తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Monday, July 12, 2010

ద్రవిడాంగనలు, వారకాంతల వర్ణనలు

రాయలు విల్లిపుత్తూరు పట్టణం , దాని అందచందాలు వివరించాడు. ఇక ద్రవిడాంగనల గురించి వర్ణించేటప్పుడు ఆ దృశ్యం మన కళ్లకు కట్టినట్టుగా ఉంటుంది. పట్టణం యొక్క విశేషాలతో పాటు అక్కడి ద్రవిడ స్త్రీలు, వారకాంతలు కూడా ప్రత్యేకమైనవారే. వారి అందమైనా, వ్యక్తిత్వమైనా, విలాసాలైనా దేనికదే సాటి.

. శయ పూజాంబుజముల్ ఘటిం దడఁబడన్ జందోయి లేఁగౌనుపై
దయఁ దప్పన్ బసుపాడి, పాగడపుఁ బాదంబొప్పఁ, జెంగల్వడి
గ్గియ నీ రచ్యుత మజ్జనార్ధము గటిం గీలించి, దివ్య ప్రబం
ధయుగాస్యల్ ద్రవిడాంగనల్ నడుతు రుద్యానంపులో త్రోవలన్.( ఈ పద్యం చదువరి స్వరంలో)

విల్లిపుత్తూరులోని ద్రవిడ స్త్రీలు ఉద్యానవనములో ఎర్రని కలువలతో నిండియున్న కొలనులో చక్కగా ఒంటికి పసుపు రాసుకుని స్నానం చేసి, శ్రీపతి అభిషేకం కొరకు బిందెలో నీరు తీసుకుని తమ నడుముపై ఉంచుకున్నారు. అసలే ఆ స్త్రీల స్తనభారంతో వారి నడుములు వణికిపోతున్నాయి. ఆ స్త్రీలు దివ్యప్రబందాలను గానం చేస్తూ ఆ ఉద్యానవనపు త్రోవలలో మెల్లిగా నడుస్తున్నారు. వారు ధరించిన కాలి అందెలు వాళ్లు పాడే పాటకు తాళం వేస్తున్నాయి. అంతేకాక స్వామికొరకు పొడవాటి కాడలతో ఉన్న కమలాలను తమ చేత ధరించి , అదే చేత్తో బిందెను పట్టుకుని నడుస్తుండగా వారి నడకలోని లయకు ఆ పూవులు బిందెలో తొట్రుపడుతున్నాయి. ఈ పద్యంలో ఏ అలంకారం లేదు. కవి తాను చూసిన ఒక దృశ్యాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణించి మనముందుంచుతున్నాడు.


మ. కలయ న్నీలమయంపుఁ దల్లి యొఱ దాఁకం దేటనీ రొప్పు ర
థ్యలకూపంబుల మీలఁ జూచి వలభివ్యాసంగి తుంగ ద్రుశా
ఖలలోనుండి గుబాలునన్ లకుముకుల్ క్రందై పడున్ లేచు మ్రు
చ్చిలి గేహేందిర ద్రావిడీ పరిచితిన్ జెండాడు చందంబునన్.


(ఈ పద్యం చదువరి స్వరంలో)

విల్లిపురపు వీధులలోని బావులలో నీరు ఒడ్డువరకు ఉబుకుతున్నాయి. నిర్మలమైన, స్వచ్చమైన ఆ నీటిలో కనిపిస్తున్న చేపలను చూసి, అక్కడి ఇండ్లలోని చూరులవెంబడి వ్యాపించి ఉన్న పెద్ద పెద్ద చెట్టుకొమ్మలపై ఉన్న లకుముకి పిట్టలు వాటిని పట్టుకోవడానికి పొంచి దుముకుతున్నాయి. వెంటనే నీళ్లలో మునిగిపోకుండా చప్పున లేస్తున్నాయి.. ఆ దృశ్యం ఎలా ఉంది అంటే ఎవ్వరికీ కనపడకుండా దాక్కుని, ఇంట వెలసిన లక్ష్మీదేవి తనకి బాగా పరిచయమైన ద్రవిడ స్త్రీలతో చెండాడు (బంతాట) తున్నట్టుగా అనిపిస్తుంది ఎవరికైనా. ద్రవిడ స్త్రీలు చెండాడుట, లకుముకి పిట్టలు చేపలను పట్టుకొనుటకు నీటిలో దుముకుట అనేది ప్రసిద్ధమైన ఉత్ప్రేక్ష.

సీ. సవలయ ధ్వని గాఁగ సారె వ్రేయు నదల్పు
యతినైన గుండె జల్లనఁ గలంప
సుడిసిన మొగమెత్తి చూడకుండు పరాకు
కుసుమబాణునినైనఁ గువిటుఁ జేయ
శ్రీకార్య పరులఁ గాంచిన లేచి మ్రొక్కు నం
జలికి నింద్రుండు నక్కొలువుఁ గోర,
హరిగృహావసరశంఖాకర్ణనకుఁ ద్రిప్పుఁ
గడగంటి జిగి ప్రజఁ గాఁడి పాఱఁ

తే. గవఱ లుంకించి వ్రేయఁ గొ ప్పవియ నవలి
కరమున నమర్పఁ బైఁటలో మరుని బటువు
బిల్లక్రియఁ బట్టుగంచెల బిగువుఁ జన్ను
నిక్కఁ దిన్నెలఁ బాత్రాళి నెత్తమాడు.


(ఈ పద్యం చదువరి స్వరంలో)
శ్రీ విల్లిపుత్తూరులోని వారకాంతలను వర్ణించ తరమా? వీధి అరుగులమీద కూర్చుని పాచికలు ఆడుతుంటే వారి చేతి కంకణాల ధ్వని సర్వం త్యజించిన సన్యాసికైనా గుండె జల్లుమనిపిస్తుంది. ఆటలో ఎంత లీనమైపోయి ఉంటారంటే ఎవరు వచ్చినా మొగమెత్తి చూడరు. ఆ కాంతలు గర్వంతో ఆ మన్మధుడినైనా సరే లెక్కపెట్టరు. కాని భగవంతుని సేవకు వెళ్ళే వారిని చూడగానే లేచి నమస్కరిస్తారు. వీరి అంజలులు పొందుటకోసం స్వర్గంలో అప్సరసల సేవలు కూడ వదులుకుని ఒక్కరోజైనా ఆ దేవాలయంలో సేవకుడిగా ఉండాలని కోరుకుంటాడట ఆ దేవేంద్రుడు. అంతటి సౌందర్యం వారిది. ఆలయములోని శంఖనాదములు వినగానే కన్నులు పక్కకి తిప్పు చూసినప్పుడు, ఆ కడకంటి చూపుల కాంతి ప్రజల గుండెల్లోంచి దూసుకుపోతుంది. అంత వాడి చూపులన్న మాటవి. పాచికలు చేత్తో బాగా గిలకరించి వేసినప్పుడు వారి కొప్పు వీడుతుంది. ఒక చేత్తో కొప్పును సరిచేసుకుని, మరో చేత్తో జారిన పైటను సరిచేసుకుంటూ ఆ వేశ్యలు పాచికలాట ఆడుతున్నారుట. ఈ పద్యంలో ఆ నగరంలోని వేశ్యల గుణగణాలన్నీ రాయలు వర్ణించారు. ఒకవైపు సౌకుమార్యమూ, మరోవైపు ఆభిజాత్యమూ, ఇంకొకవైపు భక్తీ, తగిన వాడివేడి, జిగిబిగి అన్నీ కలబోసిన సౌందర్యమూర్తులు వారు.


ఉ. వేవిన, మేడఁపై వలభి వేణికఁ జంట వహించి విప్పఁగాఁ
బూవులు గోట మీటుతఱిఁ బోయెడు తేఁటుల మ్రోఁత కామి శం
కావహ మౌఁ గృతాభ్యసన లౌటను దంతపు మెట్ల వెంబడిం
జే వడి వీణ మీటుటయుఁ జిక్కెడలించుటయు న్సరింబడన్.( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

ప్రకృతికి ప్రతీక స్త్రీ. స్త్రీకి సంబంధించిన పనులన్నీ అందంగానే ఉంటాయి.. ఇక సరసులైన రాయలవారు మాత్రం తక్కువతిన్నారా?... మేడపై జడవిప్పుకుని పూలను తీసివేస్తున్న కాంతను ఎంత రమ్యమనోహరంగా వర్ణించాడో చూడండి... ప్రభాతవేళ మేడపై చూరుపక్కన నిలబడి తన జడను ముందుకువేసుకుని విప్పుకుంటందంట ఓ వారకాంత. ఆ దృశ్యం చూడడానికి సర్వసాధారణంగానే ఉంటుంది. కాని కవికదా. సాధారణ విషయాన్ని మరింత అందంగా చెప్పకపోతే ఎలా? ఆ స్త్రీ తన జడవిప్పి అందులో చిక్కుకుని వాడిపోయిన పూలను గోటితో తీసివేస్తున్నది. పువ్వులున్నప్పుడు తుమ్మెదలు రాకుండా ఉంటాయా? ఆ ఇంతి పూవులు తీసేస్తుంటే తుమ్మెదలు చెదిరి ఝుమ్మని రొద చేస్తున్నాయంట. ఆ వీధిలో వెడుతున్నఒక కాముకుడు అది చూసి నిలబడిపోయాడు. అప్పటి కాంతలు వీణావిద్వాంసులు. తన జుట్టునుండి పూలను గోటితో రాలుస్తుండగా ఆమె వీణవాయిస్తున్నట్టుగా అనిపించిందంట ఆ యువకుడికి. త్వరత్వరగా పూలను విదిలిస్తుంటే ఆమె నల్లని జుట్టు వీణియగాను, అందులో చిక్కుకున్న పూలు దంతపు మెట్లుగాను తోస్తున్నాయి మరి ఆ కాముకుడికి. అందునా తుమ్మెదల రొద కూడా వీణాగానంవలె నున్నది. ఎంత అందమైన భ్రాంతి కదా..

1 comments:

భావన said...

నాకు ఆఖరి పద్యం, వర్ణన ఎంత నచ్చిందో.. చాలా బాగా అనిపించింది.

"బూవులు గోట మీటుతఱిఁ బోయెడు తేఁటుల మ్రోఁత" ఆ పదాలు అలా ఆ అమ్మాయి ను చూస్తూ అలవోక గా ఆయన నోటి నుంచి జాలువారేయేమో అని అనుకుంటే అంతటి రాయల వారి ప్రశంస అందుకున్న ఆమెదెంత అందమో అనిపిస్తోంది.
పంచుకున్నందుకు నెనర్లు..

Related Posts Plugin for WordPress, Blogger...