తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Monday, March 11, 2019

గోదాదేవి వృత్తాంతము - 2

          శ్రీ విల్లిపుత్తూరులో కొలువై ఉన్న గోదాదేవిని మోక్ష సంపదలిచ్చేది కాబట్టి చూడికొడుత్తవళ్ అని తమిళులు పిలుస్తారు. ‘చూడికొడుత్త నాచ్చారు’ ఆమె పేరు. నాచ్చియార్ అని ‘య’కారంతో పలకాలి. ఈమెనే తెలుగువాళ్ళు `నాంచారు’ అంటారు. తెలుగువాళ్లలో నాంచారయ్యలూ, నాంచారమ్మలూ చాలామంది ఉన్నారు. ఈమెకు ఆండాల్ (రక్షకురాలు)కోదై (పూలమాల)అనే పేర్లుకూడా ఉన్నాయి. కోదై అనేది తమిళభాషలో ప్రాచీన రూపం ‘గోద’ అనేది దాని ఆధునిక రూపంగా పండితులు చెప్తారు.  కృష్ణదేవరాయలు  గోదాదేవి జీవిత చరిత్ర నే ఆముక్తమాల్యద కావ్యంగా మలిచాడు.  పండుని కొరికి తియ్యగా ఉన్నదాన్నే శబరి రాముడికి సమర్పించినట్టు , నాంచారు కూడా తాను ధరించి బాగున్నదని సంతృప్తి చెందాకనే పూలమాలను స్వామికి సమర్పించేది. జనకుడికి తన పొలంలో సీతాదేవి దొరికినట్టువిష్ణుచిత్తుడికి తన పూలతోటలో, తులసి మొక్కల దగ్గర ఈ నాంచారు దొరికింది. జనకుని కుమార్తెగారాముని భార్యగా సీత పూజనీయం ఐతే, విష్ణుచిత్తుని కుమార్తెగా, ఆ శ్రీ మహావిష్ణువు భార్యగాభూదేవి అవతారంగా నాంచారు పూజలందుకుంది. అటువంటి శ్రీదేవి నాచ్చారును అద్భుతంగా వర్ణిస్తున్నారు రాయలవారు.
            
           కం.ఆయత భుజైక చక్రుం
డా యదుపతి దొమ్మి గెలువ నడరు మరుని కా
లాయస చక్రపరంపర
లోయన నుంగరపు గురులు యువతికి నమరున్! (5-9)

ఆమె ఉంగరపు కురుల యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు రాయలవారు. ఆమె వలచిన నారాయణుని దీర్ఘ బాహువునందు చక్రాయుధము దాల్చియున్నవానిని పోరులో గెలువగోరి మదనుడు చక్రాయుధము ఒరుసలో యున్నట్టు ఒప్పరెనని చెప్తూ. ఉంగరపు కురులు ఆ నారాయణునికి మిక్కిలి మోహం కలిగించాయని చెప్పడం దీని భావం.

శా.సైరంధ్రుల్పయికెత్తి  కజ్జలము బక్ష్మశ్రేణికం దీర్ప వా
లారుం గన్నుల మీదు చూచు తరి ఫాలాంచ చ్చతుధీన్ నిశా
స్ఫారేందుం గనె వక్త్ర మక్కనుట గా బర్వేందుడాత్మ ప్రభా
చోరుం డుండగ దన్ను దద్గతవిభా చోరంబనున్ లోకముల్.(5-11)

ఉత్ప్రేక్షాలంకారంలో అత్యంత సుందరమయిన రూపకాపహ్నుత్యనుప్రాణితోత్ప్రేక్ష అలంకారంలో ఆమె ముఖ సౌందర్యాన్ని వర్ణించడం ఈ పద్యంలో చూడవచ్చు. చెలికత్తెలు ఆమె ముఖాన్ని అలంకరించేటప్పుడు ఆమె మొహాన్ని పైకెత్తి కన్నులకు కాటుక దిద్దుచుండగా ఆమె ముఖము వారి ముఖమనెడి చవతి చంద్రుని చూడడం వలన ఆ దోషం వలన ఆమె ముఖమునకు దాని కాంతిని దొంగిలిచ్చినట్లయిందట అయినా ఆ చంద్రునికి ఏ నీలాపనిందలు రాక తానాతని కాంతిని దొంగిలించినదని లోకములో నింద కలిగినదట. ఎంత అనదమైన ఊహ.
 ఆమె కంఠాన్ని, కంఠ స్వరాన్ని ఈ క్రింది పద్యాలలో వివరిస్తున్నాడు రాయలవారు.

తే.గీ. శంఖ సామ్యంబు రా మున్ను జలజ భవుడు
సరసి రుహపత్త్ర నేత్ర కంధర యొనర్చె
జవ్వనము వచ్చి వెండి సాక్షాత్కరించు
శంఖమున చేసెనును గంధ సారచర్చ (5-17)
ఆమె కంఠం పుట్టుకతో శంఖంలాగా ఉండేది. యవ్వనపు చందనంపు నునుపూతచేత కంబువే అయినది. యౌవనము బ్రహ్మ శృష్టిని మించినదని అంతర్భావము. ఉపమాగమ్యోత్ప్రేక్ష ఇందులో విశేషము.

కం. కమలదళేక్షణ సంగీ
తమున నెగడు మంద్ర మధ్య తార త్రిస్థా
నములకు దీర్చిన రేఖల
క్రమమగు రెఖాత్రయమున గంఠంబమరున్ (5-18)

ఆమె కంఠము మంద్ర స్థాయి ఇంతవరకు, మధ్యమ స్థాయి ఇంతవరకు, తారా స్థాయి ఇంతవరకు అని తెలియజెప్పే విధంగా ఆమె కంఠంపై మూడు రేఖలున్నాయట.

చం. ఒదవెడు జవ్వనంబు వెలి కొత్తఁగఁ బయ్యెద సిగ్గుఁ గూడి చి,
ట్టదుమఁగ లేఁత లౌట దిగనీకను మీఱను లేక పక్షపుం,
జదువునఁ బ్రక్కల న్మెఱసి చప్పట లై మఱి లావుఁ గూడఁ బైఁ,
బొదలె ననంగ బిక్కటిలె బొల్తుక చన్నులు నాడు నాటికిన్ (5-21)

ఆమెకు యవ్వనము వచ్చి కూడింది. దానితోపాటు పుట్టుకొచ్చిన చన్నులను ఆ యవ్వనం పైకి, బయటకు  నెట్టేసింది. కానీ యవ్వనంతో పాటే వచ్చిన సిగ్గు పైటను తెచ్చిపెట్టింది. ఆ పైట చన్నులను అదిమిపెట్టింది,  బిగించి పట్టింది. దానితో పాపం ఆ వక్షోజములకు లోపలికి పోవడానికీ బయటకు రావడానికీ వీలుకాక,  ప్రక్కలకు వ్యాపించినట్లు ముద్దలుగా ప్రక్కలకు వ్యాపించి, నానాటికీ విశాలములు అయినాయి.

తే.గీ. ధృత రఘూత్తమ శాపమొక్కింత విడిచి
విడిచి కడకేగ నప్పుడప్పుడకవిసెడు
చక్రయుగ మన రొమ్మొయ్యనాక్రమించి
కొమిరెచన్నులు పృథుచూచుకముల నమరె (5-22)

శ్రీరాముడు సీతాదేవి వియోగాన్ని అనుభవిస్తున్నప్పుడు చక్రవాక పక్షులకు శాపం ఇచ్చాట్ట. నేను నా  ప్రియురాలి వియోగాన్ని అనుభవిస్తుంటే మీరు హాయిగా సంయోగానందాన్ని నా కన్నుల ఎదురాగానే  అనుభవిస్తూ, నన్ను ఉడికిస్తూ వెక్కిరిస్తూ బాధిస్తున్నారు, భడవల్లారా, మీకు రాత్రిపూట ఎడబాటు  కలుగుగాక, పగటిపూటే మీకు ఒకరినొకరు చూసుకోడం, కలుసుకోడం జరుగుగాక అని శాపం  ఇచ్చాట్ట. ఆ  శాప ప్రభావం వలన పగటిపూట కలుసుకున్న చక్రవాక పక్షులు ఆనందంగా కౌగలించుకుని ముక్కులు రాసుకున్నట్లు గోదాదేవి వక్షోజములు ప్రక్కలకు పెరిగి పెరిగి ఒకదానినొకటి ఒరుసుకుంటున్నాయి. ఆ  చక్రవాక పక్షుల ముక్కుల లాగా ఆమె చూచుకములు రాసుకుంటున్నాయి!

తా రె ట్లట్లుగ దమ్ముం 
జేరిన ముత్తెంపుసరుల జేడియచన్నుల్ 
లోరెంట లుడిపె ఘనమగు 
వారు నిజార్జవము జేరు వారికి నీరే (5-23)


      ఉత్తములైనవారు తమను ఆశ్రయించిన వారికి తమ ధైర్యాన్ని, సత్త్వాన్ని, లక్షణాలను అందించినట్లు, యజమానుల లక్షణాలు సేవకులకు వచ్చినట్లు గోదాదేవి వక్షోజాలను ఆశ్రయించిన ఆభరణాలకు ఆ వక్షోజాల  లక్షణాలు వచ్చాయి. విపరీతమైన వైశాల్యం వలన ఆ వక్షోజాలు ఒకదానికొకటి అంటుకుపోయాయి. ఆమె  ధరించిన ఆభరణాలకు ఆమె వక్షోజాల మధ్యలో ఇరుక్కుపోవడం వలన, పేటలన్నీ ఒక్కటిగా ముడిపడి,  ఇరుక్కుపోయాయి. రాయలవారి రసికత్వం ఇంకా చాలా ఉంది. వచ్చే పోస్టులో చూద్దాం.

0 comments:

Related Posts Plugin for WordPress, Blogger...