తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Tuesday, October 8, 2019

మాలదాసరి కధ - 2

ఒకనాడు అర్ధరాత్రి ఒక పిల్లి ఇంటిలోనికి ప్రవేశించగా అలికిడికి కోళ్ళు కూత పెట్టగా, ఎరుంగని దాసరి ప్రాత:కాలమయినదని భావించి, నా గురించి కీర్తించుటకు బయలుదేరెను.
శా.కాంచెన్వైష్ణవు డర్ధయోజన జటాఘటోత్థ శాఖోప శా
ఖాంచ ఝాట చరున్మరుద్రయ దవీయః ప్రేషితోద్యచ్ఛ దో
దంచత్కీట కృత వ్రణచ్ఛలన లిప్యా పాదితా ధ్వన్యని
స్సంచారాత్తమహా ఫలోపమ ఫలస్ఫాయ ద్వట క్ష్మాదమున్
రాయల పాండితీ గరిమను చాటిచెప్పే పద్యమిది. అలా మాలదాసరి వెళ్తూ ఉండగా.. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. చెట్టు మీద ఒక బ్రహ్మరక్షసుడున్నాడు. అది తిమ్మమ్మ మఱ్ఱి మానును మించినది..ఎన్నో ఊడలు, మరెన్నో కొమ్మలు. కొమ్మలు ప్రక్కకు విస్తరిస్తూంటే ఊడలు నేలలోకి చొచ్చుకొని వెళ్తున్నాయి. అది చెట్టా! చెట్లా! ఆకులు ఎండి రాలాయి కాలువేస్తే పట పట మని శబ్దం చేస్తూ విరిగి పోతున్నాయి. ఆకులను చెదపురుగులు తిన్నాయి. తినడం ఏదో అక్షరాలూ వ్రాసినట్లున్నది. గాలి చెట్టు క్రింద దూరి ఆకులను విసిరి వేస్తున్నది. నిర్జనారణ్యం. యింత నేపధ్యం వున్నది. యింత భయంకరమైన దృశ్యాన్ని దృశ్యమానం, శ్రవ్యమానం చెయ్యటానికి ఎలాంటి పదాలు వాడాలో అలాంటి పదాలు వాడారు రాయలు. మాలదాసరి ఐదు మైళ్ళు వ్యాపించిన ఊడలపై భాగంలో మొలిచిన కొమ్మలు, చిట్టి కొమ్మలతో ఒప్పుచున్న గంభీర సమూహంలో ఈలలు వేస్తూ సూది తిరుగుతున్న గాలి యొక్క వేగంతో దూరానికి పంపబడిన ఎగిరే ఆకులలో స్పష్టానంగా పురుగులచే చేయబడిన రంధ్రాలన్న మిష గల వ్రాతతో కలిగిన, బాటసారులెవరూ సంచరించనందున లబ్ధమైన గొప్ప ఫలాలతో సాటి రాగల పండ్లతో విస్తరించిన మఱ్ఱి చెట్టును చూచెనని రాయలవారు వర్ణించారు.

.వె.కాంచియాతడొక్క కాలిత్రోవయునంత
గాంచి యందు దెరువు గాంచినదియ
పరమలబ్ధి గాన ద్వరితంపు గతి నవ్వ
టావనీజ మంత నత గదిసి.
       అంత పెద్ద మర్రి చెట్టును గాంచి, దాని ద్వారా యున్న ఒక కాలిద్రోవను కనుగొని అటుగా వెళ్ళి మర్రిచెట్టును చేరాడు.

సీ. ఎలనీటి బొండలంబులువోలె మెదడెల్ల
జుఱ్ఱి వైచిన డొల్లు పుఱ్ఱెగములు
నెఱచి గీఱిన జీర లేర్పడఁ దుదముట్టఁ 
జీఁకిన నులిపచ్చి కీకసములు
దొనదొనమను నీఁగె తుట్టెల రూ పేఱు
పరక క్రంపలను వ్రేలెడు గరుసులు
ధూళ్ళ మక్కెక్కి మంగళ్ళతిప్పలు రేఁగు
వడువున గాలి నాడెడు వెఱకలుఁ 
తే.గీ. దునిసిన నరాంగకములఁ బొత్తులను గమిచి
పోక యొండొంటితోఁ బిఱువీకులాడు
శ్వాపదంబులుఁ, బదహతి వ్రస్సి వలచు
పరుగు దఱచగు ముఱుత్రోవ నరిగె యెదుట
   
  చెట్టుక్రింద ఉన్న బీభత్స దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు రాయలవారు. లేత కొబ్బరినీళ్ళను పీల్చేసి, పారేసిన కొబ్బరి బోండాల లాగా మెదడు మొత్తాన్ని  పీల్చిపారేసిన డొల్లు పుర్రెలు అంతటా పడి ఉన్నాయి. అంటే భారతంలో బకాసుర వధ సన్నివేశంలో మనం చూసిన దృశ్యం లాంటిదేగీకి గీకి మాంసాన్ని మొత్తం పీల్చిన  పచ్చి బొమికలు పడి ఉన్నాయి. కంపలమీద వ్రేళ్ళాడుతున్న పచ్చి చర్మపు ఖండాలు   కనిపించకుండా దొన దొన మని జోరీగలు ముసురుతున్నాయి. ధూళి కొట్టుకుని  కనరెక్కిన మంగలి వాళ్ళ స్థలాలలో వెంట్రుకల కుప్పలు ఎగిరినట్లు, మానవ శరీరాలమీది రోమాలు, కేశాలు గాలికి ఎగురుతున్నాయి. మా నవశరీరాల ఖండాలను  కరిచిపట్టుకుని అక్కడినుండి కదలకుండా ఒకదానితో ఒకటి పెనగులాడుతున్న  దుష్ట జంతువులు కనిపిస్తున్నాయి. కాళ్ళతో తన్ని పగిలి కంపు కొడుతున్న మాంసపు  వరుగుల కుప్పలు కనిపిస్తున్న కాలిబాటవెంట ముందుకు వెళ్ళాడు భక్తుడు. ముందరికాళ్ళమీద సాగిలపడి, పైకి దొంగచూపులు చూస్తూ, మాంసపు ఖండాలను ఎత్తుకుని పారిపోతున్న కుక్కలు కనిపిస్తున్నాయి. మాంసపు పోగులను కరుచుకున్న గ్రద్దలు కొమ్మలమీదినుండి ఎగిరిపోతున్నప్పుడు గాలికి దుర్వాసన వ్యాపిస్తుండగా గ్రద్దల అరుపులు వినిపిస్తున్నాయి. బ్రహ్మరాక్షసుడి దారికి అడ్డంగా వచ్చి, వాడి చేతి చరుపులకు నడుములమీద చేతులు పెట్టుకుని అరుస్తూ పారిపోతున్న  కోతులు కనిపిస్తున్నాయి. యిదంతా చూస్తూ బిక్కు బిక్కుమంటూ, 'యిక్కడెవడో  భయంకరుడు ఉన్నాడు, వాడు మనిషి గాడు, ఎలారా దేవుడా, వెనక్కు వెళ్ళాలన్నా చాలా దూరం' అనుకుంటూ ముందుకు వెళ్ళాడు భక్తుడు, దాసరి. వెళ్లి..ఒక భయంకరమైన రాక్షసుడిని చూశాడు. వాడెలా ఉన్నాడయ్యా అంటే...

సీ. మృతమర్త్యు రెంటాన నిడ్డఁ జాలక నెత్రు
రంజిల్లు పెనుపొట్ట ముంజివానిఁ 
బల్లచీమల వక్ర భల్లాతకియుఁబోలె
నెఱ్ఱ దుప్పటి నొప్పు కఱ్ఱె వాని
వ్యత్యస్త హస్తిమ స్తాభఁ బాయగు గడ్డ
మును దంష్ట్రికలుఁ బొల్చు మొగమువానిఁ
గడుఁదుర్ల నిడుత్రుట్టె గతిఁ జోఁగలోఁ బాండు
రత మించు కపిలకూర్చంబువాని
తే.గీ. నెఱకుఁదెరువరిఁ గన శాఖ లెక్క జారు
ప్రేవుజందెంబుఁ గసరి పైఁ బెట్టువాని
వ్రేలు డగుబొజ్జ గల బూర కాలి వానిఁ
జెంబుతలవాని నవటుకచంబువాని

     భీకరాకారం తనచేతిలోచచ్చినవాడి శవాన్ని గోచీలాగా పెట్టుకున్నాడు అలాంటివాడు... గోచీగా శవం నిడివి చాలక, లాగి, లాగి మొలతాడులో దోపుకోవడంవల్ల శవం ఛిద్రమై ఒంటి నిండా రక్తం స్రవిస్తున్న భయంకరుడిని చూశాడు. ఎర్రచీమలు  నిండా పాకుతున్న నల్లని జీడి చెట్టులా ఎర్రని దుప్పటిని కప్పుకున్న నల్లటి భయంకరాకారుడిని చూశాడు. ఏనుగు తలను తలకిందులు చేసినట్లు కోర దంతాలు పైకి పొడుచుకువచ్చి, నోటిక్రింద చాలా పెద్దదైన గడ్డంతో ఉన్న వికృత భయంకరాకారుడిని చూశాడు. కందిరీగల గుంపులా గుంటగా పాండు వర్ణంలో ఉన్న నుదుటితో భయంకరంగా ఉన్నవాడిని చూశాడు. 'ఎర'కోసం, తిండికోసం దారినబోయే వాడెవడన్నా ఉన్నాడా అని చూడడం కోసం కొమ్మలమీదికి ఎక్కినపుడు జారిపోయిన ప్రేగుల జందెమును కసిరి  తిట్టుకుంటూ భుజము మీదికి నెట్టుకుంటున్న వాడిని, వ్రేలాడుతున్న పొట్టతో,బూరల్లా ఉన్న కాళ్ళతో, చెంబులా నున్నగా ఉన్న తలతో ముచ్చెనగుంటలో జుట్టు ఉన్న వికృత భయంకరాకారుడిని చూశాడు భక్తుడు మాల దాసరి.  

తే.గీ. కండకన్నులవాని, నాఁకటను బండు
తిట్ల బేతాళికల సారెఁ దిట్టువాని,
నగగరిమవాని, నన్వర్థ నాముఁ, గుంభ
జాను వనునొక్కద్విజనిశాచరునిఁ గనియె

కళ్ళల్లో కండలు పెరిగిన వికృతాకారుడిని, ఆకలితో తోటి ఆడ దయ్యాలను మాటిమాటికీ బండబూతులు తిడుతున్నవాడిని, కొండలా ఉన్నవాడిని,కుండలవంటి మోకాళ్ళతో 'కుంభజానువు' అనే సార్ధక నామధేయుడైన ఒక బ్రహ్మరాక్షసుడిని చూశాడు.

తర్వాత జరిగిన వ్యవహారం తరువాయి భాగంలో చూద్దాం.

0 comments:

Related Posts Plugin for WordPress, Blogger...