తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Tuesday, September 14, 2010

ఆశ్వాసాంత పద్యాలు

శా. బాలార్కాంశు విజృంభితామలశరత్పద్మాక్ష! పద్మాక్షమా
నీళాజాంబవతీశ! యీశ బలభి న్నీరేరుహోద్భూత ది
క్పాలామూల్యశిరోమణిద్యుతికనత్పాదాబ్జ! పాదాబ్జఫా
లాలంకారకచావలీ మకర దీప్యత్కుండలాంచన్ముఖా.

( పద్యం భైరవభట్ల కామేశ్వరరావు స్వరంలో)
రాయలు తన కావ్యంలో స్వామిని కూడా అద్భుతంగా వర్ణించాడు. స్వామి కన్నులు ఎలా ఉన్నాయయ్యా అంటే ఉదయించే సూర్యుడి లేత కిరణాలకు వికసించే నిర్మలమైన శరత్కాలంలోని కమలములవలె కనిపిస్తున్నాయి. ఇక ఆయన దేవేరులు లక్ష్మీదేవి, భూదేవి, నీలాదేవి,జాంబవతీ దేవికి ప్రియవిభుడు. శివుడు, ఇంద్రుడు, బ్రహ్మ తో పూజింపబడుచు, వెలగట్టలేని శిరోరత్నములచే ప్రకాశించే పాదపద్మములు కలవాడు. లలాటమున అలంకారమైన ముంగురుల చేత, మకరాకారములో ప్రకాశిస్తున్న కర్ణాభరణములతో ప్రకాశించే మోము గల స్వామీ.. చివరి రెండు పాదాలకీ అర్థం - "శివుడు, ఇంద్రుడు, బ్రహ్మ, దిక్పాలకులు శిరసువంచి నమస్కరిస్తూ ఉంటే, వారి కిరీటాలలోని అమూల్యమైన మణికాంతులతో వెలుగుతున్న పాదాబ్జములు కలవాడా! చవితి చంద్రుడు లాంటి ఫాలభాగానికి అలంకారంగా ఉన్న ముంగురులతో, ప్రకాశించే మకర కుండలాలతో శోభిస్తున్న ముఖము కలవాడా!" పద్యంలో చక్కని ముక్తపదగ్రస్తం ఉంది.



బలద్విడ్వినిర్దిష్ట పాథోధరోరూ
పలాసార ధారాతపత్రీకృతాద్రీ
ఫలన్మూర్థచాణూర భంగోగ్ర బాహా
కలాకృత్తకంసా శిఖండావతంసా


( పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

ఇక్కడ లీలావినోదుడు శ్రీకృష్ణుని స్తుతిస్తున్నాడు రాయలు. "దేవేంద్రుని ఆజ్ఞతో బయలుదేరిన మేఘాలు కురిపించిన రాళ్ళ జడివాన నుండి గోకులాన్ని కాపాడడానికి గోవర్ధనగిరినే గొడుగుగా చేసిన గోవర్ధనధారి! మిక్కిలి వాడిమిగల, గడియమానులవంటి బాహువులతో చాణూరమల్లుని తల పగలకొట్టినవాడా! కలా (క్షణంలో ముప్ఫైయ్యోవంతు) కాలంలో కంసుని నఱికినవాడా!, నెమలిపింఛాన్ని శిరోభూషణంగా
ధరించువాడా!" అని స్త్రోత్రం చేసాడు.



మ.ఇది కర్ణాటధరాధృతిస్థిర భుజాహేవాకలబ్దేభరా
డుదయోర్వీధర తత్పితృవ్యకృత నవ్యోపాయనోష్ణీష ర
త్నదృగంచత్పద కృష్ణరాయవసుధాధ్యక్షోదితాముక్తమా
ల్యద నాశ్వాసము హృద్యపద్యముల నాద్యంబై మహింబొల్పగున్..


( పద్యం రవి స్వరంలో)

కృష్ణదేవరాయలు గజపతి ప్రతాపరుద్రుడి పినతండ్రి ఐన ప్రహరేశ్వర పాత్రుడు ఉదయగిరి దుర్గములో ఉండగా దానిని ముట్టడించిన చాన్నాళ్ళకు దుర్గము వశము కానందున రాయలు ఆగ్రహించి ఒకరోజు అతడిని ఓడించి తల తొక్కకున్న స్నానము చేయనని ప్రతిజ్ఞ చేసాడు. అప్పుడు రాయల సైన్యం భీకరంగా విజృంభించి పోరాడింది. అంతట ప్రహరేశ్వరుడు భయపడి తన తలకు బదులు రత్నఖచితమైన కిరీటాన్ని రాయలకు కానుకగా ఇవ్వగా రాయలు మణిమయ కిరీటాన్ని తొక్కి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. ఇందులో ఒక చక్కని ఊహ ఉంది. ఉష్ణీషము అంటే కిరీటము. కిరీటానికి పొదిగిన రత్నాల చూపులతో ఒప్పారుతున్నాయట రాయల పాదాలు. కిరీటం ప్రహరేశ్వర పాత్రుని తలకు బదులుగా వచ్చింది. కాబట్టి దానికి పొదగబడిన రత్నాలే ప్రహరేశ్వరుని కన్నుల్లాగా, రత్నకాంతులు ఓడిన వాని చూపుల్లాగా ఉన్నాయని ఇక్కడ ధ్వని. రత్నాల ప్రకాశాముచేత ఒప్పుచున్న పాదములు కల కృష్ణదేవరాయలచే చెప్పబడిన ఆముక్తమాల్యద అను గ్రంధము మనోజ్ఞమైన పద్యములచే ప్రధమ ఆశ్వాసము అలరారుతున్నది.

5 comments:

మాలా కుమార్ said...

వార్షికోత్సవ శుభాకాంక్షలు .

Sanath Sripathi said...

జ్యోతి గారు, బాలార్కాంశు పద్యం ఆడియో పూర్తి గారాలేదు. మూడవ పాదంలో ఆగిపొతోంది.
కామేశ్వరరావు గారు ఈ తాత్పర్యం తో పాటు పద్యం లోనిసొబగు ని, పద్య లక్షణాల్లంటివి వర్ణిస్తే బాగుంటుందేమో. ఉదాహరణకి పద్మాక్ష! పద్మాక్షమా; జాంబవతీశ! యీశ; పాదాబ్జ ! పాదాబ్జ |మొ|

జ్యోతి said...

సనత్ గారు, ధన్యవాదాలు. సరిచేసానండి. wav నుండి mp3 కి మార్చినప్పుడు జరిగిన పొరపాటు. ఇది కన్వర్టర్ ప్రాబ్లమ్..

karlapalem Hanumantha Rao said...

అద్భుతం గా వున్నది ఈ బ్లాగ్! ముఖ్యంగా ఈ టపా !ఆడియో తో కలిపి మీరు అందించిన సమాచారం నిజంగా సాహిత్య సంగీతాభిమానులకు షడ్ రుచుల విందు.

Vasu said...

ఇది ఈ రోజే నా కంట పడింది. చాలా మంచి ప్రయత్నం.
ముఖ్యంగా పద్యం ఆలపించి అది కూడా ఇక్కడ చేర్చడం చాలా బావుంది. ఇలా కొంత మంది కలిసి ఈ కార్యానికి పూనుకోవడం ముదావహం.

Related Posts Plugin for WordPress, Blogger...