఠమైనది. ఏకాంతంలో నీకు తప్ప ఇంకెవరికీ చూపించకూడదు.

శ్రీరామమిశ్రుడు వర్ణించిన ఆ నిధి, భక్తుల పెన్నిధి, శ్రీరంగాన కొలువైన రంగనాథుడు! కావేరీ నది రెండు పాయలుగా చీలిన మధ్య ప్రదేశంలో శ్రీరంగం ఉంది, అంచేత అది ద్వీపం. అందులో ఉన్న నిధి శ్రీరంగనాథుడు. పై పద్యంలో మామూలు నిధికి ఉండే లక్షణాలని శ్రీరంగనాథుడనే విశేషమైన నిధికి అన్వయించి చెప్పడం గమనించవచ్చు. సాధారణంగా నిధి నిక్షేపాలు పాడుబడిన భవనాల్లో ఉంటాయి. కాబట్టి వాటి చుట్టూ పాములు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామి శేషశాయి కదా. అంచేత, పడగలపై మణులు ప్రకాశించే తెల్లనిత్రాచు చుట్టి ఉంటుందన్నాడు. అలాగే, రాక్షసులో భూతప్రేత గణాలో నిధినిక్షేపాలని కాపలా కాస్తూ ఉంటాయని అంటూ ఉంటారు. ఇక్కడ కూడా రాక్షసుడు ఉన్నాడు. కాని అతడు పరమ భాగవతుడైన విభీషణుడు. విభీషణుడు శ్రీరంగక్షేత్రాన్ని ఆరునెలలకి ఒకసారి వచ్చి దర్శించుకుంటాడని ఒక కథ ఉంది. దాన్ని యిక్కడ ప్రస్తావించాడు. మామూలుగా నిధులు దొరకడానికి జంతుబలులతో కూడిన పూజలు చేస్తూ ఉంటారు. కానీ యీ నిధి (శ్రీరంగనాథుడు) దొరకాలంటే నిండైన భక్తి కలిగిన కాస్తంత పూజ సరిపోతుంది. నిధినిక్షేపాలని కనుక్కోడానికి అంజనం వేసి చూడ్డం ఒక పద్ధతి. అంటే, మంత్రించిన కాటుక పెట్టుకుంటే నిధి ఎక్కడుందో కనిపిస్తుందని నమ్మకం. కానీ శ్రీరంగనాథుని వెలుగులు చూడ్డానికి అంజనం అవసరం లేదు సరికదా, పైగా నిరంజనదృష్టికే (అంటే స్వఛ్చమైన చూపు) అతను కనిపిస్తాడు! నిధులు రత్నాలతో నిండి ఉంటాయి కాబట్టి, ఇక్కడ కూడా ఒక దివ్యమైన రత్నం పైన మెరుస్తూ ఉంటుంది. అది కౌస్తుభమణి. శ్రీరంగంలో స్వామి శేషశాయి కాబట్టి, అతను పడుకొని ఉంటే, వక్షస్థలంపై కౌస్తుభం మెరుస్తూ ఉంటుందన్న చిత్రాన్ని ఇక్కడ "పైన" అన్న పదంతో రూపుగట్టారు రాయలవారు. సరే పద్మశంఖాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి స్వామివారికి. ఇక యీ నిధి అక్షయము అనంతము అనడంలో సందేహమేముంది!

శ్రీరామమిశ్రుని మాటలకి సంతోషించి ఉత్సాహంతో ఆ నిధిని చూడ్డానికి అతని వెంట బయలుదేరతాడు యామునాచార్యుడు. ఇంకా అతను చూపిస్తానన్న నిధేమిటో అప్పటికి యామునాచార్యునికి తెలియదు. రామమిశ్రుని వెంట శ్రీరంగం వెళ్ళి, పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తాడు. అప్పుడు రామమిశ్రుడు, మీ పెద్దలు కూడబెట్టిన నిధి యిదే స్వీకరించు, అని ఆ రంగపతి దివ్య శ్రీచరణారవిందాలను చూపిస్తాడు.

ఆ పాదపద్మాలను చూసిన యామునాచార్యుని హృదయంలో ఎలాంటి స్పందన కలుగుతుంది? రామమిశ్రుని పరిశ్రమ ఫలిస్తుందా లేదా? ఆపై కథ ఏం జరుగుతుంది? వచ్చే టపాలో తెలుసుకుందాం.

Thursday, April 11, 2013

శరదృతు వర్ణన


ఈ ఆముక్తమాల్యదని ఆసక్తితో చదివే పాఠకమిత్రులందరికీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! వర్షకాలం వెళ్ళి శరదృతువు ప్రవేశించింది. అదేమిటి, వచ్చింది వసంతమైతే శరదృతువు అంటానేమిటని ఆశ్చర్యపోతున్నారా! :-) ఇందులో మీ తప్పేమీ లేదు. ఎప్పుడో నాలుగునెలల కిందట ఆపేసిన కథ, తిరిగి యిన్నాళ్ళకు మొదలుపెడితే మీరెంతకన్న గుర్తుంచుకుంటారు. ఆముక్తమాల్యద కథలో మనం వర్ష ఋతువు వర్ణన దగ్గర ఆగాము. ఇప్పుడు శరదృతు వర్ణన. ఈ ఋతువర్ణనలు అయ్యాక మళ్ళీ అసలు కథలోకి వెళతాము. కొత్త సంవత్సరం సందర్భంగా తీసుకున్న ఒక దృఢసంకల్పం - ఈ ఏడాది చకచకా నెలకొక టపాతో వేగంగా సాగాలని. ఉగాది రోజు చేసినది ఏడాదంతా చేస్తామనే నమ్మకంతోనైనా, ఈ విజయనామ సంవత్సరంలో ఈ కావ్యపఠన విజయవంతంగా కొనసాగి, వీలైతే ముగింపుకి కూడా వస్తుందని ఆశిద్దాం! ప్రస్తుతానికి కావ్యంలోకి మళ్ళీ ప్రవేశిద్దాం.


సాంధ్యరాగలహరి సామిరంజితములై
తిరిగె మింట నిదుర దెలిసినట్టి
యిందిరాధిపతికి నెత్తు కర్పూర నీ
రాజనములన శరద్ఘనములు

 ఈ పద్యం రాఘవ స్వరంలో  - రాగం లహరి

శరత్కాల మేఘాలని వర్ణిస్తున్న పద్యమిది. వానాకాలంలో నీటిమబ్బులు నల్లని రంగులో మెరిస్తే, శరదృతువులో నీరులేని మబ్బులు తెల్లని తెలుపులో వెలిగిపోతూ ఉంటాయి. అలాంటి తెల్లని మబ్బులపై సాంధ్యరాగలహరి, అంటే సంజకెంజాయ, ప్రసరిస్తే? అవి సగం తెలుపు సగం ఎరుపు రంగులో ధగధగలాడతాయి. అవి ఆకాశంలో తిరుగుతూ ఉంటే ఎలా ఉన్నదంటే, అప్పుడే నిద్రలేచిన శ్రీహరికి పట్టిన కర్పూరహారతిలాగా ఉన్నాయట! వర్షాకాలం విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళడం గురించి వర్షాకాల వర్ణనలో చూసాం కదా. శరత్తు ఆయన నిద్రలేచే సమయం అన్నమాట. ఎర్రనికాంతితో వెలిగే తెలిమబ్బులను, హారతికర్పూరంతో పోల్చడం ఎంత మనోజ్ఞమైన ఊహ!నీరజేక్షణుడ వ్వేళ నిదుర దెలిసి
యడుగుదన మీద మోపెనో యవని రమణి
కంటకిత గాత్రి యయ్యె నాగా, విపాక
పరుష కంటక శాలి మంజరులు పొలిచె


పై పద్యంలో నిద్ర లేచిన విష్ణుమూర్తికి నీరాజనాలిచ్చే సన్నివేశం చిత్రించిన కవి యీ పద్యంలో మరో అడుగు ముందుకు వేసాడు. స్వామి నిద్రనుండి లేచి, తనపై అడుగు మోపడంతో అవని రమణి (అంటే భూదేవి) పులకించిందట! శాలిమంజరులు అంటే వరికంకులు. పంట బాగా పండి, శరత్కాలంలో నేలనుండి మొలిచుకొని వచ్చాయి వరికంకులు. వాటికుండే ధాన్యపు గింజలు సూదిగా ముళ్ళల్లా ఉన్నాయి.  అవి భూదేవి మేనిపై పుట్టిన పులకల్లాగా ఉన్నాయట! గోదాదేవంటే భూదేవి అవతారమే. అందుకే రాయలవారి వర్ణనల్లో మనకు మాటిమాటికీ ఆ ప్రకృతీ పురుషుల ప్రస్తావన కనిపిస్తుంది.ఇలకు సుధాసమత్వము రహింప శరజ్జలజాక్షి కుండమం
డలి సలిలంబు గల్మషమడంగ మొగి ల్విరియెండ గాచుచో
జిలుకు నిశారజఃపటలి చెన్ను వహించె దరంగపంక్తిపై
దళదరవింద కైరవ కదంబ కడార పరాగపూరముల్
 
 ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో

"దళదరవింద కైరవ కదంబ కడార పరాగపూరముల్" - వికసిస్తున్న తామరపూలు, తెల్లకలువలు. వాటినుండి ఎగసే పసుపురంగు పుప్పొడి.
"మొగిల్ విరి యెండ" - అంటే మబ్బులు విచ్చుకోగా చక్కగా కాస్తున్న ఎండ.
ఇవి శరత్కాలపు ప్రకృతిలో కనిపిస్తాయి. అంతే కాకుండా, వానాకాలంలో బురదగా ఉండే కొలని నీళ్ళు, వానలు వెలిసాక తేటపడి, త్రాగడానికి తీయగా స్వచ్ఛంగా ఉంటాయి.

వీటన్నిటినీ అనుసంధానం చేస్తూ ఒక కల్పన చేసారు రాయలవారు. స్వర్గంలో సుధ, అంటే అమృతం ఉంటుంది కదా. దానికి సమానంగా భూమిపై నీటిని కూడా అంత స్వచ్ఛంగా చేయలని అనుకున్నదట శరత్తనే జలజాక్షి. నీటిని శుద్ధి చెయ్యడానికి దాన్ని మరిగించి, పసుపు వేస్తారు కదా. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. చక్కగా కాస్తున్న ఎండ అనే వేడితో నీటిని మరిగించి, పూల పరాగమనే పసుపు దానిపై చల్లి నీటిని శుద్ధి చేసిందట శరజ్జలజాక్షి. అలా శుద్ధి చేసిన నీరు చక్కగా తేటపడి కనిపిస్తోందట. జలజాక్షి అంటే మామూలుగా ఉండే అర్థం తామరపూలవంటి కన్నులు కలది అని. శరత్కాలంలో తామరలు బాగా పూస్తాయి కాబట్టి, ఇక్కడ జలజాక్షి అంటే తామరపూవులనే కన్నులు కలది అని కూడా అర్థం తీసుకోవచ్చు. కమలాక్షి, పద్మనేత్రి అనేవి లక్ష్మీదేవి పేర్లు. అంచేత ఇక్కడ శరత్తనే లక్ష్మీదేవి అనే ధ్వనికూడా ఉంది.గగనలక్ష్మి నిజోరు నక్షత్రమాలి
కలు, వియన్నది జలముల గడుగ బిసుక
నెఱయు కుంకుడుబండుల నుఱువులనగ
బలపలని పాండురాంబుద పంక్తు లమరె
 
ఈ  పద్యం లంకా గిరిధర్ స్వరంలో


రాయలవారు తన కల్పనా చాతుర్యంతో దేన్ని దేనితో ముడిపెడతారో ఊహించడం అసంభవం! అలాంటి ఒక అనూహ్యమైన కల్పన యీ చిన్న పద్యంలో కనిపిస్తుంది. శరద్రాత్రులలో ఆకాశంలో చుక్కలు చక్కగా మెరుస్తూ కనిపిస్తాయి. అక్కడక్కడా తెల్లని మబ్బులు తేలుతూ కదులుతూంటాయి. ఆ దృశ్యాన్ని వర్ణిస్తున్నారిందులో. అది ఎలా ఉన్నదంటే, ఆకాశలక్ష్మి, తన ముత్యాలసరాలను (ఇరవయ్యేడు ముత్యాలున్న హారాన్ని నక్షత్రమాల అంటారు) ఆకాశగంగలో కడుగుతోందట. ముత్యాలని కుంకుడుకాయ నురుగుతో కడుగుతారు. అలా పిసికిన కుంకుడుపళ్ళ నురుగులాగా ఉన్నాయట పలుచని తెలిమబ్బు గుంపులు!అప్పుల్ వారిధి చేత బుచ్చికొని, కార్యంబైన ముంగొన్న య
య్యప్పుల్ దౌ చనియున్ సమృద్ధికముగా నవ్వార్ధికే తీర్పగా
నప్పుణ్యాతి విశుద్ధ జీవులు నిజాచ్ఛాంగంబులం దోచున
ట్లొప్పారెన్ శశిబింబ గర్భితములై ద్యోచారి శుభ్రాభ్రముల్
 
ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో.

పై పద్యంలోని తెలిమబ్బుల గురించే మరో చిత్రమైన కల్పన యీ పద్యంలో చేసారు రాయలు. ఇందులో చుక్కల కన్నా ప్రకాశంగా వెలిగిపోతున్న చంద్రబింబాన్ని తీసుకువచ్చారు. అసలే తెల్లని మబ్బులు. వాటి చాటున ఉన్న శశిబింబం చిందిస్తున్న వెన్నెల కాంతిలో అవి తళతళా మెరిసిపోతున్నాయి. పుణ్యాత్ములై, స్వచ్ఛమైన తనుకాంతితో మెరిసిపోతున్నట్లుగా ఉన్నాయట అవి. మబ్బులేం పుణ్యం చేసాయి? అంటే, పద్యమంతా చదివితే తెలుస్తుంది. మబ్బులు వారిధి చేత, అంటే సముద్రంనుండి, అప్పులు తీసుకున్నాయట. ఏమిటా అప్పులు? "అప్"పులే! "అప్" అంటే సంస్కృతంలో "నీరు" అని అర్థం. అంచేత తెలుగులో "అప్పులు" అంటే నీళ్ళు అనే అర్థం కూడా ఉంది. అంచేత అప్పులనే అప్పులుగా తీసుకున్నాయి మబ్బులు, సముద్రంనుండి. తీసుకున్న అప్పు తీర్చాలి కదా. అంచేత, కార్యంబైన, అంటే తమ పని అయిపోయాక, మున్ గొన్న ఆ అప్పుల్, ముందు తీసుకున్న ఆ అప్పులను, దౌ చనియున్ - ఎంత దూరం వెళ్ళినా, సమృద్ధికముగా - వడ్డీతో సహా, ఆ వార్ధికే తీర్పగా - ఆ సముద్రానికే తిరిగి తీర్చేయగా, అవి పుణ్యవతులయ్యాయి!
సముద్రంనుండి తీసుకున్న దానికన్నా ఎక్కువ నీళ్ళు తిరిగి ఎలా యిస్తాయి? అనే సందేహం రావచ్చు. వానాకాలంలో వానలు సమృద్ధిగా కురుస్తాయి అంటాం కాబట్టి వానల పరంగా సమృద్ధిగా కురవడం అనీ, అప్పులు తీర్చే పరంగా వడ్డీతో సహా తీర్చడం అనీ శ్లేష తీసుకోవచ్చు. మరో రకంగా ఆలోచిస్తే, సముద్రం దగ్గర ఉప్పునీటిని తీసుకొని తిరిగి మంచినీటిని ప్రసాదించడం అనేది అవి యిచ్చే వడ్డీ అని కూడా అనుకోవచ్చు.అయనిష్ఠన్ ధవళాతపత్రి దగు నయ్యాగంబు సాగంగ, నం
దు, యమిశ్రేణులు రాగ బుంగవకకుత్స్థుం డల్ల వర్షాదినా
త్యయరాముండు సలక్ష్మణుం డినున కోజోవాప్తిగా, విల్లు ని
ర్దయతంద్రుంప బ్రభగ్న శాల్యవని సీతాలబ్ధి గాకుండునే


ఇది ఒక సంక్లిష్ట కల్పన. పూర్తిగా శ్లేషతో కూడిన ద్వ్యర్థి పద్యం. శరదృతువుకీ రామాయణానికి ముడివేసారీ పద్యంలో రాయలు! శరత్తుకి శ్రీరాముడితో పోలిక చెప్పారు.

అయనిష్ఠన్ - శుభకార్యాలు చేయాలనే కోరికతో లేదా, శుభకాలంలో
ధవళాతపత్రి - తెల్లని గొడుగు కలవాడు (అంటే రాజు. ఇక్కడ జనకమహారాజు) లేదా, తెల్లని తామరపూలే గొడుగులుగా కలది (శరత్కాలానికి సంబంధించినది)
ఆ యాగంబు సాగంగ - జనకుడు చేసే యాగము జరుగుతూ ఉంటే, లేదా, శరత్కాలంలో చేసే వాజపేయమనే యాగం జరుగుతూ ఉంటే
యమిశ్రేణులు రాగ - మునులగుంపులు, లేదా, హంసల గుంపులు రాగా
పుంగవ కకుత్‌స్థుండు - కకుత్‌స్థవంశానికి చెందిన శ్రేష్ఠుడు (అంటే రాముడు), లేదా, మంచి మూపురంగల ఎద్దు,
వర్షా దిన అత్యయ రాముండు - వానాకాలపు ఆకాశంలా ఉన్న రాముడు, లేదా, వానాకాలము వెళ్ళిపోవడం వల్ల మనోహరంగా ఉన్న శరత్తు
సలక్ష్మణుండు - లక్ష్మణుడితో కూడినవాడు, లేదా, బెగ్గురుపక్షులతో కూడినవాడు (శరత్తు)
ఇనునకు ఓజః అవాప్తి కాన్ - సూర్య వంశానికి మరింత తేజం తెచ్చే విధంగా, లేదా, సూర్యకాంతి బాగా ప్రకాశించగా
విల్లు - శివధనుస్సు, లేదా, హరివిల్లు
నిర్దయతన్ త్రుంప - ఎలాంటి జంకు లేక విరిచేయగా
ప్రభగన శాలి అవనిన్ - విరిచిన ఆ ప్రదేశంలో, లేదా, కోయబడిన వరి చేనిలో
సీతాలబ్ధి గాకుండునే - సీతాదేవి లభించదా! లేదా, నాగేటి చాలు ఏర్పడకుండా ఉంటుందా!

రామాయణార్థంలో తాత్పర్యం:
శుభకార్యాలు చేసే కోరికతో జనక మహారాజు చేసే యజ్ఞానికి మునులందరూ విచ్చేసారు. అక్కడకి కకుత్‌స్థవంశ శ్రేష్ఠుడైన నీలమేఘశ్యాముడు, శ్రీరాముడు, లక్ష్మణునితో సహా వచ్చి, తమ సూర్యవంశానికి వన్నె తెచ్చే విధంగా, పరాక్రమంతో శివధనుస్సుని విరిచాక ఆయనకు సీతాదేవి లభించకుండా ఉంటుందా!

శరత్కాల పరంగా తాత్పర్యం:
శుభకాలమైన శరదృతువులో వాజపేయయాగం సాగుతోంది. ఆకాశంలో హంసలూ, తెల్లని కొంగలూ ఎగురుతున్నాయి. వర్షాకాలం అంతమై, ఇంద్రధనుస్సులు అదృశ్యమై, సూర్యుడు బాగా కాంతితో ప్రకాశిస్తున్నాడు.  అప్పుడు, మంచి మూపుగల ఎడ్లతో దున్నబడేందుకు వరిపొలాలు సిద్ధమవుతాయి. వాటిలో నాగేటి చాలు ఏర్పడకుండా ఉంటుందా!

శరత్కాలంలో వరిపొలాలను ఎందుకు దున్నుతారు? అంటే, వరిపంట కోత కోసి మళ్ళీ దున్నడం మొదలుపెడతారని తాత్పర్యం.పరుషాతపతప్తంబగు
ధరణీపాత్రమున బడుట దళమయ్యె జుమీ
పరిపక్వంబై, యనగా 
శరదిందుజ్యోత్స్న రేల సాంద్రత గాసెన్
 
ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో.

రాత్రివేళల శరజ్జ్యోత్స్న చాలా దట్టంగా కాస్తోంది. ఆ చిక్కదనం వెన్నెలకెలా వచ్చింది? అంటే, ఉదయమంతా యెండ తాకిడికి భూమి అనే పెనం వేడెక్కిందిట. అలాంటి వేడి పెనం మీద అట్లపిండిలాంటి వెన్నెల పడి, అది దిబ్బరొట్టెలాగా దళసరిగా అయ్యిందట! ఇలాంటి వర్ణనల్ని చదివినప్పుడు, "ఓరినీ అసాధ్యం కూలా!" అని నోరు వెళ్ళబెట్టడం తప్ప ఎంచేస్తాం! :-) వెన్నెల "పిండారబోసినట్లు" కాసిందని అంటాం కదా. ఆ పిండిని నిజంగానే పొయ్యాల్సిన పెనం మీద పోసారు రాయలవారు!హంసము క్రౌంచము తొలి రా,
మాంసలరుచి వచ్చె దాను మలయము శిఖ; బాల్
హంస విఱువ, నీర్విఱిచెను,
హంసమున కగస్తి పరమహంసం బగుటన్
 
(ఈ పద్యం రాఘవ స్వరంలో - రాగం హంసనాదం)

వివరణ యిస్తే కాని అర్థం కాని రాయల మార్కు పద్యం! శరదాగమనంతో జరిగే మూడు అంశాలని కలిపి ఒక చిన్న పద్యంగా అల్లారు రాయలవారిక్కడ. శరత్కాలంలో, స్వర్గలోక హంసలు, క్రౌంచపర్వతం మద్యన ఉండే రంధ్రం గూండా యీ లోకంలోకి వస్తాయని ఒక కవిసమయం. అలాగే అగస్త్య నక్షత్రం (దీన్నే ఇంగ్లీషులో Canopus అంటారు) దక్షిణాన ఉదయించడం, వర్షాంతాన్నీ శరత్కాల ప్రారంభాన్నీ సూచిస్తుందని ఒక నమ్మకం. ఈ నక్షత్రం ఆగస్టు సెప్టెంబర్లలో కనిపిస్తుంది కాబట్టి బహుశా అలా అంటారు. అయితే యీ నక్షత్రం దక్షిణాన మలయపర్వతం మీదగా కనిపిస్తుంది కాబట్టి, అగస్త్యుడు కొండపైనుండి వచ్చినట్టుగా కవి భావిస్తున్నాడిక్కడ. మూడవది, శరత్కాలంలో బుఱద నీరు బుఱదపోయి తేటపడడం ఇంతకుముందు చెప్పుకున్న అంశమే. ఈ మూడిటినీ ముడివేసి చెప్పారీ పద్యంలో.
హంసమున కగస్తి పరమహంసం బగుటన్ - అగస్త్యుడు హంసలకి పరమహంస కాబట్టి,
హంసలు క్రౌంచ పర్వతము (మధ్య)నుండి తొలిగా వస్తే, ఆ పిమ్మట అగస్త్యుడు మలయగిరి శిఖరం మీదగా అధికమైన వెలుగుతో (మాంసలరుచిన్) వచ్చాడు. హంసలు పాలని విరిస్తే, అగస్త్యుడు నీటిని విరిచాడు. నీటిని విరవడం అంటే, బురదనీటిలో బురదని విరిచి నీటిని తేటపరిచాడని. పాలకన్నా నీరు పలచన కాబట్టి, దాన్ని విరవడం ఇంకా గొప్ప అని ధ్వని. మొత్తానికి అగస్త్యుడు హంసలకన్నా గొప్పవాడు, పరమహంస అని తాత్పర్యం.

దీనితో వర్ష శరత్తుల వర్ణన ముగిసింది. వచ్చే టపాలో, కథ ఎక్కడ ఆగిందో చూసి మళ్ళీ కొనసాగిద్దాం.

Monday, December 3, 2012

వర్షాకాల వర్ణనసరిగ్గా విష్ణుచిత్తునిలాగే, యామునాచార్యుడు పాండ్యరాజు సభలో పండితులను ఓడించి విజయం సాధించాడు. అందరి వాదాలను ఒక్కటొక్కటిగా సహేతుకంగా ఖండించి "విష్ణుమూర్తియే పరమాత్మ, విశిష్టాద్వైతమే గొప్పమతం" అని నిరూపించాడు. అప్పుడు ఆ  మహారాజు యామునాచార్యుని ప్రతిభను గుర్తించి సాష్టాంగ ప్రణామం చేసి పూజించాడు. ఇక్కడే కథ మలుపు తిరిగింది. ఆ రాజు యామునాచార్యుని ప్రతిభకు మెచ్చి తన చివరి చెల్లెలినిచ్చి వివాహం జరిపించి, అర్ధరాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేశాడు.  తాను ఇతర దేవతలను, దేవాలయాలను, భక్తులను కూడా గౌరవిస్తూ, భక్తితో శ్రీహరిని సేవించాడు. ఒక ఆచార్యుడు రాజయ్యాడు.! రాజ్యాభిషేకం తర్వాత యామునాచార్యుడికి అస్త్రశస్త్ర విద్యలు, రాజనీతి, స్వయంగా నేర్పించి, దివ్యాస్త్ర మంత్రాలు కూడా ఉపదేశించాడు పాండ్యరాజు. రాజు అయినవాడు తరచూ శత్రువులపై దండెత్తి జయించి రావాలని హెచ్చరించాడు. కాని వస్తున్నది వర్షాకాలం. వర్షాకాలంలోదండయాత్ర చేయుట తగదని మంత్రి, పురోహితులు వారించారు. ఆ వర్షాకాలాన్ని అద్భుతమైన పద్యాలలో రాయలవారు ఈ విధంగా వర్ణిస్తున్నాడు. మ. తనతోయం బినరశ్ము లెత్త, నిల వాత్యారేణుమూర్తిన్ మహేం

      ద్రునకుం జెప్పగ, మ్రుచ్చుఁ బట్ట దివమందు న్విల్ఘటింపం, భయం

      బునఁ దద్రశ్మిసహస్రము న్వెస డిగెం బో డాఁగి వే గ్రుమ్మరిం

      , ననం ధారలు దోఁచె మించు వెలిఁగింప న్మబ్పుల న్వెల్లిపై.

ఈ పద్యం రాఘవ స్వరంలో ... రాగం - తోడి


వానాకాలంలోని గాలివానని చిత్రిస్తున్న పద్యమిది. ఆకాశంలో ఓ వైపు దట్టని మేఘాలు, మెఱపులు. మరోవైపు ఇంద్రధనుస్సు. దుమ్ము రేపే జోరుగాలి. హోరువాన. ఇవన్నీ ఉన్నాయీ పద్యంలో. వీటన్నిటినీ కలిపి ఒక అందమైన కథ అల్లాడు కవి. భూమి, తనలోని ఉదకాన్ని (నీటిని) సూర్యకిరణాలు ఎత్తుకుపోయాయని, సుడిగాలి రేణువుల రూపంలో వెళ్లి దేవేంద్రుడితో మొఱ పెట్టుకుందిట. వెంటనే ఆ ఇంద్రుడు విల్లంబులు ధరించి ఆకాశంలో దొంగను పట్టుకోవడానికి బయలుదేరాడు. మబ్బుల చాటున మెఱుపుల రూపంలో దాగిన ఆ కిరణాలిది గమనించి, తాము దొంగిలించిన నీటినంతా తొందరగా పారేయాలనే ఆత్రుతతో గ్రుమ్మరించేస్తున్నట్టుగా వర్షం కుండపోతగా కురుస్తోందట!

ఈ వర్ణనలో రాయలవారి రాజధర్మ నిర్వహణ తొంగిచూడటం లేదూ! ఇందులో మరొక విశేషం కనిపిస్తుంది. సూర్యుని వేడిమికి భూమ్మీద నీరు ఆవిరై మేఘాలు ఏర్పడి వానలు కురిసే జలచక్రం గురించిన అవగాహన, కనీసం రాయలనాటి కాలానికి మన దేశంలో ఉందని తెలుస్తుంది. ఆ శాస్త్రపరిజ్ఞానాన్ని అందమైన కథ రూపంలో చెప్పడమూ కనిపిస్తుంది.


 తే. పుట్ట వెడలి నభోభిత్తిఁ బట్టు శక్ర

     కార్ముకపుఁ బెద్ద పలువన్నెకట్ల జెఱ్ఱి

     దైన నడచెడు కాళ్ళగుంపనఁగ గాలిఁ

     గార్కొని దిగంతముల వానకాళ్లు నడచె

ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో...

మెఱుపు కాంతిలోనో సూర్యకాంతిలోనో వర్ష ధారలను చూస్తే, గాలికి ఊగుతూ అవి నడుస్తున్నట్టుగా కనిప్సితాయి. వాటినే వానకాళ్ళంటారు. ఇక్కడ కవి ఆ వానకాళ్ళని వర్ణిస్తున్నాడు. పైన ఆకాశంలో ఏడు రంగుల హరివిల్లుంది. అది రంగురంగుల జెఱ్ఱిలా ఉందట! పుట్టనుండి బయటకు వచ్చి ఆకాశమన్న గోడ మీద నడుస్తున్న ఆ రంగురంగుల జెఱ్ఱి కాళ్ళ గుంపులాగా ఉన్నాయట వానకాళ్ళు!

కాళిదాసు మేఘదూతంలోని "వల్మీకాగ్రాత్ ప్రభవతి హి ధనుఃఖండ మాఖండలస్య" అన్న శ్లోక పాదం యీ పద్యానికి ఆధారం అనిపిస్తుంది. వల్మీకంనుండి ఇంద్రధనుస్సు పుట్టింది అని అర్థం! పుట్టనుండి హరివిల్లు పుట్టడమేమిటని సందేహం. "వల్మికో సాతపో మేఘః" అన్న అమరకోశం ప్రకారం, వల్మీకం అనే పదానికి ఎండతో కూడిన మబ్బు అనే అర్థం కూడా ఉంది. అంచేత అక్కడ కాళిదాసు ఉద్దేశం ఎండ పడిన మేఘంనుండి ఉద్భవించిన ఇంద్రధనుస్సు అని పండితులు వ్యాఖ్యానించారు (ఇంద్రధనుస్సు ఏర్పడడం వెనకనున్న భౌతిక కారణం కాళిదాసు కాలానికే తెలుసననడానికిది రుజువని కూడా అన్నారు). అయితే ఇక్కడ రాయలవారు ఆ పదానికి పుట్ట అనే అర్థమే తీసుకొని, ఆ ఊహకు కొనసాగింపుగా ఆ హరివిల్లుని పుట్టనుండి వెడలిన పలువన్నెల కట్లజెఱ్ఱితో పోల్చారు!

  


 సీ. ఎలగోలుజల్లు మున్ పెళపెళ నేటవా

        ల్పడి గాలి నట్టిండ్లఁ దడిపి చనఁగ

     నట్టె తో వడగండ్ల కట్టావులు దుమార

        మావుల రేఁచి రెండవదియుఁ జన

     మఱి మూఁడవది నిల్చి మెఱసి బిట్టుఱిమి శీ

        కరవారి సృష్టిఁ జీకటిగ నలమ

     నుయ్యెలచేరుల యోజఁ బై పై వెండి

        జల్లుపైజల్లు పెల్లల్లుకొనఁగ తే. భూభిదాపాది దుర్భరాంభోభరంపు

     వడి మరుజ్ఝంఝఁ దెరలక కడవ వంచి

     నట్లు హోరని ధారౌఘ మైక్య మొంది

     విన్ను మన్నును నొకటిగా వృష్టి బలసె.

ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో...


ఈ పద్యంలో అంచెలంచెలుగా కురిసే వానని స్వభావోక్తిలో వర్ణిస్తున్నారు రాయలవారు. మొదటి జల్లు పెళపెళధ్వనితో  ఏటవాలుగా వచ్చి గాలితో కలిసి గుమ్మాలు దాటి నట్టింట్లోకి దూరి తడిపేసి వెళుతుంది. వెంటనే రెండవ జల్లు వడగళ్ళతో వచ్చి భూమిని తడిపి, వేడిపొగలూ, దుమ్మూ రేపి వెళిపోతుంది. ఆ వెనకే మూడవజల్లు వచ్చి కొంతసేపు ఆగి ఉరుములు మెరుపులతో, చిరు తుంపరలతో అంతా చీకటి చేస్తుంది. ఇక ఆ తర్వాత జల్లు మీద జల్లు ఉయ్యేల గొలుసుల్లా పెనవేసుకుపోయి కురవడం మొదలుపెడతాయి. కారు మబ్బులు కమ్మి, జోరుగాలితో కూడి, భరింపలేని వేగంతో, భూమి ఆకాశాలు ఏకమైనట్లుగా హోరుమనే ధ్వని చేస్తూ, కడవతో నీరు గ్రుమ్మరించినట్టు విడువకుండా కురుస్తుంది వాన.


 చం. పెళపెళ మబ్బు బిట్టుఱుమ భీతి విదూరశిలాంకుర చ్చటో

      త్పులకినియై ప్రియు న్నిదురవోవు హరి న్వడిఁ గౌఁగిలింపఁగాఁ,

      దలరి ధరిత్రి సాఁచు గఱు దాల్చిన గేళ్ళన గంకణంపుమ్రోఁ

      తలఁ బులు దేల వండు పయిఁదాల్చి నదు ల్వెసఁ జొచ్చెవారిధిన్.

ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం - శంకరాభరణం..


పెళపెళమని మబ్బురిమింది. ఏకాంతంలో కాంత భూదేవికి భయం కలిగింది. పక్కనే ఉన్న భర్త గాఢంగా నిద్రిస్తున్నాడు (వానాకాలంలో నాలుగునెలపాటు విష్ణుమూర్తి నిద్రలోకి వెళతాడని అంటారు కదా!). భయం పోగొట్టుకోడానికి భర్తపై చేయిచాచినట్లు నదులు దీర్ఘంగా సాగాయి. నదిలో కొత్తనీరు కదా, గడ్డి తేలుతోంది. అవి భూదేవి పొందిన గగుర్పాటుకి గుర్తుల్లాగా ఉన్నాయి. శరీరమ్మీద పులకలన్న మాట. ఆ నదిలో నీటిపక్షులు కిలకిలమంటున్నాయి. అవి, ఆ నదులనే చేతులకి ధరించిన గాజుల గలగలల్లాగ ఉన్నాయి. వానాకాలంలో బురదకూడా ఉంటుంది కదా. అది భూదేవి తాల్చిన గంధపుపూతలాగా ఉందట! అలా, ఆ వర్షాకాలపు నదులు సముద్రంలో సంగమించడం, భీతిల్లిన భూకాంత తన ప్రియుని కౌగిలించుకున్నట్టుగా ఉన్నదని కవి ఊహ. ఇక్కడ మళ్ళీ మనం గుర్తుకు తెచ్చుకోవలసిన విషయం - ఈ కావ్యంలో ప్రధానరసం శృంగారం. పైగా కావ్యనాయిక అయిన గోదాదేవి భూదేవి అవతారం. అంచేత అక్కడక్కడా యిలాంటి వర్ణనలు ఆ రసస్ఫురణను కలిగిస్తాయి. క. ఘనవృష్టి కతన ఫణు లే

    పున నల వల్మీకరంధ్రములు మూయఁగ నె

    త్తినగొడుగు లనఁగ చత్రా

    కనికాయం బవని నెల్లకడలం బొడమెన్.

ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో...

వానాకాలంలో ఎక్కడ చూసినా పుట్టగొడుగులు గుంపులుగుంపులుగా పొటమరించాయి. ఇది ఎలా ఉందంటే - వానలు పెల్లుగా కురియటం వల్ల పాములు పుట్టల్లో దూరి వానధారలు లోపలకు రాకుండా కన్నాల మీద గొడుగులు విప్పుకొని లోపల కూర్చున్నాయా - అన్నట్ట్లు ఉందట. బహుశా "పుట్టగొడుగు" అనే పేరుకి ఇంత చక్కని అర్థం చెప్పిన కవి ఒక్క రాయలేనేమో! క. కాకోదరాహితుల వ

    ల్మీకంబులఁ దూర్చె మెఱసి మేఘుం, డని గుం

    పై కనుఁగొని పొగడె నన్

    భేకధ్వను లెసఁగె వృత్త భేదానుకృతిన్

ఈ  పద్యం రాఘవ స్వరంలో.. రాగం - భూపాలం


పై పద్యంలో పాములు పుట్టల్లోకి దూరిపోవడం చిత్రించబడింది కదా. అలా తమ శత్రువులైన పాములని మేఘుడు పరాక్రమంతో, మెరుపులనే ఆయుధాలతో దండెత్తి వాటిని పుట్టల్లో దూరిపోయేట్టు చేసి తమని కాపాడినందుకు అతన్ని ప్రశంసిస్తూ రకరకాల ఛందస్సులలో కప్పలు స్తుతిస్తున్నాయా అన్నట్టు కప్పల అరుపులు (భేక ధ్వనులు) వినిపుస్తున్నాయట! వేదంలో భేకసూక్తాలని ఉన్నాయి. వాటి పరమార్థమేమిటో మనకు తెలియలేదు. కాని అర్థం మాత్రము, వానలు వచ్చి తమకు ఆనందం కలిగించాయని మేఘుని ప్రశంసించడం - అని బోధపడింది. ఛందమంటే వేదం కనక వృత్తభేదమన్న పదంతో వేదంలోని భేకసూక్తాలని కవి సూచిస్తున్నట్టుగా భావించవచ్చు.

 

 చం. తడి తల డిగ్గి ముంప, జడతం దుదఱెప్పలఁ గన్ను విప్పి, పు

       ల్పొడచుచు నీరు ముంగఱల పోలిక ముక్కునఁ గూడ, నోటఁ గొం

       తొడియుచు గూఁటి కఱ్ఱ సగ మొత్తుచు ఱెక్క విదుర్పు మున్నుగా

       వడఁకుటె కాక చేష్టుడిగె పక్షులు వక్షము జానువుల్ చొరన్..


వాననీటిలో తడిసిన పక్షుల అవస్థ చక్కని స్వభావోక్తిలో అత్యంత సహజంగా చిత్రించే వర్ణన యిది. వాననీరు తలపైనుంచి దిగి శరీరమంతటినీ తడిపేసింది. రెప్పలార్పడానికి కూడా అవ్వడం లేదు. కంటి తుదలతో మెల్లగా కళ్ళను తెరుస్తున్నాయి. అప్పుడా నీటిచుక్కలు ముక్కు మీద పడి ముంగరలాగ మెరుస్తూ, మెల్లగా నోట్లోకి జారుతున్నాయి. ఆ నీటిని కొంత తాగి, మరికొంత తమ గూటికున్న పుల్లలకి రాస్తున్నాయి. వణుకుతూ రెక్కలు విదిలిస్తున్నాయి. చివరకి, చలి పోగొట్టుకోడానికి మోకాళ్ళను రెక్కలు కప్పిన రొమ్ములోకి జొనిపి, అలా చేష్టలుడిగి మునగదీసుకు కూర్చుండిపోయాయి. ఉ. కాలునిదున్న నందినయి గంటలు దున్నక మంటినా, మహా

     కాలుని నంది దున్ననయి కర్దమమగ్నత లేక మంటి నా,

     హాలికు లెన్నఁడుం దెగని యౌరులచేలును జాకుమళ్ళునుం

     గా లలి నేరుసాఁగి రిలఁ గల్గుపసింగొని పేద మున్నుగన్.

ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో...

వ్యవసాయంలో మెఱకదుక్కి, దమ్ము(రొంపి)దుక్కి అని రెండు రకాల దుక్కులు (దున్నడం) ఉన్నాయి. మెఱకదుక్కి అంటే మెట్టపొలాలు (బురద లేని బీడు పొలాలు) దున్నడం, ఏడ్లతోనే తప్ప దున్నపోతుల చేత చేయించరు. రొంపిదుక్కి అంటే బురదతో ఉన్న పొలాన్ని చదను చేయడం. ఇది దున్నలచేత చేయిస్తారు, ఎడ్లతో కాదు. యామునాచార్యుని రాజ్యంలోని రైతులు ఈ రెండు రకాల పొలాలనూ (ఔరుగంట్ల పొదలతో ఉన్న మెరకచేనుని, బురదతోనిండిన జాకుమళ్ళనీ కూడా) ఎక్కడెక్కడ ఉన్న ఎడ్లతోనూ దున్నపోతులతోనూ దున్నిస్తున్నారట. అది చూసి యముని వాహనమైన దున్నపోతుకీ, శివుని వాహనమైన నందికీ (ఎద్దు) భయం పట్టుకుంది, తమ చేత కూడా దుక్కి చేయిస్తారేమోనని! కాని మళ్ళీ వాటికవే సర్దిచెప్పుకున్నాయట. ఏమిటని? నేను ఎద్దుని కాదు కదా, అంచేత నాకు మెరక దున్నే బాధ తప్పిందని యముని మహిషమూ, నేను దున్నని కాదు కదా, అంచేత బురదలో పొర్లే బాధ తప్పిందని శివుని వృషభమూ సంతోషించాయట! అంత సమృద్ధిగా పేదరైతులు సైతం ఏరువాక సాగించారు.

 

 క. వరుజుబడి రొంపిఁ ద్రొక్కం

    జరణంబులఁ జుట్టి పసిఁడి చాయకడుపులం

    బొరి నీరుకట్టె లమరెను

    బిరుదులు హాలికులు దున్నఁ బెట్టిరొ యనఁగన్.

ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో...


రైతులు రొంపి దుక్కిలో పొలంగట్ట్ల వెంబడి బురద తొక్కుతూ ఉన్నారు. వాళ్ళ కాళ్ళకి వానపాములు చుట్టుకున్నాయి. వాటి కడుపులు బంగారు రంగులో మెరుస్తున్నాయి. అది ఎలా ఉందంటే, వ్యవసాయంలో గొప్ప పండితులైన ఆ రైతులు, తమ పాండిత్యానికి చిహ్నంగా బంగారు గండపెండేరాలను ధరించారా అన్నట్టుగా ఉన్నదట!

 

 మ. గురుగుం జెంచలిఁ దుమ్మి లేఁదగిరిసాకుం దింత్రిణీపల్లవో

      త్కరముం గూడఁ బొరంటి నూనియలతోఁ గట్టావికుట్టారికో

      గిరముల్ మెక్కి తమిం బసుసుల్ పొలము వో గ్రేఁపుల్ మెయిన్ నాక మేఁ

      కెరువుంగుంపటి మంచ మెక్కిరి ప్రభుత్త్వైకా ప్తి రెడ్లజ్జడిన్..ఇంత వర్షంలో కూడా ఇల్లాల్లు తమ భర్తలకోసం ఆ కాలంలో దొరికిన కూరలు, ఆకుకూరలతోనే రుచికరమైన భోజనం తయారుచేస్తారు. వర్షాకాలంలో పొలాల గట్ల మీద, బీళ్ళలో, గోడలమీద దొరికే కురకటము (గురుగాకు), చెంచెలియాకు, తుమ్మియాకు, లేత తగిరిసాకు, చింతచిగురుతో కలిపి నూనెతో యిగురుబెట్టి, ఆవిరి తేలుతున్న కుఱుచయారికల (కుట్టారికల) అన్నం కడుపునిండా తిని (పీకలదాకా మెక్కి!), పశువులని పొలాలకి తోలి, మేకెరువుతో రాజుకున్న కుంపటి మంచం కింద పెట్టుకొని, గుడిసెలో ఓ మూల కట్టేసిన దూడలు తమ శరీరాలను నాకుతున్నా పట్టించుకోకుండా, తమ పెద్దరికం ఉట్టిపడుతూ ఉండగా, హాయిగా గుఱ్ఱుపెట్టి పడుకుంటారట ఆ ఊరి రెడ్లు. ఇక్కడ కర్షకజీవన సౌందర్యం అద్భుతంగా వర్ణించబడింది. మేకెరువు చాలా ఆరోగ్యకరమట. ముఖ్యంగా క్షయరోగాన్ని నివారిస్తుందట! "ఓగిరము మెక్కి" అనడంలో ఎంత తృప్తిగా భుజించారో ధ్వనిస్తుంది. "మంచమెక్కిరి" అనడంలో "హాయిగా మంచమెక్కి పడుకున్నారు" అనే ధ్వని ఉంది.


ఇలా మొత్తం అరవై పద్యాలలో వర్షాకాల వర్ణన చేసారు కృష్ణదేవరాయలు. మచ్చుకి కొన్ని పద్యాలు మాత్రం ఇక్కడ వివరించడం జరిగింది. ఆ వర్ణనల్లో శాస్త్రవిషయాలు, సమాజ జీవితం, అద్భుత కల్పనలు, స్వభావోక్తి - అన్నీ కనిపిస్తాయి. వర్ష ఋతువు తర్వాత శరదృతు వర్ణన వస్తుంది. ఆ వర్ణనావైవిధ్యం, వైదుష్యం, తర్వాతి టపాలో...
Related Posts Plugin for WordPress, Blogger...