తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Wednesday, September 10, 2014

యామునాచార్యుడు -రాజనీతి 1



అనివార్య పరిస్థితులవల్ల దాదాపు ఏడాదిగా ఈ బ్లాగు నిస్తేజంగా ఉండింది.  దానికి క్షమాపణలు కోరుతూ ఆముక్తమాల్యద బ్లాగును పునరుద్ధరిస్తున్నాను... ఈ బ్లాగు రచనలో నాకు సాయం చేస్తున్నవారు టేకుమళ్ల వెంకటప్పయ్యగారు, పద్యాలు టైప్ చేస్తున్నది ఈ బ్లాగు అభిమాని లక్ష్మీదేవిగారు. వీరిద్దరికి కృతజ్ఞతలు.  శ్రవ్యకాలు కూడా వీలువెంబడి జత చేయడం జరుగుతుంది.


జరిగిన కధ:
వాదములో యామునాచార్యుడు నెగ్గడంతో  రాజు తన రాజ్యంలో కొంత భాగానికి  యామునాచార్యుని రాజును చేసి,  తన చెల్లెలినిచ్చి పెళ్ళి చేసాడు. అతడు దివ్యాస్త్ర మహిమ కలవాడు గనుక దిగ్విజయము చేయవలెనని కోరిక కలిగి  సర్వరాజులను జయించి రాజ్య భోగలాలసుడయ్యాడు. యామునాచార్యుని తండ్రి  నాథముని. ఆయన గొప్ప భక్తుడు. ఆయన శిష్యుడు పుండరీకాక్షుడు. ఆయన కూడా గొప్ప భక్తుడు. ఆయన శిష్యుడు శ్రీరామమిశ్రుడు యామునాచార్యుని చూసి ఈ రాజ్య వ్యసనమేమిటీ? ఈ పాపమేమిటని వాపోయాడు.  అతని మనసు మార్చడానికి ఏదైనా చేయాలని అనుకుని, రాజదర్శనము చేసుకుని రాజా! మీ పూర్వులు ఓ నిక్షేపమును కావేరినది యొక్క ఒకానొక ద్వీపమున ఉంచారు దాని చుట్టూ పాము ఉంటుంది. పద్మము శంఖము కూడా వుంటాయి.” అని రాజును తీసుకుని శ్రీరంగనాథుని చూపించడం వరకూ తెలుసుకున్నాము.
మరి ఇప్పుడు ఏమి జరిగిందో తెలుసుకోబోయే ముందు:
సీ! భైరవ భొట్లార్య, బహు పసందుగజెప్పె
రాయల కావ్యమున్ రమ్య లీల!
వలబోజు జ్యోతికి, వందన మనుచునే,
కార్య రంగమునందు గాలు బెడితి.
అనుభవమేమియున్ యసలు లే దనుచునే,
ఉత్సాహమెండుగ యుంది నాకు!
దొసగులు దప్పులున్ దొర్లిన జెప్పుడు!
సరిజేసు కొనుచుందు చల్లగాను!

తే!గీ! పంచ కావ్యములందున పనసపండు
నారికేళపు పాకము నాకు దోచు!
తేలికపనిగాదు గవితను తెలియ జెప్ప
కనక దుర్గమ్మె దిక్కిక! కల్పవల్లి.
(టేకుమళ్ళ వెంకటప్పయ్య,  విజయవాడ)

మళ్ళీ కధలోకి వద్దాం.
ఆ విధంగా శ్రీరామమిశ్రుడు రాజును తీసుకుని వెళ్ళి శ్రీరంగనాథుని చూపించాడు. వెంటనే యామునాచార్యునికి తను చేసిన తప్పు తెలిసి జ్ఞానము కలిగింది. వెంటనే  తన కొడుకుకు రాజ్యాన్ని అప్పగించి తాను సన్యాసము తీసుకున్నాడు. ఆ తరువాత కొడుకుకు రాజనీతిని బోధించాడు.
మన ఆంధ్ర వాజ్మయములో రాజ్య తంత్రములు రాజ్యపాలన తెలిసినవారు యెందరో ఉండి ఉండవచ్చు. కానీ వాటిని తెలియజెప్పిన వారు మాత్రం ఇద్దరే ఇద్దరు. కవిబ్రహ్మ తిక్కన సోమయాజి ఒకరైతే.. ఇంకొకరు శ్రీ కృష్ణదేవరాయలు. విజ్ఞానంలో తిక్కనకు సాటి ఎవరూ రారు. అనుభవంలో రాయలకు మేటియైనవారు  లేరు., ఈ ఇద్దరూ కావ్య రచనలో ఉద్దండులు.  తిక్కన చూసిన  రాజ్యము చిన్నది. రాయల రాజ్యము చాలా సువిశాల మైనది. రాయలకు స్వానుభవం చాలా ఎక్కువ. రాయలు రాజు. తిక్కన మంత్రి.. రాయల రాజనీతి చాల సుస్పష్టము.  తిక్కన మంత్రాంగం చాలా గొప్పది. ఇదే వీరిద్దరిలో తేడా!  ఆముక్తమాల్యదలో కొన్ని కొన్ని సందర్భాలలో మనకు కౌటిల్యుని రాజనీతి కనిపిస్తుంది. అదేమిటో.. పోలికలేమిటో తర్వాత  చూద్దాము. ప్రస్తుతం రాయలు వ్యక్తపరచిన రాజనీతిని చదువుకోడానికి వీలుగా 1. రాజులు 2. అమాత్యులు 3. ఉద్యోగులు 4. భృత్యులు 5. దుర్గము - విప్రులు 6. అడవులు 7. శతృవు 8. అదాయ వ్యయాలు  9. వాణిజ్యము 10. నృపధర్మ సమర్ధనము.   అనే పది విభాగాలుగా జేయవచ్చు.
ఇక కథలోకి ప్రవేశిస్తే...
తే!!గీ!! రాష్ట్రవర్ధనమెదఁ గోరు రాజు మేలు
రాష్ట్రమును గోరు; దానఁ గార్యమె యనంగ
రాదు; బ్రహ్మోత్తరములైన ప్రజల యేక
ముఖపుఁ గోర్కి దదంతరాత్ముండొసఁగడె?

ముందుగా ప్రజాభివృద్ధిని కాంక్షించే రాజు గురించి చెప్తున్నారు.  తన ప్రజల మేలు తనకు కూడా మేలు చేస్తుంది అని కోరుకునే రాజు యొక్క   మేలును, అభివృద్ధినీ కోరుకునే ఆలోచనను  ఆ భగవతుండు  ప్రజలకూ, బ్రాహ్మణోత్తములకూ ఇస్తాడు అని భావము.  పరబ్రహ్మస్వరూపులైన ప్రజలు ముక్తకంఠంతో  రాజు మేలు కోరినయంతనే    పరమాత్ముడు తప్పకుండా తీరుస్తాడు. రాయలు హరిభక్త సాగరంలో తేలియాడేవాడు. "రాజ్యాంతే నరకం ధృవం" అన్న విషయం తెల్సినవాడు  కనుకనే తన అవిద్యచే మృత్యువును తరియింప నెంచిన వాడు.  పుణ్య ఫలాన్ని భోగ భుక్తి వలన వ్యయింప నెంచినవాడేమో!

కం! దుర్గములాప్త ద్విజవర
వర్గమునకె యిమ్ము; దుర్గవత్తత్తతి క
త్యర్గళ ధరాధిరాజ్య వి
నిర్గత సాధ్వసత పొడమ నిలుపకు కొలఁదిన్ (207)

రాజా!  నీకు ఆప్తులైన బ్రాహ్మణులను దుర్గములకు అధిపతులుగా నియమించు. అయితే, ఈ దుర్గాలను కాపాడుకోవడానికి  ఎంత అవసరమో వారికి అంత సైన్యాన్ని మాత్రమే ఇవ్వు. నివారింప శక్యము గాని సైన్యాధిపత్యం వారికి ఇవ్వటం కూడా మంచిది కాదు. దానివలన క్రమంగా వారు నీ పట్ల భయము లేకుండా మసలే అవకాశం ఉంది.

! మొదలఁ బెనిచి, పిదప గురియింప, నెవ్వాఁడుఁ
దనదు తొంటిహీనదశఁ దలంపఁ,
డలుగుఁ; గాన శీల మరయుగుఁ గ్రమవృద్ధిఁ
బెనిచి, వేళవేళఁ బనులు గొనుము

రాజు తన ఉద్యోగుల్లో ఎవరికైనా మొదట పెద్ద పదవినిచ్చి తర్వాత ఆ  పదవిని తగ్గించినట్లైతే.. (రివర్షన్) బాధ పడతారు.  తమ నిజస్థితి తెలుసుకొని తాము తక్కువ స్థితికే అర్హులం అని ఆలోచించక బాధపడతారు.  రాజుపై  కోపగిస్తారు. అందుకే రాజు  వారి వారి నడవడి ఎలాంటిదో గమనిస్తూ  పదవుల్లోకి యెక్కించడమూ.. దించడమూ.. చేస్తూ ఉండాలి. వారి ప్రవర్తనను బట్టి క్రమంగా ఉద్యోగాభివృద్ధిని కల్పిస్తూ, అవసరమైన విషయాలలో వారికి తగిన పనులను కేటాయిస్తూ ఉండాలి.  తిక్కన సోమయాజి కూడా ఇదే విషయాన్ని చెప్పడం గమనార్హం.

చం!  చదివి యధర్మభీతి నృపశాస్త్రవిధిజ్ఞతల న్వయస్సు డె
బ్బదిటికి లోను నేఁబదికి బాహ్యము నై యరుజన్వపూర్వులై,
మదమఱి రాజు ప్రార్థన నమాత్యతఁ గైకొని తీర్చు పాఱువా
రొదవిన నంగముల్మిగులనూర్జిత మౌటకుఁ బూఁట సాలదే,
ఒక రాజు దగ్గర మంత్రి పదవికి ఎవరు అర్హులో ఈ పద్యంలో తెలియజేస్తున్నారు రాయల వారు. బ్రాహ్మణులై, శాస్త్రాలన్నీ క్షుణ్ణంగా చదువుకొని, ముఖ్యంగా  రాజనీతి పరిజ్ఞాము గలిగి, పాపభీతి కలిగి ఉండాలి. వారి  వయస్సు ఏభైకి పైన ఢెబ్బైకి లోపు ఉండాలి. (ఇప్పటి ప్రజాస్వామ్యంలో మంత్రులూ అంతే కదా.. ఇంచు మించు) వారి పూర్వీకులనుండి వంశపారంపర్యంగా ఏ రోగములు సంక్రమించియుండక,  పదవియందు మాత్సర్యాదులు లేకుండా ఉండి,  రాజు ఆహ్వానం మీదనే అమాత్య పదవి స్వీకరించే విప్రుడు లభిస్తే... ఆ రాజ్యం సర్వతోముఖాభి వృద్ధి చెందుతుంది అని అంటారు రాయలవారు.

శా! విల్లుందానును భిల్లుఁడొక్కఁడరుగ, న్విందింట దుగ్ధాన్నమున్
భిల్లుండన్యుఁడు వెట్ట, నారయుడుక న్వీక్షించి,దొబ్బంచు వాఁ
డెల్ల న్వమ్ముగఁ జేసి, తన్ననువ రా, నెందేఁ దెగం జూడఁగా
నుల్లంబై, "చన నంపు, నార చెడు" నా, నూహించి పో నంపఁడే.
అల్పులకు అతి వైరాత్యానుకూల్యము అల్ప కార్యాల వల్లనే పుడతాయని పద్యములో చెప్పడానికి ప్రయత్నించారు రాయలవారు.  దానికి ఉదాహరణముగా ఇద్దరు బోయవాళ్ల  ఉదంతం చెప్తాడు. ఒక బోయవాడు  తన మార్గమున బోవుచూ  మరియొక భిల్లుని ఇంటి వద్ద ఆగాడు.   భిల్లుడు ఇష్టపూర్వకంగా క్షీరాన్నాన్ని పెట్టాడు.  అంతట ఆ అతిధిగా వచ్చిన  బోయవాడు  పొయ్యి మీద యెర్రని పట్ట తాటలపై పొంగుతున్న  యెర్రని నీటిని జూచి మాంసమని భ్రమించి... వీడు నాకు మాంసము పెట్టడా అని ఆగ్రహించి ఎలాగైనా వీనిని చంపాలని అనుకున్నాడు.   తర్వాత   అతిధ్యమిచ్చిన భిల్లుడు సాగనంపుటకు కొంత దూరం తోడుగా వచ్చి... అయ్యా! నాకు పొయ్యి మీద పెట్టిన పట్టా చిమిడిపోతుంది  సెలవివ్వమని అడిగినంతనే   భిల్లుడు నిజము గ్రహించి సెలవిచ్చి పంపాడు. అందువలన అల్పులైనవారు ఎప్పుడూ అల్పముగానే ఆలోచిస్తారు . నిజానిజాలు తెలుసుకోకుండా  ఆవేశపడతారు. ఉద్రేకపడతారు.   కాబట్టి వారి వారికి తగినట్టుగా సముచితమైన స్ధానములు  ఇవ్వాలని వివరిస్తున్నారు రాయలవారు.

కం! మేలగు ఘోటకమును శుం
డాలంబును నాప్తనుభటునకె యిమ్ము; తఱి
న్మేలగు మెలవున మందురఁ
బాలింపుము; దొరలపాలు పఱుపకు మెపుడున్.
రాజు తన దళాలలో అతి ముఖ్యమైన  గజబలాన్ని, అశ్వబలాన్ని   సరియైన సంరక్షణ చేయాలనుకున్నప్పుడు మంచి సుశిక్షితుడు, వీరుడైన  రౌతుకు అప్పచెప్పాలి. అప్పుడప్పుడు గజశాల, అశ్వశాలలను సందర్శించి వాటిగురించి స్వయంగా పరామర్శించాలి. అంతే తప్ప సైన్యంలో చాలా ముఖ్యమైన ఈ రెండింటిని  ఎప్పుడు కూడా రాజోద్యోగులకు  ఇయ్యరాదు అని చెప్తున్నారు. ఇలా చేయడం వలన అవసరమైన వేళ వాళ్లు రాజుకు అండగా ఉండి మేలు చేస్తారు..

!వె!వాడిఁబొదలు జఠరవైశ్వానరుఁడు గఫ
ప్రముఖ దోషయుక్తి బలిమి చెడిన,
వెలి మహౌషధంబు బలమిచ్చు గతిఁ , బ్రతి
సేయ, వారిమదముఁ జెఱుచుఁ బరుఁడు.
ఒక సమర్ధుడైన అధికారిని  నియమిస్తే...దుర్మదాంధులైన వారిని ఎట్లు అణుస్తాడో.. ఒక అనారోగ్యముతోనున్న ఒక రోగి యొక్క కఫ వాత పితా శ్లేష్మాలు  ఒక మంచి మందుతో ఎలా ఉపశమిస్తాయో  పోల్చడం   గమనించదగ్గ విశేషం.  ఒక వ్యక్తి  ఉష్ణము,  కడుపులో మంట, కఫము మొదలైన అంతః రోగములతో  శక్తిహీనుడిగా మారినప్పుడు  బాహ్యంగా  సేవించిన శ్రేష్టమైన ఔషధముతో ఉపశమించి రోగనివారణ జరుగుతుంది.  అదేవిధంగా రాజ్యంలో సమర్ధుడైన అధికారిని నియమించినప్పుడు  రాజ్యంలో దుష్టులైనవారిని పొగరు, మదాన్ని అణిచి  శాంతిభద్రతలను నెలకొల్పుతాడు. అందుకే రాజు ఈ విషయంలో చాలా జాగరూకతగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారీ పద్యంలో.. 

చం. ఒకటికి రోయకుంట గనుమున్నవియుం, ద్రుపదుండు మారణే
ష్టికిఁ బసిఁ జూపి వేఁడ మునిసింహుడొకండు తమన్న వేల్చుఁ? బం
డొకఁడపవిత్రభూమిఁ గని యొల్లక యేఁ జనఁ దా గ్రహించె రో
యకనియెఁ దాన నట్లెఱుఁగ నౌఁ, జనుసర్వముఁ గాన శక్యమే?
 ఎవరైనా ఒక తప్పు చేయడానికి సిగ్గుపడనప్పుడు, అసహ్యపడనప్పుడు వారి మిగతా నడవడిక ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు అంటూ రాయలవారు ఉదాహరణపూర్వకంగా చూపుతున్నారు. పూర్వం ద్రుపదమహారాజు  ఒక హింసారూపమైన యాగాన్ని తలపెట్టి  గోవులను దానంగా ఇవ్వాలని యోచించగా   ఉపయాజులు అనే మునిశ్రేష్టుడు  అది తిరస్కరించి అయ్యా! నా సోదరుడు యాజుడు. అతడు పాప కర్మలను జేయుటలో చింతించక, ఫలాపేక్షను మాత్రమే కోరేవాడు కనుక తమరు వానిని   సంప్రదించవలసినదని చెప్పాడు.. అలాగే.. యాజుని గూర్చి చెప్తూ ఒక ఫలము అశుద్ధము, అపవిత్రమైన  ప్రదేశమునందు బడియున్నప్పుడు నేను దానిని వదిలివేసాను కాని నా అన్న దానిని తీసుకున్నాడు కావున నీ పనికి  తగినవాడు యాజులు అని చెప్పాడు.. దీని వల్ల ఒక మోసపు లేదా అసహ్యపు పని చేసినవారికి ఇంకో పని అలాటిదే  చేయడానికి వెనుకంజ వేయరు రాయల వారు చెప్తున్నారు.

తే!గీ!కన్నొకటి నిద్ర వోఁ బెఱకంట జాగ
రంబు గావించు భూరుహాగ్రంబు మీఁది
యచ్చభల్లంబు గతి భోగమనుభవించు
నెడను బహిరంతరరులపై దృష్టి వలయు.
ఎలుగుబంటి చెట్టుకొమ్మ మీద నిద్రించునప్పుడు ఒక కన్ను మూసి, ఒక కన్ను తెరిచి ఉంటుంది.  రాజు కూడా అదే విధంగా  అన్నివేళలా అప్రమత్తుడై ఉండాలి. ఇంటాబయటా ఉన్న శత్రువులను ఒక కంట కనిపెడుతూ ఉండక తప్పదని  అర్ధము.

అనాదినుండీ శతృవిజయమే రాజు విధీ.. ధర్మమూనూ..  అదే కీర్తి హేతువు కూడా. కాళిదాసు ఒక చోట "యశసే విజిగీషాణాం" అంటాడు. విధంగా శతృవులు రెండు విధాలు. అరిషడ్వర్గాలైన అంత:శ్శతృవులు, బహిశ్శతృవులు. అరిషడ్వర్గాలను జయించకుండా రాజు లోకాన్నెట్లు జయించగలడు?  కౌటిల్యుడు ఇలా చెప్తున్నాడు.  కామముచే  బ్రాహ్మణ కన్యను కోరి భోజవంశస్థుడగు  దాండ్యుడై,   కోపము వలన జనమేజయ రాజూ, లోభముచే ఐలుడూ, మదము వలన దంభోద్భవుడూ, హర్షముచే అగస్త్యుని జయింపదలచిన వాతాపీ..  నశించిన విధంగానే నశించెదరు.  
ఇక బహిశ్శత్రువుల గురించీ...అదాయ వ్యయాల గురించీ... వాణిజ్యమూ.. విదేశీ వ్యాపారాలను గూర్చి.. నృపధర్మ సమర్ధనము గురించీ రాబోయే టపాల్లో చూద్దాం. స్వస్తి.

0 comments:

Related Posts Plugin for WordPress, Blogger...