తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Sunday, June 27, 2010

విలిబుత్తూరు వర్ణన

ఆముక్తమాల్యద ప్రబంధాన్ని రాయలు విల్లిపుత్తూరు పట్టణ వర్ణనతో మొదలుపెట్టాడు. ముందుగా ఆ పట్టణంలోని సౌధాలు ఈ విధంగా ఉన్నాయి.


.లలితోద్యాన పరంపరా పిక శుకాలాప ప్రతిధ్వానము
ల్వలభీ నీల హరి న్మణీ పికశుక స్వానభ్రమం బూన్ప మి
న్నులతో రాయు సువర్ణ సౌధముల నెందుం జూడఁ జెన్నొంది శ్రీ
విలుబుత్తూరు సెలంగుఁ బాండ్య నగరోర్వీ రత్నసీమంతమై


( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

ఈ పద్యం చదువుతుంటే విల్లిపుత్తూరు పట్టణం ఎంత అందమైనదో కదా అని ఆశ్చర్యం కలగక మానదు. నిజంగా అలా ఉండేదా? లేక కవి ప్రతిభా అనిపిస్తుంది. ఆ పట్టణం అకాశాన్నంటే బంగారు మేడలతో శోభిల్లుతూ ఉంది. పట్టణం చుట్టుపక్కల ఉన్న ఉద్యానవనాలలో కోయిలలు, చిలుకలు కూస్తుంటే అవి ఆ మేడలలో ప్రతిధ్వనిస్తున్నాయి.. ఆ ద్వనులకు ఆ వీధులవెంట నడిచేవాళ్లు తలలెత్తి చూస్తే ఆ మేడల చూరులో అలంకారానికి అమర్చిన నీలములతో చెక్కిన కోయిలలు, పచ్చలతో చెక్కబడిన చిలుకలే కూస్తున్నట్టుగా భ్రమ కలుగుతుంది.. ఇక్కడ పక్షుల శరీరవర్ణాలకు అనువుగా రత్నాలను ఎన్నుకున్నాడు కవి. ఇంతటి అందచందాల వలననే ఈ విల్లిపుత్తూరు పట్టణం పాండ్యదేశమందలి భూమి అనే స్త్రీ పెట్టుకున్న పాపిట బొట్టులా ప్రకాశిస్తుంది. ప్రతి స్త్రీకి అలంకారమైన నుదుటి బొట్టుకు పవిత్రత, ప్రాముఖ్యం ఉన్నాయి. అందుకే విల్లిపుత్తూరు కూడా పాండ్యదేశానికి అలంకారంగా మాత్రమే కాక ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉందని అర్ధమవుతుంది.




చ. పగడపుఁ జాయ చెందిరముఁ బ్రామిన పాండ్యవధూ కుచంబులన్
నగు నరుణంపు బొండ్లముల నారికెడంబులు వజ్రకుట్టిమం
బగు పథముం జెలంగు భవనాహృత శేషిత రత్న రక్ష క
భ్రగతరు సంతతి బ్రథమ భార్యఁ బురిన్ గిఱ వుంచె వార్ధినాన్



(ఈ పద్యం చదువరి స్వరంలో )

శ్రీ విల్లిపుత్తూరు పట్టణంలో ఉన్న ఇళ్లన్నీ రత్నాలతో అలంకరించబడి ఉన్నాయి. గృహవినియోగానికి ఉపయోగించగా మిగిలిన రత్నాలను సముద్రుడు తీసుకొని తన సంతానమైన కల్పవృక్షములను, పెద్ద భార్యయైన గంగను ఈ పట్టణానికి కుదువ పెట్టాడంట. ఆశ్చర్యంగా ఉంది కదా. అలా ఎందుకన్నారో చూద్దాం. పగడపు కాంతిగల కుంకుమను అద్దిన పాండ్యదేశ స్త్రీల కుచములను పరిహసిస్తున్నట్టుగా ఉన్న ఎర్రని, పై పీచు ఒలవని కాయలతో నిండి ఉన్న కొబ్బరిచెట్లు కల్పవృక్షములవలె, తెల్లనికాంతితో ప్రకాశిస్తున్న పురవీధులు గంగానదివలే స్వచ్చంగా కనిపిస్తున్నాయి మరి.



క. కోరకిత నారికేళ
క్ష్మారుహములు రత్నకుట్టిమంబులఁ దోఁపన్
ద్వారము లయత్న కృత శృం
గారముఁ గను నలికి మ్రుగ్గు ఘటియించి రనన్



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )
శ్రీవిల్లిపుత్తూరులో ప్రతి ఇంటిలో నారికేళ వృక్షాలున్నాయి.ఆ యింటివారు వాకిలి ముందు అలికి ముగ్గు పెట్టినట్టుగా ఇంటిముందు గట్టిపడిన భూమిపై మొగ్గలు, పచ్చని ఆకులు గల కొబ్బరికాయల నీడ ప్రతిఫలిస్తుంది . ఆ ఆకులనీడ వాకిలి అంతా అలికినట్టుగా, మొగ్గల నీడ ముగ్గులు పెట్టినట్టు అందమైన భావన కలుగుతుంది.

3 comments:

చందు said...

"దేశ భాషలందు తెలుగులెస్స " అన్న ఆంధ్రభోజుని కవితా తృష్ణ కు ఆముక్తమాల్యద ఒక చిన్ని ఉదాహరణ.
అందులో ప్రతి వర్ణనా అత్యద్భుతం మహారాజే కాదు అయన కవి రాజు కుడా అని నిరూపించే కావ్యం అది.
మీ సాహిత్య అభిలాష నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.దయచేసి వ్రాస్తూ ఉండగలరు!
........మీ సావిరహే

Unknown said...

ఓ సారీ క్రింది లింకును గమనించగలరు.
http://kasstuuritilakam.blogspot.com/search/label/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%82%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%9A%E0%B1%82%E0%B0%A1%E0%B0%BE%E0%B0%AE%E0%B0%A3%E0%B0%BF%28%20%E0%B0%9B%E0%B0%82%E0%B0%A6%E0%B0%83%20%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81%20%29

antaryagam said...

ఈ మధ్యనే హంపి వెళ్ళటం జరిగింది.

అక్కడ అణువణువు రాయల దర్పానికి, కళా పిపాసకి దీటు గా ఉన్నాయి.

రాయల అంతఃపుర కాంతల స్నాన ఘట్టాలకి నీరు సరఫరా చేసే (ఎత్తిపోతల విధానం లో) పద్ధతి, గ్రానైట్ కాలువల నిర్మాణం ఎంతో ఆశ్చర్య జనకం గా ఉన్నది.

ఆయన పరిపాలించినది అతి తక్కువ కాలం అయినా మనిషి లక్ష్య సుద్ధి ఉంటే ఇటు సుపరిపాలన, రాజకీయం, జైత్రయాత్రల ద్వారా రాజ్య విస్తరణ, అటు హ్రుద్యమైన కవిత్వం, కవిపోషణ అత్యద్భుతం గా సాధించగలరని నిరూపించిన గొప్ప వ్యక్తి అని చెప్పక తప్పదు.

ఆముక్త మాల్యద లో మీరు ఉటంకించిన పద్యాలు, వర్ణనా కౌశలం, రాయల లోని కవితాత్మ మిగిలిన ఆయన ఏ లక్షణాలకి తీసిపోదు అని నిరూపించింది.

వాహ్వ సెహ్భాష్

Related Posts Plugin for WordPress, Blogger...