తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Monday, July 25, 2011

విష్ణుచిత్తుని వాదము

శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలోని తృతీయాశ్వాసాన్ని ఆ వేంకటరాయని ప్రార్ధనతో ప్రారంభించాడు. ఈ ఆశ్వాసంలో విష్ణుచిత్తుడు రాజాస్ధానంలో పండితులను నిర్ద్వందంగా ఓడించిన విధానము, ఖాండిక్య కేశీధ్వజుల సంవాదము వివరిస్తున్నాడు..

కం. శ్రీక్షితినీళా వర! దను
జోక్షప్రాణహర! దంష్ట్రికోత్కృత్తహిర
ణ్యాక్షక్షపాచర! కృపా
వీక్షాదృతబాహులేయ! వేంకటరాయా!


( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం -హమీర్ కల్యాణి )

లక్ష్మీదేవికి, భూదేవికి, నీళాదేవికి నాథుడైనవాడా! వృషభాసురుని (ఉక్షము అంటే ఎద్దు) సంహరించినవాడా! వరాహావతారమున తన కోఱలచే హిరణ్యాక్షుని ఖండించినవాడా! దయతో కుమారస్వామిని ఆదరించిన వేంకటరాయా! అని సంభోదిస్తూ తృతీయాశ్వాసానికి శ్రీకారం పలికాడు రాయలు..
నీళాదేవి కుంభకుడన్న వాని కూతురు. కాలనేమి అనే రాక్షసి కొడుకులు ఆబోతురూపాలలో గొల్లపల్లెను బాధిస్తూ ఉండగా వారిని చంపినవానికి తన కూతురునిచ్చి పెళ్ళి చేస్తానని కుంభకుడు చాటిస్తే, శ్రీకృష్ణుడు వారిని చంపి నీళాదేవిని పెళ్ళి చేసుకున్నాడు. అలానే వరాహావతారంలో భూదేవిని రక్షించి ఆమెకి భర్త అయినాడు. భూ నీళా దేవిల ప్రస్తావన తెచ్చి, దానికి అనుసంధానంగా ఆయా రాక్షసులని సంహరించినవానిగా పేర్కొనడం పద్యానికి ఒక చక్కని అమరిక తెచ్చింది. విశిష్టాద్వైత మతంలో గోదాదేవిని నీళాదేవి స్వరూపంగా భావిస్తారు.
కుమారస్వామి వేంకటనాథుని కొలిచినట్టుగా కథ ఉంది. అతని పేరు మీదనే స్వామి పుష్కరిణి ఏర్పడింది.

శా. నిత్యంబున్ బ్రతిహారి వాద మగుటన్ విజ్ఞప్తి లే కంపఁ, దా
నత్యూర్జస్వలుఁ డౌట భూపతియు సభ్యవ్రాతమున్ శంకమైఁ
బ్రత్యుత్థానముఁ జేసి మ్రొక్కఁగ, సభాభాగంబు సొత్తెంచి యౌ
న్నత్యప్రోజ్వల రాజదత్త వరరత్న స్వర్ణపీఠస్థుఁడై


( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)

మన్నారుస్వామి ఆదేశానుసారము పాండ్యరాజు కొలువులో పండితులతో వాదమొనరించుటకు వెళ్లాడు విష్ణుచిత్తుడు. ఆ మధురానగర రాజాస్ధానంలో పరతత్త్వ నిర్ణయం కోసమైన వాద ప్రతివాదాలు రోజూ జరుగుతూనే ఉన్నాయి. అందులో పాల్గొనడానికి వివిధ ప్రాంతాలనుండి పండితులు విచ్చేస్తున్నారు. అందుకే అక్కడి ద్వారపాలకుడు రాజుగారికి విన్నవించడం, ఆజ్ఞ తీసుకోవడం లాంటి ఆనవాయితీ లేకుండానే విష్ణుచిత్తుని లోపలికి పంపించాడు. సభలోకి ప్రవేశించిన విష్ణుచిత్తుడు అఖండమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఆ ప్రకాశము చూసి “ఎవరో ఈ మహాత్ముడు!” అనుకుని రాజుతో సహా సభాసదులందరూ లేచి నమస్కరించారు. విష్ణుచిత్తుడు సభలో ప్రవేశించి మహారాజు తనకు సమర్పించిన రత్నఖచిత సింహాసనంలో ఆసీనుడయ్యాడు.

. అతిథ్యము గొని, హరి తన
చేతోగతి నొలయ, రంతు సేయని విద్వ
ద్ర్వాతంబుఁ జూచి, ‘లాఁతుల
మా తరవాయుడుగ? మాటలాడుం’ దనుచు


(ఈ
పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

రాజుగారి
ఆతిధ్యము స్వీకరించిన తర్వాత విష్ణుచిత్తుడు తన మనసునందు మహావిష్ణువు ఆవరించగా, తమ వాదము మాని నిశ్శబ్దంగా ఉన్న పండితులను చూస్తూ “మనమేమన్నా పరాయివాళ్లమా? వాదం ఎందుకు ఆపారు? మొదలెట్టండి!”, అన్నాడు. విష్ణువు తన చిత్తంలో పూర్తిగా అలముకొని, విష్ణుచిత్తుడన్న అతని పేరు గొప్ప సార్థక్యాన్ని పొందిందిప్పుడు. అందుకే అతనిలో ఆ తేజస్సు! విష్ణుచిత్తుని మాటల్లోని చొరవ గమనించాలి. అదంతా విష్ణుమూర్తి చలవే!

సరే వాదప్రతివాదాలు మళ్ళీ మొదలుపెట్టారు పండితులు. కొన్ని మాటల్లోనే వారి తెలివితేటలు గ్రహించి, వారి వాదములో లోతులేదని తనలో తాను నవ్వుకొని, పండితుల చెప్పుతున్నది పూర్తయిన తర్వాత తాను కూడా మాట్లాడేందుకు రాజు అనుమతిని తీసుకున్నాడు విష్ణుచిత్తుడు. రాజును మధ్యవర్తిగా ఉండమని తన వాదమును ప్రారంభించాడు.

సీ. అందులో నొకమేటి కభిముఖుండై యాతఁ
డనిన వన్నియును మున్ననువదించి;
తొడఁగి యన్నిటి కన్ని దూషణంబులు వేగ
పడక తత్సభ యొడఁబడఁగఁ బల్కి
ప్రక్కమాటల నెన్న కొక్కొకమాటనె
నిగ్రహస్థాన మనుగ్రహించి;
క్రందుగా రేఁగినం గలఁగ కందఱఁ దీర్చి
నిలిపి; యమ్మొదలి వానికినె మగిడి;

తే. మఱి శ్రుతి స్మృతి సూత్ర సమాజమునకు
నైక కంఠ్యంబు గల్పించి, యాత్మమతము
జగ మెఱుంగఁగ రాద్ధాంతముగ నొనర్చి;
విజితుఁగావించి దయ వాని విడిచి పెట్టి



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)
వాదమంటే ఎలా జరపాలో చక్కగా వివరించే పద్యమిది! ఆనాటికే కాదు ఈనాటికీ ఎవరు చక్కని వాదము చెయ్యాలన్నా యీ పద్ధతినే అనుసరించాలి. ముఖ్యంగా చట్ట సభలలో వాదులాడుకొనే మన నాయకులు దీన్ని నేర్చుకోవలసిన అవసరం చాలా ఉంది!
విష్ణుచిత్తుడు ముందుగా అక్కడి పండితులలో మేటియనిపించిన ఓ పండితుడి వైపు తిరిగి అతని వాదమును మొత్తం అనువాదము చేసి, ఆ వాక్యాలలోని దోషాలను ఒక్కటొక్కటిగా ఎత్తి చూపుతూ సభలోనివారందరూ అంగీకరించి మెచ్చుకొను విధంగా వాటిని ఖండించాడు. ప్రక్కనున్న పండితులు పలికే వితండ వాదాన్ని పట్టించుకొనక ఒక్కో మాటతోనే క్లుప్తంగా వారి పరాజయ హేతువును సూచించాడు. తమ పరాజయాన్ని తట్టుకోలేని పండితులు మూకుమ్మడిగా తనతో వాదానికి దిగినా ఏమాత్రం జంకకుండా అందరినీ సమాధానపరిచాడు. తర్వాత తనతో వాదమునకు దిగిన మొదటి పండితుని వైపు తిరిగి వేదాలు, బ్రహ్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు – వీటన్నిటి పరమార్ధం ఒక్కటే అని వాటి ఏకవాక్యతని (ఏకగ్రీవతని) స్ధాపించిన పిమ్మట స్వమతము అనగా శ్రీవైష్ణవమే విశిష్టమైనదని లోకానికి స్పష్టం చేసాడు. తనచేతిలో ఓడిన పండితుడిని దయతో క్షమించి విడిచిపెట్టాడు. ఇదే విధంగా అక్కడ వాదించిన పండితులందరితోనూ ప్రతివాదము చేసి ఒక్కొక్కడినే ఓడించాడు విష్ణుచిత్తుడు.

ఆ చేసే వాదములో అన్యమత ఖండనం ఎలా చేసాడో ఈ కింద పద్యంలో వివరిస్తున్నాడు రాయలు. పెద్ద వ్యాఖ్యానం అవసరమైన పద్యమిది. ఈ పద్యం అర్థం కావాలంటే అసలు మన భారతదేశంలో పూర్వమున్న మతాల అన్నిటి గురించి మనకి తెలియాలి. మనకిప్పుడు "హిందూ మతం"గా చెలామణీ అవుతున్నది నిజానికి చాలా "మతాల" సమ్మేళనం. అయితే ఇంచుమించుగా ఈ "మతాలన్నీ" వేదాలని ఆధారం చేసుకున్నవే.
ఇప్పుడీ పద్యంలో ప్రస్తావించిన మతాలు ఒక్కొక్కటే ఏమిటన్నది చూద్దాం.

సీ. 'జగదుద్గతికిని బీజము ప్రధాన' మన 'నీ
క్షత్యాది' వీశు నశబ్దవాదిఁ
బొరి 'నీశుఁడేన' నా 'భోగమాత్రే'త్యాద్యు
దాహృతిస్ఫూర్తి మాయావివాది,
'ఫలియించుఁ గ్రియయ' నా 'ఫలమత' యిత్యాది
సర్వేశుఁ గొనని యపూర్వవాది,
'శాస్త్రయోనిత్వాది' సరణి నీశ్వరునిఁ దె
ల్పెడు 'ననుమాన' మన్పీలువాది

'నిత్యులందెల్ల నిత్యు'డన్ శ్రుత్యురూక్తి
'క్షణిక సర్వజ్ఞ తేషి' సౌగత వివాది,
'ననుపవత్తేర్నా' యను సూత్ర మాదియైన
వాణి 'నృపతీశు' బ్రత్యక్షవాది గెలిచె


( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)

మొదటి పాదంలో ఉన్నది సాంఖ్యమనే మతం. దీనినే సాంఖ్యదర్శనం అంటారు. ఈశ్వరుడు లేదా బ్రహ్మము, శుద్ధ జ్ఞానస్వరూపమని, జత్ సృష్టికి మూలకారణం "ప్రధానము"(ప్రకృతి) అని చెప్పే మతమిది. అయితే దీనిని "ఈక్షతేర్నాశబ్దం" అనే బ్రహ్మసూత్రాన్ని ఉపయోగించి ఖండిచాడు విష్ణుచిత్తుడు. ఈ బ్రహ్మసూత్రం సంఖ్య 1:1:5. దీని వివరణ ఏమిటంటే - "తదైక్షత బహూస్యాం" అనే శ్రుతి వాక్యాన్ని బట్టి, "తాను అనేకత్వాన్ని పొందాలని సృష్టి కారకమైన బ్రహ్మము ఈక్షణము (సంకల్పము) చేసినది" అని వేదాలలో చెప్పబడింది. కాని ప్రకృతికి (అచేతనము కాబట్టి), అలాంటి "సంకల్పము" చేసే శక్తి లేదు. అంచేత అదే జగత్తుకి మూలమని చెప్పడం "అశబ్దం" అంటే వేదాలకి సమ్మతం కాదు. ఇక్కడ గమనించవలసిన ఒక ముఖ్య అంశమేమిటంటే, ఈ మతాలన్నిటికీ కూడా వేదాలే ఆధారం. అంచేత ఈ వాదోపవాదాలన్నీ కూడా వేదాలని అనుసరించి జరిగేవే. వేదాలు ఒక common platform అన్నమాట!

ఇక రెండవ పాదంలో ఉన్నది అద్వైతము. ఇది "ఈశుడు ఏనె" అంటే, నేనే ఈశ్వరుడిని అని, జగత్తు కేవలం మాయ అని చెప్పే మతం. దీనిని "భోగమాత్ర సామ్య లింగాశ్చ" అనే బ్రహ్మసూత్రం చెప్పి ఖండించాడు విష్ణుచిత్తుడు. ఇది బ్రహ్మసూత్రాలలో, నాలుగవ అధ్యాయంలో నాలుగవ పాదంలో ఇరవై ఒకటవ సూత్రం (4:4:21). దీని వివరణ ఏమిటంటే - ముక్తి పొందిన జీవుడు, కేవలం ఆనందానుభవంలో మాత్రమే పరమాత్మతో సమానుడవుతాడు అని వేదం ప్రతిపాదించిన విషయం. అంటే, జగత్ సృష్టిస్థితిలయాది శక్తులు ముక్తిపొందిన జీవాత్మకి సంభవించవు. అవి పరమాత్మకి మాత్రమే ఉంటాయి. ఆ విధంగా, జీవాత్మ పరమాత్మల మధ్య సంపూర్ణమైన అద్వైతం సంభవం కాదు.

మూడవ పాదంలో చెపుతున్న మతం మీమాంస. కర్మయే జీవికి సుఖదుఃఖాది ఫలాలను ఇస్తుందని యీ మతం చెపుతుంది. దానిని "ఫలమత ఉపపత్తేః" అనే బ్రహ్మసూత్రాన్ని చూపించి ఖండించాడు విష్ణుచిత్తుడు. ఇది మూడవ అధ్యాయం రెండవ పాదంలో ముప్పై ఎనిమిదవ సూత్రం(3:2:38). కర్మఫలాన్ని ఇచ్చేది బ్రహ్మమే అని యీ సూత్రం చెపుతుంది.

నాల్గవది వైశేషిక దర్శనం. దీనిలోనిదే పీలువాదము, అంటే పరమాణువుల సంయోగముతో జగత్తు ఏర్పడుతుందని చెప్పే వాదము. ఈ మతం అనుమాన ప్రమాణాన్ని ఆధారం చేసుకుంటుంది. అనుమాన ప్రమాణం అంటే కార్య కారణ సంబంధాన్ని ఉపయోగించి సత్యాన్ని నిర్ణయించడం. ఉదాహరణకి దూరంగా కనిపించిన పొగనిబట్టి, అక్కడ నిప్పు ఉండి ఉండాలని నిర్ణయించడం (నిప్పుని ప్రత్యక్షంగా చూడకపోయినా). ఇది ఒక రకంగా ఇప్పటి హేతువాదానికి దగ్గరగా ఉంటుంది. ఈ మతాన్ని విష్ణుచిత్తుడు, "శాస్త్ర యోనిత్వాత్" అనే బ్రహ్మసూత్రం ఆధారంగా పరాస్తం చేసాడు. ఇది మొదటి అధ్యాయం మొదటి పాదంలో మూడవ సూత్రం. ఇందులో "శాస్త్రం" అంటే వేదం. వేదాలని పుట్టించినవాడు పరబ్రహ్మమని, అతడిని తెలుసుకోడానికి ఆ వేదాలే ఆధారమని యీ సూత్రం చెపుతుంది. కాబట్టి పరబ్రహ్మాన్ని గూర్చి తెలుసుకోడానికి వేదాలే ప్రమాణం కాని వైశేషికుల అనుమాన ప్రమాణం సరికాదని ఆ వాదాన్ని ఖండించాడు.

తరువాతది బౌద్ధమతం. సౌగతుడు అంటే బౌద్ధమతాన్ని అనుసరించేవాడు. బౌద్ధమత ప్రకారం జగత్తులోని సర్వ వస్తువులూ క్షణికాలు. వారిని క్షణికవాదులు అంటారు. బౌద్ధం నిరీశ్వర వాదం. ఈ వాదాన్ని కఠోపనిషత్తులోని "నిత్యో నిత్యానాం" అనే వాక్యంతో ఖండిచాడు విష్ణుచిత్తుడు. అంటే పరబ్రహ్మము నిత్యమైన వాటిలోకెల్లా నిత్యమైనది అని.

తర్వాతది చార్వాకమతం. ఇది కేవలం ప్రత్యక్ష ప్రమాణాన్నే అంగీకరిస్తుంది. అంటే కనిపించేదే నిజమని నమ్మేది. ఇది ఒక రకంగా ఇవ్వాళ మనకి కనిపించే భౌతికవాదం అని అనవచ్చు. చార్వాకులు రాజే ఈశ్వరుడని అంటారు. ఈ మతాన్ని "అనుపపత్తేస్తు న శారీరః" అనే బ్రహ్మసూత్రంతో ఖండించాడు. ఈ సూత్ర సంఖ్య 1:2:3. జీవునికి ఉండే భౌతికమైన శరీరము బ్రహ్మమునకు ఉండదు అని చెపుతుంది. అందువల్ల బ్రహ్మాన్ని గురించి భౌతిక పరిశీలనతో తెలుసుకోవడం సాధ్యము కాదు. బౌద్ధ మతాన్నీ చార్వాకాన్నీ నాస్తిక మతాలుగా (అంటే వేద ప్రామాణ్యాన్ని ఒప్పుకోనివి) భావిస్తారు.

ఈ విధంగా అక్కడున్న సమస్త మతాలవారి వాదములని విష్ణుచిత్తుడు ఖండించాడు. ఈ పద్యమంతా రాయలవారి తత్త్వ పరిజ్ఞానానికి అనుపమ నిదర్శనం. ఇందులో చూపించిన అన్యమత ఖండనమంతా శ్రీమద్రామానుజాచార్యులవారు బ్రహ్మసూత్రాలకు వ్రాసిన భాష్యాన్ని (దీనికి శ్రీభాష్యమని పేరు) ఆధారంగా చేసుకున్నదే. ఆరు మతాలనూ, వాటి ఖండన విధానాన్ని ఒకే పద్యంలో గుత్తెత్తించడం సామాన్య విషయం కాదు. విష్ణుచిత్తుడి చేత ఎలా ఆ వాదాన్ని జరిపించాడో, అలాగే రాయలవారి చేత ఆ విష్ణువే వ్రాయించాడేమో అనిపించేంత ఆశ్చర్యకరమైన విషయమిది!

శా. విద్వద్వందితుఁడాత డిట్లు సుఖ సంవిత్తత్వబోధైక చుం
చుద్వైపాయనసూత్రసచ్ఛ్రుతుల నీశున్ మున్ నిరూపించి, పైఁ
దద్విష్ణుత్వము దాని కన్య దివిషద్వ్యావర్తనంబున్ విశి
ష్టాద్వైతంబును దేటగాఁ దెలుప మాటాడెన్ బ్రమాణంబులన్


( ఈ పద్యం రాఘవ స్వరంలో ... రాగం.. ఖరహరప్రియ )

విద్వాంసులచేత స్తుతించబడిన ఆ విష్ణుచిత్తుడు, యీ విధంగా సచ్చిదానంద రూపమైన పరమేశ్వరుని ఉనికిని బ్రహ్మసూత్రములూ శ్రుతి వాక్యముల ద్వారా ముందు స్థాపించి, తర్వాత ఆ పరమాత్మ యొక్క విష్ణుత్వమునూ ఆతనికీ ఇతర దేవతలకీ ఉన్న భేదమునూ తద్వారా విశిష్టాద్వైతమునూ ప్రమాణ పూర్వకంగా స్పష్టముగా బోధించాడు. ముందు అన్య మత నిరసనం చేసి తరువాత స్వమత స్థాపన చేసాడన్న మాట. విశిష్టాద్వైతాన్ని ఎలా స్థాపించాడో యీ కింద పద్యంలో వివరిస్తున్నాడు రాయలు.

సీ. ఆదినారాయణుండాయె నొక్కఁడ, బ్రహ్మ
లేఁడు, మహేశుండు లేఁడు, లేదు
రోదసి, లేఁడు సూర్యుఁఢు, లేఁడు చంద్రుండు,
లేవు నక్షత్రముల్, లేవు నీళ్లు,
లే దగ్ని; యట్లుండ 'లీల నేకాకిత
చనదు; పెక్కయ్యెద ననుచు నయ్యెఁ
జిదచిద్ద్వయంబు సొచ్చి' యని ఛాందోగ్యంబు
దెలిపెడు; నంతరాదిత్యవిద్య

తే. నర్కులోఁ బుండరీకాక్షుఁ డతఁడ యగుట
కక్షిణీయని యష్టదృక్ త్ర్యక్ష దశ
తాక్ష విధి రుద్ర శక్రాదులందు నొకఁడు
కామి కాశ్రుతియే విలక్షణతఁ దెలిపె




( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

సృష్టి ఆరంభంలో నారాయణుడొక్కడే అంతటా నిండి ఉండేవాడు. బ్రహ్మ, ఈశ్వరుడు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నీళ్లు, అగ్ని.. ఏవీ లేవు. అట్టి పరిస్థితుల్లో, అంతటా నేనొక్కడనై ఉంటే లీల జరగదని, ఒక్కడినే అనేకమవుతాను అని సంకల్పించిన నారాయణుడు, చేతన అచేతన పదార్థాలలో ప్రవేశించి తానే బహురూపములయ్యాడు. ఛాందోగ్యంలోని అంతరాదిత్య విద్యలో తెలిపినట్టుగా సూర్యునిలో ఉన్న పుండరీకాక్షుడతడే! ఎనిమిది కన్నులున్న బ్రహ్మ, త్రినేత్రుడైన రుద్రుడు, సహస్రాక్షుడైన ఇంద్రుడు - వీరందరిలో ఒకడు కాడు, వారికంటే అతీతుడు. అందుకు ఛాందోగ్యం "అక్షిణి" అంటూ రెండు కన్నులున్నవానిగా పేర్కొనడమే నిదర్శనం. అంతేగాక ఈ సృష్టి అంతటా లోపల, వెలుపల తానే నిండివున్నాడన్న విషయాన్ని ఛాందోగ్యోపనిషత్తు ఉద్ఘోషిస్తుంది.. కాబట్టి శ్రుతి విష్ణువే పరమదైవమని చెపుతున్నదని శ్రీవైష్ణవ మతాన్ని స్థాపించాడు.

ఈ పద్యంలో రాయలవారు అనేక ఉపనిషత్ వాక్యాలను తెనిగించారు. ఉదాహరణకి "ఆదినారాయణుండాయె నొక్కడు..." మొదలైనవి మహోపనిషత్తులోని యీ ఉక్తికి అనువాదం: "ఏకో హ వై నారాయణ ఆసీన్న బ్రహ్మా నేశానో నాపో న్నాగ్నీషోమౌ నేమే ద్యావా పృథివీ న నక్షత్రాణి న సూర్యో న చంద్రమాః". అలాగే ఛాందోగ్యోపనిషత్తులో "త దైక్షత బహు స్యాం ప్రజాయేయేతి..." అనే వాక్యం - "లీల ఏకాకిత చనదు పెక్కయ్యెదననుచు..." అన్నదానికి మూలం.
మనకి ఉపనిషత్తులలో మొత్తం 32 బ్రహ్మవిద్యలు ఉన్నట్టుగా పండితులు గుర్తించారు. అందులో అంతరాదిత్య విద్య ఒకటి. బ్రహ్మవిద్య అంటే పరబ్రహ్మమును తెలుసుకొనే మార్గాన్ని బోధించేది. అది అంత సులభ వంటబట్టే విద్య కాదు. అందుకే "అదొక బ్రహ్మవిద్యా!" అన్న నానుడి వచ్చింది (ఇంగ్లీషులో It is not a rocket science అన్నట్టుగా). "యెయేషో అంతరాదిత్యే హిరణ్మయ పురుషాః" అని ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నది అంతరాదిత్య విధ్య. సూర్యమండల మధ్యంలో హిరణ్మయ (బంగారపు కాంతులతో ప్రకాశించే) పురుషుడిని ఉపాసించే విద్య యిది. ఆ పురుషుని గురించి వివరిస్తూ, "తస్య యదా కప్యాసం ఏవమక్షిణి" అని ఆ ఉపనిషత్తు చెపుతుంది. అంటే, సూర్యునిచేత అప్పుడే వికసింపబడిన పద్మాల వంటి నేత్రద్వయం కలిగినవాడు అని.

ఇంకా అనేక వేదోపనిషత్ వాక్యాల ఆధారంగా సర్వమునకు పరమాత్మ శ్రీమన్నారాయణుడే అని నిరూపించాడు విష్ణుచిత్తుడు. అంతే కాదు, బ్రహ్మరుద్రాదులు ఆయా సమయాలలో కొన్ని ప్రయోజనాల కోసం శ్రీమన్నారాయణుడు ధరించిన రూపాలే కనుక ధర్మార్థకామాలని కోరే వారు తప్ప, మోక్షం కావాలనుకున్న వారికి వారినారాధించటం కర్తవ్యం కాదని నిర్ధారణ చేసాడు. ముముక్షువు (ముక్తిని ఆకాంక్షించేవాడు) పరమాత్ముడైన పుండరీకాక్షుని ఆశ్రయించక తప్పదని తేల్చి చెప్పాడు.

ఇలా విశిష్టాద్వైతాన్ని స్థాపించిన అనంతరం, ఆ పరమాత్మ అయిన నారాయణుని ఎలా తెలుసుకోవడమో తెలియజెప్పే ఖాండిక్య-కేశిధ్వజ సంవాదమనే కథని చెపుతున్నాను వినమని ఆ కథని చెప్పడం ప్రారంభించాడు విష్ణుచిత్తుడు.
ఖాండిక్య-కేశిధ్వజుల కథ తరువాతి టపాల్లో...

2 comments:

రవి said...

టైపోలున్నాయి. సరిదిద్దగలరు.
ఉదా:-
"చార్వాకులు రాజే ఈశ్వరుడని అంటుంది."

murthy said...

అత్యబ్దుతం, కృతజ్ఞాభివందనములు.

Related Posts Plugin for WordPress, Blogger...