తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Tuesday, May 25, 2010

స్వప్న వృత్తాంతం

యిష్టదేవతా ప్రార్ధన చేసిన అనంతరం రాయలు ఆముక్తమాల్యద వ్రాయడానికి ప్రేరణ ఏమిటో వివరించాడు. దీనికి ప్రేరణ అతనికి వచ్చిన కల. ఆ కల ఎప్పుడు ఎక్కడ వచ్చిందంటే...

15వ శతాబ్దంలో పట్టాభిషిక్తుడైన తర్వాత రాయలు రాజ్యవిస్తరణకు పూనుకున్నాడు. ఈ విజయయాత్రలో భాగంగా కళింగ రాజ్యంపై మూడోవిడత దండయాత్రకు బయలుదేరాడు. బెజవాడలో కొన్ని వారాలు విడిది చేసిన సమయంలో ఒకసారి కృష్ణాజిల్లా కూచిపూడి సమీపంలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు దేవాలయానికి తీర్థయాత్ర చేసి ఏకాదశి ఉపవాసం చేసాడు. ఆ రాత్రి నాలుగో ఝామున ఆయనకో కల వచ్చింది. ఆ కలలో ఎవరు కనబడ్డారో ఈ చక్కని సీస పద్యంలో వర్ణించాడు:


( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం - ఆనంద భైరవి )
సీ. నీలమేఘముడాలు డీలు సేయఁగఁ జాలు
మెఱుఁగుఁ జామనచాయ మేనితోడ
నరవిందములకచ్చు లడఁగించు జిగి హెచ్చు
నాయతం బగు కన్నుదోయి తోడఁ
బులుఁగురాయనిచట్టుపలవన్నె నొరవెట్టు
హోంబట్టుజిలుఁగు రెంటెంబుతోడ
నుదయార్కబింబంబు నొఱపు విడంబంబు
దొరలంగనాడు కౌస్తుభముతోడఁ

తే. దమ్మికే లుండఁ బెఱకేల దండ యిచ్చు
లేము లుడిపెడు లేఁజూపు లేమతోడఁ
దొలఁకు దయఁ దెల్పు చిఱునవ్వుతోడఁ గలఁ ద
దంధ్ర జలజాక్షుఁ డిట్లని యాన తిచ్చె.


స్వప్నములో సాక్షాత్కరించిన వాడు అంధ్ర జలజాక్షుడు, అంటే ఆంధ్ర మహావిష్ణువు. అతను ఎలా ఉన్నాడంటే...
నల్లని మేఘములను కూడా బలహీనపరచగల నిగనిగలాడే చామనచాయ గల శరీరముతో, తామర రేకుల గర్వమును అణచివేయగల అందమైన కన్నులు కలిగి, గరుత్మంతుని రెక్కలయొక్క కాంతిని వన్నెపెట్టు (గీటురాయి మీద బంగారాన్ని వన్నె చూసినట్టు) బంగారు జరీ కలిపిన సన్నని పట్టువస్త్రములు ధరించి, బాలసూర్యబింబమును మించిన కాంతులు గలిగిన కౌస్తుభమణి ధరించిన స్వామి. ఒకచేతితో కమలము బట్టుకొని, మరొక చేతితో తన చేతిని పట్టుకున్న లక్ష్మీదేవి సరసనుండగా దయతో కూడిన చిరునవ్వుతో దర్శనమిచ్చాడు.

సీస పద్యం ఎంతందంగా ఉందో చాసారా! "డాలు - జాలు", "కచ్చు - హెచ్చు" ఇలా అన్ని పాదాల్లోనూ ప్రాస ఆకట్టుకుంటుంది. తమాషా ఏమిటంటే, ఈ పద్యాన్ని రాసింది రాయలు కాదు! ఇది అల్లసాని పెద్దన వ్రాసింది. మనుచరిత్రలోది. స్వారోచిష మనువుకు విష్ణువు ప్రత్యక్షమైనప్పుడు ఎలా ఉన్నాడో వర్ణించే పద్యమిది. కాని చివరనున్న తేటగీతిని మాత్రం రాయలు ఇక్కడ సందర్భానికి అణుగుణంగా మార్చి వ్రాసాడు. పెద్దన కవిత్వమంటే రాయలకెంత అభిమానమో. ఎంత ముచ్చటపడక పోతే ఆ పద్యాన్ని ఇక్కడ వాడుకొని ఉంటాడు! ఇలా సొగసుగా పద్యం వ్రాయడం రాయల శైలి కాదు.


కథలోకి వస్తే, అలా కలలోకి వచ్చిన ఆంధ్రవిష్ణువు ఏమని ఆనతినిచ్చాడంటే - మదాలస చరిత్ర, సత్యావధూ ప్రీణనము, సకల కథాసార సంగ్రము, జ్ఞాన చింతామణి, రసమంజరి మొదలైన ఎన్నో మధుర కావ్యాలని సంస్కృత భాషలో రచించి మెప్పించావు. అలాంటి నీకు ఆంధ్రభాష అసాధ్యమా? ఆ భాషలో కూడా ఒక కృతి నిర్మించి మాకు సంతోషాన్ని కలిగించు - అని.



( ఈ పద్యం రాఘవ స్వరంలో. రాగం -- సారంగ )

ఉ. ఎన్నిను గూర్తునన్న విను మే మును దాల్చిన మాల్య మిచ్చున
ప్పిన్నది రంగంమం దయిన పెండిలి సెప్పుము మున్ను గొంటి నే
వన్ననదండ యొక్క మగవాడిడ, నేను దెలుంగు రాయడన్
గన్నడ రాయ! యక్కొదువ గప్పు ప్రియా పరిభుక్త భాక్కథన్.

ఓ కన్నడరాయా! నా సంతోషం కోసం నా కథతో తెలుగులో ఒక కృతిని రచించుము. నా గురించి ఉన్న ఎన్నో కథలలో దేని గురించి రాయాలంటావా? తాను ముందు ధరించిన పూలమాలలను నాకు సమర్పించిన చూడికుడుత్త నాంచారియని పిలువబడిన చిన్నారి గోదాదేవితో నా పరిణయం గురించి చెప్పు. పూర్వము ఒక మగవాడిచ్చిన పూలదండ ఏవగింపుతో తీసుకున్నాను. ఆ కొఱత తీరునట్టుగా నా ప్రియురాలు గోదాదేవి చేత విడువబడిన మాలను నేను పొందిన వైనము వివరింపుము. నేనేమో తెలుగు రాయణ్ణి, నువ్వేమో కన్నడ రాయడివి. అంచేత నువ్వే ఆపని చెయ్యడానికి తగినవాడవు. అని కోరాడు.

ఇక్కడ ప్రస్తావించిన ఆ మగవాడు ఎవరో, అతను ఇచ్చిన దండ కథేమిటో కచ్చితంగా తెలియదు. కొందరేమో కృష్ణావతారంలో సుదాముడు అని అన్నారు. సుదాముడు అంటే మంచి దండ కలవాడు అని అర్థం. అతను శ్రీకృష్ణునికి మంచి దండలు సమర్పించాడు. అయితే అవి ఏవగింపుతో తీసుకోవడం ఎందుకు అన్నది స్పష్టం కాదు, సమంజసంగానూ లేదు. ఆంధ్రనాయక శతకం అని ఒక శతకం ఉంది. అందులో వేరే ఒక కథ ఉంది. ఈ ఆంధ్ర విష్ణువును అర్చించే పూజారి ప్రతిరోజూ ఆయనకు వేసే దండలను తన ప్రియురాలైన ఒక వేశ్యకి ముందు అలంకరించి, అవి తెచ్చి విష్ణువు మెడలో వేసేవాడట. ఒకరోజు రాజుగారు దైవ దర్శనానికి వస్తే దైవ ప్రసాదంగా విష్ణువు మెడలోని పూలదండని రాజుగారి మెడలో వాశాడట. ఆ దండలో ఒక వెండ్రుక వచ్చింది. అది చూచి రాజుగారికి కోపం వచ్చింది. "భగవంతునికి అర్పించే పూలదండలో ఈ కేశమేమిటి?" అని గద్దించాడు. పూజారి భయంతో, "ప్రభూ! మన స్వామి కొప్పులోని వెండ్రుక ఇందులో చిక్కుకుంది" అన్నాడట. "నువ్వు చెప్పేది చాలా విడ్డూరంగా ఉంది. విగ్రహానికి కొప్పేమిటి?" అని రాజు నిలదీసాడు. రేపు చూపిస్తానన్నాడట పూజారి. ఆ రాత్రి భగవంతుని ప్రార్థిస్తే తన భక్తుని రక్షించడానికి తన విగ్రహానికి కొప్పు తెప్పించాడట ఆ స్వామి! ఇక్కడ ప్రస్తావించింది ఆ పూజారి గురించని అనుకోవడం సమంజసం. వేశ్యకి వేసిన దండ తనకిస్తే ఏవగింపు కలగడం సహజమే కదా!

సరే ఏ కథ కావ్యంగా వ్రాయాలో, ఎందుకు వ్రాయాలో కూడా చెప్పాడు. మరి తెలుగు భాషలో ఎందుకట? అంటే,




( ఈ పద్యం చదువరి స్వరంలో )
. తెలుగదేల యన్న, దేశంబు తెలు గేను
దెలుగు వల్లభుండ దెలుగొ కండ
యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాషలందు దెలుగు లెస్స

నేను నివసించునది తెలుగుదేశము. నేను తెలుగు రాయడను. తెలుగు కలకండ అంత తీయని భాష. మంచి కండ, అంటే పుష్టి గల భాష. ఎందరో సామంతరాజులతో వివిధ భాషలు వింటూ , మాట్లాడుతూ ఉండే నీకు తెలుగుభాష అందం గురించి తెలియంది కాదు. దేశభాషలందు తెలుగు లెస్స కాదా..
ఈ పద్యంలో చివరిపాదం వినని తెలుగువాళ్ళు ఉండరనడం అతిశయోక్తి కాదు. అంతగా ప్రచారం పొందింది. ఇది చాలామంది స్వయంగా కృష్ణదేవరాయలే అన్నదనుకుంటారు. అన్నది ఆంధ్ర విష్ణువు. ఇందులో ఉన్న తెలుగు వల్లభుడు అతనే. మరో తమాషా ఏమిటంటే, ఈ వాక్యం ముందు మనకి కనిపించేది క్రీడాభిరామం అన్న కావ్యంలో. వినుకొండ వల్లభరాయడో, శ్రీనాథ కవిసార్వభౌముడో వ్రాసిన కావ్యమది. ఆ వాక్యం కృష్ణదేవరాయల అంతరాంతరాలలో అంతగా నిండిపోయిందన్న మాట. రాయలకి తెలుగంటే ఎంత అభిమానమో కదా!



(ఈ పద్యం చదువరి స్వరంలో )

క. అంకితమో యన నీకల
వేంకటపతి యిష్టమైన వేల్పగుట దదీ
యాంకితము సేయు మొక్కొక
సంకేతమ కాకతడ రసన్నేగానే.

కావ్యం దేని గురించో, ఏ భాషలోనో చెప్పాడు బాగుంది. అంకితం ఎవరికి? తనకే ఇమ్మన లేదు చూడండి! కావ్యము నా గురించి రాసినా, నీకు ఇష్టదైవమైన వేంకటేశ్వరుడికి అంకితమివ్వు . పేరులోనే తేడా కాని మేమిద్దరమూ ఒక్కటే కదా. మా ఇద్దరికీ ఎటువంటి భేధమూ లేదు. అలా తనకిష్టమైన కథని, తన భాషలో రాయమని చెప్పినా, అంకితం విషయంలో అది రాయలవారి ఇష్ట దైవమైన వేంకటేశ్వరునికే ఇవ్వమన్నాడు.


ఎవరికిచ్చినా ఒకటే కదా! తను ఆనతిచ్చినట్టుగా ఆ కావ్యాన్ని రచిస్తే, ఉత్తరోత్తర గొప్ప అభివృద్ధి పొందుతావని దీవించి ఆ తెలుగురాయలు అంతర్ధానమయ్యాడు. యుద్ధ సంరంభంలో ఉన్న రాయలకి ఇలాంటి కల రావడం విడ్డూరం కదూ!


రాయలు నిద్రలేచిన తర్వాత ఆలయ గోపురానికి నమస్కరించి కాలకృత్యాలు తీర్చుకొని దండనాధ సామంతులను, వేదపండితులను పిలిపించి తన స్వప్న వృత్తాంతం వివరించాడు. వాళ్లు సంతోషించి "మహారాజా! ఈ కల నీకు సకల శుభాలనే సూచిస్తుంది. శ్రీమహావిష్ణువు సాక్షాత్కారం వల్ల ఇంతకు ముందుకంటె భక్తి పెరగగలదని, కావ్యరచన చేయమనడం నీకు విద్యాప్రాప్తి కలగగలదని సూచిస్తుంది. అంతేగాక లక్ష్మీ సమేతంగా రావడం నీకు ధనసంపద కూడా సమృద్ధి పొందగలదని, చేతిలో కమలం ఏకచ్ఛత్రాధిపత్యాన్ని సూచిస్తుంది. నీ కొలువులో సకల సామంతరాజులతో భాష గురించి వచ్చిన ప్రస్తావన సమస్త సామంతులు నీ ఆధీనంలో ఉండగలరనడానికి సంకేత సూచన. అదేవిధంగా తన ప్రియురాలు ధరించి ఇచ్చిన పూలమాలల గురించి ప్రస్తావించాడంటే నీకు భవిష్యత్తులో బహు ప్రేయసీ ప్రాప్తి కలగగలదని చెప్పకనే చెప్పుతున్నది. ఈ ప్రబంధ రచన నీకు అన్నివిధములుగా అభివృద్ధి, క్షేమం, విజయం కలిగిస్తుంది అని చెప్పారు.

ఆముక్తమాల్యద కావ్యం అవతరించడానికి ఉన్న నేపథ్యం ఇదీ. వచ్చేసారి విల్లిపుత్తూరు వర్ణనలోకి వెళదాము.

6 comments:

వెంకట్ said...

woo.. really intresting

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

జ్యోతి గారూ, కొంచెం ఆలస్యంగా ఇప్పుడే చూశాను. చాలా బాగా రాశారు.

రాజేశ్వరి నేదునూరి said...

విలిబుత్తూరు వర్ణన ,చక్కని పద్యాలు " శయపూజాంబుజముల్ ,లలితోద్యాన పరంపరా,ద్రవిడ కుటుంబినుల్ ,నీలమేఘము డాలు ఇలా మంచి మంచి పద్యాలతొ మంచి కావ్యాన్ని అందిస్తున్నందుకు ధన్య వాదములు .జ్యోతి గారు మీ కృషి అనన్యం .

kandu said...

ఈ బ్లాగ్ నిజంగా చాలా చాలా బాగుంది... ఆముక్తమాల్యద చదువుతూ ఉంటే ఆకలి వేయడం లేదు..

kandu said...

యూట్యూబ్ లో గరికపాటి నరసింహారావు గారి తర్వాత ఈ బ్లాగ్ నిజంగా చాలా బాగుంది

kandu said...

గరికపాటి వారు నాలుగు పద్యాలు వివరించారు
.. ఆయనతో ఆముక్తమాల్యద మొత్తం చెప్పించాలనేది నా కోరిక

Related Posts Plugin for WordPress, Blogger...