తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Thursday, August 19, 2010

సాయంకాలపు దేవాలయాలు

రవిగాంచని చోట కవిగాంచును అన్నారు కదా. రాయలుకు ప్రతీ వస్తువు అందంగా కనిపిస్తుంది. విల్లిపుత్తూరులోని మన్నారు కృష్ణుడిగా కొలవబడే శ్రీరంగనాధుని ఆలయం గురించి ఎంత అందంగా వర్ణిస్తున్నాడో.


శా.సాయంకాలములం దదీశ మురజి త్సద్మస్వనద్దుందుభి
స్ఫాయత్కాహళికాప్రతిస్వనత దోఁప న్గుంజగర్భంబుల
న్ర్మోయుం గేళివనిం గులాయ గమన ప్రోత్తిష్ట ద న్తస్సర
స్స్థాయి శ్వేతగరు ద్గరుత్పటపటాత్కారంబుఁ గ్రేంకారమున్


( ఈ పద్యం భైరవభట్ల కామేశ్వరరావుగారి స్వరంలో)

సాయంకాల సమయంలో విల్లిపుత్తూరులోని ఉద్యానవనాలలోని సరస్సులలో ఉన్న హంసలు తమ విహారాలు చాలించి తమ గూటికి వెళ్ళడానికి లేచాయి. అప్పుడు వాటి రెక్కల చప్పుడు ఎలా ఉందంటే ఆ పట్టణపు స్వామియైన మన్నారు కృష్ణుని కోవెలలో సంధ్యవేళలో మ్రోగే భేరీధ్వనులవలె , ఇంటికి వెళ్లడానికి పైకి లేస్తూ అవి చేస్తున్న క్రేంకారములు ఆలయములోని బూర శబ్దము వలె ఎల్లెడలా వ్యాపించి ఆ ఉద్యానవనపు పొదరిల్లలో ప్రతిధ్వనిస్తున్నాయి.మ. పొలయుం గాడ్పు లుదజ్మహాలయవ దంభోజాక్షవక్షస్తుల
స్యలఘు స్రజ్మకరందబిందువులఁ బణ్యారంపుఁ బుణ్యంపుఁ గం
పులఁ దాపత్రయి మీటి వీట నటన ప్రోద్యోగ సజ్జీభవ
ల్లలనావర్జిత కైకిక క్షరిత కహ్లారాళి నల్లార్చుచున్.( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)
రాయలు విల్లిపుత్తూరులోని ఉద్యానవనాలు, వీధులు, వారకాంతలనే కాదు అక్కడ వీచే గాలిని కూడా అత్యంత మనోహరంగా వర్ణించాడు. ఆ వాయువులు మన్నారు కృష్ణుని వక్షస్థలమందలి తులసీమాలల మీదుగా వీచడం వాళ్ళ వాటి పవిత్రతను , పరిమళాన్ని , ఆలయంలోని భక్ష్యాలు మొదలైనవాటి మీదుగా వీచుట వలన పుణ్య సౌరభము, నాగవాసమనెడి ఉద్యోగానికి సిద్ధమవుతున్న వారకాంతల కొప్పులలోని జారిన చెంగలువలను తాకి, వాటిని కదిలిస్తూ సుగంధభరితమై ఎల్లెడలా సంచరిస్తుంది ఆ గాలి ..
చ. కలమపుటెండుగు ల్ద్రవిడకన్యలు ముంగిటఁ గాచుచుండి, త
జ్జలరుహనాభగేహ రురుశాబము సారెకు బొక్కులాడఁ, గొం
డెలపయి కమ్మ గ్రామ్యతరుణీతతి డించిన పేఁపగంపలం
దల మగుచున్న చెంగలువ దండలఁ దోలుదు రప్పురంబునన్


( ఈ పద్యం భైరవభట్ల కామేశ్వరరావుగారి స్వరంలో)
రాయలవారి ఊహలు చాలా అపురూపంగా ఉంటాయి. కళ్ళంలోనో, వాన పడటం వల్లనో వడ్లు తడిశాయి. ఇంటి ముందు చాప వేసి ఆ వడ్లను ఎండబెట్టారు. ఆ ఇంటి కన్య ఆ వడ్లను గొడ్లు తినిపోకుండా కాపలాగా బయట కూర్చున్నది. గొడ్లు రావడంలేదు కానీ ఒక జింక పిల్ల వచ్చి సారె సారెకూ వడ్లు బొక్కిపోతున్నది. “జలరుహనాభగేహ రురుశాబము” దేవాలయపు జింక పిల్ల. ఎద్దులో, గేదెలో అయితే కర్రతో ఒక దెబ్బ వేయవచ్చు. కానీ అది సున్నితమైన జింక పిల్లాయె, పైగా దేవాలయపు జింక పిల్లాయె, ఊరి మీద పడి గింజలు తినే హక్కు దానికుంది! కర్రతో దానిని కొట్టడానికి చేయి రాదు. సరిగ్గా ఆ సమయానికి చెంగల్వ దండలను వేపగంపలో పెట్టుకొని, అమ్ముకోడానికి పల్లెటూరినుంచి వచ్చిన స్త్రీలు గంపను ఆ ఇంటి ముందు దించారు. ఆ అమ్మాయి, గంపలోని చెంగల్వ పూదండను తీసుకొని దానితో ఆ జింక పిల్లను అదిలిస్తున్నదట - అదీ ఈ పద్య భావం.
తడి వడ్లు ఇంటి బయట ఎండబోసుకోవడమూ, ఆడపిల్లలు గొడ్లు రాకుండా కాచి వుండటమూ, పల్లెటూరి స్త్రీలు పూదండలు అమ్మరావడమూ, దేవాలయపు జింక పిల్ల వడ్లు బొక్కడమూ - ఇవన్నీ ఎంతో సాధారణమైన విషయాలు. ఇవన్నీ ఎప్పుడు చూశాడో ఆ మహారాజు, ఎంతో చక్కగా బొమ్మ కట్టాడు. సున్నితమైన పదాలు వేసి పద్యంలో ఒక ధార సాధించడం కన్నా, చెప్పే విషయం యొక్క అపురూపత మీదనే ఎక్కువ దృష్టి, రాయలకు. ఆయన వ్రాసిన చాలా పద్యాలు అలానే వుంటాయి. ఈ పద్యమూ అంతే. పదాలను కొత్తగా వాడటం ఆయనకు బాగా ఇష్టం. ‘కలమపుటెండుగల్’ అలాంటి ఓ పదం. పదిహేనో శతాబ్దం ఆఖరిభాగంలోనూ, పదహారో శతాబ్దపు ప్రారంభంలోను ప్రవర్తిల్లిన పాండ్యదేశపు సామాజిక జీవితం ఇంత అందంగా తీర్చి దిద్దిన ఈ పద్యం ఎవరికి నచ్చదు?


శా. అం దుండుం ద్వయసద్మ పద్మవదనుం డద్వంద్వుఁ డశ్రాంతయో
గాందూబద్ధమధుద్విషద్ద్వి రదుఁ డన్వర్ధాభిదానుఁ డురు
చ్చందోబృందతదంతవాగపఠనా సంజాతతజ్జన్యని
ష్పందద్వైతసుసం విదాలయుఁడు నిష్ఠ న్విష్ణుచిత్తుం డనన్.(ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)
ఆ విల్లిపుత్తూరులో విష్ణువును తన చిత్తమునందు ఉంచుకొని నిరంతరము ద్వయానుసంధానము చేయుచు, సుఖదు:ఖాలు, శీతోష్ణములగురించి పట్టించుకోకుండా తన నిరంతర యోగముచే శ్రీరంగనాధుని వశపరుచుకున్నాడు విష్ణుచిత్తుడు. వేదవేదాంగములు చదువకుండానే వాటివలన లభించే నిశ్చల ద్వైతజ్ఞానమునకు తానే నిలయమైనాడు నిష్టాగరిష్టుడైన విష్ణుచిత్తుడను సార్ధకనామదేయముగల భాగవతోత్తముడు .

ఆముక్తమాల్యదను విష్ణుచిత్తీయం అని కూడా అంటారు. ఈ విష్ణుచిత్తుడు శ్రీహరినెప్పుడూ తన హృదయంలో ధ్యానిస్తు ఉంటాడు. ఆ మన్నారు కృష్ణస్వామికి పూలదండలు కట్టి కైంకర్యం చెయ్యటం అతనికి ప్రీతికరమైన పని. తాను న్యాయంగా సంపాయించిన డబ్బుతో ఆ వూరి గుండా వెళ్ళే తీర్థయాత్రికులకి పగలు రాత్రి అన్న తేడా లేకుండా నిత్య అన్నదానాలు చేస్తుంటాడతను.


విష్ణుచిత్తుడు ఆయా కాలాలలకు, వాతావరణానికి తగ్గట్టుగా వడ్డించే ఘుమఘుమల గురించి తర్వాతి టపాలో..

0 comments:

Related Posts Plugin for WordPress, Blogger...