తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Friday, July 27, 2012

విష్ణుచిత్తుని పురప్రవేశం



సాధారణంగా హరికథ చెపుతున్నప్పుడు భక్తులు నిద్రావస్థలోకి వెళుతూ ఉంటారు. కానీ యిక్కడ పరిస్థితి తారుమారయ్యింది! :-) దానితో మూడు నెలలు గడిచిపోయాయి. అంచేత ఒకసారి "శ్రీమద్రమారమణ గోవిందో హరి!". ఆఁ, కథ ఎంత దాకా వచ్చింది?  

విష్ణుచిత్తుడు పాండ్యరాజ సభలో పండితవాదనలో దిగ్విజయం పొంది, విశిష్టాద్వైత మతస్థాపన చేసి, రాజుని వైష్ణవుణ్ణి గావించి విల్లిపుత్తూరుకు తిరిగి బయలుదేరాడు. తోవలో అతనకి శ్రీ మహావిష్ణువు దర్శనమయ్యింది. అతని దివ్యమంగళ స్వరూపాన్ని చూసి పరవశంతో దశావతార స్తోత్రం చేసాడు విష్ణుచిత్తుడు. ఆ దివ్యమోహన సౌందర్యాన్ని చూస్తూ, విష్ణుచిత్తుని స్తోత్రాన్ని వింటూ మూడు నెలలు గడిచిపోయాయి. ప్రస్తుతంలోకి వస్తే...

అలా విష్ణుచిత్తుడు స్తుతించిన పిమ్మట, స్వామివారు దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి, "ఈ వెఱ్ఱి భక్తుడు తనకి పాండ్యరాజు సమర్పించిన ధనమంతా నా ఆలయాలకూ భక్తులకూ ధారపోసి మళ్ళీ ఏమీ లేనివాడవుతాడు. అంచేత నువ్వు విష్ణుచిత్తుని ఇంటిని రత్నరాశులతోనూ సంపదతోనూ నిండేట్లు చెయ్యి" అని ఆనతిచ్చి అంతర్థానమయ్యారు. విష్ణుచిత్తుడు తన తిరుగు ప్రయాణాన్ని కొనసాగించి తన ఊరు చేరాడు. మధురలో దిగ్విజయం చేసి వచ్చిన అతడిని చూడ్డానికి, స్వాగతించడానికి, ఉత్సాహాతిరేకంతో మేళతాళాలతో ఎదురు వచ్చారు ఆ ఊరి జనం. ఆ ఎదుర్కోలు సన్నాహాన్నీ సరంభాన్నీ ఒక అద్భుతమైన వచనంలో మన కళ్ళకుకట్టించారు రాయలవారు.

ఇట్లెదుర్కొని పట్టపవిత్ర భగవత్ప్రసాద తీర్థంబు లుపాయనంబులుగా బ్రణామంబు లాచరించి లేచి, ప్రాంజలులై, భర్మపరికర్మ వర్మితంబగు  బ్రహ్మరథంబున నబ్భాగవత వతంసంబు నునుచుకొనిపోవు సమయంబున, బరస్పర సమేతంబులగు పౌర జానపద జనంబులు గలసి మెలసి నడచునెడ; 
మృదంగం బుపాంగం బావజంబు దండె తాళం బురుమ కిన్నెర సన్నగాళె వీణ ముఖవీణె వాసెగ్రోలు డోలు మౌరి భేరి గౌరు గుమ్మెట తమ్మెటంబు డుక్క డక్కి చక్కి చుయ్యంకి లోనగు నసంఖ్యాక వాదిత్ర త్రితయ పరంపరలు మొరయన్; 
ఎడనెడ పడతుకలు మలపుగొన బట్టణాగత గజధట్ట ఘోట్టాణఘోట్టాక ఘంటా కదంబ ఘర్జరఘోషంబుల కనుప్రాసంబులై, విలాసినీ మంజు మంజీరంబు లెలుగియ్య నల్లనల్లం జాగుతఱిన్; 
కెలకులకుం గవచితకుథాకర్బరులగు కరివర కరేణు కంధరలం గనకాంకుశంబులు చేబూని సేవించి పోవు సామంతకుమార ధట్టంబులం బిట్టు గాంచి, యొండొరు గడవ సంభ్రమించుచు, మ్రొక్కి నిక్కి చేయెత్తి యోసరిల్లి యొత్తిల్లి నేత్రంబు లుత్తాన తరళ తారకంబులుగా మగిడి మగిడి పొగడుచుం బోవు తఱిన్; 
తద్రాజ కదంబకం బచ్చటి పడంతుకలకుం దమకుం బురికిం జనుదెంచునప్పుడెల్ల నెడకాండ్రగుట మేలమాడబోలు నా ప్రోలి మేళంపు గళావతుల వ్రేయు నెపంబున గ్రామగ్రామ గ్రామణులొసంగు నారంగ మాతులుంగ జంబీర కుంద కందుకాదులం బూర్వానుభుక్తలగు నక్తంకరముఖుల వైవ; 
ధళధళత్ తరళ తాటంకంబులును నంకురిత స్మితంబునుగా,  నాతన్ముఖ ప్రెంఖోళిత స్ఫీత సాకూత విభ్రమాకేకరాపాంగ విలోకనంబును, నాచలిత ధమ్మిల్లంబునుంగా, మొగంబులు తిగిచికొని సమ్మర్దంబునం జను మార్దంగికుల మూపుల మఱుంగుల డాగి యన్నాగవాసంబులు నాగరక విలోకనంబునం జెలరేగి, మొగంబులు బిగించుకొని, వేదఱెత్తిన గతి నరిదియెత్త బ్రతిపదంబును మర్దలముఖావమర్దనకు గురంగుటయు, బయలుపడి చేయునది లేక యాకడకు మగిడి తుఱుము దిద్దుచు, దద్వారణాభినయనవత్ పరాచీనకరాబ్జలై సుడివడు నెడం బొడము కర్ణకుసుమావతంస కపోలఖురళీ కించిచ్చలనోపలక్ష్య వైలక్ష్య హాసకుందంబులు సాంద్రతర చంద్రికాకదంబంబులం దీటు కొలుపన్; 
చాటూక్తి వాచాటలగు జరఠవనితలు తమకు మ్రొక్కం దారు మ్రొక్క కొక్కించుక యోరమోమిడి, వారి యిరుపక్కియల నొదిగి తొంటి యంటు దలంచి తలవాంచిన, వంచనం గటాక్షించి యెకసెక్కంబునకు దమచేత మ్రొక్కించుకొను వేడ్క నక్కడం బుడమిఱేడు లేమి సామాన్య మానవులం గైకొనక, సుమాళంబు వేద్యంబుగా విద్యావయోవృద్ధుల రగు మీరు మ్రొక్కం దారు మ్రొక్కమి యెట్లు మ్రొక్కింపుం డనుటయు; 
గ్రక్కునన్ బొడము మొలకనగవుల మోముదమ్ములకు వేఱొక్క వింతతెలివి యెక్క, మ్రొక్క కక్కడ గెడగూడి నడచు తోడి చేడియల కద్దొరలకు దమకు దద్దయుం బొందుగల దను పెద్దఱికం బెఱుకపఱుప గెమ్మోవులు మలంచి లోలోన నొయ్యనొయ్యన నుచుక్కన నక్కీలెఱింగి దక్కె పొమ్మని తమ్ము నమ్ముదుసళ్ళు ముందఱికి నూకి, యక్కక్క, మ్రొక్కవే మనపాలి వేలుపని బుజ్జగించియు బొమలుగొని జంకించియు నెట్టకేలకు నొడంబఱచినన్;
త్రపాతరళనయనలై విరళవిరళాంగుళాంజలి బంధంబుగా మ్రొక్కి, కక్కసాన నిట్లు మ్రొక్కించి, హెచ్చి, యచ్చయ్యాట మెడపడకయుండ జిగురుగుండెలువోలె నల్లుకొని గొల్లన నగు నల్లోలాంగనల గల్ల కోపంబునం గొట్టి కసరుజూప నబ్భూప సంఘంబుపై నిగుడ మగుడ మఱుపడు కొమిరె హరిణలోచనల చలిత కంకణసంకుల క్రేంకారంబు లాననామోద మేదురాళి ఝంకారంబుల బింకంబు లడంపన్; 
చెవుల సంకులు, లోనంక భుజంబులు, కొంకిసిగలు, గావి దుప్పటులు నొప్ప నిమ్ము దెప్పరంబై ముప్పున నప్పురంబు జేరి, రసికజనబాంధవంబున బంధుజనవియోగంబు మఱచి, గంధకలనా కుసుమగ్రథనాదులనాంధ్యంబులే కలరు నంధ్రదేశీయులగు గంధకారులు పాటిపాటి పద్యంపు మ్రొక్కులతో వెఱ్ఱివెఱ్ఱి కైవారంబులు గౌరుతత్తడులపై వచ్చు రాచవారిపై నాడువారిపై నాళువారిపై జల్లగా జల్ల, బెల్లెగసి సృష్టియెల్లను ముష్టీకరించుచు,  నస్పష్టభేదయగు పరిమళసమష్టిం బెట్టు పిష్టాతకంబు నభోమండలికిం జండాంతకంబై చండకర కిరణంబుల మాటుపఱుప, బన్నీరు నించిన తన్నీరుతిత్తులొత్త; 
వియత్తలంబునం బాఱి కైవ్రాలు ధారల వాద్యంబులు దడిసిన విద్యోపజీవులు పుష్కరంబులు గ్రాప నగ్గిరోయుచుండ;  నమ్మొత్త మత్తఱి నృత్తంబుజూడ నిలిచి మెత్తమెత్తన నడుచుచుండు మిండతండంబునుం దారు నప్పిండు పుండరీకాస్య లవకాశంబు గాంచి కాశకుసుమ ప్రతిఫలన పాండురంబులై పథ్యాతిహృద్యపార్శ్వద్వయోద్యాన పాదపంబులకుం బాఱు చెంగలువకాలువలకుం డిగ్గి, కాసరీదధిమండ మాసరంబులుగా బిసికి యారంబెట్టిన నారంగ శృంగబేర భంగంబులతో గట్టిన కలమాన్నంపు జలిది పోకపొత్తులం గుడువ గూర్చుండ వీక్షించి;
కుక్షింభరత్వంబున క్షుత్ క్షాములై తిరిగితిరిగి వేసారి యోసరిలిన దాసరిగుంపు వారిపాల గోపాలభిక్ష బిక్షించి భక్షింప దీరక్షోణుల నిలిపిన తోరంపు దివెదారికోలల రంధ్రగోళంబుల నుత్కీలంబులై మండు ధగధగని జగజ్జ్యోతి దీపజాలంబుల మధ్య ధూపకుండికాంగారముల నీరాఱ గ్రాచి, నాదు బరికింప వాయించు ధిమిధిమిధ్వానంబులకుం బెదరి యీవలి యుపవనశుకంబు లావలి కావలి యుపవనశుకంబు లీవలికి దట్టంబుగా గట్టనితోరణంబులై పఱవ, దలలు విసరుటయు నోరు దెఱచుటయు గేలి సఱచుటయు దక్క మిక్కుటంబగు నక్కోలాహలంబున నేపాటియుం బాట వినరాక మూకగట్టిన భాగవతజాతంబు లేతేరన్;
ఊరూరి సంతసంతకుం దిరుగ బెద్ద లింటింట సంతరించిన పిలుకువాటు గోడిగల జావడంబులకుం బుట్టి కాల్గట్టి విడువ నెత్తంబున మెత్తని గఱిక మేసి పోసరించి మాపునూపున మేపు సజ్జకవణంపు మేపున బిడుక గొఱసంబు తోమకంబున బుటపుటనై కఱియకంబడిపాత గనియైన నీడం గనియైన బెదరు కొదమతట్టువగుంపు కాలికొలందికి వ్రేలు లాలుకుంచెలు గీలించిన గవ్వదంటల గంటల నలంకరించి మోలుగుమడ్డిం గాచి తోచి మూర కొక్కడును జేన కొక్కండునుగా గుట్టిన డొల్లుటుల్లారు లుల్లసిల్లం బల్లించిన పల్లంబులపై జిల్లతైలంబును వాసన కొడుపులం బూసిన మణుంగు జంద్రికల చేలలే రవణంబులుగా నెదురుగా వేడుకం జూడవచ్చిన యవ్వీటి మేటి సాలె యగసాలె పటుసాలె వానె వైజాతి సాతు లేతులకొమరులు తుములమై వచ్చు తచ్చమూసామజంబులం జూచి యేచిన వెఱం దమ యెక్కిరింత లెక్కికొని వాగె లిరుగేలం గుదియంబట్టిన నిలువ కయ్యుత్సవం బీక్షింప వచ్చిన ప్రజలం ద్రొక్కుచుంబోవన్;
తన్మధ్య వృద్ధవధ్వాతురాదులు దిట్ట నిట్టట్టనలేక ప్రాణంబులు పిడికిటం బట్టుకొనిపోవుచు, నవీనసవిధకేదారంబుల ద్రెళ్ళి చట్టలు దిగంబడి వెడలలేకుండం దారు దిగ నిమ్ము లేక బిమ్మటగొని నలుదెసలం జూడం, జూచి కేలు సఱచి కోహోయని గేలిసేయు గణికాకదంబంబుల చప్పటులు నిబిడ నిష్కుట విటపి ఝాటంబులం బ్రతిశబ్దంబులు పుట్టింపన్;
ఇట్లనూన విభవంబు చిగురొత్త నత్తిరుపతి సొచ్చి యచ్చక్రధరు నగరి మోసల నిలచుటయు, నవ్విష్ణుచిత్తుండు దద్రధావతరణంబు చేసి, ధరణీధవస్థానిక సమూహంబు వెంటరా నవ్వైకుంఠు సేవించి, తత్ప్రసాద లబ్ధంబగు వరిపట్టంబున నలంకృతుడై, నానాలంకారసహితంబును రత్నకాంచనమయంబు నగు నాత్మీయ భవనంబు గాంచి విస్మితుండై పుండరీకాక్ష మహిమాభిలబ్ధ వైభవంబుగా దెలిసి, తత్రత్య ధాత్రీకళత్ర వర్గంబుల ననిపి, ప్రవేశించి, తొంటికంటె శతగుణంబులుగా భాగవతపూజా ప్రవణుండై యుండె నంత.


(ఆసక్తి ఉన్నవాళ్ళు, ఈ వచనాన్ని తప్పులు లేకుండా చదవడానికి ప్రయత్నించండి. అలా చదవగలిస్తే, దాన్ని మీరు రికార్డు చేసి పంపిస్తే, మేము పరిశీలించి, బాగున్నవాటిని యిక్కడ ప్రచురిస్తాం!)

విష్ణుచిత్తుని ఎదుర్కోలు సన్నాహం ఒక పెద్ద తిరనాళ్ళలాగ ఉంది. పల్లెటూళ్ళలో పండగలకి జరిగే తిరనాళ్ళను చూసిన వాళ్ళకి యిక్కడ రాయలవారు చిత్రించిన దృశ్యం కొంత పరిచయమైనదిగా తోస్తుంది. విల్లిపుత్తూరులోని మన్నారుస్వామి దేవాలయాధికారులు విష్ణుచిత్తునికి కానుకగా స్వామివారి తలకుచుట్టిన పట్టువస్త్రాన్ని సమర్పించి, ప్రసాద తీర్థాలను అందించి, అతనికి సాష్టాంగపడి లేచి పసిడి వన్నెలు దీర్చిన బ్రహ్మరథంలో కూర్చుండబెట్టి ఊరేగింపుగా ఊరిలోకి తీసుకువస్తున్నారు. ఊరి జనమంతా అతని వెంట కదలి వస్తున్నారు. ఆ సంబరంలో మృదంగం, తాళం, రుంజె, తుంబుర, కిన్నెర, కాహలి, డోలు, సన్నాయి, భేరి, బాకా, డప్పు, చక్కి మొదలైన ఎన్నో వాద్యాల ఘోష మిన్నుముట్టింది. మధ్యలో నాట్యకత్తెలు వెనుకకు తిరిగి (అంటే విష్ణుచిత్తునికి అభిముఖంగా) నాట్యం చేస్తూ వస్తున్నారు. మధురానగరం నుండి వచ్చిన ఏనుగుల, గుఱ్ఱాల మెడలకున్న గంటల గణగణలకు అనుగుణంగా ఆ నాట్యకత్తెల మంజు మంజీర నాదాలు రవళిస్తున్నాయి. విష్ణుచిత్తునికి యిరువైపులా రత్నకంబళ్ళతో శోభిస్తున్న ఏనుగులపై సామంత రాజకుమారులు తోడుగా వస్తున్నారు. అంతటి భక్తశిఖామణి ఊరేగింపులో ఒకవైపు భక్తిభావం రాజ్యమేలుతున్నా, యీ రసిక రాకుమారుల కారణంగా మరొకపక్క రక్తి కూడా చోటుచేసుకుంది. జనవాహినిలో అన్ని రసాలూ ఏకమై ప్రవహిస్తూ ఉంటాయి మరి! 
ఆ రాజకుమారులను చూడ్డానికి జనమంతా ఉవ్విళ్ళూరుతూ త్రొక్కిసలాడుకుంటున్నారు. అలా కనులు విప్పారి చూస్తున్న వారిలో ఆ ఊరి వేశ్యలుకూడా ఉన్నారు. ఏనుగుపైనుంచే వారిని గుర్తుపట్టారు రాకుమారులు. వారితో పూర్వమే చనువుంది. ఆ చనువుతో, తమ దగ్గరున్న నారింజ నిమ్మ మొదలైన పళ్ళనూ, మొల్లలు బంతులు మొదలైన పూలనూ (ఇవి తోవలో వచ్చే ఊళ్ళ గ్రామాధికారులు వాళ్ళకి యిచ్చినవి) ఆ సుందరాంగుల పైకి వెయ్యసాగారు (ఇప్పుడు తెలిసిందా దర్శకేంద్రునికి స్ఫూర్తి ఎక్కడనుండి వచ్చిందో! :-)). వాళ్ళ సరసానికి చిరునవ్వులు చిందిస్తూ, ఓర కళ్ళతో వారిని గమనిస్తూ, ఆ పళ్ళూ పూలనుండి తప్పించుకోడానికి మార్దంగికుల (అంటే మృదంగం వాయించేవాళ్ళు) వెనక్కి వెళ్ళి దాంకుంటున్నారా చంచలాక్షులు. అయితే మృదంగం వాయించేవాళ్ళు యిటూ అటూ కదులుతునే ఉంటారు కదా. అంచేత ఆ కదలికల్లో వాళ్ళకి చాటు కాస్తా పోతున్నాది. ఇక చేసేది లేక చాటునుండి బయటకు వచ్చి, తమ కొప్పులు సవరించుకొంటూ, ఫలపుష్పాలకు చేతులడ్డు పెట్టుకుంటూ సింగారంగా నడుచుకు వెళుతున్నారు. వారి చెక్కిళ్ళలో పూలకాంతులు ప్రతిఫలించాయి. వారి చిరునవ్వులు మొల్లలు పూచినట్లున్నాయి. వెన్నెల కాంతులతో పోటీపడుతున్నాయి. ఆ జనసందోహంలో ముసలి వారకాంతలు కూడా ఉన్నారు. వాళ్ళు రాజకుమారులకి నమస్కరిస్తున్నారు. నడుస్తున్న పడుచు కాంతలు మాత్రం ఆ పని చెయ్యక బిడియంగా యిప్పుడీ ముసలి స్త్రీల చాటుకు వెళ్ళారు. రాజకుమారుల సరసానికి మరొక సందర్భం దొరికింది. ఆ పడుచుకాంతల వైపు దొంగచూపులు చూస్తూ, ముసలి స్త్రీలతో బిగ్గరగా, "పెద్దవారైన మీరే నమస్కరించారు కాని ఆ యువతులా పని చెయ్యలేదు. వారి చేత కూడా మ్రొక్కించం"డని అన్నారు. పక్కన మహారాజుగారు లేరు కాబట్టి ఆ సామంత రాకుమారులకిలా తమని మ్రొక్కమని అడిగే ధైర్యం వచ్చిందట! రాయలవారి రాజసం, సామంతులు వారికెంతగా ఒదిగి ఉండేవారో, మనకిక్కడ కనిపిస్తుంది. వాళ్ళ మాటలకి యువతులు మళ్ళీ చిరునవ్వు చిందించి, ఆ రాకుమారులతో తమకున్న సంబంధాన్ని చెలికత్తెలతో గొప్పగా చెప్పారు. ఇంకేముంది, ఆ ముసలిస్త్రీలకు అసలు విషయం అర్థమయ్యింది. ఆ యువతులను ముందుకి తోసి, రాకుమారులకు నమస్కరించమని తొందర పెట్టారు. బలవంతాన ఎడమెడంగా ఉన్న వేళ్ళతో నమస్కారం పెట్టారు వాళ్ళు. అది చూసి గొల్లున నవ్వారు వృద్ధస్త్రీలు. అప్పుడు తెచ్చిపెట్టుకున్న కోపంతో ఆ యువతులు రాకుమారులను ఎఱ్ఱెఱ్ఱగా చూస్తూ మళ్ళీ ముసలిస్త్రీల చాటుకు వెళ్ళారు.
ఇదీ సామంత రాకుమారులకూ, ఆ ఊరి వారాంగనలకు మధ్య జరిగిన సయ్యాట. ఆ సమూహంలో ఇంకా ఎవరెవరున్నారంటే, ఎక్కడో ఆంధ్రదేశం నుండి వచ్చి అక్కడ పరిమళద్రవ్యా లమ్ముకొంటున్న గంధకారులున్నారు. వాళ్ళు వంకర కొప్పులు, కావి దుప్పట్లు కలిగి ఉన్నారు. ఆ సంబరాలకి వచ్చిన రసికులకు పూలదండలూ, పరిమళద్రవ్యాలూ  అమ్ముతూ , వాళ్ళు తమ పుట్టిన నేలకి దూరమైన ఎడబాటు మరచిపోయారు.  ఆనందంతో ఏవో పద్యాలూ వెఱ్ఱిపాటలు పాడుకుంటూ బుక్కాపొడిని ఆకాశంలోకి చల్లుతున్నారు. పిచికారీలతో పన్నీరు పైకి విరజిమ్ముతున్నారు.  అది వానజల్లులా కురుస్తోంది. ఆ జల్లులో  వాద్యకారుల చర్మ వాద్యాలు తడిసి నానిపోయాయి. నానిపోయిన వాద్యాలు మ్రోగవు కదా! వాటిని వేడి చేసుకోవాలి. దానికి నిప్పుకోసం వెదుకుతున్నారు. నిప్పెక్కడనుంచి దొరుకుతుంది? దొరికింది! ఎలా అంటే, దారికి ఒక పక్కగా, తోటలకి పారుదలగా ఏర్పరచిన మంచినీటి కాలువలున్నాయి.  ఆ కాలువల పక్క కూర్చొని కొంతమంది తాము తెచ్చుకున్న చద్దిమూటలు విప్పి తింటున్నారు. మాంచి మీగడపెరుగుతో పిసికి, ఆరబెట్టిన నిమ్మకాయముక్కలు, అల్లపు ముక్కలతో కలిపిన ఆ చద్దిని వాళ్ళు తింటూ ఉంటే, తోవనపోతున్న దాసరులు చూసారు. వాళ్ళకి ఆకలయ్యింది. ఆ తింటున్న వాళ్ళదగ్గర కొంచెం భిక్షగా తీసుకొని తిన్నారు. ఈ ప్రయత్నంలో, వాళ్ళ చేతనున్న దీపాల లాంతర్లు (కాగడాలవంటివి) కాలువొడ్డున పెట్టారు. అక్కడ దొరికింది వాద్యకారులకు నిప్పు! ఆ లాంతర్ల కన్నాలలోంచి బయటకి వస్తున్న దీపజ్వాలల్లో తమ వాద్యాలను వెచ్చబెట్టుకుంటూ, అవి పూర్తిగా ఆరాయో లేదో తెలుసుకోడానికి మ్రోగిస్తూ పాటలు పాడుతున్నారు. కాని అవేవీ వినిపించడం లేదట! ఎందుకంటే, ఆ వాద్యాల చప్పుళ్ళకి దారికి  ఇరుపక్కలా ఉన్నా తోటల్లోని చిలకలు ఇటునుంచి అటు అటునుంచి యిటు కిలకిలమంటూ తోరణంలా ఎగురుతున్నాయి. ఆ కోలాహలానికి వీళ్ళు పాడే పాట, వాద్యాలు వినపడటం లేదు. వాద్యగాళ్ళ తలలు విసరడం, తాళం వెయ్యడం లాంటివి మాత్రం కనిపిస్తున్నాయట! ఎంత విపులంగా వర్ణించారో చూసారా రాయలవారు.  ఇంకా ఆ సందడిలో భయంతో కదంతొక్కుతున్న గుఱ్ఱాలను, అక్కడకి వచ్చిన నేతగాళ్ళు, కమసాలులు, పట్టు నేతగాళ్ళు, కోమటులు మొదలైన నానా జాతి ప్రజను, వృద్ధవనితలు పడే పాట్లను అన్నిటినీ యీ వచనంలో చక్కగా వర్ణించారు రాయలవారు.

నిజానికి యింత పెద్ద వచనమూ కథకి ఏమాత్రం సంబంధం లేనిదిగానే అనిపిస్తుంది. నేరుగా ఎలాంటి సంబంధం లేదు కూడా. ఇది లేకపోయినా కథకి కాని, కథా గమనానికి కాని వచ్చిన యిబ్బంది ఏమీ లేదు. కానీ ఊరికే కథ చెప్పుకుంటూ పోతే అది కథ అవుతుంది కాని కావ్యం కాదు కదా! పైగా, తాను చూసిన ఆనాటి సమాజాన్ని సజీవంగా చిత్రించడంపై రాయలవారికెంతో మక్కువ. రాకుమారులు పూలు, పండ్లనూ వారకాంతలపై వేసి చేసిన సయ్యాట కాని, వాద్యకారులు తమ వాద్యాలను వెచ్చబెట్టుకున్న తీరు కాని, ఇవేవీ కేవల కల్పనవల్ల స్ఫురించే అంశాలు కావు. పారంపరికంగా వచ్చిన కవుల పడికట్టు  వర్ణనలు అంతకన్నా కావు. రాయలవారు స్వయంగా చూసి చేసిన సహజ వర్ణన.
ఇంత చెప్పుకున్నా, యీ వర్ణనకి అసలు కావ్యప్రయోజనం ఉందా అన్న అనుమానం మిగిలిపోతుంది. కాస్త ఆలోచిస్తే ఉందని తెలిసి ఆ సందేహమూ తీరిపోతుంది. అంతటి భక్తశిఖామణి దిగ్విజయోత్సవంలో సరస సల్లాపాలను వర్ణించడంలోని ఆంతర్యమేమిటి? సరే రక్తి భక్తి కలిసిమెలిసి ఉంటాయని చెప్పడం ఒకటయితే, అక్కడ పోషింపబడిన రసం శృంగారం. అంటే, ఈ కావ్యంలోని ప్రధాన రసం శృంగారం సుమా అనే ధ్వని యీ వర్ణనలో ఉందన్న మాట. భక్తి శృంగారాల మేలికలయికే మధురభక్తి. కావ్య నాయిక అయిన గోదాదేవిలో మూర్తీభవించినది అదే! దాన్ని పాఠకులకు అడుగడుగునా, తగిన సందర్భం వచ్చినప్పుడల్లా స్ఫురింప జేస్తారు రాయలవారు. ఈ వర్ణనలోని కావ్య ప్రయోజనం అది.

ఈ విధంగా విష్ణుచిత్తుడు పురప్రవేశం చేసి, వైకుంఠనాథునికి మ్రొక్కి, తన యిల్లు చేరి, అది మణిమయమై ఉండడం చూసి స్వామివారి అనుగ్రహంగా స్వీకరించి, మరింత శరణాగతితో భగవంతుని నిరంతరం సేవిస్తూ కాలంగడిపాడు. వచ్చే టపాతో మళ్ళీ కథ జోరందుకుంటుంది. మరొక కొత్త పిట్టకథ మొదలవుతుంది. అది స్వయానా శ్రీ మహావిష్ణువు అమ్మవారితో చెప్పిన కథ!

Related Posts Plugin for WordPress, Blogger...