తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Monday, September 12, 2011

ఖాండిక్య కేశీధ్వజ సంవాదము - 2

యాగధేనువుని పులి చంపివేయడం వల్ల కలిగిన ఆటంకానికి ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసుకొనేందుకు కేశిధ్వజుడు, తాను ఓడించిన శత్రువని కూడా లెక్కచెయ్యకుండా ఖాండిక్యుని దగ్గరకు బయలుదేరాడు కదా. ఇప్పుడతడు ఖాండిక్యుని వద్దకు వెళుతున్నది ఒక రాజుగా కాదు, అర్థిగా! కాబట్టి, ఆర్భాటమేమీ లేకుండా, కేవలం జింకతోలు కప్పుకొని, నిరాయుధుడై, ఖాండిక్యుడున్న అడవిని ప్రవేశించాడు. ఖాండిక్యుడు అడవిలో వేగులని పెట్టాడు కదా. కేశిధ్వజుడు అడవి ప్రవేశించగానే అతని రథానికున్న జండాని చూసి అతడు కేశిధ్వజుడని వాళ్ళు గుర్తుపట్టేసారు. కేశిధ్వజుడు వస్తున్నాడని అడవిలోని ఖాండిక్యునికి తెలియాలని పెద్ద పెద్ద కూతలు పెడుతూ సైగలు చేసారు. ఆ కేకలని అడవిలో నివసిస్తున్న ఖాండిక్యుని పరివారమంతా విన్నారు. అమ్మ బాబోయి! కేశిధ్వజుడు ఇక్కడికి కూడా దండెత్తి వస్తున్నాడనుకొని వాళ్ళందరూ భయపడ్డారు. ఖాండిక్యుడు తన భటులని వాళ్ళకి అండగా పంపి వాళ్ళ భయాన్ని తీర్చి, కొండ కనుమలలో విలుకాండ్రని ఏర్పాటు చేసి, కేశిధ్వజుడిని ఎదుర్కోడానికి వెళ్ళాడు. వెళ్ళి:

క. వచ్చు రిపుఁ జూపులనె చుఱ
పుచ్చుచు, సిరిఁ గొనుట మగుడఁ బొడముట రుష ము
చ్చిచ్చున లావెచ్చఁగ వి
ద్యుచ్చల చాపజ్యఁ దూపు దొడుగుచుఁ బలికెన్.


( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)ఎదురుగా వస్తున్న కేశిధ్వజుణ్ణి చూసాడు. "నా సర్వసంపదని తీసుకుని కుడా మళ్ళీ యిలా నా మీదకి దండెత్తి వస్తాడా!", అన్న కోపం ముచ్చిచ్చులాగా (త్రేతాగ్ని) ఖాండిక్యుని మండించింది. ఆ కోపపు చూపులతోనే కేశిధ్వజుణ్ణి కాల్చేస్తూ, మెఱుపుతీగలాంటి తన వింటినారికి బాణాన్ని సంధించాడు.

"నా సమస్త సామ్రాజ్యాన్నీ అపహరించింది చాలక, మారీచునిలాగా జింకతోలు కప్పుకొని పెద్ద మునిలాగా మాలో ప్రవేశించి మా ప్రాణాలు తీయడానికి వచ్చావా! ఈ వాడియైన బాణంతో నిన్ను సంహరిస్తాను." అని తీవ్రమైన కోపంతో అన్నాడు ఖాండిక్యుడు. కేశిధ్వజుడు చెయ్యెత్తి అతడిని వారించాడు. "నేను నీకు కీడు చేద్దామని రాలేదు. నీ సహాయాన్ని అర్థించడానికి వచ్చాను" అని, జరిగిన విషయమంతా చెప్పాడు. చెప్పి, "నువ్వు నాకు దయతో ప్రాయశ్చిత్తాన్ని ఉపదేశించినా సరే, నీ బాణంతో నన్ను చంపేసినా సరే. నీ యిష్టం" అన్నాడు.

విషయమంతా విన్న ఖాండిక్యుడు ఇప్పుడు ఏం చెయ్యాలి? రాజ్యం లేక అడవుల్లో జీవిస్తున్నా, తనకీ పరివారం ఉంది. మంత్రులున్నారు. స్నేహితులున్నారు. వాళ్ళతో చర్చించకుండా తను ఏ నిర్ణయమూ ఏకపక్షంగా తీసుకోకూడదు. ఇది రాజనీతి. అందుచేత, వాళ్ళందరినీ పక్క చెట్ల గుంపుల్లోకి పిలిచి, విషయం చెప్పి, ఏమి చెయ్యాలన్న విషయంపై మంతనాలు మొదలుపెట్టాడు.
క. పాలు గలవాఁడు మన కొక
జాలి యిడక తానె తారసానకు వచ్చెన్;
వేల యిదె, లెమ్ము, నృప! కృప
చాలున్, గారాకు మేపి చంపకు ప్రజలన్.( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

ఖాండిక్యుని మంత్రులు వాళ్ళకి తెలిసిన రాజనీతిని వాళ్ళు చెప్పారు. శత్రువు మనను శ్రమ పెట్టక తనంతట తానుగా వెదుక్కుంటూ వచ్చాడు. రాజా! ఇదే తగిన సమయం. ఇంతవరకు చూపిన దయ, జాలి చాలు. నిన్ను ఆశ్రయించిన ప్రజలను పండుటాకులు తినిపించి చంపకు. తొందరగా యుద్ధమునకు సన్నద్ధుడవు కమ్ము, అని చెప్పారు. తమ భార్యాబిడ్డలూ అడవుల్లో పడుతున్న అవస్థలు వర్ణించారు. కేశిధ్వజుని కనక ఇప్పుడు సంహరిస్తే, రెండు రాజ్యాలూ లభిస్తాయి. ఏ ఉపాయంతోనైనా శత్రుసంహారం చేసి అధికైశ్వర్యాన్ని పొంది ప్రజలని రక్షించడమే ధర్మమని రాజనీతిని బోధించారు. పైగా, తన సామ్రాజ్యాన్ని నాశనం చెయ్యడానికి వచ్చిన త్రిశీర్షుని, గురువనికూడా చూడకుండా ఇంద్రుడు సంహరించ లేదా అని దృష్టాంతం కూడా చూపెట్టారు. అలాగే మరో దృష్టాంతం కూడా చూపించారు.
క. అవమతిఁ బితృఘ్న లగు భూ
ధవుల వెదకి పిల్లపిల్లతరము దునిమి భా
ర్గవుఁడు ముని యయ్యె: మఱి వై
భవము వలదు, శాంతి కైనఁ బగ దెగ కగునే?( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం బృందావని )

పరశురాముడు తన తండ్రిని చంపిన రాజులనే కాక ఇతర రాజులనూ, వారి పిల్లలనూ, పిల్లలకు పిల్లలనూ వెదకి వెదకి మరీ సంహరించాడు. ఆ తర్వాతనే అతను ముని అయ్యాడు. మరి నువ్వు రాజ్యభోగాలు అక్కరలేదు అనుకున్నా, మనశ్శాంతి కోసమైనా నీ పగ తీర్చుకోవలసినదే కదా అని చెప్పారు.
మంత్రులైన వాళ్ళ మాటల్లో ఎంత చాకచక్యముంటుందో చూడండి. ఎలాగైనా ఖాండిక్యుని ఒప్పించాలని రకరకాలుగా చెప్పుతున్నారు. పురాణ దృష్టాంతాలనే కాకుండా లోక వృత్తాంతాన్ని కూడా ఉదాహరణగా చెపుతున్నారీ పద్యంలో:
క. పులి మల డిగి యూళ్ళకు న
క్షులరుజ రా జనము మాంచుకోఁ బనిచి, గవిన్
నెలకొన సురియలు గొని చని
పొలియునొ? యూరఁ గుయిరేఁగి పొడుచునొ? చెపుమా?( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)

"పులికి కంటిజబ్బు వచ్చి దారి తెలియక తనుండే పర్వతము దిగి ఊరిలోకి వస్తే, అక్కడి ప్రజలు దాని మీద దయదలిచి "కంటిజబ్బు మాన్పుకోమ్మా!", అని తిరిగి పంపించి, తర్వాత ఎప్పుడో అది జబ్బు తగ్గి ఆరోగ్యంగా ఉన్నప్పుడు కత్తులు కటార్లతో వెళ్లి చంపుతారా? లేక ఊళ్ళోకి వచ్చినప్పుడే చంపుతారా? నువ్వే చెప్పు", అని అన్నారు.
రాయలవారికి జంతుస్వభావాన్ని గురించి బాగా తెలుసు. పులి యీనినప్పుడు దానికి కళ్ళకి కలకవస్తుందిట. అప్పుడది ఊళ్ళోకి వస్తుంది. అది ఇక్కడ పోలిక తెచ్చారు. వాక్యనిర్మాణంలో కాని, పద్యరచనలో కాని అంతా తెలుగుదనమే! "చెపుమా!" అని పద్యాన్ని ముగించడంలో మంత్రులు రాజు తెలివితక్కువతనాన్ని తెగేసి చెప్పినట్లయ్యింది!

ఇలా అనేక రకాలుగా మంత్రులు, కేశిధ్వజుని సంహరించమని ఖాండిక్యునికి నచ్చజెప్పే ప్రయత్నం చేసారు.

క. మీ నొడివినయది కార్యం
బౌ; నిప్పని సేయ రాజ్య మంతయు మనకున్,
వానికిఁ బరలోకము జిత
మౌ నొక్కట; నిందు వాసు లరయఁగ వలయున్.( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

మంత్రులు చెప్పినది సాంతం విన్నాడు ఖాండిక్యుడు. "వినదగు నెవ్వరు చెప్పిన, వినినంతనె వేగపడక వివరింప దగున్" అన్న మాటకి తగ్గట్టుగా, అతను విచారించడం మొదలుపెట్టాడు. తన మంత్రులతో ఇలా అంటున్నాడు. "మీరన్నది నిజమే! మీరు చెప్పినట్టు అతడిని చంపితే ఒకేసారి మనకు రాజ్యం తిరిగి లభిస్తుంది. అతనికి పరలోక సౌఖ్యం సిద్ధిస్తుంది. కాని ఈ రెండింటికి మధ్య గల అంతరాన్ని మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకం ఉన్నది". అవతలవారు చెప్పినది నిజమంటూనే, తన వాదనని వినిపించడం మంచి వాక్చాతుర్యం, వాదపటిమ!

ఇంతకుముందు కేశిధ్వజుని పాత్ర ఎలా అయితే అఖండ యజ్ఞదీక్షా జ్యోతిలో వెలిగిందో, అలానే ఇక్కడ సద్విచార కాంతిలో ఖాండిక్యుని పాత్ర ధగద్ధగాయమానంగా ప్రకాశించడం మనకి కనిపిస్తుంది! "రాజ్యసౌఖ్యం ఎంత కాలముంటుంది? తన చేతిలో మరణించే కేశిధ్వజుడు శాశ్వత సుఖాన్ని పొందుతాడు. ఈ అల్పకాల సుఖం కోసం పాపం చేసి ఆ శాశ్వత కాల సుఖానికి దూరం కావడం తగునా?" - ఇదీ ఖాండిక్యుని విచారధార.
క. "బద్ధాంజలిపుటు దీనున్
గ్రుద్ధతఁ దనమఱుఁగు సొరఁగఁ గూల్చుట కడుఁ గీ,
డుద్ధతి పరలోకార్జన
బుద్ధికి" నను కణ్వవాక్యములు దలఁప రొకో!


( ఈ పద్యం రాఘవ స్వరంలో. రాగం కానడ )
"చేతులు మోడ్చి దీనంగా శరణు కోరి వచ్చిన శత్రువును అహంకారంతో సంహరించడం పరలోకప్రియుడైన వానికి మిక్కిలి పాపాన్ని అంటగడుతుంది" అన్న కణ్వమహర్షి మాటలను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పాడు తన మంత్రులతో. మంత్రులు ఇంద్ర, పరశురామ కథలు చెప్పి తమ రాజనీతిని ప్రదర్శించారు. ఖాండిక్యుడు కణ్వవాక్యాల ద్వారా వారి మాటలను తిరస్కరించాడు!

అలా తన అభిప్రాయాన్ని మంత్రులకి నిశ్చయంగా తెలిపి కేశిధ్వజుని దగ్గరకి వచ్చి, అతని సమస్యని వివరంగా తెలుసుకుని, అతనికి తగిన ప్రాయశ్చిత్తాన్ని చెపుతాడు ఖాండిక్యుడు. కేశిధ్వజుడు అది తెలుసుకొని, తిరిగి తన రాజ్యాన్ని చేరుకొని దాన్ని ఆచరించి యజ్ఞాన్ని సంపూర్ణం చేస్తాడు.

లౌకికమైన రాజనీతికీ పారలౌకికమైన ధర్మానికీ మధ్యనున్న సున్నితమైన సమతౌల్యాన్ని చిత్రించే కథ యిది. ఆ సమతౌల్యాన్ని ఎంతో సమర్థంగా నిర్వహించే పాత్రలుగా ఖాండిక్య కేశిధ్వజులని తీర్చిదిద్దాడు రాయలు. ఆముక్తమాల్యద కావ్యమంతటా కూడా ఇలాంటి సమతౌల్యమే కనిపిస్తుంది. బహుశా రాయలవారు తన నిజజీవితంలో కూడా లౌకిక పారలౌకిక ధర్మాలని ఇలానే సమతూకంతో నిర్వహించారని మనం ఊహించవచ్చు. అయితే, యీ కథ ఇక్కడితో అయిపోతే విష్ణుచిత్తుడు చెప్పదలచుకున్న పరమార్థం తెలియనే తెలియదు! ఖాండిక్య కేశిధ్వజుల యీ ధర్మప్రవర్తన, పరమార్థమైన మోక్షానికి ఎలా దారితీస్తుందో ముందు కథలో మనకి తెలుస్తుంది.

0 comments:

Related Posts Plugin for WordPress, Blogger...