తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Sunday, August 19, 2012

యామునాచార్య చరిత్ర

తే. ప్రభువు లరిగిరి క్రమ్మఱఁ బాండ్యనగరి,
కమ్మునియు నట్లు వైష్ణవాభ్యర్చనంబుఁ
దన చిరంతన తులసికాదామకరణ
దాస్యమును జేసికొంచుఁ దత్పరత నుండె.

( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో )
మత్స్యద్వజుడు పంపిన మంత్రి, సామంతులు మొదలైనవారు రాత్రంతా విష్ణుచిత్తుని ఆతిథ్యం స్వీకరించి మరునాడు సెలవు తీసుకుని వెళ్లిపోయారు. ఆ తరువాత విష్ణుచిత్తుడు యథావిధిగా భగవదారాధనలో మునిగిపోయాడు. మన్నారుస్వామికి ప్రీతికరమైన తులసీమాలల అలంకరణ సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడితో విష్ణుచిత్తుని జైత్రయాత్ర కథ ముగిసింది. విష్ణుచిత్తుడు తిరిగి తన భగవదర్చనలో తులసీమాలల కట్టుకొనే పనిలో నిమగ్నమయ్యాడు. ఇది ఒక ఉదాత్తమైన ముగింపు.

ఇప్పుడొక కొత్త కథ మొదలవుతోంది. ఇది యామునాచార్యుని కథ. శ్రీవైష్ణవమతంలో ఆచార్యుల పరంపర ఉంది. అందులో యామునాచార్యుడు ఒక ప్రధానాచార్యుడు. ఇతను
రామానుజాచార్యుని కన్నా ముందువాడు, క్రీ.శ. 10వ శతాబ్దానికి చెందినవాడు. ఈ కథ చెప్పబోతున్నది విష్ణుమూర్తి. చెపుతున్నది లక్ష్మీదేవితో. ఒకనాడు మధ్యాహ్న వేళ విష్ణుచిత్తుడు స్వామికి పుష్పమాలికను సమర్పించి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు అతన్ని అదృశ్యంగా గమనిస్తున్న విష్ణుమూర్తి తన భార్య లక్ష్మీదేవితో యిలా అంటున్నాడు:


తే. 'యామునాచార్యుఁ డొక్కఁడు నీమహాత్ముఁ
డొక్కఁడును గాదె దర్శనం బుద్ధరించి
రస్మదీయకృపాతిశయమున' ననిన
నిందిరాదేవి తన భర్త కిట్టు లనియె.

( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)

"యామునాచార్యుడొక్కడు, ఈ మహాత్ముడొక్కడు. నా దయవల్ల విశిష్టాద్వైత దర్శనాన్ని ఉద్ధరించారు." అని శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో అన్నాడు. విష్ణుచిత్తుడిని చూసినప్పుడు విష్ణుమూర్తికి యామునాచార్యుడు గుర్తుకువచ్చాడన్న మాట. యామునాచార్యుడే ఎందుకు గుర్తుకువచ్చాడో, కథలోకి వెళితే తెలుస్తుంది. నిజానికి యామునాచార్యుడు విష్ణుచిత్తుని తర్వాతి కాలం వాడు. అయినా భగవంతునికి కాలావధి లేదు కదా! ఇక్కడ "అస్మదీయ కృపాతిశయమున" అన్నది చాలా ముఖ్యమైన పదం. అంటే నా కృప వల్లనే వారు తమ కార్యాలను సాధించారు అని నొక్కి చెపుతున్నాడు. దీని ద్వారా ఈ కావ్యానికి అసలైన నాయకుడు శ్రీమహావిష్ణువే అనే విషయాన్ని స్ఫురింపజేస్తున్నారు రాయలవారు.
విష్ణుమూర్తి యిలా అనేసరికి అమ్మవారు ఆసక్తిగా, ఎవరా యామునాచార్యుడు, ఏమా కథా అని అడిగింది. విష్ణుమూర్తి తన భార్యకు యామునాచార్యుని కథ చెప్పడం మొదలుపెట్టాడు.

తే. అతఁడు చిఱుతనాఁడె యాచార్యకులమున
వేదశాస్త్రముఖ్య విద్య లభ్య
సించుచుండ, నపుడు చెలువ, యిప్పటి పాండ్య
నృపతి పూర్వవంశ్యుడే యొకండు.
( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం మాయామాళవగౌళ )

ఈ యమునాచార్యుడు చిన్నవయసునుండే గురుకులంలో ఉండి వేదశాస్త్రాలను అభ్యసించాడు. ఆ కాలంలో ఇప్పటి పాండ్య రాజు పూర్వ వంశస్థుడైనవాడే రాజుగా ఉండేవాడు. ఇక్కడ తెలుస్తుంది, యామునాచార్యుడే విష్ణుమూర్తికి ఎందుకు గుర్తుకువచ్చాడో. యామునాచార్యుని కాలంలో, అతనుండే దేశాన్ని కూడా పాండ్య వంశానికి చెందిన రాజే పరిపాలన చేస్తూండేవాడు. అయితే ఈ రాజుకీ ఆ రాజుకీ తేడా ఉంది. యామునాచార్యుని కాలంలోని రాజు,

తే. వెఱ్ఱిశైవంబు ముదిరి మద్వినుతి వినఁడు
నతి యొనర్పఁడు మామక ప్రతిమలకును,
హరుఁడె పరతత్వ మను, మదీయాలయముల
నుత్సవంబుల కులుకు, నెయ్యురును నట్లె.

ఆ రాజు శైవమత పక్షపాతి. ఆ వెఱ్ఱి ముదరడం వల్ల ఆ రాజు విష్ణు కీర్తిని, స్తుతిని సహించలేకపోయేవాడు. అంతేగాక తన రాజ్యంలోని వారెవరూ విష్ణువిగ్రహారాధన కూడా చేయరాదని కట్టడి చేసాడు. వైష్ణవాలయాలలో జరిగే ఉత్సవాలు చూసి అసహ్యించుకుంటూ శివుడే పరబ్రహ్మమని అంటూ తన స్నేహితులతో అదే విధంగా ఉండేవాడు. ఇక్కడ "వెఱ్ఱిశైవంబు" అంటే రెండు రకాల అర్థాలు తీసుకోవచ్చు. అసలు శైవమే వెఱ్ఱిదని ఒక అర్థం. వెఱ్ఱిగా మారిన శైవమని మరొక అర్థం. శైవులలో కూడా వీరశైవులు వేరేగా ఉన్నారు. ఇక్కడ ఆ వీరశైవాన్నే వెఱ్ఱిశైవంగా పేర్కొన్నాడని మనం భావించాలి. ఎందుకంటే, మతం ఎప్పుడైనా పరమత సహనం కలిగినంత కాలం బాగానే ఉంటుంది. అది కోల్పోయినప్పుడే అది వెఱ్ఱిగా మారుతుంది. రాయలవారు ఎంతటి శ్రీవైష్ణవ మతావలంబి అయినా, శైవుల పట్లగాని, ఇతర మతాలవారి పట్లగాని అనాదరం చూపించలేదు, మనకు తెలిసినంతలో. శ్రీవైష్ణవులలోనే కొందరు వీరవైష్ణవులు ఆ పని చేసారు. వారిది కూడా వెఱ్ఱే అవుతుంది.
రాయలవారిక్కడ ఆ వెఱ్ఱి శైవం ఎలా ఉందో వర్ణిస్తారు. అది వేదాలను నమ్మదు. వేదపండితులను గౌరవించకుండా కేవలం జంగములనే పూజిస్తారు. ఇంటి ఇలవేల్పులను పట్టించుకోరు. కేవలం వీరభద్రుడినే కొలుస్తారు. ప్రాచీనాలయాలు శిథిలమైపోతున్నా, వాటి గురించి పట్టించుకోక కేవలం జంగములకు మఠాలను మాత్రమే స్థాపిస్తున్నాడు రాజు. మతం రాజకీయంలోకి, రాజ్యపాలనలోకి ప్రవేశిస్తే ఏర్పడే అవస్థ యిక్కడ వర్ణిస్తున్నాడు రాయలు. రాజు శైవమతావలంబి కావచ్చు. అంత మాత్రాన ఇతర దేవాలయాలను పట్టించుకోక పోవడం రాజుగా అతని బాధ్యతారాహిత్యమే అవుతుంది. పైగా ఈ వైపరీత్యం ఎంత దాకా వెళ్ళిందంటే:

క. శివలింగముఁ దాల్చిన జన
నివహం బేమైనఁ జేయనిది పాపము దా
నవుఁ గా దనఁ; డా సమయము
నవు నను విప్రులక యగ్రహారము లిచ్చున్.

( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )
ఈ రాజు శివలింగాన్ని ధరించినవారు ఎటువంటి దుష్కార్యాలు చేసినా వారిని మందలించక, శిక్షించకుండా కనీసం అది తప్పు, పాపం అని కూడా చెప్పేవాడు కాదు. శైవాచారమే గొప్ప అని రాజుకు తలూపే బ్రాహ్మణులకు అగ్రహారాలు మొదలైన ధనసంపద దానం చేసేవాడు.
అసలు శైవమతాన్ని అవలంబించని వారికి దేశబహిష్కరణ శిక్ష విధించేవాడట. దానితో, తమ పుట్టినూరు విడిచి వెళ్ళలేక బ్రాహ్మణులు కొందరు శైవ వేషం వేసుకొని తిరిగేవారు.

క. శీలముఁ బట్టియు గంజా
హాల లుపాంశున భుజించు నధముల బైటం
జాలఁడు వైవన్, విప్ర
స్ఖాలిత్యము బైలుసేసి కనుగిఱపు సభన్



( పద్యం లంకా గిరిధర్ స్వరంలో)


శైవుల పట్ల ఆ రాజుకు ఎంత పక్షపాతం అంటే వాళ్లు శివదీక్షను స్వీకరించిన తర్వాత కూడా గంజాయి, సారా సేవించినా వాళ్లని పట్టుకుని శిక్షించడు కాని బ్రాహ్మణులు తెలియక చేసిన చిన్న తప్పులకు కూడా వాళ్లని సభనుండి వెళ్లగొట్టి శైవుల వైపు కన్నుగీటుతూ హేళనగా నవ్వేవాడు.


రాజు ఎంత దుర్మార్గుడైనా అతని పట్టపురాణి మాత్రం విష్ణుభక్తురాలు. తన భర్త చేసే దుష్కార్యాలు చూసి బాధపడేది. ఆమె ఎంతటి శ్రేష్ఠురాలంటే,

సీ. వింగడం బైనట్టి ముంగిట నెలకొన్న

బృందావనికి మ్రుగ్గు వెట్టుఁ దాన;

దశమినాఁ డేకభుక్తము సేసి, యవలినాఁ

డోర్చి జాగరముతో నుండు నిట్రు;

బారసి పోనీదు, పై నిద్రఁ బాఱుట

క్కలుపాడు మత్పుణ్యకథలఁ ద్రోయు;

నేమంపు మూన్నాళ్లు కామింప దధినాధు;

మఱునాఁడు కన్నును మనసుఁదనియ


నారజపు వన్నెఁ బ్రియు సెజ్జ కరుగుఁ గూర్మి;

నరుగుచో నాభి దుడిచి కప్పురపు నాభిఁ

బెట్టు; నిట్టుల మద్భక్తి పుట్టియును ని

జేశు నెడ భక్తి చెడదు మదిష్ట మగుట


( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం - వరాళి )

విశాలంగా, సుందరంగా ఉన్న ఇంటి ముంగిలిలోనున్న తులసీవనంలో శుభ్రం చేసి తానే ముగ్గులు పెట్టేది.. ప్రతీ దశమినాడు ఒంటిపూట భోజనం చేసి ఏకాదశినాడు అభోజనంగా ఉండి రాత్రి జాగారం చేసేది. బారసినాడు (ద్వాదశినాడు) కూడా వ్రత దీక్షలో ఉండి, ఆ రాత్రి బ్రాహ్మణ స్త్రీలు పాడే శ్రీహరి పుణ్యకథలను వింటూ నిద్రపోకుండా గడుపుతుంది. ఆ దశమి, ఏకాదశి, ద్వాదశి రోజులలో భర్తకు కూడా దూరంగా ఉండేది. త్రయోదశినాడు భర్తకు నచ్చేవిధంగా అందంగా అలంకరించుకుంటుంది. తన కస్తూరీ తిలకాన్ని తుడిచి కర్పూరపు తిలకం దిద్దుకుని భర్త అంతఃపురానికి వెళుతుంది. కస్తూరి వైష్ణవుల బొట్టు. అంచేత భర్త దగ్గరకు వెళ్ళేటప్పుడు దాన్ని తుడిచేస్తుంది. కర్పూరం విభూతిలా ఉంటుంది కనుక అది పెట్టుకుంటుంది. విష్ణువు మీద ఎంత భక్తి ఉన్నా పత్రివ్రతా ధర్మం ఆదరణీయం కనుక భర్తపట్ల భక్తిలో ఏమాత్రం లోపం రానిచ్చేది కాదు. రాజ్యమంతటా తన వీరశైవాన్ని స్థాపించినా, తన అంతఃపురంలోనే, తన భార్యచేత వైష్ణవపూజ మానిపించ లేకపోయాడన్న మాట ఆ రాజు!


రాజు తన భక్తులను నిరాదరిస్తూ, కష్టాలకు గురిచేస్తూ ఉంటే భగవంతుడు ఉపేక్షించడు కదా. కాని దేశానికి రాజైన వాని ద్వారానే ధర్మం రక్షింపబడాలి. అధర్మం జరుగుతున్న చోటల్లా భగవంతుడే అవతరించాలంటే కుదరని పని. అంచేత రాజులో ఎలాగైనా మార్పు తేవాలనుకున్నాడు విష్ణుమూర్తి. అందుకోసం యామునాచార్యుని రాజు కొలువుకు పంపించి అక్కడి శైవపండితులను వాదనలో గెలిచి విశిష్టాద్వైతాన్ని అతడు స్థాపించేలా చెయ్యాలనుకొని, యామునాచార్యుని మనసులో ఆలోచన పుట్టించాడు.

ఇక్కడ మనం గమనించ వలసిన విషయమేమిటంటే, విష్ణుచిత్తునికి స్వయంగా స్వామి ప్రత్యక్షమై పాండ్యరాజసభకు వెళ్ళమని ఆదేశించాడు. యామునాచార్యునికి అలా కాక అతని మనసులో ఆలోచన పుట్టేలా చేసాడు. అంటే నేరుగా దర్శనమిచ్చేంత పరిపక్వత యామునాచార్యుడు ఇంకా సంపాదించ లేదన్న మాట.

సరే, విష్ణుచిత్తుని కాలంలోని పాండ్యరాజుకు స్వయంగా వైరాగ్యం కలిగి మతాన్ని తాను అవలంబించాలో తెలుసుకోవాలని అనుకున్నాడు. కాని కథలో పాండ్యరాజు అలా కాదు కదా. ఇతడు వెఱ్ఱిశైవుడు. ఇతని సభలో ప్రవేశించడం ఎలా మరి? అందుకోసమే అతని భార్య విష్ణుభక్తురాలయ్యింది. రాజు నిరసించిన భక్తులకూ, పూజ్యులకూ, వెనక ద్వారం గూండా ఈమె ఆశ్రయమిస్తూ ఉండేది! అక్కడకు వెళ్ళాడు యామునాచార్యుడు. వెళ్ళి రాణిగారికి ఆశీర్వచన అక్షతలు పంపించి, తన వివరాలు తెలియజెప్పాడు. తాను వైష్ణవ బ్రహ్మచారిననీ, రాజు వైష్ణవ విముఖుడు కాబట్టి తమలాంటి వారిని సభలోకి రానివ్వడనీ, భార్యకు అతను అనుకూలుడు కాబట్టి, ఆమె మాట వింటాడనీ, అంచేత ఆమె ఎలాగైనా తనను సభకు రప్పించి వాదం ఏర్పాటు చేయిస్తే వైష్ణవమత స్థాపన తాను చేయగలనని విన్నవించుకుంటాడు.


ఆమె రాజును ఒప్పించి సభను ఏర్పాటు చేస్తుందా, యామునాచార్యుడు వాదన గెలుస్తాడా, గెలిస్తే తర్వాత ఏమవుతుంది అన్న కథ తర్వాతి టపాల్లో చూద్దాం.

1 comments:

BHALLAM SRI KRISHNA VENKATESWARA ANIL RAJU said...

మీ యొక్క ప్రయత్నం అద్భుతం....మన సంస్కృతిని కాపాడడానికి మీరు తీసుకున్న నిర్ణయం అభిననందనీయం ...
భల్లం లీల శ్రీ సీత రామాంజనేయ కృష్ణ వెంకటేశ్వర త్రినాధ వర్మ

Related Posts Plugin for WordPress, Blogger...