తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Sunday, August 29, 2010

మూడు కాలాల భోజనం

విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భాగవతోత్తముడు తన న్యాయార్జితమైన సొమ్ముతో ఏడాది పొడవునా అడిగినవారికి లేదనకుండా అన్నికాలాలందు తగువిధమైన భోజనాలు పెట్టి సత్కరించేవాడు. మరి రాయలు ఆ భోజనాలను స్వయంగా చూసాడేమో అన్నట్టుగా నోరూరించేరీతిగా పద్యాలనందించాడు. మనము వానాకాలం చలికాలం, ఎండాకాలంలో ఒకేరకమైన వంటకాలు చేసుకుంటాము. కాని ఈ బ్రాహ్మణోత్తముడు ఆయాకాలాలకు తగినట్టుగా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అతిధులకు వడ్డించేవాడు.


చ. గగనము నీరుబుగ్గ కెనగా జడివట్టిననాళ్లు భార్య కన్
బొగ సొరకుండ నారికెడంపుంబొఱియ ల్దవిలించి వండ న
య్యగపల ముంచిపెట్టుఁ గలమాన్నము నొల్చినప్రప్పు నాలు గే
న్పొగపినకూరలున్ వడియముల్ వరుగుల్ పెరుగున్ ఘృతప్లుతిన్

( ఈ పద్యం భైరవభట్ల కామేశ్వరరావుగారి స్వరంలో)

వానాకాలంలో ఆకాశం నీటి ఊటలాగా మారి ముసురుపట్టి ఉంది. ఈ కాలంలో ఎండు కట్టెలు దొరకడం చాలా కష్టం. అసాధ్యం అని చెప్పవచ్చు. అలాటి వాతావరణంలో తడిసిన కట్టెలతో వంట చేస్తే తన భార్యకు కళ్ళలో పొగ చేరుతుందని, విష్ణుచిత్తుడు నీరు తీసేసి ఎండబెట్టిన కొబ్బరికాయల టెంకలతో పొయ్యి వెలిగిస్తాడు. అతని భార్య వివిధ రకములైన శాకములు తయారు చేస్తుంది. ఆ టెంకాయ చిప్పలనే గరిటలుగా వరి అన్నము, పొట్టు తీసిన పప్పు బద్దలతో వండిన పప్పు, నాలుగైదు తాళింపుకూరలు, వడియాలు, వరుగులు, పెరుగు, నెయ్యితో కలిపి అతిథులకు వడ్డిస్తాడు.చ . తెలినులివెచ్చ యోగిరముఁ దియ్యని చారులుఁ దిమ్మనంబులున్
బలుచనియంబళు ల్చెఱకుపా లెడనీళ్లు రసావళు ల్ఫలం
బులును సుగంధిశీతజలము ల్వడపిందెలు నీరుఁజల్లయు
న్వెలయఁగఁ బెట్టు భోజనము వేసవిఁ జందనచర్చ మున్నుగన్


(ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

ఇక ఎండాకాలంలో ఐతే అతిథులకు ముందుగా చల్లబడడానికి చందనం ఇస్తాడు. తర్వాత తెల్లని, గోరువెచ్చగా ఉన్న అన్నము, తియ్యని చారులు, మజ్జిగపులుసులు, పలుచని అంబలి, చెఱకు పాలు, లేత కొబ్బరికాయ నీళ్ళు, భక్ష్యములు, వివిధ రకములైన ఫలాలు, వట్టివేళ్ళు మొదలైనవాటితో చల్లబరిచి, సుగంధభరితం చేసిన మంచి నీరు, శరీరానికి వేడి చేయకుండా ఉండడానికి ఊరవేసిన మామిడిపిందెలు, మజ్జిగ మొదలగు పదార్థములతో సుష్టుగా భోజనము పెడతాడు.మ.పునుఁగుం దావి నవౌదనంబు మిరియంపుం బొళ్లతోఁ జట్టి చు
య్యను నా దాఱని కూరగుంపు, ముకుమం దై యేర్చునావం జిగు
ర్కొనువచ్చళ్లును, బాయస్నానములు, నూరుంగాయలున్, జేసుఱు
క్కను నేయుం, జిఱుపాలు వెల్లువగ నాహారం బిడున్ శీతునన్.


( పద్యం భైరవభట్ల కామేశ్వరరావుగారి స్వరంలో)

ఇక గజగజ వణికిచే చలికాలంలో కమ్మని రాజనాల బియ్యంతో వండిన వేడి వేడి అన్నము, మిరియాల పొడితో తిరగమోత పెట్టగా చుయ్యిమనుచు ఘుమ ఘుమలాడే కూరలు, ముక్కులోని జలుబును కూడా తక్షణమే వదలగొట్టగల ఆవపిండి వేసి గుచ్చెత్తిన ఊరగాయలు, చేతి మీద పడగానే చుర్రుమనే వేడి నెయ్యి, గోరువెచ్చని పాలతో సుష్టిగా భోజనం పెడతాడు విష్ణుచిత్తుడు.
ఇలా తన సౌలభ్యం గురించి ఆలోచించకుండా ఆతిధుల సౌఖ్యము, ఆరోగ్యము కూడా దృష్టిలో పెట్టుకుని పలురకములైన వంటకాలను వినయవిధేయతలతో వడ్డించి వారిని సంతృప్తి పరచేవాడు విష్ణుచిత్తుడు.శా. ఆ నిష్ఠానిధి గేహసీమ నడురే యాలించిన న్ర్మోయు నెం
తే నాగేంద్రశయానుపుణ్యకథలుం దివ్యప్రబంధానుసం
ధానధ్వానము 'నాస్తి శాకబహుతా, నా స్త్యుష్ణతా, నాస్త్యపూ
పో, నాస్త్యోదనసౌష్ఠవంచ, కృపయాభోక్తవ్య' మన్పల్కులున్( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

సదాచార సంపన్నుడైన విష్ణుచిత్తుడు తన జీవితం భగవంతుని సేవలో, అతిధి సత్కారములు, అన్నదానాలలో గడిపేవాడు. ఈ అన్నదానం పగటిపూటయందేకాక అర్ధరాత్రులలో కూడా జరిగేది. నడిరేయిలో కూడా ఆ పుణ్యమూర్తి ఇంట్లో విష్ణు పుణ్య కథాగానము, దివ్యప్రబంధ పారాయణములతో పాటు భోక్తలతో అన్నము వేడిగా లేదు, కూరలు ఎక్కువగా లేవు,పిండివంటలు కూడా లేవు, అంత సుష్టుగా లేని భోజనము. ఎలాగోలా సర్దుకోండి అని వినయంగా విష్ణుచిత్తుడు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఎల్లవేళలా దైవనామ స్మరణకు, అన్నప్రసాదాలకు విష్ణుచిత్తుడి నివాసం పెట్టింది పేరు అయింది.

3 comments:

కృష్ణశ్రీ said...

"తెలుగదేల యన్న........" అన్న శ్రీకృష్ణరాయని ముఖ్య ప్రబంధం ఆముక్తమాల్యద.

విష్ణుచిత్తుడు తెలుగువాడు. గోదాదేవి తెలుగుది. కానీ, వారిని తమిళీకరించుకొని, అరవ్వాళ్లు మనని శాసించడానికి ప్రయత్నిస్తున్నారు!

బహుపరాక్!

Hemalatha said...

చాలా మంచి పని చేస్తున్నారు జ్యోతి గారు.స్వర దాతలకి కూడా అభినందనలు.
-హేమలత పుట్ల

భాస్కర రామి రెడ్డి said...

జ్యోతి గారూ..., హృదయపూర్వక వినాయక చతుర్థి శుభాకాంక్షలు!

హారం

Related Posts Plugin for WordPress, Blogger...