తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Saturday, July 27, 2019

ఆముక్తమాల్యద యొక్క మన్మధావస్థ

రాయలు వసంత కాల వర్ణన కొనసాగిస్తూ.. ఆ ఆముక్తమాల్యద స్వామిపై మరులు కొని మన్మధావస్తను బొందడాన్ని వర్ణిస్తున్నాడు.

ఉ. ఆ వనజాక్షి కాక బొర లాడ నలగిన సొమ్ముజీరలున్
వేవిన నూడ్చి యూడ్చి మరి వేర వహించుట వారక్లప్తముల్
గా వనమాలి సేవయెడ కాంక్షనొదుంగక కల్ల తెల్వితో
నే వలవంత దాగ జరియించిన డాగమి జూచి నెవ్వగన్

ఆ ఆముక్త మాల్యద స్వామియందు విరహానురక్తురాలై పొరలి పొరలి నలిగిన బట్టలను మరల మరల ధరించుచు, ఆ ధరించునది శృంగారము కొరకనునట్లు గనపడుచుండగా, కొంతవడి తెలివి దెచ్చుకుని, భగవత్సేవకు పూనుకొనుచుండగా ఆ విష్యము బయటపడి విష్ణుచిత్తుడు గాంచి మనసున బాధపడును.

కం. పుత్రియు దా గామిని నొక
పుత్రియు నట్లుండుటకు నబుద్ధేక్షు ధను:
పత్రియగు విష్ణుచిత్తుడ
పత్త్రపలే కదియు నేత పంబో యనుచున్
ఆ విష్ణుచిత్తుడు తన జీవితములో నెన్నడూ మదనతాపమెరుగని వాడు కావున ఆమె విరహమనుభవించుచున్నదను విషయము ఆయనకు అర్ధంకాలేదు. ఆమె అలా ఉండడం కూడా ఒక పూజ/తపము లోని భాగమే అని తలచాడు.
ఐతే ఆయన మనసు పొరల్లో ఏదో సందేహం మిగిలి ఉంది. దిన దిన ప్రవర్ధమాన అవుతున్న తన కూతురు యొక్క బాధ ఏమిటో అర్ధం కావడంలేదు. గుడిలో పూజాదికాల అనంతరం స్వామిని ప్రార్ధించాడు.


ఉ. కంధర నీలవర్ణ మధుకైటభ నాగ సుపర్ణయోగి హృ
ద్గ్రంధి బిదోత్ధ భోగి వనితా స్వనవచ్ఛ్వస నస్రవచ్ఛిర
స్సంధి వసన్ని శాపతిర సస్రుతి దుగ్ధపయోధి వీచికా
మంధర కేళికా దరస మాశ్రిత పంజ్తిశిరోధి సోదరా.

నీలమేఘశ్యామా! మధుకైటభులనెడు రాక్షస సర్పములకు గరుత్మంతుని వంటి వాడా! యోగుల యొక్క యోగ శక్తితో కుండలిని విద్య తో పైకి ఎగసిన సర్పమువలె ఉన్నవాడా! పాలకడలి యొక్క అలలపై విహరించే వాడా! ఆశ్రయించిన రావణుని సోదరుడగు విభీషణుని సమాదరించిన వాడా.. వినుము.

ఇంతటితో ఆశ్వాసము ముగిసినది. మరల షష్టాశ్వాసం లొ కలుసుకొందాం.


0 comments:

Related Posts Plugin for WordPress, Blogger...