తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Thursday, September 27, 2012

యామునాచార్యుని సభాప్రవేశం

ఎలాగైనా తనను సభకు పిలిపించి వాదం ఏర్పాటు చేయగలిస్తే, తాను పండితవాదనలో నెగ్గి, వైష్ణవమత స్థాపించగలనని యామునాచార్యుడు మహారాణితో విన్నవించుకున్నాడు. 


తే. గ్రీష్మసమయనిరుత్సాహకేకిరమణి
నవఘనధ్వని కలరుచందమున నలరి,
యేకతమ నర్మగోష్ఠిఁ బ్రాణేశుతోడ
నతని విధ మెఱిఁగింప, నిట్టట్టు వడుచు.
 
(ఈ పద్యం రాఘవ స్వరంలో . రాగం - సామ )

యామునాచార్యుని మాటలు విన్న మహారాణి సంతోషించింది. ఎంతగా సంతోషించినదంటే, వేసవికాలంలో నిరుత్సాహంగా కాలం గడుపుతున్న ఆడనెమలి, మేఘ ద్వని వినగానే ఎలా ఆనందిస్తుందో అలా సంతసించింది. ఎంత చక్కని ఉపమానం!
మహారాజుతో ఏకాంతంగా సరససల్లాపాలాడే సమయంలో యామునాచార్యుని గురించి ప్రస్తావించింది. అది విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యం పొందాడు. అట్టిట్టయిపోయి:

క. భూవల్లభుఁ "డెట్టెట్టూ!
తా వాదము సేసి శివమతంబు జయింపం
గా వచ్చెనొ? చూతముగా,
రావింపు" మటన్న నాఁటిరాత్రి చనంగన్.
 
( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

ఆ పాండ్యరాజు తన భార్యతో "ఎట్టెట్టా! ఆ బ్రహ్మచారి తన వాదనతో శైవమతాన్ని జయింపగలడా?? సరే అదీ చూద్దాం. అతన్ని రప్పించు" అన్నాడు.
ఇది చిన్న పద్యమైనా రాజు ఇట్టట్టుపడడాన్ని మంచి నాటకీయంగా చిత్రిస్తుంది. ఎట్టెట్టు, తా, వాదము సేసె, శివమతంబును, జయింపగావచ్చునో - అన్న మాటలన్నీ ప్రతిది నొక్కినొక్కి పలికితే తప్ప అతని తబ్బిబ్బు పాఠకులకు అబ్బురంగా కనిపించదు. ఇదే సహజమైన సంభాషణలో ఉండే కాకువు. రెండవ పాదం "తా వాదము", మూదవ పాదం "గా వచ్చెనొ", యిలా విడిపోవడం, నాల్గవపాదం "రావింపుము" అని మొదలుకావడం, యిదంతా అతడు పడ్డ ఆశ్చర్యాన్ని, అతని మాటల్లోని వేళాకోళాన్నీ ధ్వనించే రచనా సంవిధానకం. నాల్గవ పాదం రావింపుము అని తెగేసి చెప్పినట్లుగా ప్రారంభించడం యామునాచార్యుడు తప్పక ఓడిపోతాడన్న రాజు నమ్మకాన్ని ధ్వనిస్తుంది.
సరే ఆ రాత్రి గడిచాక మర్నాడు పొద్దునే సభ ఏర్పాటు చేసారు. మహారాణికూడా ఆ సభలో రాజు పక్కనే ఆసీనురాలయింది. రాజు అనుమతితో  యామునాచార్యుని సభకు రప్పించింది.

క. ద్వారంబు సొచ్చి, కీలిత
గారుడమహి వజ్రవేదికం జివురులఁ గెం
పారు నొక పిప్పలముఁ గని
యా రావిన్ వాదసాక్షికై వలగొనుచున్

( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)
యామునాచార్యుడు సభలోకి ప్రవేశించబోతున్నాడు. ఆ సభకూ రాజద్వారానికీ మధ్య ఒక రావిచెట్టు ఉంది. చుట్టూ గరుడపచ్చలూ వజ్రాలు పొదిగిన అరుగుతో, ఎఱ్ఱని చివుళ్ళతో, అందంగా ఉందా చెట్టు. ఆ రావి చెట్టుకు నమస్కరించి తాను చేయబోయే వాదనకు సాక్షిగా నిలిపి, ప్రదక్షిణము చేసి సభలోకి ప్రవేశించాడు యామునాచార్యుడు. రావిచెట్టు విష్ణుస్వరూపం!

చుట్టూ జటాధారులైన శైవాచార్యులందరూ కూర్చొని ఉండగా, దట్టమైన విబూదితో, చెవులకు, మెడలోను రుద్రాక్షలతో, రత్న కంబలిపైనున్న చిన్న గద్దెపై కూర్చొని ఉన్నాడు పాండ్యరాజు. పక్కనే ఉన్న తలగడపై మోచేయి పెట్టి, నంది ప్రతిమలుగల ఉంగరాల చేతిలో చెక్కిలి ఆనించి, శైవాగమాలు వింటున్నాడు. అలా కూర్చున్న రాజు దగ్గరకు వెళ్ళి యామునాచార్యుడు యజ్ఞోపవీతాన్ని కానుకగా యిచ్చాడు. 

అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీం వృద్ధ బాలకౌ
రిక్తహస్తేన నోపేయాత్, రాజానం దైవతం గురుమ్

అగ్నిహోత్రం దగ్గరకు కాని, ఎవరైనా యింటికి కాని, ఆలయానికి కాని, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, రాజు, దైవం, గురువు దగ్గరకు కాని, వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదన్నది ఆచారం. యామునాచార్యుడు బ్రహ్మచారి. అంచేత తనకు ఉచితమైన, తన దగ్గరుండే ఒక యజ్ఞోపవీతాన్ని రాజుకు సమర్పించాడు. కాని రాజు వీరశైవుడు కాబట్టి దాన్ని తిరస్కరించాడు. హేళనగా, కొంచెం కోపంగా యిలా అన్నాడు:

తే. "సంగతియె యోయి, యిసుమంత ఠింగణావు!
తత్వనిర్ణయవాదంబు దరమె నీకు?
నోడితేనియుఁ బట్టి మొఱ్ఱో యనంగ
లింగమును గట్టకుడుగ, మెఱింగి నొడువు"
 
( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)

"ఇది నీకు తగునటోయీ? వేలెడంత లేవు! (ఠింగణా అంటే చిన్నవాడు, పొట్టివాడు అని అర్థం) భగవత్తత్త్వ సిద్ధాంతము గురించి నువ్వేం మాట్లాడతావు. ఇది నీకు సాధ్యమైన పనియేనా? ఒకవేళ ఈ వాదనలో నీవు ఓడిపోతే ఎంత మొత్తుకున్నా పట్టి బంధించి లింగధారణ చేయించి పంపుతాము. ఈ విషయం గురించి మరోసారి ఆలోచించుకుని మాట్లాడు" అని చెప్పాడు. ఠాంక్విన్ దేశంనుండి దిగుమతి అయ్యే గుఱ్ఱాలను ఠింగణాలు అనేవారట. అవి పొట్టి గుఱ్ఱాలు కాబట్టి, పొట్టివాళ్ళను ఆ పేరుతో పిలిచేవారు. 

తే. వాదుల మటంచుఁ జెప్పించి వత్తు: రోట
మైన దయ నీరె యేమైన నని విలజ్ఞ
జూటుఁదనమున సభ లెక్కు చొరవకాండ్రు:
పాఱువారల సుద్ది సెప్పంగ నేల?
 
( ఈ పద్యం భైరవభట్ల కామేశ్వరరావు స్వరంలో)

ఇంకా యిలా అంటున్నాడు: "బ్రాహ్మణుల సంగతి వేరే చెప్పడం దేనికి? సిగ్గులేకుండా ఏవరో ఒకరి మధ్యవర్తిత్వంలో సిఫార్సు మీద వస్తారు, శాస్త్రవాదం చేస్తామంటూ. ఓడిపోయినా ఎంతో కొంత ముట్టచెపుతారు కదా అని ఆశ."  "జూటు" అనేది "ఝూటా" అనే హిందీ పదంనుండివచ్చి ఉండాలి.
తన మతస్థులే ఓడిపోతే తానూ, తనకు ఆప్తులైన శైవులందరూ చక్రాంకితాలు వేసుకుంటామని, యామునాచార్యుడు ఓడిపోతే అతనితో పాటు రాణికూడా లింగధారణ చెయ్యాలని అంటాడు రాజు. దానికి రాణి ఒప్పుకొని, మీరు మీ మాట మీద నిలబడండి, దీనికి పంచభూతాలే సాక్షి అంటుంది. అప్పుడు యామునాచార్యుడు లేచి, రాజు పలికిన మాటలకు ఇలా అన్నాడు:

క. "దేవా, యిట్లని యానతి
యీ వల, దేఁ గడుపుఁగూటి కిట రా, నా డ
బ్బేవారిఁ బ్రోవ? భిక్షా
జీవిక వర్ణికిని విధి సృజించెనె గాదే?"
 
( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

"ఓ రాజా! నీవలా అనుట తగదు. నేను ఒంటరి బ్రహ్మచారిని. నా కడుపుకూటికి జూటుదనంతో యిలా రాజసభలకు వచ్చే పని నాకు లేదు. అలా సంపాదించిన డబ్బుతో నేనెవరిని పోషించాలి కనక? బ్రహ్మచారులకు ఆ భగవంతుడే భిక్షాటన వృత్తిని విధించాడు కదా."

యింకా ఇలా అన్నాడు:

తే. ఎవ్వఁడే సర్వభూతస్థుఁ డిత్తెఱంగు
నకును బ్రేరేఁచె, నతనియానతియె తెచ్చె,
నెఱిఁగినవి నాల్గు నొడువ నేమేని లెస్స:
యతఁడ బొంకిన నేమిసేయంగ వచ్చు?
 
( ఈ పద్యం భైరవభట్ల కామేశ్వరరావు స్వరంలో) 

"సర్వభూతాలలో ఉన్నవాడెవడో నన్ను ప్రేరేపించి యిక్కడకు తీసుకువచ్చాడు. నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్పినందువల్ల ఏ ఫలితం కలిగినా మంచిదే. ఆ భగవంతుడే అబద్ధము ఆడితే నేనేం చేయగలను." అని, "మీరు చెప్పిన దానికి నేను బద్ధుడనై ఉంటాను. నా వాదనలో ఓటమి లక్షణాలు కనిపిస్తే, అమ్మగారు సిఫార్సు చేసిన పండితుడనని నా మీద దయ చూపించనక్కరలేదు. మీరు చెప్పినట్టే చెయ్యండి" అని చెప్పాడు.
అప్పుడు వాదన జరిగింది. సరిగ్గా విష్ణుచిత్తుడు మత్స్యధ్వజుని సభలో చేసిన వాదననే యిక్కడ కూడా యామునాచార్యుడు చేసి, అదే రీతిలో సభలోని పండితులందరినీ ఓడించాడు. "విష్ణుమూర్తియే పరమాత్మ, విశిష్టాధ్వైతమే గొప్ప మతం" అని నిరూపించాడు.

క. ఆయెడను నొక్కపలు కెదు
రై యుండెడు పిప్పలమున నాయెను విన "నో
హో, యిది నిక్కము, నృప, నా
రాయణుఁడె పరంబు, కొల్వు మతని" నటంచున్.
 
( ఈ పద్యం  రాఘవ స్వరంలో  రాగం - కీరవాణి )
అంతట సింహద్వారం సమీపంలో సాక్షీభూతంగా ఉన్న రావిచెట్టునుండి "ఓహో వినండి. ఇది నిజము. ఓ రాజా! నారాయణుడే పరమాత్మ. అతనిని పూజింపుము" అన్న మాటలు వినిపించాయి. దానితో యామునాచార్యుని గెలుపు నిశ్చయమయ్యింది. ఈ యామునాచార్యుని విజయంతో కథ మరో కొత్త మలుపు తిరిగింది!

2 comments:

bvraman said...

very very good and nice poetry.chala kalamayinadi chevulara vinasompupuga telugu padyamulu vini,chadivi.amuktamalyadani netlo vunchi chala manchi pani chesinaru.mabotivariki ituvanti kavyalu chala chala nachuthai. meeku ma dhanyavadamulu. keep it up. bvramansastri.

Dr.Tekumalla Venkatappaiah said...

ఆంధ్ర బాషను అందరూ మర్చిపోతున్న రోజుల్లో... ఇలాంటి సాహస కార్యానికి పూనుకున్న "ఆంధ్ర-జ్యోతి" ప్రశంసార్హురాలు.

"త్రికరణశుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును" అన్న అన్నమయ్య మాట నాకు ఈ సందర్భం లో గుర్తుకొస్తొంది.

పద్యాలకు తాత్పర్యాలు రాయడమే ఒక విపర్యయము ఈ రోజుల్లో. అలాంటిది..పద్యం వినిపించే ప్రక్రియ కూడా చేపట్టి విజయవంతం గా సాగిస్తున్నరంటే.. చాల కష్టమైన ప్రక్రియ. తెలుగు బ్లాగుల్లో ఇలాంటి ప్రక్రియ రాలేదేమో కూడా ఇంతవరకూ.

ఆవిడకు సహకరిస్తున్న సర్వశ్రీ కామేశ్వరరావు, భైరవభట్ల, స్వర దాతలు సర్వశ్రీ లంక గిరిధర్, చదువరి (అసలు పేరు తెలియదు "పాటరి" అని కూడా అనాలని ఉంది), సనత్, శ్రీపతి, రవి, మరలా మన శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు, రాఘవ
అభినందనీయులు. వీరి పేర్లు ఈ "అంతర్జాలం" ఉన్నంతవరకూ మార్మోగుతూనే ఉంటాయి. ఏమాత్రం సందేహం లేదు. ఇలాంటి ప్రాజెక్ట్ ఇంకొకరు చేయడం కాదు కదా ఊహించడానికే భయం వేస్తుంది.

ఓ చిన్న పద్యం తో ముగిస్తాను!

కృష్ణ రాయల గ్రంధము తృష్ణ కొలది
సర్వ జనులకు నందించి శక్తి మేర
తెనుగు జాతికి జేసిరి తేట తెల్ల
మార్గ దర్శులు మీరెల్ల మాకు నిజము!

ధన్యవాదములతో....

Related Posts Plugin for WordPress, Blogger...