తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Thursday, April 11, 2013

శరదృతు వర్ణన


ఈ ఆముక్తమాల్యదని ఆసక్తితో చదివే పాఠకమిత్రులందరికీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! వర్షకాలం వెళ్ళి శరదృతువు ప్రవేశించింది. అదేమిటి, వచ్చింది వసంతమైతే శరదృతువు అంటానేమిటని ఆశ్చర్యపోతున్నారా! :-) ఇందులో మీ తప్పేమీ లేదు. ఎప్పుడో నాలుగునెలల కిందట ఆపేసిన కథ, తిరిగి యిన్నాళ్ళకు మొదలుపెడితే మీరెంతకన్న గుర్తుంచుకుంటారు. ఆముక్తమాల్యద కథలో మనం వర్ష ఋతువు వర్ణన దగ్గర ఆగాము. ఇప్పుడు శరదృతు వర్ణన. ఈ ఋతువర్ణనలు అయ్యాక మళ్ళీ అసలు కథలోకి వెళతాము. కొత్త సంవత్సరం సందర్భంగా తీసుకున్న ఒక దృఢసంకల్పం - ఈ ఏడాది చకచకా నెలకొక టపాతో వేగంగా సాగాలని. ఉగాది రోజు చేసినది ఏడాదంతా చేస్తామనే నమ్మకంతోనైనా, ఈ విజయనామ సంవత్సరంలో ఈ కావ్యపఠన విజయవంతంగా కొనసాగి, వీలైతే ముగింపుకి కూడా వస్తుందని ఆశిద్దాం! ప్రస్తుతానికి కావ్యంలోకి మళ్ళీ ప్రవేశిద్దాం.


సాంధ్యరాగలహరి సామిరంజితములై
తిరిగె మింట నిదుర దెలిసినట్టి
యిందిరాధిపతికి నెత్తు కర్పూర నీ
రాజనములన శరద్ఘనములు

 ఈ పద్యం రాఘవ స్వరంలో  - రాగం లహరి

శరత్కాల మేఘాలని వర్ణిస్తున్న పద్యమిది. వానాకాలంలో నీటిమబ్బులు నల్లని రంగులో మెరిస్తే, శరదృతువులో నీరులేని మబ్బులు తెల్లని తెలుపులో వెలిగిపోతూ ఉంటాయి. అలాంటి తెల్లని మబ్బులపై సాంధ్యరాగలహరి, అంటే సంజకెంజాయ, ప్రసరిస్తే? అవి సగం తెలుపు సగం ఎరుపు రంగులో ధగధగలాడతాయి. అవి ఆకాశంలో తిరుగుతూ ఉంటే ఎలా ఉన్నదంటే, అప్పుడే నిద్రలేచిన శ్రీహరికి పట్టిన కర్పూరహారతిలాగా ఉన్నాయట! వర్షాకాలం విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళడం గురించి వర్షాకాల వర్ణనలో చూసాం కదా. శరత్తు ఆయన నిద్రలేచే సమయం అన్నమాట. ఎర్రనికాంతితో వెలిగే తెలిమబ్బులను, హారతికర్పూరంతో పోల్చడం ఎంత మనోజ్ఞమైన ఊహ!నీరజేక్షణుడ వ్వేళ నిదుర దెలిసి
యడుగుదన మీద మోపెనో యవని రమణి
కంటకిత గాత్రి యయ్యె నాగా, విపాక
పరుష కంటక శాలి మంజరులు పొలిచె


పై పద్యంలో నిద్ర లేచిన విష్ణుమూర్తికి నీరాజనాలిచ్చే సన్నివేశం చిత్రించిన కవి యీ పద్యంలో మరో అడుగు ముందుకు వేసాడు. స్వామి నిద్రనుండి లేచి, తనపై అడుగు మోపడంతో అవని రమణి (అంటే భూదేవి) పులకించిందట! శాలిమంజరులు అంటే వరికంకులు. పంట బాగా పండి, శరత్కాలంలో నేలనుండి మొలిచుకొని వచ్చాయి వరికంకులు. వాటికుండే ధాన్యపు గింజలు సూదిగా ముళ్ళల్లా ఉన్నాయి.  అవి భూదేవి మేనిపై పుట్టిన పులకల్లాగా ఉన్నాయట! గోదాదేవంటే భూదేవి అవతారమే. అందుకే రాయలవారి వర్ణనల్లో మనకు మాటిమాటికీ ఆ ప్రకృతీ పురుషుల ప్రస్తావన కనిపిస్తుంది.ఇలకు సుధాసమత్వము రహింప శరజ్జలజాక్షి కుండమం
డలి సలిలంబు గల్మషమడంగ మొగి ల్విరియెండ గాచుచో
జిలుకు నిశారజఃపటలి చెన్ను వహించె దరంగపంక్తిపై
దళదరవింద కైరవ కదంబ కడార పరాగపూరముల్
 
 ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో

"దళదరవింద కైరవ కదంబ కడార పరాగపూరముల్" - వికసిస్తున్న తామరపూలు, తెల్లకలువలు. వాటినుండి ఎగసే పసుపురంగు పుప్పొడి.
"మొగిల్ విరి యెండ" - అంటే మబ్బులు విచ్చుకోగా చక్కగా కాస్తున్న ఎండ.
ఇవి శరత్కాలపు ప్రకృతిలో కనిపిస్తాయి. అంతే కాకుండా, వానాకాలంలో బురదగా ఉండే కొలని నీళ్ళు, వానలు వెలిసాక తేటపడి, త్రాగడానికి తీయగా స్వచ్ఛంగా ఉంటాయి.

వీటన్నిటినీ అనుసంధానం చేస్తూ ఒక కల్పన చేసారు రాయలవారు. స్వర్గంలో సుధ, అంటే అమృతం ఉంటుంది కదా. దానికి సమానంగా భూమిపై నీటిని కూడా అంత స్వచ్ఛంగా చేయలని అనుకున్నదట శరత్తనే జలజాక్షి. నీటిని శుద్ధి చెయ్యడానికి దాన్ని మరిగించి, పసుపు వేస్తారు కదా. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. చక్కగా కాస్తున్న ఎండ అనే వేడితో నీటిని మరిగించి, పూల పరాగమనే పసుపు దానిపై చల్లి నీటిని శుద్ధి చేసిందట శరజ్జలజాక్షి. అలా శుద్ధి చేసిన నీరు చక్కగా తేటపడి కనిపిస్తోందట. జలజాక్షి అంటే మామూలుగా ఉండే అర్థం తామరపూలవంటి కన్నులు కలది అని. శరత్కాలంలో తామరలు బాగా పూస్తాయి కాబట్టి, ఇక్కడ జలజాక్షి అంటే తామరపూవులనే కన్నులు కలది అని కూడా అర్థం తీసుకోవచ్చు. కమలాక్షి, పద్మనేత్రి అనేవి లక్ష్మీదేవి పేర్లు. అంచేత ఇక్కడ శరత్తనే లక్ష్మీదేవి అనే ధ్వనికూడా ఉంది.గగనలక్ష్మి నిజోరు నక్షత్రమాలి
కలు, వియన్నది జలముల గడుగ బిసుక
నెఱయు కుంకుడుబండుల నుఱువులనగ
బలపలని పాండురాంబుద పంక్తు లమరె
 
ఈ  పద్యం లంకా గిరిధర్ స్వరంలో


రాయలవారు తన కల్పనా చాతుర్యంతో దేన్ని దేనితో ముడిపెడతారో ఊహించడం అసంభవం! అలాంటి ఒక అనూహ్యమైన కల్పన యీ చిన్న పద్యంలో కనిపిస్తుంది. శరద్రాత్రులలో ఆకాశంలో చుక్కలు చక్కగా మెరుస్తూ కనిపిస్తాయి. అక్కడక్కడా తెల్లని మబ్బులు తేలుతూ కదులుతూంటాయి. ఆ దృశ్యాన్ని వర్ణిస్తున్నారిందులో. అది ఎలా ఉన్నదంటే, ఆకాశలక్ష్మి, తన ముత్యాలసరాలను (ఇరవయ్యేడు ముత్యాలున్న హారాన్ని నక్షత్రమాల అంటారు) ఆకాశగంగలో కడుగుతోందట. ముత్యాలని కుంకుడుకాయ నురుగుతో కడుగుతారు. అలా పిసికిన కుంకుడుపళ్ళ నురుగులాగా ఉన్నాయట పలుచని తెలిమబ్బు గుంపులు!అప్పుల్ వారిధి చేత బుచ్చికొని, కార్యంబైన ముంగొన్న య
య్యప్పుల్ దౌ చనియున్ సమృద్ధికముగా నవ్వార్ధికే తీర్పగా
నప్పుణ్యాతి విశుద్ధ జీవులు నిజాచ్ఛాంగంబులం దోచున
ట్లొప్పారెన్ శశిబింబ గర్భితములై ద్యోచారి శుభ్రాభ్రముల్
 
ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో.

పై పద్యంలోని తెలిమబ్బుల గురించే మరో చిత్రమైన కల్పన యీ పద్యంలో చేసారు రాయలు. ఇందులో చుక్కల కన్నా ప్రకాశంగా వెలిగిపోతున్న చంద్రబింబాన్ని తీసుకువచ్చారు. అసలే తెల్లని మబ్బులు. వాటి చాటున ఉన్న శశిబింబం చిందిస్తున్న వెన్నెల కాంతిలో అవి తళతళా మెరిసిపోతున్నాయి. పుణ్యాత్ములై, స్వచ్ఛమైన తనుకాంతితో మెరిసిపోతున్నట్లుగా ఉన్నాయట అవి. మబ్బులేం పుణ్యం చేసాయి? అంటే, పద్యమంతా చదివితే తెలుస్తుంది. మబ్బులు వారిధి చేత, అంటే సముద్రంనుండి, అప్పులు తీసుకున్నాయట. ఏమిటా అప్పులు? "అప్"పులే! "అప్" అంటే సంస్కృతంలో "నీరు" అని అర్థం. అంచేత తెలుగులో "అప్పులు" అంటే నీళ్ళు అనే అర్థం కూడా ఉంది. అంచేత అప్పులనే అప్పులుగా తీసుకున్నాయి మబ్బులు, సముద్రంనుండి. తీసుకున్న అప్పు తీర్చాలి కదా. అంచేత, కార్యంబైన, అంటే తమ పని అయిపోయాక, మున్ గొన్న ఆ అప్పుల్, ముందు తీసుకున్న ఆ అప్పులను, దౌ చనియున్ - ఎంత దూరం వెళ్ళినా, సమృద్ధికముగా - వడ్డీతో సహా, ఆ వార్ధికే తీర్పగా - ఆ సముద్రానికే తిరిగి తీర్చేయగా, అవి పుణ్యవతులయ్యాయి!
సముద్రంనుండి తీసుకున్న దానికన్నా ఎక్కువ నీళ్ళు తిరిగి ఎలా యిస్తాయి? అనే సందేహం రావచ్చు. వానాకాలంలో వానలు సమృద్ధిగా కురుస్తాయి అంటాం కాబట్టి వానల పరంగా సమృద్ధిగా కురవడం అనీ, అప్పులు తీర్చే పరంగా వడ్డీతో సహా తీర్చడం అనీ శ్లేష తీసుకోవచ్చు. మరో రకంగా ఆలోచిస్తే, సముద్రం దగ్గర ఉప్పునీటిని తీసుకొని తిరిగి మంచినీటిని ప్రసాదించడం అనేది అవి యిచ్చే వడ్డీ అని కూడా అనుకోవచ్చు.అయనిష్ఠన్ ధవళాతపత్రి దగు నయ్యాగంబు సాగంగ, నం
దు, యమిశ్రేణులు రాగ బుంగవకకుత్స్థుం డల్ల వర్షాదినా
త్యయరాముండు సలక్ష్మణుం డినున కోజోవాప్తిగా, విల్లు ని
ర్దయతంద్రుంప బ్రభగ్న శాల్యవని సీతాలబ్ధి గాకుండునే


ఇది ఒక సంక్లిష్ట కల్పన. పూర్తిగా శ్లేషతో కూడిన ద్వ్యర్థి పద్యం. శరదృతువుకీ రామాయణానికి ముడివేసారీ పద్యంలో రాయలు! శరత్తుకి శ్రీరాముడితో పోలిక చెప్పారు.

అయనిష్ఠన్ - శుభకార్యాలు చేయాలనే కోరికతో లేదా, శుభకాలంలో
ధవళాతపత్రి - తెల్లని గొడుగు కలవాడు (అంటే రాజు. ఇక్కడ జనకమహారాజు) లేదా, తెల్లని తామరపూలే గొడుగులుగా కలది (శరత్కాలానికి సంబంధించినది)
ఆ యాగంబు సాగంగ - జనకుడు చేసే యాగము జరుగుతూ ఉంటే, లేదా, శరత్కాలంలో చేసే వాజపేయమనే యాగం జరుగుతూ ఉంటే
యమిశ్రేణులు రాగ - మునులగుంపులు, లేదా, హంసల గుంపులు రాగా
పుంగవ కకుత్‌స్థుండు - కకుత్‌స్థవంశానికి చెందిన శ్రేష్ఠుడు (అంటే రాముడు), లేదా, మంచి మూపురంగల ఎద్దు,
వర్షా దిన అత్యయ రాముండు - వానాకాలపు ఆకాశంలా ఉన్న రాముడు, లేదా, వానాకాలము వెళ్ళిపోవడం వల్ల మనోహరంగా ఉన్న శరత్తు
సలక్ష్మణుండు - లక్ష్మణుడితో కూడినవాడు, లేదా, బెగ్గురుపక్షులతో కూడినవాడు (శరత్తు)
ఇనునకు ఓజః అవాప్తి కాన్ - సూర్య వంశానికి మరింత తేజం తెచ్చే విధంగా, లేదా, సూర్యకాంతి బాగా ప్రకాశించగా
విల్లు - శివధనుస్సు, లేదా, హరివిల్లు
నిర్దయతన్ త్రుంప - ఎలాంటి జంకు లేక విరిచేయగా
ప్రభగన శాలి అవనిన్ - విరిచిన ఆ ప్రదేశంలో, లేదా, కోయబడిన వరి చేనిలో
సీతాలబ్ధి గాకుండునే - సీతాదేవి లభించదా! లేదా, నాగేటి చాలు ఏర్పడకుండా ఉంటుందా!

రామాయణార్థంలో తాత్పర్యం:
శుభకార్యాలు చేసే కోరికతో జనక మహారాజు చేసే యజ్ఞానికి మునులందరూ విచ్చేసారు. అక్కడకి కకుత్‌స్థవంశ శ్రేష్ఠుడైన నీలమేఘశ్యాముడు, శ్రీరాముడు, లక్ష్మణునితో సహా వచ్చి, తమ సూర్యవంశానికి వన్నె తెచ్చే విధంగా, పరాక్రమంతో శివధనుస్సుని విరిచాక ఆయనకు సీతాదేవి లభించకుండా ఉంటుందా!

శరత్కాల పరంగా తాత్పర్యం:
శుభకాలమైన శరదృతువులో వాజపేయయాగం సాగుతోంది. ఆకాశంలో హంసలూ, తెల్లని కొంగలూ ఎగురుతున్నాయి. వర్షాకాలం అంతమై, ఇంద్రధనుస్సులు అదృశ్యమై, సూర్యుడు బాగా కాంతితో ప్రకాశిస్తున్నాడు.  అప్పుడు, మంచి మూపుగల ఎడ్లతో దున్నబడేందుకు వరిపొలాలు సిద్ధమవుతాయి. వాటిలో నాగేటి చాలు ఏర్పడకుండా ఉంటుందా!

శరత్కాలంలో వరిపొలాలను ఎందుకు దున్నుతారు? అంటే, వరిపంట కోత కోసి మళ్ళీ దున్నడం మొదలుపెడతారని తాత్పర్యం.పరుషాతపతప్తంబగు
ధరణీపాత్రమున బడుట దళమయ్యె జుమీ
పరిపక్వంబై, యనగా 
శరదిందుజ్యోత్స్న రేల సాంద్రత గాసెన్
 
ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో.

రాత్రివేళల శరజ్జ్యోత్స్న చాలా దట్టంగా కాస్తోంది. ఆ చిక్కదనం వెన్నెలకెలా వచ్చింది? అంటే, ఉదయమంతా యెండ తాకిడికి భూమి అనే పెనం వేడెక్కిందిట. అలాంటి వేడి పెనం మీద అట్లపిండిలాంటి వెన్నెల పడి, అది దిబ్బరొట్టెలాగా దళసరిగా అయ్యిందట! ఇలాంటి వర్ణనల్ని చదివినప్పుడు, "ఓరినీ అసాధ్యం కూలా!" అని నోరు వెళ్ళబెట్టడం తప్ప ఎంచేస్తాం! :-) వెన్నెల "పిండారబోసినట్లు" కాసిందని అంటాం కదా. ఆ పిండిని నిజంగానే పొయ్యాల్సిన పెనం మీద పోసారు రాయలవారు!హంసము క్రౌంచము తొలి రా,
మాంసలరుచి వచ్చె దాను మలయము శిఖ; బాల్
హంస విఱువ, నీర్విఱిచెను,
హంసమున కగస్తి పరమహంసం బగుటన్
 
(ఈ పద్యం రాఘవ స్వరంలో - రాగం హంసనాదం)

వివరణ యిస్తే కాని అర్థం కాని రాయల మార్కు పద్యం! శరదాగమనంతో జరిగే మూడు అంశాలని కలిపి ఒక చిన్న పద్యంగా అల్లారు రాయలవారిక్కడ. శరత్కాలంలో, స్వర్గలోక హంసలు, క్రౌంచపర్వతం మద్యన ఉండే రంధ్రం గూండా యీ లోకంలోకి వస్తాయని ఒక కవిసమయం. అలాగే అగస్త్య నక్షత్రం (దీన్నే ఇంగ్లీషులో Canopus అంటారు) దక్షిణాన ఉదయించడం, వర్షాంతాన్నీ శరత్కాల ప్రారంభాన్నీ సూచిస్తుందని ఒక నమ్మకం. ఈ నక్షత్రం ఆగస్టు సెప్టెంబర్లలో కనిపిస్తుంది కాబట్టి బహుశా అలా అంటారు. అయితే యీ నక్షత్రం దక్షిణాన మలయపర్వతం మీదగా కనిపిస్తుంది కాబట్టి, అగస్త్యుడు కొండపైనుండి వచ్చినట్టుగా కవి భావిస్తున్నాడిక్కడ. మూడవది, శరత్కాలంలో బుఱద నీరు బుఱదపోయి తేటపడడం ఇంతకుముందు చెప్పుకున్న అంశమే. ఈ మూడిటినీ ముడివేసి చెప్పారీ పద్యంలో.
హంసమున కగస్తి పరమహంసం బగుటన్ - అగస్త్యుడు హంసలకి పరమహంస కాబట్టి,
హంసలు క్రౌంచ పర్వతము (మధ్య)నుండి తొలిగా వస్తే, ఆ పిమ్మట అగస్త్యుడు మలయగిరి శిఖరం మీదగా అధికమైన వెలుగుతో (మాంసలరుచిన్) వచ్చాడు. హంసలు పాలని విరిస్తే, అగస్త్యుడు నీటిని విరిచాడు. నీటిని విరవడం అంటే, బురదనీటిలో బురదని విరిచి నీటిని తేటపరిచాడని. పాలకన్నా నీరు పలచన కాబట్టి, దాన్ని విరవడం ఇంకా గొప్ప అని ధ్వని. మొత్తానికి అగస్త్యుడు హంసలకన్నా గొప్పవాడు, పరమహంస అని తాత్పర్యం.

దీనితో వర్ష శరత్తుల వర్ణన ముగిసింది. వచ్చే టపాలో, కథ ఎక్కడ ఆగిందో చూసి మళ్ళీ కొనసాగిద్దాం.

4 comments:

లక్ష్మీదేవి said...

అద్భుతమైన పద్యాలు. ముఖ్యంగా కర్పూర హారతి పద్యం.
అప్పుల పద్యం భలే సరదాగా ఉంది. నిజం కూడా.

శూభ్ర = శుభ్ర నా?
లేక టైపాటా?
నీలామేఘ, బుగవ శతజ్జ్యోత్స్న ఈ పదాలను సరిచేయగలరు.

కామేశ్వర రావు భైరవభట్ల said...

శూభ్ర - టైపాటే. పదాలను సరిచేసాను. చెప్పినందుకు ధన్యవాదాలు.

కమనీయం said...
రాయలవారి ఆముక్తమాల్యద పద్యాలు ప్రతిపదార్థ వివరణేగాక,అంతర్గతభావాన్ని వివరిస్తే తప్ప బోధపడవు.ఆయనచేసిన శరదృతువు వర్ణనని చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు.

వారణాసి నాగలక్ష్మి said...

ఎంత బాగా వివరించారండి! పిండారబోసిన వెన్నెలలో తీరికగా కూర్చోబెట్టి రుచికరమైన దిబ్బరొట్టెలు వడ్డించారు.రాయల వారికి వందనాలు.రావుగారికి కృతజ్ఞతలు !

Related Posts Plugin for WordPress, Blogger...