తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Friday, May 7, 2010

ఆముక్తమాల్యద .. ప్రార్ధన

విశ్వశ్రేయస్సు కోసం నీతిబోధ చేయడం ప్రాచీన కావ్యాల ప్రధాన ఉద్ధేశ్యం కాగా చదువరులకు రసస్ఫూర్తి కలిగించడమే ప్రబంధాల ముఖ్య ఉద్ధేశ్యం.. ప్రబంధాలలో కథావస్తువుకంటే అలంకారాలు, పద విన్యాసాలు, పాత్రచిత్రణలకు, రసపోషణకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. మనిషిలోని ఆకలి దప్పులలాగే సౌందర్య పిపాస, రస పిపాస, కళాతృష్ణ మొదలైన లక్షణాలను తృప్తిపరచడానికి ప్రబంధ సాహిత్యం ఒక అద్భుతమైన సాధనం. ఇదే క్రమంలో విజయనగర సామ్రాజ్యనేత శ్రీకృష్ణదేవరాయలు రచించిన "ఆముక్తమాల్యద" ఒక మహాద్భుతమైన ప్రబంధం.

గోదాదేవి తను ధరించిన మాలను విష్ణువుకు సమర్పించిన కారణం చేత ఆమెకు ఆముక్తమాల్యద అనే పేరు వచ్చింది. అట్టి గోదాదేవి , రంగనాధుడి పెళ్లి కథ " ఆముక్తమాల్యద అనే విష్ణుచిత్తీయము". దీనికి మూలంగా "దివ్య సూరి చరిత్ర", "గురుపరపరా ప్రభావం", "ప్రపన్నామృతం" అనే మత గ్రంధాలను రాయలు స్వీకరించాడు.

1518 ప్రాంతంలో కళింగరాజ్యం మీద దండయాత్రకు వెళ్లిన సమయంలో కృష్ణాజిల్లా కూచిపూడి సమీపంలోని శ్రీకాకుళాంద్ర మహావిష్ణువు దేవాలయానికి తీర్ధయాత్ర చేశాడు రాయలు. అక్కడ నిదురించిన వేళ ఆయనకు కలలో ఆంధ్రమహావిష్ణువు దర్శనమిచ్చి.. " ఓ రాజా! సంస్కృతంలో ఎన్నో గ్రంధాలు రాసి మెప్పు పొందావు. తియ్యనైన తెలుగు బాషలో నా సంతోషం కోసం నా కథను తెలుగులో కృతిగా నిర్మించు.. నీకు సర్వదా విజయము, శుభము కలుగుగాక..." అని ఆజ్ఞాపించి, ఆశీర్వదించినట్టుగా రాయలు చెప్పాడు.

అంతట ఆ రాయలు తన దండనాధులు, సామంతులు, వేదపండితులతో చర్చించి ఈ ప్రబంధ రచనకు పూనుకున్నాడు. ఈ కావ్యం మొత్తం అయిదు విడివిడి కథల సమాహారం . మొదటిది.. విష్ణుచిత్తుడి కథ .. రెండవది..ఖాండిక్య కేశిధ్వజ వృత్తాంతం. మూడవది.. యామునాచార్య వృత్తాంతం.. నాలుగవది. గోదాదేవి వృత్తాంతం.. అయిదవది.. చండాల, బ్రహ్మరాక్షసుల కథ. ఈ అయిదు కథలు కలిపి కావ్యంలో సుమారు అయిదువందల పద్యాలు ఉన్నాయి. వాటికి తోడు పీఠికా, విల్లిపుత్తూరు వర్ణనా, మధురాపుర వర్ణనా, ఋతువర్ణనలూ అన్నీ కలిపి ఒక అత్యద్భుతమైన కావ్యాన్ని మనకందించాడు శ్రీకృష్ణదేవరాయలు. ఈ ప్రబంధాన్ని తనకు ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్పరునికే అంకితమిచ్చాడు.

రాయలు శ్రీవేంకటేశ్వరుని మీదనే మొదటి పద్యం రాశాడు. కల్యాణమూర్తులైన లక్ష్మీనారాయణులను అత్యంత రమణీయంగా వర్ణించాడు.( ఈ పద్యం చదువరి స్వరంలో )

శ్రీ కమనీయ హారమణిఁ జెన్నుగఁ దానును, గౌస్తుభంబునం

దాకమలావధూటియు నుదారతఁ దోఁపఁ, బరస్పరాత్మలం

దాకలితంబు లైన తమ యాకృతు లచ్చతఁ బైకిఁ దోఁప,

స్తోకత నందుఁ దోఁచె నన, శోభిలు వేంకటభర్తఁ గొల్చెదన్

భార్యాభర్తలకు ఒకరిమీద ఒకరికి ఉన్న అత్యంత ప్రేమను, అనురాగాన్ని ఈ పద్యంలో వివరిస్తూ, లక్ష్మీదేవి ధరించిన అందమైన హారములోని మణియందు శ్రీనివాసుడు, ఆతని కౌస్తుభమునందు లక్ష్మీదేవి చక్కగా ప్రతిబింభిస్తున్నారు. ఒకరి మనస్సులో ఒకరు నిండి యున్న కారణంగా వాళ్ళ మనసుల స్వచ్ఛత వలన (అవి transparent అయి) ఆ లోపలున్న రూపాలు వారు ధరించిన హారములలోని మణులలో స్పష్టంగా బయటకి కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి. ఈ విధముగా విలసిల్లుతున్న వేంకటేశ్వరుని సేవిస్తాను అని ఉత్పలమాల(కలువపూలమాల) తో ఆముక్తమాల్యద (ధరించిన పూలమాలను సమర్పించినది) కావ్యాన్ని మొదలుపెట్టాడు కృష్ణదేవరాయలు.


(ఈ పద్యం చదువరి స్వరంలో)

సీ. ఖ నట త్పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు

ధృత కులాయార్ధ ఖండిత సమిల్లవరూప చరణాంతిక భ్రమ త్తరువరములు

ఘన గుహా ఘటిత ఝాంకరణ లోకైక ద్వి దుందుభీకృత మేరు మందరములు

చటుల ఝంపా తర స్స్వ నగరీ విపరీత పాతితాశాకోణ పరిబృఢములు

తే. ప్రబల తర బాడబీకృతేరమ్మదములు

భాస్వరేరమ్మదీకృత బాడబములు

పతగ సమ్రాత్పతత్త్ర ప్రభంజనములు

వృజిన తూలౌఘములఁ దూల విసరుఁ గాత.

గరుత్మంతుడి రెక్కల గాలుల వల్ల సముద్రంలోని నీళ్లన్నీ ఆకాశానికి ఎగిసిపోయి పాతాళలోకం బట్టబయలై కనపడింది. అప్పుడు పాతాళంలోనున్న పాములు తమ ఆజన్మశత్రువైన గరుత్మంతుని చూసి భయంతో గజగజ వణకుతూ ఒకదానికొకటి పట్టుకుని ముద్దలుగా కనిపిస్తున్నాయి. గరుత్మంతుడి రెక్కలగాలి ఎంత వేగంగా, తీవ్రంగా ఉందంటే పెద్ద పెద్ద చెట్లు కూడా కూకటివేళ్లతో సహా లేచిపోయి ఆతని కాళ్లకు తట్టుకున్నాయి. ఆతడు పక్షియగుట చేత, తన గూటి కోసం కట్టెపుల్లలను తన కాలిగోళ్లతో తీసికెళ్తున్నట్టుగా తోస్తున్నది. అతని రెక్కల గాలులు పర్వతగుహలలో ప్రవేశించినప్పుడు మేరుపర్వతం, మంధరపర్వతం రెండూ ఏకమై భేరీ, దుందుభులుగా శబ్దం చేస్తున్నట్టుగా లోకాలన్నీ దద్దరిల్లుతున్నాయి ...గరుడుని రెక్కల గాలులు మిక్కిలి తీవ్రంగా ఉండుటచేత దిక్కులు,మూలలయందు ఉన్న పాలకులు (అష్టదిక్పాలకులు) నిలబడలేక వేఱు వేఱు దిక్కులకు విసిరివేయబడ్డారు.

గరుత్మంతుడి రెక్కలగాలి వేగానికి ఆకాశంలోని మేఘములతోడి మెరుపులు సముద్రంలో పడి బడబాగ్నులు సృష్టిస్తున్నాయి. ఆ గాలి ఉధృతానికి బడబాగ్నులు మింటికెగసి మెరుపులుగా మారాయి. అట్టి ప్రచండమైన పక్షిరాజు రెక్కల గాలి పాపములనెడి దూదిపింజెల్లాటి మేఘములను చెదిరిపోవుగాక.


(ఈ పద్యం రాఘవ స్వరంలో..రాగం.. రీతిగౌళ )

పిడికెడు కౌను గొప్పు గని ప్రేమ ద్రివక్ర సమాంగి జేసి, తే

బిడికెడు కౌను గొప్పు బయిబెచ్చు గుణంబును గంటి నంచు, నే

ర్పడగ నిజత్రివక్రతయు బాపగ మ్రొక్కెడు నా, సుమాలిపై

జడిగొన నమ్ములీను హరి శార్‍ఙ్గ ధనుర్లత గాచు గావుతన్

విష్ణుమూర్తి సుమాలి అనే రాక్షసుడితో యుద్ధం చేస్తుండగా ఆయన చేతిలో ఉన్న శార్‌జ్గ ధనుస్సు వంగి అతనికి అభివాదం చేస్తూ ఏదో ప్రార్ధన చేస్తున్నట్టుగా ఉంటుంది. పిడికెడు నడుము, కొప్పూ కలిగి,మూడు వంకరలున్న కుబ్జను తీర్చి సుందరమైన స్త్రీగా చేసావు. అదే విధంగా పిడికెడు నడుమూ (ధనుస్సు మధ్యభాగమైన లస్తకము) , కొప్పు( విల్లు పైభాగం), వీటితో పాటు గుణమూ (గుణం, వింటితాడును గుణం అని కూడా అంటారు) ఉన్న నా వంకరలను ఎందుకు తొలగించవు ప్రభు?" అని యుద్ధములో సుమాలిపై జడివానల వేస్తున్న శరప్రయోగమునందు ఆ విల్లు ఈ విధముగా శ్రీమహావిష్ణువుకు వంగి మొక్కుచున్నట్టుగా ఉన్నది. ఇంతకీ ఆ ధనుస్సు వక్రతను విష్ణుమూర్తి ఎలా తొలగిస్తాడు? ఎడతెగకుండా యుద్ధం చేసేటప్పుడు విల్లు అర్థ చక్రాకారంలోకి మారుతుందని వర్ణిస్తూ ఉంటారు. అంటే అంతగా వంచబడుతుందన్న మాట. అప్పుడా త్రివక్రత పోయినట్టే కదా! అంచేత ఎప్పుడూ అలా యుద్ధం చేస్తూ శత్రు సంహారం చెయ్యమని ఆ ధనుస్సు ఆకాంక్ష అన్న అర్థం కూడా స్ఫురిస్తుంది.


(ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం .ద్విజావన్తి )


అడరు గళాస్రధారలు మహాముఖ వాంత సుధాంబుధారలున్

పొడవగు వహ్నికీలములు పొంగును కాన్ పెరదైత్య కోటికిన్

బెడిదపు కిన్కతో నెసరు వెట్టిన పెద్దపనంటి వోలె, ఎ

క్కుడు వెస రాహు మస్తకము కొన్న సుదర్శనదేవు గొల్చెదన్

క్షీరసాగర మథనంలో పుట్టిన అమృతాన్ని రాక్షసులకు అందకుండా దేవతలకి పంచడానికి విష్ణుమూర్తి మోహినీ అవతారమెత్తుతాడు కదా. ఆ సమయంలో రాహువనే రాక్షసుడు దేవతలలో చేరి అమృతాన్ని త్రాగబోతాడు. అది గ్రహించిన విష్ణువు ఆ అమృతం రాహువు కంఠంనుండి కిందకి దిగకముందే తన సుదర్శన చక్రంతో అతని తల నరుకుతాడు. ఈ పద్యంలో ఆ ఘట్టం వర్ణించబడింది. అలా తెగిన తలనుండి రక్తం ఎగజిమ్మింది. రాహువు నోటినుండి అమృతం పైకి పొంగింది. ఆ ఎఱ్ఱని రక్తమేమో పొయ్యికింద మంటలా ఉంది. పైకి పొంగుతున్న అమృతమేమో ఎసరుపెట్టినప్పుడు పైకి పొంగే నీళ్ళలాగా ఉంది. తెగిన రాహువు తల ఎసరుపెట్టిన పెద్ద కుండలాగా ఉంది. కోపంతో రాక్షస సమూహమంతటికీ ఎసరుపెట్టిందా అన్నట్టుగా అతి వేగంతో రాహువు తల నరికిన ఆ సుదర్శన దేవుడికి నమస్కరించాడు. ఎసరుపెట్టడం అంటే నష్టాన్ని కలిగించడానికి ప్రయత్నించడం అనే తెలుగు జాతీయాన్ని ఈ పద్యంలో ఎంత చక్కగా ఉపయోగించాడో చూసారా!


ఇలా ఇష్టదేవతా ప్రార్థనలో వేంకటపతి అయిన విష్ణుమూర్తిని, ఆదిశేషువుని, విష్ణు వాహనమైన గరుత్మంతుడిని, విష్ణు సేనాధిపతి విష్వక్సేనుడి బెత్తాన్ని, విష్ణు శంఖమైన పాంచజన్యాన్నీ, అతని ఖడ్గమైన నందకాన్ని, కౌమోదకి అనే అతని గదని, శార్‌ఙ్గ ధనుస్సుని, సుదర్శమ చక్రాన్ని, పన్నెండుమంది ఆళ్వారులని ప్రార్థిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. రాయలు వైష్ణవ మతావలంబి. ఆ మతంలో విష్ణుమూర్తితో బాటు అతని సకలాయుధాలను, ఆదిశేషువును, గరుత్మంతుని, విష్వక్సేనుని కూడా పూజించడం ఆనవాయితీ. అలాగే పరమభక్తులైన ఆళ్వారులను కూడా. మరే ఇతర దేవతలని అందుకే ప్రార్థించ లేదు.

ఇష్టదేవతా ప్రార్థన అయిన తర్వాత, అసలు తను ఈ ఆముక్తమాల్యద వ్రాయడానికి వెనకనున్న కారణాన్ని నేపథ్యాన్ని వివరిస్తాడు. అది తర్వాతి పోస్టులో చూద్దాం.

23 comments:

Sriram said...

Great Effort !! Congrats to amuktamalya.blog team
- Sriram

Avineni N Bhaskar said...

Wow, amazed at your efforts. chaduvutunTE, santOshangA undi. inkA vinalEdu. vinna tarvAta audio meeda naa abhipraayaM cheptaanu. Will wait for more padyaMs.

-avinEni bhAskar

Pranav said...

చాలా మంచి ప్రయత్నం :)

Srujana Ramanujan said...

Excellent. అంటే ఆండాళ్ తల్లి కధ చెపుతున్నారన్నమాట

కొత్త పాళీ said...

చాలా సంతోషం. శుభారంభం. నడుం బిగించి గొంతులు సవరించిన వారందరికీ అభినందనలు.
హిట్లు వచ్చినా రాకపోయినా, మీ ప్రయత్నం మాత్రం ఆపకుండా కొనసాగించండి.

nedunuri said...

నమస్కారములు.
చాలా సంతోషం. ఇలాంటి అమృత తుల్యమైన కావ్యాలు ఎన్ని సార్లు చదివినా మధురంగానె ఉంటాయి. మంచి ప్రయత్నం తప్పక రాయండి. అభీష్ట సిద్ధి రస్తు. నాకీ లింక్ పంపినందుకు ధన్య వాదములు.

cbrao said...

No audio links in the article, on my Mac computer. Is the audio a flash file? Any reader heard these poems audios? Pl give your feedback.
cbrao
Mountain View, CA.

రవి said...

భేష్! ఇటువంటి పని ఎవరిచేత అవగలదో, అంతటి వారే ఈ పనికి పూనుకోవడం మహదానందకరం.

రాఘవ గారి పద్యాలు, వెనుక వీణానాదం - శభాష్.

ఉష said...

అభినందనలు. మీ అందరి ప్రయత్నం విజయవంతం కావాలని, శుభప్రదం కావాలని ఆశిస్తూ..

కౌటిల్య said...

ఆముక్త మాల్యద చదుకున్నానే గాని,మంచి గొంతుల్లోంచి విన్నది లేదు...రాఘవ గారూ,చదువరి గారూ! భువనవిజయంలో కూర్చున్నట్లుంది...నాకు ఇంత మంచి అనుభూతినిచ్చినందుకు రాఘవ గారికి,చదువరిగారికి,భైరవభట్ల వారికి,జ్యోతిగారికి ధన్యవాదాలు..

Dr.రామక పాండు రంగ శర్మ said...

చాలా సంతోషం. తెలుగు సాహితీ సేవలో మీ కృషి మెచ్చదగినది. ఇది పెద్ద ప్రాజెక్టు. మీరు ఈ ప్రాజెఖ్టును చివరివరకూ నిర్వహించాలని, ఆ శక్తి సమర్థ్యాలు, ఓపిక, అవకాశాలు భగవంతుడు మీకు కల్పించడం వల్ల మావంటి చదువరులకు మేలు చెయ్యాలని కోరుకుంటున్నాను.

జ్యోతి said...

అందరికి ధన్యవాదాలు

రావుగారు, ఇందులో ఆడియో లింకులు ఇవ్వలేదు. ప్లేయర్ ని పెట్టాను. అవి అందరికి పనిచేస్తున్నాయి మరి..

cbrao said...

నా Operating system Mac O.S.X. 10.5.8 Browser Firefox 3.6.3 లో ప్లేయర్ కనిపించటంలేదు. అయితే సఫారిలో బ్లాగు తెరిస్తే ప్లేయర్ కనిపించింది. ఇది ఫైర్ఫాక్స్ సమస్య కావచ్చు. రాఘవ పద్యాలు,నేపధ్య సంగీతం బాగున్నాయి. తెలుగు బ్లాగు చరిత్రలో మరో నూతన అధ్యాయాన్ని తెరుస్తుందీ ఆముక్తమాల్యద. ఈ బ్లాగు సృజనలో కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

చాలా బాగుంది జ్యోతిగారూ. ఇలాగే కానివ్వండి.

పంతుల జోగారావు said...

ఇది కలా, నిజమా ! అనిపించేంత గొప్పగా ఉంది.
చాల గొప్ప కార్యాన్ని తల కెత్తుకున్నారు. దీనిని ఆసాంతం సాగించే శక్తి సామర్ధ్యాలు ఆ భగవంతుడు మీకివ్వాలని కోరుకుంటున్నాను.
ఆముక్తమాల్యద పద్యాలు వింటూ, మీ బ్లాగు చదవడం ఒక మంచి అనుభూతిని కలిగిస్తున్నది. శుభం !
జయోస్తు.

చింతా రామకృష్ణారావు. said...

అమ్మా! జ్యోతిగారూ! అద్భుతం. అత్యద్భుతం. మీ అసాధారన ప్రయోగం మానసోల్లాసకరంగా చాలా చక్కగా ఉందమ్మా!
చదువరి; రాఘవలు తమ అకుంఠిత కంఠస్వరంతో వినేవారికి కంఠ పాఠం చేయడమే కాదు. చాలా--- చాలాచాలా బాగుంది. తప్పక ఇదిలా కొనసాగించండి. బ్లాగ్సాహితీజగత్తులో క్రొత్త క్రొత్త సుమాలు పూయించండి.
మీకూ; మీతో పాటు చదువరి గారికి;
ముద్దులికే మధుర గాత్రాభిరాముడైన ముక్కు రాఘవ కిరణ్కుమార్ కు అభినందనలు.

జ్యోతి said...

రామకృష్ణగారు,

మా టీమ్ లో భైరవభట్ల కామేశ్వరరావుగారిని మర్చిపోయారండి. నలుగురి కృషి సమానంగా ఉంది మరి ఈ బ్లాగు నిర్వహణలో...

భరత్ said...

adbhutamaina mee prayatnaniki naa johaarlu.

Tekumalla Venkatappaiah said...

ఆహా... ఏమి నా భాగ్యము..
తెలుగు పద్యం ఇంకా బతికి బట్టకడుతోందంటే.... వలబోజు జ్యోతి లాంటి వాళ్ళ వల్లే అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

ఆమె సాహితీ తృష్ణకు..కళాభివందనాలు. కళాభినందనాలూనూ....

ఆ!వె! అల్లసాని వారి అల్లిక కాదేమొ,
కృష్ణదేవ రాయు తృష్ణ ఏమొ!
జ్యొతి గారు రాయ జ్యొత్స్నలు విరబూసె.
తెలుగు వారి ఘనత తెలియ జెప్పె.

దీన్ని నభూతో నభవిష్యతి అన్నట్టు రూపు దిద్దండి.
మీకు సాహిత్య అకాడమీ వారి అవార్డు రావాలని మనస్ఫూర్తి గా కోరుకుంటూ..

ఈ సాహిత్య అనే సముద్రంలో, జ్యోతి లాంటి ముత్యాలూ రతనాలూ ఎన్నో ఉన్నాయి.
నేను మాత్రం ఆ సముద్రం వడ్డున గవ్వలు ఏరుకునే పసి బాలుడిని.

భవదీయుడు
టేకుమళ్ళ వెంకటప్పయ్య.

జ్యోతి said...

అయ్యబాబోయ్! వెంకటప్పయ్యగారు...ఇది నలుగురు కలిసి చేస్తున్న సమిష్టి కృషి అండి. ఆపైన అ ఏడుకొండలవాడి దయ..

Tekumalla Venkatappaiah said...

తెలుగు బ్లాగులు తొమ్మిది వెలుగు నింప
తెనుగు వారికి వలబోజు తెచ్చె జ్యోత్స్న!
షడ్రుచులయ్యె మనకెల్ల సకల కళలు
తెలుగు విజ్ఞాన సర్వస్వ జ్యోతి యామె!

Konda Reddy Mopuri said...

చాలా సంతోషం.ఇలాంటి అమృత తుల్యమైన కావ్యాలు అందిస్తున్నందుకు కృతఙ్ఞతలు.....!

Madhavi said...

wow, amazing effort. Thank you so much for this.

Related Posts Plugin for WordPress, Blogger...