తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Wednesday, October 19, 2011

ఖాండిక్య కేశీధ్వజ సంవాదము - 3

ఖాండిక్యుని యుద్ధంలో ఓడించి రాజ్యాన్ని చేజిక్కించుకున్న కేశీధ్వజుడు, తలపెట్టిన క్రతువులో యజ్ఞదేనువు పులిబారిన పడి చనిపోవడంతో, శత్రువైనా తన సోదరుడు ఖాండిక్యుని పరిష్కారం కోరడానికి అతనుండే అడవికి వెళతాడు. శత్రువు తనంతట తానే వచ్చినపుడు అతనిని సంహరించి రాజ్యాన్ని దక్కించుకొనుమని ఖాండిక్యునికి మంత్రులు సలహా యిస్తారు. ఖాండిక్యుడు అది ధర్మసమ్మతము కాదని వారించి, కేశీధ్వజునికి తగిన ప్రాయశ్చితం చెప్పి పంపిస్తాడు. కేశీధ్వజుడు తిరిగి తన రాజ్యమునకు వెళ్లి తన యజ్ఞాన్ని ఏ లోపమూ లేకుండా సంపూర్ణంగా నిర్వహిస్తాడు. ఇప్పటివరకూ జరిగిన కథ యిది. అలా యాగాన్ని పూర్తిచేసిన కేశిధ్వజుడు అవబృథస్నానం చేసి, ఋత్విక్కులను, వైతాళికులను, సదస్యులను, యాచకులను అందరినీ సత్కరించాడు.

తే.

మఱియుఁ గోరినవారి యక్కఱలు తీర్చి

యును మన:పూర్తి చాల కొయ్యనఁ దలంచి,

'యకట గురుదక్షిణ యొసంగ నయితి' నంచు

మగుడఁ జని, శంక నతఁడు సంభ్రమపడంగ.

( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)

ఇంకా అడిగినవారందరికీ వారు కోరిన అవసరాలు తీర్చాడు. అయినప్పటికీ అతని మన్సులో ఏదో వెలితి మిగిలిపోయింది. ఆలోచించగా అతనికో విషయం గుర్తొచ్చింది. ప్రాయశ్చితాన్ని సూచించిన ఖాండిక్యునికి గురుదక్షిణ ఇవ్వడం మరిచానే అనుకుంటూ మళ్లీ అడవికి వెళ్లాడు. మళ్లీ వచ్చిన కేశీధ్వజుడిని చూసి ఖాండిక్యుడు సందేహంతో తొట్రుపాటుపడ్డాడు. ఇదేమిటబ్బా! మళ్ళీ వచ్చాడు అని.

ఖాండిక్యుని కంగారు అర్థంచేసుకున్న కేశిధ్వజుడు అతడిని వారించి, "రాజా! నీకు గురుదక్షిణ యివ్వడానికి వచ్చాను. నీ కోరికేమిటో చెప్పు" అని అడిగాడు. దానితో మళ్ళీ కేశిధ్వజుడు తన మంత్రులతో సమావేశమయ్యాడు!

క.

'గురుదక్షిణ యిచ్చుట కీ

నరవరుఁ డేతెంచె; మీరు నా కనురక్తుల్;

పరికించి పదింబదిగా

నరయుఁడు మది నెద్ది మేలు ప్రార్ధించుటకున్.'( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

"మీరు నాకు ఆప్తులు, కేశిధ్వజుడు నాకు గురుదక్షిణ ఇవ్వడానికి వచ్చాడు. బాగా ఆలోచించి ఏమడిగితే బావుంటుందో తెలపండి", అని అడిగాడు.

ఈ పద్యం చివరిపాదంలో యతి గమనార్హం. "అరయుడు"లోని "అ"కి, "ప్రార్థించు"లోని "ప్రా"కి యతి ఎలా కుదురుతుంది? యతి అక్షరాలలో ఒకటి అచ్చు అయినప్పుడు, రెండవది కూడా అచ్చు కాని "య", "హ"లు కాని అయినప్పుడే యతి చెల్లుతుంది. ఇక్కడ ఎలా చెల్లిందంటే, "ప్రార్థించు" అన్న పదం "ప్ర+అర్థించు" అనే పదాల కలయిక కాబట్టి, అర్థించు పదంలో "అ"తో యతిమైత్రి జరిగింది. "ప్రార్థన" వంటి పదాలలో (నిత్యసమాసాలు), సంధి జరిగాక వచ్చిన "ప్రా" అన్న అక్షరంతో కాని, సంధి జరగక ముందున్న "అ" అన్న అక్షరంతో కాని యతిమైత్రి కుదురుతుంది.

ఖాండిక్యుడు అలా అనగానే అతని ఆప్తులందరూ, "మహారాజా! ఇవ్వాళ కదా దైవమున్నదని తెలిసింది! ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఈ ధరాతలాన్నంతటిని గురుదక్షిణగా గ్రహించి మమ్మల్నందరినీ రక్షించు", అని అన్నారు. మంత్రులింకా యిలా అంటున్నారు:

ఉ.

ఎన్నఁడు లావుగూడు మన? కెన్నఁడగున్ దఱి? యయ్యెనేని పో

రెన్నిక యౌనె? పోరిన జయింపనె చెప్పిరె? నీదు భాగ్యసం

పన్నతఁ జేరెఁ గార్య మిటు; బంధు సుహృత్తతి కొక్కకీడు రా

కున్నటు లుండఁగానె; సిరు లూరక చావక నోవ కబ్బునే?"( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం - సునాద వినోదిని )

"మనకు ఎప్పుడు సైన్యబలము చేకూరుతుంది? అనుకూలమైన సమయం ఎప్పుడొస్తుంది? సమయము చిక్కినా యుద్ధం చేయవచ్చునా? ఒకవేళ యుద్ధము చేసినా మనమే జయిస్తామన్న నమ్మకం ఉన్నదా? ఇప్పుడు నీ అదృష్టం కొద్దీ ఇలా కలిసి వచ్చింది. బంధుమిత్రులలో ఏ ఒక్కరికీ ఎలాంటి కష్టమూ కలగకుండా, ఒక్కరూ చావకుండా, బాధ కలగకుండా సిరిసంపదలు నీవున్నచోటికే వెతుక్కుంటూ వచ్చాయి." అన్నారు. ఇందులో ఒక రాజనీతి సూత్రం చెప్పబడింది. బలము, కాలము అనుకూలంగా ఉన్నప్పుడే దండయాత్ర చేయాలి. సంధి, యుద్ధాలలో ఏది అనుకూలమైనదో జాగ్రత్తగా పరిశీలించి అనుసరించాలి.

ఇలా, మరల వాళ్ళకి తోచినది చెప్పారా మంత్రులు. ఈ ఖాండిక్యుడు వాళ్ళ మాటలు వింటాడా!

చ.

అనవుడు నల్ల నవ్వి మనుజాధిపుఁ డిట్లను:- " మీర లర్ధసా

ధనపరతంత్రకోవిదులు దక్క, మహాసుఖదాయి మోక్షమా

ర్గ నయ విచారకోవిదులు గా, రతిచంచల రాజ్యలక్ష్మి నే

మని చని వేఁడువాఁడఁ బరమార్ధము వేఁడక యమ్మహామతిన్?

మంత్రులు చెప్పిన మాటలు విన్న ఖాండిక్యుడు మందహాసం చేస్తూ యిలా అన్నాడు. "మీరు అర్ధశాస్త్ర కోవిదులే తప్ప మోక్షమార్గ విచారణలో ప్రవీణులు కారు. మహాజ్ఞాని అయిన కేశిధ్వజుడిని పరమార్థ జ్ఞానాన్ని ప్రసాదించమని అడగకుండా అతి చంచలమైన రాజ్యలక్ష్మిని ఇవ్వమని నేనెలా అడగగలను?".

విష్ణుచిత్తునితో స్వామి మాట్లాడిన సందర్భంలో "నేడు మహామతీ" అంటూ ఆ విష్ణుచిత్తునికి వాడిన మాట "మహామతి".మళ్ళీ యిక్కడ కేశిధ్వజుని గురించి ఖాండిక్యుడు అన్నాడు. అతిలోక సంబంధమైన విచారణ బుద్ధి కలవాడు మహామతి. అలాంటి మహామతి అయిన కేశిధ్వజుడు నీకేమి కావాలో కోరుకోమంటే, అతి చంచలమైన రాజ్యాన్ని ఏ ముఖం పెట్టుకొని అడుగుతాను చెప్పండి! అన్నాడు ఖాండిక్యుడు. మంత్రులు ఎంతసేపూ, "అర్థసాధన పరతంత్రకోవిదులు". అంటే అర్థసాధనకి బానిసలయిపోయారు. కేశిధ్వజుడిని వేడవలసినది ఏమిటి? "పరమార్థం", అంటే ఉత్కృష్టమైన అర్థం! ఆ పరమార్థం ముందు వట్టి అర్థం ఎంతటి హీనమైనది! "అర్థం", "పరమార్థం" అనే యీ మాటలలో ఆ మంత్రులు కోరుకొమ్మన్నదానికీ, అసలు కోరుకోవలసిన దానికీ మధ్య అంతరమెంతుందో అద్భుతంగా ధ్వనింపజేసాడు రాయలు. కవి అన్నవాడు పదాలని ఎంత నేర్పుగా ప్రయోగిస్తాడో, ప్రయోగించాలో దీన్ని చూస్తే అర్థమవుతుంది.

ఇంకా ఖాండిక్యుడు తన మంత్రులతో యిలా అంటాడు,"నిమివంశంలో జన్మించిన మాకు లక్ష్యం గావలసినది ఉత్తమమైన జ్ఞానయోగమే కాని రాజ్యం కాదు. పైగా ఆ కేశిధ్వజుడు అలాంటి జ్ఞానం కలిగినవాడు కూడాను. అందువల్ల వాడి చేత పొందదగినది యోగమే కాని రాజ్యం కాదు". అని నిక్కచ్చిగా చెప్పేసి, నన్నింక వదలండని బయటకి వచ్చి కేశిధ్వజునితో, "నిజంగానే నేనడిగిన గురుదక్షిణ చెల్లిస్తావా" అని అడుగుతాడు. అంటే "ఆఁ! తప్పకుండా", అంటాడు కేశిధ్వజుడు. అప్పుడు తనకి భవబంధాలని నశింపజేసే అధ్యాత్మవిద్యని ప్రసాదించమని అడుగుతాడు. అది విని, "ఆహాహా! హాయిగా నా రాజ్యసర్వస్వాన్నీ అడిగి తీసుకోక యిదేమి కోరికకోరావయ్యా! రాజన్నవాడికి అన్నిటికన్నా ప్రీతిపాత్రమైనది రాజ్యమే కదా." అని అంటాడు కేశిధ్వజుడు. దానికి ఖాండిక్యుడీ విధంగా సమాధానం చెపుతాడు:

మ.

'విను కేశిధ్వజ, ధాత్రి వేఁడమికి నా వేదించెదన్ హేతు: వ

జ్ఞునకుంగాక వివేకి కేల జనియించున్ లౌల్య మెందున్? రణం

బునఁ బాడిన్ రిపుఁ గూల్చు వాఁడియుఁ బ్రజాపోషంబు ధర్మంబు రా

జున కౌ; నైన నశక్తుఁ ద్వద్విజితరాజ్యున్ నన్నఘంబంటునే?

" కేశీధ్వజా! నేను రాజ్యాన్ని కోరకపోవడానికి గల కారణం చెబుతాను విను. లోకంలో ఎక్కడైనా లోలత్వం అన్నది అజ్ఞానికి గాని వివేకికి ఎందుకు కలుగుతుంది. యుద్ధంలో శత్రువులను సంహరించడం, లేదా ఓడించి సామ్రాజ్యాన్ని దక్కించుకోవడం, దాన్ని సుస్థిరపరుచుకుని ప్రజలను చక్కగా పాలించడం అన్నవి రాజధర్మాలు. అయితే నేను నీతో యుద్ధంలో ఓడిపోయి నా సామ్రాజ్యాన్ని పోగొట్టుకున్నాను. కాబట్టి రాజ్యాన్ని పరిపాలించకపోవడం అన్న పాపం నన్ను అంటదు." అన్నాడు ఖాండిక్యుడు.

ఇక్కడ రెండు అంశాలని ప్రస్తావించాడు ఖాండిక్యుడు. ఒకటి, తాను రాజ్యాన్ని కోరుకోవడం లౌల్యమవుతుంది. అది తప్పు. అజ్ఞులకే తప్ప వివేకవంతులకి అలాంటి లౌల్యం కలగదు. తాను అజ్ఞాని కాదు. రెండు, అసలు రాజ్యం కోరుకోవడం లౌల్యమెలా అవుతుంది? రాజన్నవానికి రాజ్య సంపాదన, పరిపాలన ధర్మాలు కదా అని అన్నట్లయితే దానికి కూడా సమాధానం చెపుతున్నాడు. యుద్ధంలో ధర్మంగా శత్రువులని జయించి రాజ్య పరిపాలన చెయ్యడం రాజధర్మం. తాను యుద్ధంలో కేశిధ్వజుని చేత ఓడిపోయాడు. కాబట్టి తాను అశక్తుడు. అంచేత తాను రాజ్యాన్ని కోరకపోవడం అధర్మం కాదు. జాగ్రత్తగా ఆలోచిస్తే, యిక్కడొక విశేషం స్ఫురిస్తుంది. పుట్టుకతో ఖాండిక్యుడు క్షత్రియుడయినా, గుణాన్ని అనుసరించి చూస్తే అతడికి రాజయ్యే అర్హత లేదు. ఆ శక్తి అతడికి లేదు. అలాంటప్పుడు రాజధర్మం అతనికి వర్తించదు అని చెపుతున్నాడు. అంటే ధర్మం అన్నది కేవలం పుట్టుకచేత కాక, గుణాన్ని అనుసరించి కూడా ఉంటుందన్న విషయం స్ఫురించడం లేదూ?

ఖాండిక్యుడింకా యిలా వివరిస్తున్నాడు:

సీ.

నరనాథ, యీ రాజ్యపరిపాలనారాతి

హననాదికృతరూప యగు నవిద్య

యనధికారికి విసర్జనముఁ గావింపంగఁ

గలుషంబు రా; దధికారియైన

వాఁడు విసర్జింప వచ్చు వర్ణాచార

లోపంబుచే నగు పాపలేప;

మైన నేనిత్తుఁ గొమ్మనఁ గొను ధరణి భో

గమునకుఁ గాక ధర్మమున కగునె?

కాన సత్క్షత్రియులకు భైక్ష్యంబు కీడు;

మత్ప్రధానులు వేడు సామ్రాజ్యమనెడు

పలుకు ధర్మచ్ఛలంపు లోభం బయుక్త

మిది యెఱిగి రాజ్య మడుగ నే నిచ్చగింప( ఈ పద్యం రాఘవ స్వరంలో - రాగం .. సురటి)

ఓయి కేశీధ్వజా! ఈ రాజ్యపాలనము, శత్రుసంహారము మొదలైన పేర్లతో కొనసాగుతున్న అవిద్యారూపమైన కర్మని, అధికారి కానివాడు విసర్జించవచ్చు. అందువల్ల అతనికి పాపం అంటదు. కాని అధికారి అయినవాడు విసర్జిస్తే వర్ణాశ్రమ ధర్మానికి లోపం కలుగుతుంది. ఫలితంగా అతనికి పాపం అంటుకుంటుంది. అయినా నేను యుద్ధంలో పోగొట్టుకున్న రాజ్యాన్ని నువ్వు యిస్తా తీసుకో అంటే నేను తీసుకుంటే ఆ రాజ్యం భోగ ప్రవృత్తికే తప్ప ధర్మనిర్వహణకు పనికిరాదు. కనుక క్షత్రియుడైన రాజుకు ఈ భిక్షాన్నం అనర్థాన్ని కలిగిస్తుంది. నా మంత్రులు నన్ను రాజ్యాన్ని కోరుకోమన్నారు. అది ధర్మం అన్న ముసుగులో ఉన్న లోభగుణం. అది అనుచితం కనుక నాకు ఇష్టం లేదు.అందుకే రాజ్యమడుగక బ్రహ్మవిద్యను కోరుకున్నాను అని వివరించాడు ఖాండిక్యుడు.

రాజ్యపరిపాలన, శత్రువులని చంపడం మొదలయినవన్నీ అవిద్య. అవిద్య అంటే కర్మ. కర్మ చేసినవాడికి పుణ్యపాపాలుంటాయి కదా? మరి కర్మని విడిచిపెట్ట వచ్చా అంటే, ఎవరికయితే కర్మ చేసే అధికారం (చెయ్యగలసిన సామర్థ్యం) ఉన్నదో అతడు కర్మని విసర్జించినట్లయితే అప్పుడు వర్ణధర్మానికి లోపం కలుగుతుంది. అప్పుడతనికి కర్మ చెయ్యకపోయినా, యీ ధర్మాతిక్రమణం వలన పాపం కలుగుతుంది. దీనికి మరి నిష్కృతి ఏమిటంటే, కర్మ చెయ్యడానికి అధికారమూ, సామర్థ్యమూ ఉన్నవాడు కర్మ చేసి తీరాలి. కాని తాను చేస్తున్నది కేవల ధర్మనిర్వహణకే కాని అందులో తన యిష్టానిష్టాల ప్రమేయం లేదని దృఢంగా నమ్మి ఆ కర్మ చేసినట్లయితే, ఆ కర్మఫలం (పుణ్యపాపాలు) అతనికి అంటదు. అసలు ఒకనికి తన స్వభావరీత్యా ఒక కర్మ చేసేందుకు శక్తే లేనప్పుడు, ఆ కర్మని చెయ్యకపోవడం వలన అధర్మం జరగదు. పైగా అలా చెయ్యాలని అనుకోవడమే అధర్మమవుతుంది. ఇక్కడ ఖాండిక్యుడు చెప్పిన ధర్మసూక్ష్మం యిది!

"ధర్మచ్ఛలంపు లోభంబు" అన్నది చాలా అద్భుతమయిన మాట. స్వార్థపరుడు, తనకి లాభాన్ని చేకూర్చేదానికి ధర్మమన్న అందమైన ముసుగు వేస్తాడు. ఇది చాలా ప్రమాదకరమైనదని అతని భావన.

ధర్మాధర్మ విచక్షణతో కూడిన ఖాండిక్యుని వివరణ విని కేశిధ్వజుడు ఎంతో సంతోషిస్తాడు. "నువ్వు చెప్పినది చాలా సబబుగా ఉంది. నేనుకూడా నా ధర్మాన్ని అనుసరించే రాజ్యపరిపాలన, యజ్ఞయాగాది కర్మలను ఆచరిస్తున్నాను. ఈ కర్మల వల్ల కలిగే పుణ్యఫలాన్ని వదిలించుకోవడానికి భోగాలని అనుభవిస్తున్నాను. పవిత్రమైన మన నిమివంశం చేసుకున్న అదృష్టం కొద్దీ నీకిలాంటి తత్త్వచింతన కలిగింది." అని చెప్పి, ఖాండిక్యుడు కోరినట్టుగా, పరమార్థాన్ని బోధించే విద్య అతనికి చెప్పడం మొదలుపెడతాడు కేశిధ్వజుడు. ఆ వివరాలు తదుపరి టపాలో చూద్దాం.

1 comments:

గన్నవరపు నరసింహ మూర్తి said...

అద్భుతమైన గాధ! జ్యోతి గారికి,భైరవభట్ల వారికి కృతజ్ఞతలు.

Related Posts Plugin for WordPress, Blogger...