తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Saturday, January 26, 2019

యామునాచార్యుని రాజనీతి బోధ - 3

యామునాచార్యుడు కొడుకుకు రాజనీతి బోధ కొనసాగిస్తున్నాడు. రాజైన వాడు ఎప్పుడూ ఒకటిరెండు విషయాలకే ఎదుటివారు చెప్పే మాటలను నమ్మి ఆవేశపడి చర్యలు తీసుకొనక.. వాడు తనకు నిజంగానే హితము చెప్పుచున్నాడా లేక పరహితము కోరే వాడా అన్న సంగతులను ఎప్పటికప్పుడు ఇతరులచే విచారణ జరిపిస్తూ ఉండాలి. తొందరపడి ఆవేశపడి ఎటువంటి నిర్ణయములు చేయరాదని భావన.
ఇక రాజు దినచర్య ఎలా ఉండాలో తెలుసుకొవలసిన అగత్యం గురించి యామునాచార్యులవారి ద్వారా రాయలవారు తెలియజేస్తున్నారు. రాజు యొక్క దినచర్య వివరంగా తెలియపరచిన విధానం మనలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

సీ.సౌఖ శాయనిక భిషక్పూర్వకము కల్య
వేళ గార్తాంతిక ద్విజుల గోష్ఠి
జామువోవ నమాత్య సామంత పూర్వకం
బర్ధార్జనస్థ కాయస్థ గోష్ఠి
దిన మధ్యమమున మర్దన మల్లపూర్వకం
బగు సూదసూప కృన్మృగయు గోష్ఠి
యపరాహ్ణమున దేవతార్చనా పూర్వకం
బార్య ధర్మాది కృద్యతుల గోష్ఠి
తే.గీ.భక్తిమీద విదూషక పూర్వకము పు
రాణ కవిగోష్ఠి, చారపూర్వకము సంజ
జాము గాయక గోష్ఠి, నిశన్ సుషుప్తి
పూర్వకము ప్రేయసీ గోష్ఠి  పొసగు బతికి.
          
           ప్రాత:కాలమున సుఖ నిద్రనడుగువారు, వైద్యులను, జ్యోస్యులగు బ్రాహ్మణులను రాజు దర్శించవలెను. రాజు వారితో తన దేహారోగ్యమును గూర్చి గ్రహానుకూలతాననుకూలతల గురించి చర్చించవలెను. ఝాము ప్రొద్దు ఎక్కిన తరువాయి మంత్రి సామంతులతోను, ధనార్జన నియుక్తులయిన కరణము వంటి వారితో ఆదాయ వ్యయముల గురించి చర్చించవలెను. తరువాయి అంగమర్దనము, మల్లురతో వ్యాయామము,వంటవారితోను, వేటగాండ్రతోను తెచ్చిన మాంసము గురించి తేవలసిన విశేషములను మాట్లాడవలెను. అపరాహ్నమున దేవతార్చన సమయమున, పెద్దలతో, ధర్మాధికారులతో సన్యాసులతోను భాషించదగును. భోజనానంతరం విదూషకులతో హాస్య సంభాషణము సాగించాలి. పౌరాణికులతో, కవులతో గోష్ఠి కార్యక్రమములు నిర్వహించవలెను. నాలుగవ జామున చారులకు దర్శనమీయవలెను. పాటకచేరీలు, రాత్రి ప్రేయసితో సరస సల్లాపములు తదుపరి సుఖ నిద్ర.

చ. హితులు భిషగ్గ్రహజ్ఞ బుధ బృంద కవీంద్ర పురోహితుల్హితా
హితులు ధనార్జనాది నృపకృత్యనియుక్తులు వెండి కేవలా
హితులు దశావశార్పిత సమృద్ధ రమాహరణేచ్ఛు; లౌటనా,
హితమును నట్లకా జతుర వృతింజరించుట నీతి రేనికిన్.

రాజునకు వైద్యులు, జ్యోతిష్యులు, పండితులు, కవులు, పురోహితులు ఎప్పుడూ మేలునే చేకూర్చుదురన్న సత్యము మరువరాదు. ధనార్జన లోనగు రాచకార్యములలో అధికారులు హితులగుదురు. రాజద్రవ్యమును అపహరించుట, కనిపెట్టి దండించునన్న భయము వలన అహితులు అగుదురు.  వారి ధన సమృద్ధిని  దుర్వృత్తిని రాజు అణచుటకు పూనుకొనును కాన, వారు ఏ విధముగానైనా రాజును మదిలో ద్వేషిస్తూనే ఉంటారు. కావున రాజు అనేవాడు ఈ మూడు తరగతుల వారిని సదా కనిపెట్టి మంత్రాంగం సాగించాలి. రాజు కూడా హితుడుగా, హితాహితుడుగా, కేవల హితుడుగా నటించవలసి యుండును.

కం.తనుభృశ దమనజ సుకృతము
ధన దత్తిన కొనగ వలయు దత్త దృతుక
మర్దన మజ్జన భోజనలే
పన వసన ప్రసవ వహన పరతం బతికిన్.

    రాజ్యాన్ని ధర్మబుద్ధితో న్యాయాన్యాయ విచక్షణతో పరిపాలించే రాజు సకల భోగములను హాయిగా అనుభవించవచ్చు. దేహదమన కారివలె తపస్సు చేయనక్కరలేదు. పుణ్యమును దాన ధర్మములచే పొందవచ్చును.

కం. విను వర్గసమత నృపుడు
న్నను ధర్మాంశంబె హెచ్చెనా, పెరమడి కె 
త్తిన నీరును దెగి యలరా
జనపు మడికి నెక్కినట్లు చను ముదమందన్.

ధర్మార్ధ కామ మోక్షములు మూడింటిలోను రాజు ధర్మము విషయమై ఎక్కువ ధనము ఖర్చైనట్లైతే మిక్కిలి సంతోషించాలి. మూడింటిలో ధర్మ విషయమైన విషయాలకే అధిక ప్రాధాన్యత ఉండాలని అర్ధం.

కం.చేయునది రాజ్యమట, యఘ
మే యవధిగ నీగువారమే మనజన; దా
మ్నయాంబు  నశక్యాను
ష్ఠేయము జెప్పదు; స్వశక్తి జేయగ జెప్పున్.

రాయలవారు ఒక వంక రాజ్యం చేస్తూనే మరోవంక సాహిత్యాన్ని కూడా ఆస్వాదించేవారు. అందువల్లనే తను నమ్మిన, ఆచరించిన సూత్రాలను, ఇంకా తనకు తిమ్మరుసు, మంత్రులు, దండనాయకులు చెప్పిన రాజనీతిని భావితరాలకు ఈ ఆముక్తమాల్యద గ్రంధం ద్వారా  అందించాడు. "రాజ్యాంతే నరకం ధృవం" అన్న విషయం గురించి  రాయలవారు వివరిస్తున్నారు. రాజు తన పాలనలో తెలిసో తెలియకో కొన్ని తప్పులను చేస్తాడు. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితులలో హింసకు పాల్పడడం జరుగుతుంది. అందువల్ల నరకప్రాప్తి గలుగుతుందన్న విషయం తెలియనిది కాదు. అందువల్ల భవిష్యత్తులో రాజులు చక్రవర్తులు పాప భయంతో బెరుకుగా అసమర్ధవంతమైన పరిపాలన చెయ్యకూడదన్న ఉద్దేశ్యంతో, యామునాచార్యుని పాత్ర ద్వారా వివరిస్తున్నారు.  యజ్ఞ యాగాదులు నిర్వహిస్తే పుణ్యం కలుగుతుంది నిజమే!  కానీ ఆవిషయం ఎవరూ స్వర్గం నుండి కానీ నరకం నుండి కానీ వచ్చి చెప్పలేదుకదా!  అందువల్ల రాజు తన కర్తవ్యం ప్రకారం నమ్మిన సత్యాన్ని అమలు పరుస్తూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారా లేదా అన్న విషయం మాత్రమే గ్రహిస్తే చాలు. మనుదండధరాధులు దోషమని తెలిసికూడా కర్తవ్య నిర్వహణ చేయడం ఉదహరిస్తూ..వివిధ పురాణాలలో ఉన్న న్యాయాన్యాలను, వివిధ శిక్షణల గురించిన విషయాలను విపులీకరించి చెప్తున్నారు రాయలవారు.

చతుర్ధాశ్వాసం ముగిస్తూ రాయలవారు ఒక చక్కని శార్దూల పద్యాన్ని రచించారు. దానిలో తను కటకమును జయించి పొట్నూరు వద్ద విజయ స్థంభమును నాటించిన విషయం ప్రస్తావించి, కృష్ణరాయ భూపతి అను పేరు గలిగిన నేను ఆముక్త మాల్యద ప్రబంధంలో నాలుగవ ఆశ్వాసాన్ని పూర్తి చేశానని చెప్పుకున్నారు.
ఇంతటితో చతుర్ధాశ్వాసం సమాప్తం. సారి పంచమాశ్వాసంతో కలుసుకుందాం. శెలవు.

0 comments:

Related Posts Plugin for WordPress, Blogger...