తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Tuesday, May 17, 2011

విప్రుల సుభాషితాలు

క్రిందటి టపాలో వేసవి వర్ణన రుచి చూసాం. ఆ వేసవి తాపాన్ని ఇప్పుడు స్వయంగా అనుభవిస్తున్నాం! పగళ్ళు పొడుగైపోయాయి. బావుల్లో నీళ్ళు అడుగంటుతున్నాయి. నేలంతా అట్టుడికినట్టు ఉడుకుతోంది.

అప్పెను వేసవి విభవము
విప్పుగ దన్నగర నికట వృషగిరిహరికిం
దెప్ప తిరునాళ్ళు రా, ముద
మొప్పన్ పరదేశి విప్రుడొక్కడు భక్తిన్


మధురానగరానికి సమీపంలో వృషగిరి అనే విష్ణు క్షేత్రం ఒకటి ఉంది. అలా పెను వేసవి ఎసరేగిన రోజుల్లో ఆ ఆలయానికి తెప్ప తిరునాళ్ళ ఉత్సవం వచ్చింది. ఆ ఉత్సవాన్ని చూడడానికి ఒక పరదేశ బ్రాహ్మణుడు వచ్చాడు. ఉత్సవాన్ని తిలకించి, స్వామిని సేవించి, తిరిగి వెళుతూ, దగ్గరగానే ఉంది కాబట్టి, మధురానగర వైభవాన్ని చూడాలని అక్కడకు వెళ్ళాడు. నగరమంతా తిరిగి సాయంకాలం వైగై నదిలో సంధ్యావందనం చేసుకొని రాజుగారి పురోహితుని ఇంటికి ఆతిథిగా వెళ్ళాడు. అక్కడి భోజనవైభవం ఎలా ఉందంటే:

పరిపక్వ సురభి రంభా ఫలంబులతోడ,
దళమెక్కు పనస పెందొలలతోడ,
ఘృతపిండ నిభ కర్కరీ ఖండములతోడ,
బలుదెఱంగుల మావిపండ్లతోడ,
గోస్తనీ మృదు గుళుచ్ఛ స్తోమములతోడ,
గప్పు లేఱిన వడప్రప్పుతోడ,
సుమధుర స్థూల దాడిమబీజముల తోడ,
దనుపారు రసదాడి గనెలతోడ,

బానకంబతిథుల కిడ్డ, దాను గ్రోలి
యర్చనాదత్త చందన చర్చ దేలి,
విరులు సిగ దాల్చి కర్పూర వీటి జౌరు
కొట్టుచు ద్విజుండు వెన్నెల బిట్టుగాయ



(ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)


బాగా మగ్గిన కర్పూర చక్కరికేళి అరటిపళ్ళు, బలిసిన పనసపండ్ల తొనలు, నేతిముద్దల్లాగా ఉన్న పందిరి దోసకాయముక్కలు, రకరకాల మామిడిపండ్లు, మెత్తని ద్రాక్ష గుత్తులు, పొట్టు ఏఱి కడిగిన వడపప్పు, తియ్యని బలిసిన దానిమ్మగింజలు, రసదాడి అనే అరటిముక్కలు, చల్లని పానకం - వీటితో కూడిన ఫలాహారం! అన్నీ వేసవికాలానికి తగిన పదార్థాలే. ఆ ఫలాహారం తీసుకున్న తర్వాత, ఆ పరదేశ బ్రాహ్మణుడు, గృహస్థు ఇచ్చిన మంచి గంధాన్ని వంటికి పూసుకొని, కొప్పులో పూలు పెట్టుకొని(అవును పూర్వకాలంలో పురుషులుకూడా కొప్పులో పువ్వులు పెట్టుకొనేవారు!), కర్పూరతాంబూలాన్ని చక్కగా నములుతూ, వెన్నెల పిండారబోసినట్లు కాస్తూ ఉంటే - ఏమి చేసాడో తర్వాతి పద్యంలో తెలుస్తుంది.


ఇలాంటి వర్ణనలు ఒకనాటి నాగరికతని మన కళ్ళముందుంచుతాయి. ప్రకృతికి మనిషి ఎంత దగ్గరగా జీచించేవాడో వీటినిబట్టి తెలుసుకోవచ్చు.


మాత్రసంచి తలాడగా, మార్గవేది
నొక్క డార్యలు, గీత లొండొకడు, దా సు
భాషితంబులుగా, దోడి బ్రాహ్మణౌఘ
ముబుసుపోకకు జదువ బరున్న వేళ

( పై పద్యం రవి స్వరంలో)

రాజపురోహితుని యింట అతిథులు చాలామందే ఉంటారు కదా. యీ పరదేశ విప్రునితో పాటు అలా వచ్చిన ఇతర బ్రాహ్మణులందరూ ఫలాహారాన్ని స్వీకరించి ఆరుబయట వెన్నెలలో ఆ యింటి అరుగుపై విశ్రాంతి తీసుకుంటున్నారు. మార్గవేది అంటే ఇంటిముందున్న వీథి అరుగు. ఈ కాలంలో అరుగులున్న యిళ్ళు చాలా అరుదైపోయాయి, కొన్నాళ్ళకి అవంటే ఏమిటో తెలియని పరిస్థితి రావచ్చు. ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులే ఉండేవి. వచ్చిన అతిథులు హాయిగా ఆ అరుగులమీదనే రాత్రి పడుకొనే వారు. మాత్రసంచి అంటే భుజానికి అటూ యిటూ వేలాడే మూటలతో ఉండే సంచి. దాన్ని తలగడగా పెట్టుకొని యీ పరదేశ విప్రుడు కూడా నడుం వాల్చాడు. వెంటనే నిద్రపట్టెయ్యదు కదా. అంచేత ఉబుసుపోకకి తమకి వచ్చిన శ్లోకాలు చదవడం మొదలుపెట్టారు. ఒకరేమో ఆర్యలు (ఆర్యా సంస్కృతంలో ఒక వృత్తం, తెలుగులో కందం లాంటిదే) చదువుతూ ఉంటే మరొకరు గీతలు (బహుశా వేదాంత గీతలు) పాడుతున్నారు. ఈ బ్రాహ్మణుడేమో సుభాషితాలు చదువుతున్నాడు.

అలాంటి సమయంలో రాజు మత్స్యధ్వజుడు చక్కగా శృంగారించుకొని భోగిని పొందుకై అదే మార్గాన వెళుతున్నాడు. వెళుతూ వెళుతూ యీ రాజపురోహితుని ఇంటి ముందు నుంచి వెళుతూ ఉంటే సరిగ్గా అదే సమయానికి ఆ పరదేశి విప్రుడు చదువుతున్న ఒక సుభాషితం రాజు చెవినబడింది. అంత బిగ్గరగా చదువుతున్నారన్న మాట! ఏమిటా సుభాషితమంటే:


వినియె, "నెలల్ చతుర్ద్వయిని వృష్టి దినాళికి, రాత్రికై దివం
బున, జరకై వయస్సునను, బూని పరంబున కిప్పుడుద్యమం
బనువుగ చేయగా వలయు" నంచు బురోహిత ధర్మ మాత్మ గీ
ల్కొన నల విప్రుడా ద్విజులలోన సుభాషితమున్ బఠింపగన్



(పై పద్యం లంక గిరిధర్ స్వరంలో)


చతుర్ ద్వయి అంటే నాలుగు రెళ్ళు ఎనిమిది. వృష్టి దినాళి అంటే వర్షపు రోజులు, వానాకాలం. అది నాలుగు నెలలు. వానరోజుల్లో పనులు పెద్దగా జరగవు (ప్రకృతి మీద ఎక్కువగా ఆధారపడే ఆ కాలంలో సంగతి యిది). కాబట్టి అప్పుడు కష్టపడకుండా జీవితం సాగాలంటే, మిగతా ఎనిమిది నెలలూ కష్టపడి ఆ నాలుగు నెలలకూ సరిపడా సరుకులు సమకూర్చుకోవాలి. అలాగే, రాత్రి పని చెయ్యం కదా, నిద్రపోతాం. అలా హాయిగా నిద్రపోగలగాలంటే, ఉదయం పని చెయ్యాలి. ఇక్కడ రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. హాయిగా నిద్రపోవాలంటే మానసిక ప్రశాంతత అవసరం. అంటే రేపటి గురించి ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేనంతగా ఆ రోజే సంపాదించుకోవాలి. రెండు, గాఢ నిద్ర కలగాలంటే శరీరం అలసి ఉండాలి. అలా అలసేట్టుగా పని చెయ్యాలి. శారీరిక మానసిక ప్రశాంతతలకి రెంటికీ పగలు పని చెయ్యడం అవసరమన్నమాట. అలాగే, ముసలితనంలో ఎక్కువ పరిశ్రమ చెయ్యలేం కదా. ఆ రోజులు హాయిగా గడిచిపోవాలంటే, వయసులో ఉన్నప్పుడే తగినంత గడించాలి. ఇక్కడ దాకా చెప్పి ఊరుకుంటే అది సుభాషితం అవ్వదు. భారతీయచింతన అక్కడితో ఆగిపోదు. మనకి కాలం ముసలితనంతోనో, మృత్యువుతోనో ఆగిపోదు. ఇహమొక్కటే ధ్యేయము కాదు. ఇహముతో పాటు పరముని (అంటే మనిషి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాతి పరిస్థితి) కూడా ఆలోచించమంటుంది. అలా పరములో కూడా సుఖపడేందుకు తగిన పరిశ్రమ బతికుండగానే, ఇహంలోనే చెయ్యాలి. ఇహలోకంలో ముందుచూపుతో చేసే కార్యాలని ముందుగా వర్ణించి, అదే విధంగా పరలోకాన్ని గురించి కూడా ముందుచూపుతో వ్యవహరించాలని చెప్పడం వల్ల సుభాషితం మనసుకి బాగా నాటుకుంటుంది. రాజు ఆత్మని హత్తుకుపోయింది. ఈ పద్యానికి మూలమైన సంస్కృత సుభాషిత శ్లోకం ఇది:


వర్షార్థ మష్టౌ ప్రయతేత మాసాన్, నిశార్ధ మర్థం దివసే యతేత
వార్థక్యహేతోర్వయసా నవేన, పరత్రహేతో రిహ జన్మనా చ


రాజేమో భోగిని యింటికి పోతున్నాడు. అతని దృష్టి భోగలగ్నమై ఉంది. సుభాషితమేమో మోక్షదృష్టిని బోధిస్తోంది. అలాంటి పరిస్థితిలో యీ శ్లోకం రాజు మనసులో నాటుకుంది అంటే ఆ రాజు హృదయం ఎంతో సుకుమారమైనదై ఉండాలన్న మాట. ఒక రోగిని, ముసలివాడిని, శవాన్ని చూసి సిద్ధార్థుడు సన్యసించాడంటే అతని హృదయం ఎంత సుకుమారమైనదో! అలానే యీ శ్లోకం వినగానే మత్స్యధ్వజుని మనసులో విరాక్తి భావం ఏర్పడింది. ఎలా ఏర్పడిందో యీ కింద పద్యంలో అద్భుతంగా వర్ణించాడు రాయలు:


విని, తద్గ్రంథార్థము నె
మ్మనమున నూహించి, తెలిసి, మ్రాన్ పడి, కడకుం
దన మోసమునకు భయపడి,
జనపతి యటు చనక నిలిచి, సంతాపమునన్



( పై పద్యం రవి స్వరంలో)

ఆ సుభాషితాన్ని రాజు విన్నాడు. విని దాని అర్థాన్ని ఒకసారి మనసులో భావించాడు. భావించి తెలుసుకున్నాడు. తెలుసుకొని మ్రాన్ పడి పోయాడు! ఒక్క క్షణ కాలంలో, ఒక సుడి తిరిగినట్లు, ఒక మెరుపు మెరిసినట్లు, జరిగిన హఠాత్పరిణామాన్ని, అంతే వేగంగా చిన్న చిన్న పదాలతో కందంలో కదనుతొక్కించాడు రాయలు. చివరికి మత్స్యధ్వజుడు తనని తాను చేసుకుంటున్న ఆత్మవంచనకి భయపడి, ఇక ముందుకి సాగక, ఆవేదనతో అక్కడే నిలబడిపోయాడు. ఏమిటి తనకి తాను చేసుకుంటున్న మోసము? అది తర్వాతి పద్యాలలో సాగే అతని ఆలోచనాపరంపర ద్వారా తెలుస్తుంది.


ఎక్కడి రాజ్యవైభవము? లెక్కడి భోగము? లేటి సంభ్రమం?
బక్కట! బుద్బుద ప్రతిమమైన శరీరము నమ్మి మోక్షపుం
జక్కి గణింపకుంటి; యుగసంధుల నిల్చియు గాలు చేతి బల్
త్రొక్కుల నమ్మనుప్రభృతులున్ దుద రూపఱకుండ నేర్చిరే!



( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)

అయ్యో! ఈ రాజ్యవైభవాలేమిటి? ఈ భోగాలేమిటి? వీటికోసం ఇంత ఆరాటమేమిటి? ఇదంతా నీటి బుడగలాంటి శరీరం కోసమే కదా! యుగాంతాల దాకా, రెండు యుగాల మధ్యన కూడా బతికిన మనువులాంటి వారు కూడా యముని దెబ్బకు రూపురేఖలు లేకుండా పోయారే!


ఉన్నట్లయుండు నద్దరి
కిన్నరులను నావ చేర్చు క్రియ వెసదా బో
కున్నట్ల యుండి కాలం
బున్నరులకు వయసుబుచ్చి మోసము దెచ్చున్

( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)

కూర్చున్నవాళ్ళని కూర్చున్నట్లే ప్రయాణీకులని, పడవ, ఇవతలి ఒడ్డునుండి అవతలి ఒడ్డుకి తీసుకుపోతుంది. ప్రయాణికులు కష్టపడి ఈదడమంటూ ఉండదు కదా. అలాగే, కాలం కూడా కదులుతున్నట్లు తెలియకుండానే వయసుని దాటించి (బాల్యం, యౌవనం, వార్థక్యం యివన్నిటినీ దాటించి) చివరికి మోసంతో, మృత్యువు దగ్గరకి తీసుకుపోతుంది. కాలాన్ని నది దాటించే పడవతో పోల్చడం ఒక అద్భుతమైన భావం. కదిలేది మనం కాదు పడవ. అలానే కాలం కూడా. దీని గమ్యం మృత్యువే!

సగరు, నలుం, బురూరవు, ద్రిశంకుసుతున్, బురుకుత్సు, గార్తవీ
ర్యు, గయు, బృథుం, భగీరథు, సుహోత్రు, శిబిం, భరతుం, దిలీపునిన్,
భృగుకులు, యౌవనాశ్వు, శశిబిందు, ననంగుని, నంబరీషు, బూ
రుగురుని, రంతి, రాఘవు, మరుత్తుని గాలము కోలుపుచ్చదే

( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)

ఎందెరెందరు రాజులనీ చక్రవర్తులనీ కాలం తీసుకువెళ్ళిపోలేదు! సగరుడు, నలుడు, పురూరవుడు, త్రిశంకుసుతుడైన హరిశ్చంద్రుడు, పురుకుత్సుడు, కార్తవీర్యుడు, గయుడు, పృథువు, భగీరథుడు, సుహోత్రుడు, శిబి, భరతుడు, దిలీపుడు, భృగుకులుడైన పరశురాముడు, యువనాశ్వుని పుత్రుడైన మాంధాత, శశిబిందుడు, అనంగుడు, అంబరీషుడు, పూరుని తండ్రయిన యయాతి, రంతిదేవుడు, శ్రీరాముడు, మరుత్తుడు - ఈ పద్యంలో మత్స్యధ్వజుడు పేర్కొన్న రాజులందరూ ఎంతో పేరున్న గొప్ప చక్రవర్తులు.

సగరుడు, కార్తవీర్యుడు, హరిశ్చంద్రుడు, నలుడు, పురూరవుడు, పురుకుత్సుడు - వీళ్ళని షట్చక్రవర్తులంటారు. గయుడు, అంబరీషుడు. శశిబిందుడు, అనంగుడు, పృథుచక్రవర్తి, మరుత్తుడు, భరతుడు, సుహోత్రుడు, దిలీపుడు, రాముడు, నృగుడు, రంతిదేవుడు, యయాతి, మాంధాత, భగీరథుడు - ఈ పదహారుగురు షోడశ మహారాజులు. అలాంటి మహారాజులు, చక్రవర్తులే కాలగతిలో కలిసిపోయారు!


వర్గత్రయ పరత ముహు
స్స్వర్గక్ష్మా మధ్యమాధ్వ జాంఘాలికతా
దుర్గతియు నొల్ల, మఱి యప
వర్గదు డేవేల్పెఱింగి వాని భజింతున్



( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)

ధర్మ అర్థ కామములన్న త్రివర్గమే ప్రధానంగా జీవితాన్ని సాగిస్తూ వచ్చాను. దీనివల్ల స్వర్గానికి పోయి తిరిగి భూమిమీద పుట్టి - ఇలా భూ స్వర్గాల మధ్య మార్గంలో మాటిమాటికీ పిక్కబలం కొద్దీ పరుగులుపెట్టే దుస్థితి నాకింక వద్దు. నాలుగోదయిన మోక్షాన్ని ప్రసాదించే దేవుడు ఎవరో తెలుసుకొని, అతడిని సేవిస్తాను.


"మధ్యమాధ్వ" - మధ్య త్రోవ. అధ్వము అంటే మార్గం అని అర్థం. అధ్వాన్నము అన్న పదం చాలామందికి తెలిసే ఉంటుంది. ఏదైనా బాగులేకపోతే, అధ్వాన్నంగా ఉంది అంటాం. దీని అర్థం అధ్వ+అన్నం - అంటే త్రోవలో తినే అన్నం అని! ప్రయాణంలో భోజన సౌఖ్యం ఉండదు కదా. ఏది దొరికితే అది, లేదా ఏది పట్టుకు వెళ్ళగలిస్తే అది ఎదో ఒకటి, ఎక్కడో అక్కడ కతకడమే కదా. అలాంటి సుష్టుదనం లేని పరిస్థితికి అధ్వాన్నం అనే పదం వాడుకలోకి వచ్చింది. "జంఘలు" అంటే పిక్కలు. జాంఘాలికత అంటే పిక్కబలం.


ధర్మ, అర్థ, కామ, మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు. అందులో మొదటి మూడిటి మీదనే దృష్టి ఉన్న మానవుడు ముక్తిపొందలేడు. ఎంత ధర్మబద్ధంగా జీవితాన్ని గడిపినా, అది పుణ్యాన్ని మాత్రమే ఇస్తుంది, ముక్తిని కాదన్నమాట. ఆ పుణ్యం స్వర్గ ప్రాప్తి కలిగిస్తుంది. చేసుకున్న పుణ్యం అయిపోగానే మళ్ళీ భూమ్మీద జన్మించడమే. నాల్గవ పురుషార్థమైన మోక్షమ్మీద దృష్టి పెట్టినప్పుడే యీ చావుపుట్టుకల చక్రం నుండి ముక్తి లభిస్తుంది. ఇది సనాతన భారతీయ చింతన.

సుభాషితం వినగానే మత్స్యధ్వజునిలో ఇంతటి వైరాగ్యం కలిగింది! అప్పుడా సుభాషితం చదివి తనకి జ్ఞానోదయం కలిగించిన ఆ బ్రాహ్మణుడికి తాంబూలముతో కూడిన దక్షిణ యిప్పించి తన అంతఃపురానికి తిరిగి వెళిపోయాడు. ఆ తర్వాత కొలువు తీర్చి, మహామహా పండితులనందరినీ రప్పించి, మీ మీ శాస్త్రాలలో మోక్షప్రదాత అయిన భగవంతుడు ఎవరో తేల్చి చెప్పండి అని చర్చ మొదలుపెట్టాడు. అంతే కాదు:

వాద మొనరించి గెలిచి తత్త్వంబు దెలుపు
వాని కని బీరపువ్వుల బోని టంక
సాల వాటులు నించి యాస్థాని గట్ట
గాల సర్పము గతి వ్రేలు జాలె జూచి



(పై పద్యం లంక గిరిధర్ స్వరంలో)


వివాదంలో ఎవడైతే గెలిచి తత్త్వ స్థాపన చేస్తాడో ఆ పండితుని కోసమని బీరపువ్వుల్లాంటి పచ్చని బంగారు నాణేలను నింపిన ఒక వలసంచిని ఆస్థానంలో వేలాడదీసాడట! వలసంచి అంటే వలలాగా చిన్నచిన్న కన్నాలున్న సంచి. అందులోంచి బంగారునాణేలు చక్కగా కనిపిస్తున్నాయి. కన్నాలలోంచి నాణేలు బంగారపు రంగు గడులుగడులుగా కనిపిస్తున్నాయి. పైగా ఆ నాణేల బరువుకి ఆ సంచి బహుశా సాగికూడా ఉంటుంది. దానితో అది ఒక కాలసర్పంలా కనిపించిందట! పైగా వాళ్ళని భయపెడుతోంది కూడా నన్నమాట. అదేమిటి బంగారు నాణేల సంచి భయపెట్టడమేమిటి? అంటే, మహామహా పండితుల మనసులోనూ ఆశ రేపి, వాళ్ళని అవమానాల పాలు చేస్తుంది కాబట్టి. వాదనలో ఓడిపోతే అవమానమే కదా. ఇలా బాహ్య రూపంలో కనిపించే పోలికతో పాటుగా వాటి స్వభావంలోని పోలికని కూడా ధ్వనించడం గొప్ప విషయం!


అలాగే, బంగారు నాణేలని బీరపువ్వులతో పోల్చడం బహుశా రాయలు తప్ప వేరే ఏ కవి చెయ్యలేడేమో! రాయలకి ప్రకృతి అంటే అంత మమేకం. పైగా బీరపువ్వులతో పోల్చడంలో మరో విశేషముంది. బీరపువ్వులు పచ్చగా ఉంటాయి. మేలిమి బంగారమే (రాగి కలపనిది) అంత పచ్చగా ఉంటుంది. ఆ నాణెములు మేలిమి బంగారువి అన్న విషయాన్ని యీ పోలిక ధ్వనిస్తోంది.
ఇంతకీ ఏ భగవంతుడు ముక్తిని ఇస్తాడన్న సందేహం హాస్యాస్పదంగా తోచవచ్చు. ఏ దేవుడైనా ముక్తిని యిస్తాడు కదా అని అనుకోవచ్చు. దానికంత చర్చ దేనికి అని కూడా అనిపించవచ్చు. నిజమే. కాని ఇక్కడ రాజు పరిస్థితిని మనం గమనించాలి. రాజు ప్రత్యేకంగా ఒక పరమ భక్తుడు కాడు. అసలు అప్పటి వరకూ ముక్తి మీద ధ్యాసే లేదు. మనలో చాలామంది దేవుళ్ళని పూజిస్తూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. కాని ఎంతమందిమి ముక్తికోసం ఆ పని చేస్తాం? ఏదో సాంసారికమైన కష్టాలని దాటాలనో, లేదా ఇహలోక కోర్కెలను తీర్చుకోవాలనో దైవ ప్రార్థనలు, పూజలు చేస్తాము. ఆ రాజు కూడా అప్పటిదాకా అలాగే చేస్తూ వచ్చాడు. కాని ఇప్పుడు హఠాత్తుగా ముక్తి మీదకి దృష్టి మళ్ళింది. అసలు ముక్తి పొందే మార్గమేమిటో కూడా అతనికి తెలియదు. ముక్తికోసం ఏదైనా దైవాన్ని కొలవాలన్నా ఆ దైవం మీద గురి కుదరాలి. ముక్తికోసం ఆ దైవాన్ని కొలిచే విధానం తెలిసి ఉండాలి. అదిగో అది తెలుసుకోడానికే ఆ చర్చ. ఆ చర్చ ద్వారా తనకి ముక్తి గురించిన విషయ పరిజ్ఞానం కలుగుతుంది. ఆ చర్చ ద్వారా తనకి ఒక దైవమ్మీద గురి కుదరాలి. ఆ దైవాన్ని అర్చించే విధానం తెలియాలి. అది రాజు ఆశయం.


సరే పండితులు చాలామంది వచ్చి చర్చ జరిపారు. వారివారి మతానుసారంగా రకరకాల దేవతలని ప్రతిపాదించారు. వైదికసంప్రదాయం నుండి పుట్టిన ఆరు మతాలు పూర్వకాలంలో బాగా వ్యాప్తిలో ఉండేవి. ఒకొక్క మతము ఒకో దైవ స్వరూపాన్ని అర్చిస్తుంది. అవి శైవము (శివుడు), వైష్ణవము (విష్ణువు), శాక్తము (శక్తి), స్కాందము (స్కందుడు అంటే కుమారస్వామి), గాణాపత్యము (గణపతి), సౌరము (సూర్యుడు). ఆ షణ్మతముల వారు వారి వారి దేవతలని ప్రతిపాదించారు. వీరు కాక కొంతమంది అగ్నిని, కొంతమంది చంద్రుడిని, మరికొంతమంది బ్రహ్మని కూడా ప్రతిపాదించారు. అయితే వాదనలు చేసారే కాని ఎవ్వరూ ఏదీ తేల్చి చెప్పలేకపోయారు. కేవలం పండితులైన వారు చర్చ జరపగలరే కాని, మోక్ష తత్త్వాన్ని ఎలా స్థాపించగలరు? ముక్తి మార్గాన్ని ఆశ్రయించిన ఒక పరమ భక్తుడికే అది సాధ్యమవుతుంది. అందుకే దానికి విష్ణుచిత్తుడు అవసరమయ్యాడు. అదెలా జరిగిందో ఆ వివరాలు వచ్చే టపాలో తెలుసుకుందాం.

8 comments:

KK said...

Some scholars should translate these into English and make them reach to the wider audience.

Andhra said...

ఈ సుభాషితాలనందించిన వారందరి కృషికి, మన "ఆంధ్రా ప్రోఫెషనల్స్" వారినుంచి శుభాభినందనలు

Rajesh Devabhaktuni said...

Dear KK

This Masterpiece is already translated to English, Please visit the following link for more details.

http://www.hindu.com/br/2010/06/22/stories/2010062254261500.htm

కాని ఏ లిపిలో వ్రాసిన దానిని ఆ లిపిలోనే చక్కగా ఆస్వాదించగలుగుతాము....!

జ్యోతి said...

అందరికి ధన్యవాదాలు.
రాజేష్ గారు, మంచి కావ్యాలు, గ్రంధాలు అన్ని భాషల్లో ఉండడం మంచిదే కదండి. చిన్న చిన్న వ్యాసాల్లా కాకుండా ఇక్కడ బ్లాగులో ఇచ్చినట్టుగా ఇంగ్లీషులో ఉంటే బావుంటుంది అని కెకెగారు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చాలామందికి తెలుగు మాట్లాడడం వచ్చినా చదవడం రాదు. చదవడం వచ్చినా రాయడం రాదు. అందుకే ఇంగ్లీషు మీద ఆధారపడుతున్నారు..

Rajesh Devabhaktuni said...

జ్యోతి గారు

మీరన్నది నిజమే, గొప్ప గొప్ప కావ్యాలు వేరే బాషలలో ఉండడం మంచిదే. కాని నేను అనేదేంటంటే తెలుగులో ఉన్న భావాన్ని ఉన్నది ఉన్నట్లుగా తర్జుమా చేయలేమేమో అని నా ఉద్దేశం. ఆముక్తమాల్యద తెలుగులో వ్రాయబడినది కనుక తెలుగులో చదివితే కలిగే రసానుభూతి, తర్జుమా జరిగిన బాషలలో చదివితే కలగకపోవచ్చని నా ఉద్దేశం.

జ్యోతి said...

రాజేష్ గారు ఎందుకు కలగదు.. అది అనువాదకుల పద విన్యాసం మీద ఆధారపడి ఉంటుంది.

కొత్త పాళీ said...

@KK, an English version of one chapter of Amukta Malyada is available here
http://telpoettrans.blogspot.com/2006/11/amukta-malyada-story-begins-thus-sri.html

gp said...

The anuktamalyada, an ever referrable life science. Prakash, Pschologist, India +919299 1066 25

Related Posts Plugin for WordPress, Blogger...