తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Monday, September 20, 2010

ప్రథమాశ్వాసం - సింహావలోకనం

ఆముక్తమాల్యద మొదటి ఆశ్వాసం పూర్తయ్యింది. దాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకొని అందులో విశేషాలని చెప్పుకోడానికి ఈ టపా.

ఇంతకు ముందు టపాల్లో చెప్పుకున్నట్టుగా, ఆముక్తమాల్యద శ్రీవైష్ణవ మత వైశిష్ట్యాన్ని వర్ణించే తెలుగు కావ్యం. శ్రీవైష్ణవం ప్రధానంగా దక్షిణ దేశంలో వ్యాప్తి పొందింది. తమిళ దేశంలో ఆళ్వారుల భక్తి రచనలు వీటికి మూలమని చెప్పుకోవచ్చు. వాటి ఆధారంగా నాదముని ప్రారంభించిన శ్రీవైష్ణవ సంప్రదాయం, శ్రీరామానుజాచార్యుల చేత తాత్త్విక భూమికని ఏర్పరుచుకొని బాగా ప్రచారం పొందింది. పరమ వైష్ణవుడైన శ్రీకృష్ణదేవరాయలు పెరియాళ్వార్ గా పేరుపొందిన విష్ణుచిత్తుడు, ఆండాళ్ గా ప్రసిద్ధి చెందిన గోదాదేవి కథలని ఆముక్తమాల్యద కావ్యంగా నిర్మించాడు. దీనికి ప్రేరణ శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు తన కలలోకి వచ్చి ఇచ్చిన ఆదేశమని చెప్పాడు. ఇది నిజమా కల్పనా అన్న సంగతి పక్కన పెడితే, ఇందులో ఒక చక్కని ఔచిత్యం ఉంది. ఆముక్తమాల్యద కథలో కూడా విష్ణుచిత్తుని కలలో విష్ణుమూర్తి కనపడి అతను చెయ్యవలసిన కార్యాన్ని ఉపదేశిస్తాడు. దాన్ని అవతారికలోనే తన స్వప్న వృత్తాంతంతో సూచించాడు రాయలు.

వైష్ణవ సంప్రదాయంలో విష్ణువుని భరించే ఆదిశేషునికీ, అతనికి వాహనమైన గరుత్మంతుడికీ, సేనానాయకుడైన విష్వక్సేనుడికి, విష్ణువు ఆయుధాలైన శంఖ, చక్ర, గద, ఖడ్గాలకీ అత్యంత ప్రాధాన్యం ఉంది. వాటిని కూడా విష్ణువు అంశగానే వైష్ణవలు కొలుస్తారు. ఆ సంప్రదాయాన్ని అనుసరించి రాయలవారు కూడా తన కావ్యాన్ని వాళ్ళందరినీ ప్రార్థిస్తూ, స్తుతిస్తూ ప్రారంభించాడు.

ఇంతకీ మొదటి ఆశ్వాసంలో జరిగిన కథ ఏమిటని చూస్తే, ఏమీ లేదు! విలిబుత్తూరు అనే ఊరుని వర్ణించాడు. ఆ ఊళ్ళో విష్ణుచిత్తుడనే విష్ణు భక్తుడున్నాడు. ఆ విష్ణుచిత్తుడిని వర్ణించాడు. అంతే, మొత్తం ఒక ఆశ్వాసమంతా ఇంతే! ఇది మనకి తెలుసున్న ఇతర కావ్యాలకన్నా చాలా తేడాగా కనిపిస్తుంది. ఇలా ఒక ఆశ్వాసమంతా వర్ణనలకే సరిపెట్టడానికి కారణం ఏమిటి? ఇది తెలియాలంటే ద్రవిడ ప్రబంధాలతో కొంత పరిచయం ఉండాలి. ఆళ్వారులు రచించిన ఈ గీతాలని దివ్య ప్రబంధాలు అంటారు (వీటినే పాశురాలనికూడా అంటారు). వీటిల్లో మనకి వర్ణనలు ఎక్కువగా కనిపిస్తాయి. విష్ణుమూర్తి రూపాన్ని వర్ణించడంతో పాటు, అతను వెలసి ఉన్న క్షేత్రాన్ని, ఆ ఊరిలో ప్రజలనీ, ప్రకృతినీ కూడా ఇవి వర్ణిస్తూ ఉంటాయి. ఆ దివ్య ప్రబంధాల సంప్రదాయమే మనకి ఆముక్తమాల్యదలో కూడా కనిపిస్తుంది. దీని వెనకనున్న తత్త్వం మనకి విశిష్టాద్వైతంలో కనిపిస్తుంది. ఇందులో సర్వ ప్రకృతీ పరమేశ్వరునికి శరీరంలాంటిది. అంచేత ప్రకృతిలో ప్రతి వస్తువునూ ఎంతో ఇష్టంతో ప్రీతితో భజించడం, ఆ విష్ణు భజన కిందనే లెక్క. అందుకే ఏ వర్ణన చూసినా అందులో చాలా వరకూ ఆ విష్ణు భక్తి తొంగిచూస్తూనే ఉంటుంది.

విలిబుత్తూరు నిజానికి ఒక పెద్ద పెల్లెటూరు అని చెప్పవచ్చు. అయినా అది పాండ్య రాజ్యానికి రత్నంగా మెరసిపోతూ ఉంది. ఆ ఊరిలో ప్రకృతి సహజ రమణీయంగా శోభిల్లుతోంది. ఆ ఊరిలో ద్రవిడాంగనలు నిత్యం దివ్యప్రబంధాలని పాడుకుంటూ అచ్యుతుని సేవలో నిమగ్నమయ్యుంటారు. వారింట లక్ష్మీదేవి నిత్యం కొలువై ఉంటుంది. ఆ ఊరిలో గుడిలో నాట్యం చేసే వేశ్యాంగనలు సైతం ఎంత గొప్ప అందగత్తెలో అంతకన్నా గొప్ప విష్ణుభక్తి పరాయణలు. ఆ ఊళ్ళో ఎటుచూసినా పచ్చని వరిమళ్ళు, విరగకాసే పళ్ళతోటలు. ఆ ఊరి అరటితోటలు ఆ విలిబుత్తూరులో వెలసిన మన్నారుస్వామికి వేసిన సంపెంగ మాలల్లాగా ఉన్నాయి. సాయంకాలపు వేళల ఎగిరే హంసల రెక్కల టపటపలూ వాటి క్రేంకారాలూ, మన్నారుస్వామి ఆలయంలోని దుందుభి కాహళ ధ్వనులని ప్రతిధ్వనిస్తున్నట్టున్నాయి. ఇలా ఒక పరమ రమణీయమైన వాతావరణం మన కళ్ళముందు చిత్రించాడు రాయలు. ఒకవైపు శృంగారం, మరొక వైపు భక్తి సమపాళ్ళల్లో ఉండే వర్ణనలు. ఇది రస నిర్వహణలో రాయలు చూపిన గొప్ప ఔచితి. ఈ కావ్యంలో ప్రధానమైనది గోదా కల్యాణ కథ. ఇందులో స్వయంగా ఆ శ్రీరంగనాథుడు నాయకుడు, గోదాదేవి నాయిక. గోదాదేవికి ఆ శ్రీహరిపై ఉన్నది మధురభక్తి. అంచేత ఇందులో ప్రధాన రసం శృంగారం. అయితే అది లౌకికమైన శృంగారం కాదు. అది భక్తితో కూడినది. ఆ రసానుభూతి పాఠకుల్లో కలిగించడానికే ఆ వర్ణనలు. "పొలయుం గాడ్పులు..." అనే పద్యం దీనికొక చక్కని ఉదాహరణ. ఆ పద్యంలో వీచే గాలులు మూడు రకాల వాసనలని అలదుకున్నాయి. ఒకటి మన్నారుస్వామివారి తులసిమాలల సుగంధం. మరొకటి ఆ స్వామికి అర్పించిన నైవేద్యాల వాసన. మూడవది ఆ గుళ్ళో దేవదాసీల కొప్పులలో ఉన్న ఎర్రకలువల సౌరభం. ఈ మూడు రకాలైన వాసనలు తాపత్రయాన్ని పోగొడుతున్నాయట. ఆధిబౌతికం, ఆధిదైవికం, ఆధ్యాత్మికం - ఈ మూడూ తాప త్రయాలు, మూడు రకాలైన తాపాలు. దేవదాసీల కొప్పుల్లో పూలపరిమళం ఆధిభౌతిక తాపాన్ని, నైవేద్యపు ఘుమఘుమలు ఆధిదైవికమైన తాపాన్ని, తులసిమాలల సౌరభం ఆధ్యాత్మిక తాపాన్ని పోగొడుతున్నాయన్నమాట! ఇందులో కామం, అర్థం, మోక్షం సమ్మిళితమై ఉన్నాయి.

ఈ పద్యం వెంటనే వచ్చే మరొక పద్యం భక్తి శృంగారాలకి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. ఇది ఇంతకు ముందు టపాల్లో ఇవ్వని పద్యం.

మలయపుగాలి రేలు వనమాలి విమానపతాక ఘల్లుమం
చులియ బసిండి మువ్వగమి నొక్కొకమాటు గదల్ప, నుల్కి మి
న్నలము తదీయ హేమవరణాంచల చంపకశాఖలందు బ
క్షులు రొదసేయ, వేగెనని కూడుదురల్కలు దీఱి దంపతుల్

ఈ పద్యాన్ని గురించి గరికిపాటి నరసింహారావుగారు చక్కని వ్యాఖ్యానం చేసారు, ఆముక్తమాల్యదపై ప్రసంగాలలో. ఈ పద్యంలో రాత్రిపూట వీచే మలయపు గాలి, అంటే దక్షిణపు గాలిని వర్ణించాడు రాయలు. ఇది మెల్లిగా వీచి, మన్నారుస్వామి దేవాలయం ముందున్న విమానపతాకని (ధ్వజస్తంభానికి ఉన్న జెండా) తాకింది. ఆ తాకిడికి దానికి కట్టిన బంగారు మువ్వలు కదిలి ఘల్లుఘల్లు అన్న శబ్దం వచ్చింది. పక్కనే ఉన్న సంపెంగ చెట్ట్ల కొమ్మల గూళ్ళల్లో పడుకొని ఉన్న పక్షులు, ఆ శబ్దానికి ఉలికిపడి లేచి రొద చెయ్యడం మొదలుపెట్టాయి. పక్షులు చేసే ఆ కిలకిలలకు ఊళ్ళో పడుకొని ఉన్న దంపతులు అప్పుడే తెల్లవారిపోతోంది అనుకున్నారు. తెల్లవారుఝామునే కదా పక్షులు నిద్రలేచి గూళ్ళను విడిచి బయలుదేరతాయి! ఇంతకీ దంపతులేమో ఎందుకో చిన్న ప్రణయకలహం వచ్చి, అలకలతో విడిగా పడుకొని ఉన్నారు. ఈ పిట్టల రొదకి తెల్లవారిపోతోందనుకొని, తెల్లవారితే ఎవరికి వాళ్ళు తమతమ పనుల్లో మునిగిపోయి దూరమవుతారన్న సంగతి గుర్తుకువచ్చి, ఇప్పుడున్న సమయాన్ని హాయిగా గడపాలన్న దృష్టివచ్చి, ఇద్దరూ దగ్గరయ్యారట! అదీ పద్యం! ఇందులో మధురమైన శృంగారం ఉంది. భార్యాభర్తలు ప్రణయకలహంతో దూరమైతే వాళ్ళని ఒక తెమ్మెర ఎలా దగ్గరకు చేసిందో ఆ వర్ణన ఉంది. అయితే దానికి ముఖ్యంగా తోడ్పడింది ఎవరంటే స్వామివారి ఆలయ ధ్వజస్తంభం మీద ఉన్న చిరుగంటలు! అది ఇందులో గొప్పదనం. భారతీయ సంస్కృతిలో శృంగారానికి ఎంత పవిత్రత ఉందో ప్రాధాన్యం ఉందో ఈ పద్యం చెపుతుంది. స్వామివారి చిరుగంటల మ్రోత భక్తికీ మోక్షానికి ప్రతీక. దానికే ఎక్కువ ప్రాధాన్యం. అందుకే దాని వర్ణన పద్యంలో రెండు పాదాలకు పైగా ఆక్రమించుకొంది. దాన్ని అనుసరించే దంపతుల కలయిక శృంగారరస వ్యంజకం. భక్తి శృంగారాలు ఇలా ముడిపడ్డాయి!

రసనిర్వహణే కాదు, ప్రథమాశ్వాసంలో కావ్యంలోని ప్రధాన పాత్రలని కూడా ప్రవేశపెట్టారు రాయలవారు! "ఆ నిష్ఠానిధి గేహసీమ..." పద్యంలో, "నాగేంద్రశయాను పుణ్యకథ"ల ప్రస్తావన ఉంది కదా. నాగేంద్రశయనుడంటే స్వయంగా ఆ శేషతల్పశాయి అయిన శ్రీరంగనాథుడే కదా! అతడే మరి కథా నాయకుడు. ఆ వెంటనే "దివ్యప్రబంధాను సంధానధ్వానము" కూడా మనకి వినిపించారు. దివ్యప్రబంధాలలోకెల్లా పేరుపొందినది తిరుప్పావై. దాన్ని రచించినది ఆండాళ్, అంటే స్వయంగా గోదాదేవి. ఈ రకంగా నాయికా నాయకులని ధ్వనిపూర్వకంగా ప్రథమాశ్వాసంలోనే ప్రవేశపెట్టారు రాయలవారు. సరే విష్ణుచిత్తుడిని నేరుగానే ప్రవేశపెట్టారు. అతనిది కావ్యంలో చాలా ముఖ్యమైన పాత్ర కదా మరి. అందుకే అతని స్వభావాన్ని చాలా వివరంగా వర్ణించారు రాయలు. "ద్వయ" మంత్రానికి నిలయమైన ముఖపద్మం కలవాడు.
శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే
శ్రీమన్నారాయణాయ నమః

ఇది ద్వయ మంత్రం. పద్మమ్మీద ఎలా అయితే నిరంతరం ఝుమ్మనే తుమ్మెద నాదం వినిపిస్తుందో అలాగే ఆ ముఖమనే పద్మంనుండి నిరంతరం ఆ మంత్ర ధ్వని వస్తుందన్న మాట. ఆ నిరంతర ధ్యానం వలన అతను అద్వంద్వుడయ్యాడు. అంటే ద్వంద్వాలు (సుఖం-దుఃఖం, కోపం-మోహం, ఆశ-నిరాశ ఇలాంటివి) లేనివాడు. ఆశ్రాంత యోగ అందూబద్ధ మధుద్విషత్ ద్విరదుడు! నిత్యమూ యోగమనే సంకెలతో (అందూ అంటే పెద్ద గొలుసు లేదా సంకెల) మధుసూదనుడైన హరి అనే ఏనుగని కట్టేసిన వాడట ఆ విష్ణుచిత్తుడు. భక్తి అనే గొలుసుతో తన మనస్సనే చంచలమైన కోతిని కట్టెయ్యమని అంటారు ఆదిశంకరాచార్యులవారు. ఇక్కడ విష్ణుచిత్తుడు, యోగమనే గొలుసుతో విష్ణువనే ఏనుగుని కట్టేసాడని రాయలవారు వర్ణించారు! అందుకే ఆ విష్ణుచిత్తుడు సార్థకనామధేయుడయ్యాడు. పైగా, అతను వేదవేదాంగాలు ఉపనిషత్తులూ చదవకుండానే వాటి సారమైన జీవేశ్వరుల సంపూర్ణ జ్ఞానాన్ని పొందినవాడయ్యడు.

అలాంటి ఆ విష్ణుచిత్తుని చేత ఆ పరమాత్మ ఎలాంటి కార్యాలు సాధించబోతున్నాడో, ఆ కథా కమామీషు మనకి ముందుముందు ఆశ్వాసాలలో తెలుస్తుంది. రెండవ ఆశ్వాసం మధురానగర వర్ణనతో ప్రారంభమవుతుంది. ఫోకస్ విలిబుత్తూరు మీదనుంచి హఠాత్తుగా మధుర మీదకి వెళుతుందన్న మాట. ఆ మధుర వర్ణనకీ, విలిబుత్తూరు వర్ణనకి మధ్యనున్న తేడా పాఠకులు జాగ్రత్తగా గమనించాలి. అందుకే రాయలవారు అలా విలిబుత్తూరు, విష్ణుచిత్తుల వర్ణనల నుండి మధురానగరానికి ఫోకస్ మార్చింది. ఈ విష్ణుచిత్తునికీ ఆ మధుర నగరానికీ ఉన్న సంబంధమేమిటో ఆ తర్వాత కథలో మనకి స్పష్టమవుతుంది.

అంతవరకూ వేచి చూడండి! :-)

2 comments:

Srujana Ramanujan said...

హృద్యంగా గా ఉంది

Sanath Sripathi said...

ప్రథమాశ్వం పై సవివిరణాత్మక విశ్లేషణ చాలా రమ్యంగా ఉన్నది.

Related Posts Plugin for WordPress, Blogger...